ఫిఫా సెమీ ఫైనల్స్ లోకి దూసుకెళ్లిన ఇంగ్లాండ్: నార్వే బ్యాడ్ లక్

ఫిఫా వరల్డ్ కప్ రసకందాయంలో పడింది. క్వార్టర్ ఫైనల్స్ దాదాపు ముగింపుదశకు వచ్చేశాయి. ఇక సూపర్ 4 ఆరంభం కానుంది. తాజాగా మయామి స్టేడియం వేదికగా అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్ లో ఇంగ్లాండ్ విజయదుందుభి మోగించింది. 2-1 గోల్స్ తేడాతో నార్వేపై అద్భుత విజయం సాధించింది. రియల్ మాడ్రిడ్ యువ సంచలనం జూడ్ బెల్లింగ్‌హామ్ రెండు అద్భుతమైన గోల్స్‌తో జట్టును ఒంటరి చేత్తో గెలిపించాడు. ఈ మ్యాచ్‌లో హీరోగా నిలిచాడు. సెమీస్ లో అర్జెంటీనా లేదా స్విట్జర్లాండ్ తో తలపడుతుందీ టీమ్.

Advertisement

మ్యాచ్ ప్రారంభమైన మొదటి నిమిషం నుంచే ఇరు జట్ల ఆటగాళ్ళు దూకుడును ప్రదర్శించారు. ముఖ్యంగా నార్వే మిడ్‌ఫీల్డర్లు ఇంగ్లాండ్ డిఫెన్స్‌ను చేధించడానికి నిరంతరం శ్రమించారు. ఈ క్రమంలో మ్యాచ్ 36వ నిమిషంలో నార్వే కెప్టెన్ మార్టిన్ ఒడెగార్డ్ అందించిన అద్భుతమైన పాస్‌ను ఆండ్రియాస్ షెల్డెరప్.. క్లాసిక్ గోల్‌గా మలిచాడు. దీంతో నార్వే మ్యాచ్ ప్రథమార్థంలోనే 1-0తో ఆధిక్యాన్ని సంపాదించింది. ఇంగ్లాండ్ జట్టు ఒత్తిడిని మరింత పెంచగలిగింది.

Advertisement

తొలి భాగంలో వెనుకంజలో ఉన్న ఇంగ్లాండ్ జట్టు ఏమాత్రం ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ప్రత్యర్థి గోల్ పోస్ట్‌పై వరస దాడులు చేసింది. ప్రథమార్ధానికి అదనంగా లభించిన సమయంలో.. అంటే సరిగ్గా 45+2వ నిమిషంలో ఆంథోనీ గోర్డాన్ అందించిన అద్భుతమైన పాస్‌ను జూడ్ బెల్లింగ్‌హామ్ గోల్‌గా మలిచి మ్యాచ్‌ను 1-1తో సమం చేశాడు. ఈ గోల్ మ్యాచ్ గమనాన్ని పూర్తిగా మార్చివేయడమే కాకుండా ఇంగ్లాండ్ లో నూతన ఉత్సాహాన్ని నింపింది.

విరామ సమయానికి స్కోర్లు సమం కావడంతో ద్వితీయార్ధం మరింత ఆసక్తికరంగా మారింది. సెకెండ్ హాఫ్ ప్రారంభమైన వెంటనే ఇంగ్లాండ్ కోచ్ వ్యూహాత్మక మార్పులు చేశాడు. ఆటకు మరింత పదునును పెట్టాడు. బుకాయో సాకా, నోని మడుయెకెలను దించాడు. డెక్లాన్ రైస్ స్థానంలో ఎబెరెచి ఎజేను పంపించాడు. నార్వే కూడా డిఫెన్స్‌ను పటిష్టం చేసుకొంది. ఇంగ్లాండ్ వ్యూహాలను తిప్పికొట్టడానికి శాయశక్తులా ప్రయత్నించింది.

