అభిషేక్ శర్మ కేసు: ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు!

భారత యువ క్రికెటర్ అభిషేక్ శర్మ పర్సనాలిటీ రైట్స్ ఉల్లంఘన వ్యవహారంలో ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. అభిషేక్ శర్మ అనుమతి లేకుండా పేరు, ఫోటోలను అలాగే వ్యక్తిగత చిత్రాలను సోషల్ మీడియాలో దుర్వినియోగం చేస్తున్న వారికి న్యాయస్థానం గట్టి హెచ్చరికలు జారీ చేసింది. ఈ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్న వివిధ ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లు, వ్యక్తులకు తక్షణమే సమన్లు పంపాలని కోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

Advertisement

కోర్టు కఠినమైన వైఖరి అవలంభించడంతో ఇంటర్నెట్ నుంచి పలు అభ్యంతరకర లింకులు ఇప్పటికే తొలగించబడ్డాయి. ఈ కేసు విచారణ జస్టిస్ జ్యోతి సింగ్ నేతృత్వంలోని సింగిల్ బెంచ్‌లో సాగింది. అభిషేక్ శర్మ ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉన్న నిందితుల సోషల్ మీడియా అకౌంట్లకు చట్టబద్ధమైన పద్ధతుల్లో నోటీసులు పంపాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ వివాదానికి సంబంధించిన తదుపరి విచారణ నవంబర్ 17వ తేదీన జరగనుంది.

Advertisement

డీప్‌ఫేక్ టెక్నాలజీతో ప్రమాదం

ప్రస్తుతం ఇంటర్నెట్ ప్రపంచంలో ఏఐ, డీప్‌ఫేక్ టెక్నాలజీ ఓ పెద్ద ఛాలెంజ్ గా నిలుస్తున్నాయి. అభిషేక్ శర్మకు సంబంధించిన ఫోటోలను అలాగే డిజిటల్ కంటెంట్‌ను ఎడిట్ చేసి, తప్పుడు ప్రచారానికి కొందరు వాడుకున్నట్లు కోర్టు విచారణలో స్పష్టమైంది. శర్మ తరఫు న్యాయవాది గౌరవ్ బహల్ స్పందిస్తూ.. ఈ వివాదాస్పద కంటెంట్‌ను వ్యాప్తి చేస్తున్న మిగిలిన లింకులపై కూడా పూర్తిగా నిషేధం విధించాలని కోరారు. అయితే చట్ట ప్రకారం నిందితులకు మొదట సమన్లు అందించి, వారి సమాధానాలు విన్న తర్వాతే తురి నిర్ణయం తీసుకుంటామని న్యాయమూర్తి పేర్కొన్నారు.

Advertisement

టెక్ సంస్థల సవాళ్లు

ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ పేరెంట్ కంపెనీ అయిన 'మెటా' తరఫున న్యాయస్థానానికి హాజరైన ప్రతినిధి వరుణ్ పాఠక్ కీలక వివరాలను కోర్టు ముందు ఉంచారు. తమ ప్లాట్‌ఫామ్‌లపై ప్రచురితమైన వివాదాస్పద పోస్టులను దాదాపుగా అన్నీ తొలగించామని, ప్రస్తుతం కేవలం రెండు లింకులు మాత్రమే పరిధిలో మిగిలి ఉన్నాయని పేర్కొన్నారు. వాటిని కూడా తొలగించే ప్రక్రియ కొనసాగుతోందన్నారు. అయితే ఇంటర్నెట్‌లో ఇలా ప్రతి లింకును వ్యక్తిగతంగా వెతికి తొలగించడం అనేది సుదీర్ఘమైన సవాలుతో కూడుకున్న నిరంతర ప్రక్రియ అని మెటా అభిప్రాయపడింది.

ఈ కేసు ద్వారా పర్సనాలిటీ రైట్స్ ప్రాధాన్యత మరోసారి చర్చనీయాంశమైంది. సెలబ్రిటీల వ్యక్తిత్వ హక్కులు, పరువు నష్టం మధ్య చాలా స్వల్ప తేడా మాత్రమే ఉంటుందని గతంలో కూడా కోర్టులు పేర్కొన్నాయి. కేవలం అభిషేక్ శర్మ మాత్రమే కాకుండా, ఇటీవలి కాలంలో ఎంతోమంది సినీ, క్రీడా ప్రముఖులు ఈ విధమైన సైబర్ వేధింపులకు గురవుతున్నారు. వారి ముఖాలను, డిజిటల్ గుర్తింపును మార్ఫింగ్ చేయడం ద్వారా సైబర్ నేరగాళ్లు ఆదాయాన్ని సంపాదించడానికి లేదా వారి ప్రతిష్టను దెబ్బతియ్యడానికి ప్రయత్నిస్తున్నారు.

English Summary

The Delhi High Court has issued strict directives to protect cricketer Abhishek Sharma’s personality rights, targeting platforms and individuals misusing his digital identity. Addressing growing concerns over deepfake technology and the unauthorized use of his creative content, the court has ordered immediate action to takedown infringing material, setting a firm precedent for celebrity rights.