అర్జెంటీనాను ముప్పతిప్పలు పెట్టి మూడుచెరువుల నీళ్లు తాగించిన పసికూన

ఫిఫా ప్రపంచకప్ నాకౌట్ లో ఓ అద్భుతం తృటిలో చేజారింది. డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా ఓటమి కోరల్లో నుంచి చివరి నిమిషంలో బయటపడగలిగింది. చావు తప్పి కన్ను లొట్టబోయిన చందంగా గెలిచిందా జట్టు. నరాలు తెగే ఉత్కంఠ మధ్య రౌండ్ ఆఫ్ 16 కు దూసుకెళ్లింది. ఈ మెగా టోర్నమెంట్‌లో అరంగేట్రం చేసిన కాబో వెర్డే (Cabo Verde) ఊహించని విధంగా అత్యుత్తమ ప్రతిభ కనబరిచి అర్జెంటీనాకు ముచ్చెమటలు పట్టించింది. మూడు చెరువుల నీళ్లు తాగించింది.

Advertisement

ఆట ముగిసే సమయానికి స్కోర్లు సమం అయ్యాయంటే కోబో వెర్డే ఎంత పట్టుదలగా ఆడిందో అర్థం చేసుకోవచ్చు. మ్యాచ్ డ్రా కావడంతో ఎక్స్‌ట్రా టైమ్ అవసరమైంది. ఈ హోరాహోరీ పోరులో అర్జెంటీనా చివరకు 3-2 గోల్స్ తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో అర్జెంటీనా జట్టు మంగళవారం అట్లాంటాలో ఈజిప్ట్‌తో జరిగే కీలక మ్యాచ్‌కు అర్హత సాధించింది. మ్యాచ్ ఓడినప్పటికీ.. ఏ మాత్రం తొట్రుపాటు లేకుండా ఆడిన కేప్ వెర్డే.. అభిమానుల మనస్సులను గెలుచుకుంది.

Advertisement

మ్యాచ్ ఆరంభం నుంచే ఇరు జట్లు ఒకరిపై ఒకరు ఆధిక్యం సాధించడానికి ముమ్మరంగా ప్రయత్నించాయి. అర్జెంటీనా స్టార్ ఫుట్‌బాలర్ లియోనెల్ మెస్సీ తన అమోఘ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ అర్జెంటీనా జట్టుకు తొలి గోల్ అందించాడు. 29వ నిమిషంలో డిఫెండర్ లిసాండ్రో మార్టినెజ్ అందించిన లాంగ్ పాస్‌ను మెస్సీ చాకచక్యంగా నియంత్రించాడు. ప్రత్యర్థి గోల్‌కీపర్ వోజిన్హాను బోల్తా కొట్టిస్తూ గోల్ సాధించాడు. ఈ ప్రపంచకప్ లో మెస్సీకి ఇది ఏడో గోల్ కావడం అతని ఫామ్‌కు నిదర్శనం.

మ్యాచ్ సెకెండ్ హాఫ్ లో కేప్ వెర్డే జట్టు వ్యూహాత్మకంగా ఆడి పుంజుకుంది. 59వ నిమిషంలో ర్యాన్ మెండిస్ అందించిన పాస్ సాయంతో కేప్ వెర్డే ఫార్వర్డ్ ఆటగాడు డెరాయ్ డువార్టే అద్భుతమైన గోల్‌తో మ్యాచ్‌ను 1-1తో సమం చేశాడు. దీనితో స్టేడియం ఒక్కసారిగా హోరెత్తిపోయింది. ఆ తర్వాత ఇరు జట్ల డిఫెన్స్ అడ్డుగోడగా మారడంతో నిర్ణీత 90 నిమిషాల సమయం ముగిసే వరకు ఎలాంటి అదనపు గోల్‌ పడలేదు. దీంతో మ్యాచ్ ఎక్స్ ట్రా టైమ్ కు దారి తీసింది.

Advertisement

ఎక్స్‌ట్రా టైమ్ ప్రారంభమైన కొద్దిసేపటికే అర్జెంటీనాకు కార్నర్ రూపంలో చక్కని అవకాశం దక్కింది. 92వ నిమిషంలో అర్జెంటీనా మిడ్‌ఫీల్డర్ అలెక్సిస్ మెక్ అలిస్టర్ అందించిన అసిస్ట్‌తో లిసాండ్రో మార్టినెజ్ అద్భుత హెడర్ ద్వారా గోల్ చేసి జట్టును 2-1తో ముందంజలోకి తీసుకెళ్లాడు. అయినప్పటికీ కేప్ వెర్డే పట్టుదలను వదల్లేదు. ఆ జట్టు ఆటగాడు సిడ్నీ లోపెస్ కాబ్రాల్ 103వ నిమిషంలో పెనాల్టీ ఏరియా వెలుపల నుంచి అద్భుతమైన లాంగ్ షాట్‌తో గోల్ సాధించాడు. ఈ కిక్.. టోర్నమెంట్‌లో బెస్ట్ గోల్స్‌లో ఒకటిగా నిలుస్తుంది.

ఈ గోల్ తో కాబ్రాల్.. స్కోర్ ను తిరిగి 2-2తో సమం చేసి అర్జెంటీనాను ఆందోళనలోకి నెట్టాడు. మ్యాచ్ షూటౌట్‌ వైపు వెళ్తుందని భావిస్తున్న తరుణంలో అర్జెంటీనాకు లభించిన కార్నర్ కిక్ మ్యాచ్ ఫలితాన్ని మార్చేసింది. 111వ నిమిషంంలో మెస్సీ పంపిన కార్నర్ బంతిని క్రిస్టియన్ రొమేరో హెడర్ ద్వారా గోల్ చేసేందుకు ప్రయత్నించగా, ఆ బంతి కాబో వెర్డే డిఫెండర్ దినే బోర్గెస్‌కు తగిలి ఓన్ గోల్‌గా మారింది. ఆఖరి క్షణాల్లో ప్రత్యర్థి జట్టు దాడిని అర్జెంటీనా గోల్‌కీపర్ ఎమిలియానో మార్టినెజ్ అద్భుతమైన సేవ్ ద్వారా కాపాడటంతో అర్జెంటీనా ఊపిరి పీల్చుకుంది.

Advertisement

కాబో వెర్డే జట్టు లీగ్ నుంచి నిష్క్రమించినప్పటికీ, ప్రపంచకప్ అరంగేట్రంలోనే వారు కనబరిచిన అజేయమైన పోరాటపటిమ అభిమానుల గుండెల్లో నిలిచిపోతుంది. డిఫెండింగ్ ఛాంపియన్లకు సైతం వణుకు పుట్టించిన వారి ఆటతీరు అద్భుతం. మరోవైపు, అర్జెంటీనా జట్టు ఈ మ్యాచ్ విజయంతో ఊపిరి పీల్చుకున్నప్పటికీ, బలమైన ఈజిప్టుతో జరగబోయే తదుపరి నాకౌట్ మ్యాచ్‌కు తమ వ్యూహాలు, డిఫెన్స్ ను మరింత పటిష్ఠం చేసుకోవాల్సి ఉంది.

English Summary

Argentina survived a massive upset scare, defeating tournament debutants Cape Verde 3-2 in extra time during their FIFA World Cup Round of 32 clash. Messi opened the scoring in the 29th minute, marking his record-extending 20th career World Cup goal.