వైభవ్ ఎంట్రీ.. ఇంగ్లాండ్‌తో రెండో టీ20 భారత తుది జట్టు ఇదే!

ఇంగ్లాండ్ జట్టుతో జరగబోయే రెండో టీ20 మ్యాచ్‌కు ముందు టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ గురించి అనేక సమీకరణాలు తెరపైకి వస్తున్నాయి. ముఖ్యంగా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ అరంగేట్రం కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తన సరికొత్త వ్యూహాలతో బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పులు చేసి వైభవ్ సూర్యవంశీకి అవకాశం కల్పిస్తే భారత జట్టు మరింత పటిష్టంగా మారుతుందని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు. సునీల్ గవాస్కర్ వంటి దిగ్గజాలు కూడా వైభవ్ సూర్యవంశీని ఎక్కువ కాలం బెంచ్‌కే పరిమితం గంభీర్‌పై ఒత్తిడి పెరుగుతుందని హెచ్చరించారు.

Advertisement

ఈ కొత్త ప్లాన్ ప్రకారం.. ఇంగ్లాండ్ జట్టుపై పవర్ ప్లేను పూర్తిగా వాడుకోవడానికి వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మలతో ఓపెనింగ్ చేయించే అవకాశం ఉంది. ఈ ఇద్దరు లెఫ్టార్మ్ బ్యాటర్లు ఆరంభం నుంచే భారీ షాట్లతో ప్రత్యర్థి బౌలర్లపై ఒత్తిడి తీసుకురాగలరు. అభిషేక్ శర్మ ఇప్పటికే మంచి ఫామ్‌లో ఉన్నాడు. జులై 1న జరిగిన గత మ్యాచ్‌లో అభిషేక్ శర్మ కేవలం 24 బంతుల్లోనే 59 పరుగులు సాధించాడు. ఒకవేళ వైభవ్ సూర్యవంశీ ఓపెనర్‌గా వస్తే.. సీనియర్ ఆటగాడు సంజూ శాంసన్ ను మూడో స్థానానికి లేదా మిడిల్ ఆర్డర్ కు పంపించవచ్చు. మిడిలార్డర్ లో ఇన్నింగ్స్ ను చక్కదిద్దే అనుభవం సంజూ శాంసన్‌‌కు మెండుగా ఉంది. అలాగే ఇషాన్ కిషన్‌ను నాల్గో లేదా ఐదో స్థానంలో ఆడించడం ద్వారా బ్యాటింగ్ లైనప్‌కు మరింత లోతు వస్తుంది.

Advertisement

బ్యాటింగ్ ఆర్డర్‌తో పాటు స్పిన్ విభాగంలోనూ మార్పులు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. జట్టు కాంబినేషన్ కోసం వైస్ కెప్టెన్ తిలక్ వర్మకు విశ్రాంతిని ఇచ్చి అదనపు బౌలింగ్ ఆప్షన్‌తో బరిలోకి దిగాలని జట్టు యాజమాన్యం భావిస్తోంది. గత టీ20 ప్రపంచకప్ 2026లో అక్షర్ పటేల్ వైస్ కెప్టెన్‌గా ఉన్నప్పటికీ జట్టు అవసరాల కోసం కొన్ని మ్యాచ్‌ల్లో బెంచ్‌కే పరిమితమయ్యాడు. అదే తరహాలో ఇప్పుడు తిలక్ వర్మను కూడా పక్కన పెట్టే యోచనలో ఉన్నారు. పిచ్ పరిస్థితులను బట్టి స్పిన్‌కు అనుకూలిస్తే వరుణ్ చక్రవర్తిని, లేదా బ్యాటింగ్ బ్యాలెన్స్ కావాలనుకుంటే వాషింగ్టన్ సుందర్‌ను జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది.

Advertisement

వైభవ్ సూర్యవంశీ అరంగేట్రంపై బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ స్పందిస్తూ.. తుది నిర్ణయం హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌ల చేతుల్లోనే ఉందని స్పష్టం చేశారు. జులై 4న మాంచెస్టర్‌లో జరగబోయే రెండో టీ20 మ్యాచ్‌లో ఈ ప్రయోగాలు గనుక సత్ఫలితాలను ఇస్తే, భారత క్రికెట్‌లో మరో యువ సంచలనం ప్రపంచ వేదికపై మెరవడం ఖాయం.

రెండో టీ20 కోసం భారత తుది జట్టు అంచనా: వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), శివమ్ దూబే, అక్షర్ పటేల్, ప్రిన్స్ యాదవ్, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, తిలక్ వర్మ/వరుణ్ చక్రవర్తి/వాషింగ్టన్ సుందర్.

English Summary

India vs England, Check out the predicted India Playing 11 for the 2nd T20I against England in Manchester. Will head coach Gautam Gambhir hand a debut to young prodigy Vaibhav Sooryavanshi?