పోర్చుగల్ బాధాకర ఓటమి- రొనాల్డో కన్నీరు మున్నీరు: చెదిరిన కల

అంతర్జాతీయ ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో ఫిఫా వరల్డ్ కప్ కల విషాదాంతమైంది. అర్లింగ్టన్‌లో జరిగిన హోరాహోరీ రౌండ్ ఆఫ్ 16 పోరులో స్పెయిన్ చేతిలో పోర్చుగల్ ఓటమి పాలైంది. 1-0 తేడాతో పరాజయాన్ని చవి చూసింది. ఈ ఓటమితో ఆ జట్టు కేప్టెన్ సూపర్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో కేరీర్ కు తెరపడింది. 41 ఏళ్ల రొనాల్డో బాధాకర ఓటమితో తన ఆరో, చివరి ప్రపంచకప్ ప్రస్థానాన్ని ముగించాడు. ఈ మ్యాచ్ కు ముందురోజే అతను రిటైర్మెంట్ ప్రకటించాడు.

Advertisement

తన కెరీర్‌లో ఆఖరి ప్రపంచకప్ మ్యాచ్‌లో గోల్ చేయడానికి ఎంతగానో శ్రమించాడు.. రొనాల్డో. ఈ మ్యాచ్‌లో కొన్ని అవకాశాలు లభించినా, వాటిని గోల్స్ గా మలచుకోలేకపోయాడు. స్పెయిన్ గోల్‌కీపర్ ఉనై సిమోన్ అడ్డుగోడలా నిల్చున్నాడు. రొనాల్డో కొట్టిన ప్రతి కిక్ ను అడ్డుకున్నాడు. ముఖ్యంగా పోర్చుగల్ ఆటగాడు జోవావ్ ఫెలిక్స్ హెడర్ ద్వారా పంపిన బంతి సిమోన్ చేతికి తగిలి వెనక్కి రాగా, రొనాల్డో వెంటనే కిక్ కొట్టాడు గానీ అది పోస్ట్ చేరలేదు. గాల్లోకి ఎగిరి సిమోన్ తన రెండు చేతులతో ఆ బంతిని అద్భుతంగా ఒడిసిపట్టి రొనాల్డో ఆశలపై నీళ్లు చల్లాడు.

Advertisement

ఈ మ్యాచ్‌లో రొనాల్డోను అడ్డుకోవడమే కాకుండా, స్పెయిన్ జట్టు ఒక అద్భుతమైన రికార్డును నెలకొల్పింది. ప్రపంచకప్ చరిత్రలోనే వరుసగా ఆరు మ్యాచ్‌ల్లో ప్రత్యర్థి జట్టుకు ఒక్క గోల్ కూడా ఇవ్వకుండా (క్లీన్ షీట్) డిఫెన్స్ చేసిన తొలి జట్టుగా స్పెయిన్ నిలిచింది. అంతకుముందు ఈ రికార్డు ఇటలీ, స్విట్జర్లాండ్ పేరిట ఉండేది. ఇప్పుడు స్పెయిన్ డిఫెండర్లు దాన్ని తిరగరాశారు.

అదే సమయంలో స్పెయిన్ గోల్‌కీపర్ ఉనై సిమోన్ కూడా సరికొత్త వ్యక్తిగత రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. వరుసగా 609 నిమిషాల పాటు ఒక్క గోల్ కూడా కాకుండా నిలువరించిన గోల్‌కీపర్‌గా ఆయన చరిత్ర సృష్టించాడు. 1990 ప్రపంచకప్‌లో ఇటలీకి చెందిన దిగ్గజ గోల్‌కీపర్ వాల్టర్ జెంగా నెలకొల్పిన సుదీర్ఘ కాల రికార్డును సిమోన్ ఈ మ్యాచ్‌తో అధిగమించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

Advertisement

మ్యాచ్ ప్రారంభమైన మొదటి నిమిషం నుండే ఇరు జట్ల ఆటగాళ్లు వ్యూహాత్మకంగా కదిలారు. ముఖ్యంగా స్పెయిన్ జట్టు మిడ్‌ఫీల్డ్‌పై పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తూ పోర్చుగల్ డిఫెన్స్ ను ఛేదించడానికి ప్రయత్నించింది. ఈ క్రమంలో స్పెయిన్ అత్యధికంగా 56 శాతం బాల్ పొసెషన్‌ను రికార్డు చేసుకుంది. 44 శాతం మాత్రమే బంతి పోర్చుగల్ ఆధీనంలో ఉంది. స్పెయిన్ ప్రత్యర్థి గోల్ లక్ష్యంగా 15 సార్లు షాట్లు కొట్టగా, అందులో 6 షాట్లు నేరుగా టార్గెట్‌ను తాకాయి గానీ పోర్చుగల్ డిఫెండింగ్ విభాగం వాటిని అడ్డుకోగలిగింది.

ఫలితంగా ప్రథమార్థంలో ఒక్క గోల్ కూడా నమోదు కాలేదు. దీంతో సెకెండ్ హాఫ్ లో మ్యాచ్ మరింత రసవత్తరమైంది. రెండు జట్లూ కొదమసింహాల్లా మారాయి. ఇరు జట్ల మేనేజర్లు పదునైన వ్యూహాలు అమలు చేశారు. పోర్చుగల్ కోచ్ ఆట 71వ నిమిషంలో డీగో డాలోట్ స్థానంలో జోవా కాన్సెలోను, రాఫెల్ లియావో స్థానంలో జోవా ఫెలిక్స్‌ను బరిలోకి దించాడు. ఇటు స్పెయిన్ కోచ్ కూడా 85వ నిమిషంలో డాని ఓల్మో స్థానంలో మికెల్ మెరినోను, రూయిజ్ స్థానంలో పెడ్రిని రంగంలోకి దించి దాడిని ముమ్మరం చేశారు.

Advertisement

ఈ వ్యూహాత్మక మార్పులే స్పెయిన్ జట్టుకు అద్భుతమైన ఫలాలను అందించాయి. మ్యాచ్ నిర్ణీత 90 నిమిషాల సమయం ముగిసేసరికి ఇరు జట్లు స్కోరు చేయలేకపోయాయి. దీంతో రెఫరీ ఎక్స్‌ట్రా టైమ్ ప్రకటించారు. ఈ క్రమంలో 90+1వ నిమిషంలో ఫెర్రాన్ టోర్రెస్ అందించిన అద్భుతమైన అసిస్ట్‌ను మికెల్ మెరినో రెప్పపాటులో గోల్‌గా మలిచాడు. దీన్ని అడ్డుకోవడంలో పోర్చుగల్ డిఫెన్స్ పూర్తిగా విఫలమైంది. స్పెయిన్ క్యాంప్ ఒక్కసారిగా పండగ వాతావరణం నెలకొనగా.. పోర్చుగల్ నిరాశలో కూరుకుపోయింది.

English Summary

Cristiano Ronaldo Breaks Down in Tears as Portugal Lose to Spain in FIFA World Cup Round of 16. Portugal lost 1 0 to Spain in Round of 16.Mikel Merino scored Spain's winning goal.Ronaldo breaks down into tears after WC exit Cristiano Ronaldo s final World Cup ended with tears.