Advertisement

ఇరు జట్ల డిఫెన్స్ బలంగా ఉండటంతో ముగింపు సమయం వరకు ఒక్క గోల్ కూడా నమోదు కాలేదంటే మ్యాచ్ ఎంత హోరాహోరీగా సాగిందో అర్థం చేసుకోవచ్చు. మ్యాచ్ నిర్ణీత సమయం సమీపిస్తున్న కొద్దీ స్టేడియంలో ఉత్కంఠ పతాక స్థాయికి చేరింది. 93వ నిమిషంలో జూడ్ బెల్లింగ్‌హామ్ మరోసారి తన అసాధారణమైన క్లాస్‌ను ప్రదర్శించాడు. సంచలన రీతిలో బంతిని ప్రత్యర్థి గోల్ కీపర్‌కు అందకుండా నెట్‌లోకి పంపి ఇంగ్లాండ్‌కు 2-1తో అద్భుత విజయాన్ని ఖరారు చేశాడు.

ఈ అద్భుత గోల్‌తో ఇంగ్లాండ్ శిబిరంలో సంబరాలు మిన్నంటాయి. ఆ తర్వాత అదనపు సమయంలోనూ నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. నార్వే తన సూపర్ స్టార్ స్ట్రైకర్ ఎర్లింగ్ హాలాండ్‌ను 106వ నిమిషంలో గ్రౌండ్ లో దించింది. స్కోరును సమం చేయడానికి దాడిని మరింతగా ముమ్మరం చేసింది. మరోవైపు ఇంగ్లాండ్ ఆటగాడు డాన్ బర్న్ 111వ నిమిషంలో బెల్లింగ్‌హామ్ స్థానంలో వచ్చి జట్టు రక్షణ శ్రేణిని మరింత పటిష్టం చేశాడు.

Advertisement

నార్వే చివరి నిమిషం వరకు రికవరీ కోసం తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ, ఇంగ్లాండ్ సాధించిన ఆధిపత్యాన్ని అడ్డుకోలేక చివరకు చేతులెత్తేసింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ జట్టు 53 శాతం బంతిని తమ నియంత్రణలో ఉంచుకుంది. నార్వే 47 శాతం బాల్ పొసెషన్‌తో గట్టి పోటీ ఇచ్చింది. ఇంగ్లాండ్ 14 సార్లు నార్వే గోల్ పోస్ట్‌పై దాడి చేయగా, అందులో 8 షాట్లు నేరుగా లక్ష్యం వైపు దూసుకెళ్లాయి. నార్వే కూడా 13 షాట్లతో ప్రత్యర్థిని భయపెట్టింది. ఇరు జట్ల గోల్ కీపర్లు అడ్డుగోడలా నిలిచి వాటిని నిలువరించగలిగారు.

Advertisement

ఈ మ్యాచ్ తో జూడ్ బెల్లింగ్‌హామ్ అంతర్జాతీయ ఫుట్‌బాల్ లో తన ప్రత్యేకత, నాయకత్వ లక్షణాలను మరోసారి నిరూపించుకున్నాడు. ఒత్తిడి సమయాల్లో భావోద్వేగాలను నియంత్రించుకుంటూ గోల్స్ నమోదు చేయడం అతడి అద్భుతమైన నైపుణ్యానికి నిదర్శనం. ఈ టోర్నమెంట్ లో ఇప్పటివరకు ఆరు గోల్స్ సాధించాడు బెల్లింగ్. తన జట్టు కేప్టెన్ హారీ కేన్ తో సమవుజ్జీగా నిలిచాడు. అత్యధిక గోల్స్ కొట్టిన వారిలో కిలియన్ ఎంబాప్పె, లియోనెల్ మెస్సీ ముందున్నారు.

English Summary

England Stun Norway in Extra Time to 2-1 Win Over Norway and Enter FIFA World Cup Semifinal Bellingham. The Real Madrid star is now tied with Harry Kane with six goals in this tournament, behind the eight of France's Kylian Mbappé and Argentina's Lionel Messi.