పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తమ మాజీ క్రికెటర్లపై కఠిన చర్యలు తీసుకోవడానికి సిద్దమవుతోంది. అవసరమైన అనుమతులు లేకుండా జాంబియాలో జరిగిన ఆసియన్ లెజెండ్స్ లీగ్‌లో పాల్గొన్న ఆటగాళ్లు క్రమశిక్షణా చర్యలను ఎదుర్కోవాల్సి రావచ్చు. నిబంధనలను ఉల్లంఘించిన వారికి రెండేళ్ల వరకు నిషేధం విధించవచ్చని బోర్డు స్పష్టం చేసింది. ఆసియన్ లెజెండ్స్ లీగ్‌కు తాము ఎలాంటి అనుమతి గానీ, మద్దతు గానీ ఇవ్వలేదని స్పష్టం చేస్తూ జాంబియా క్రికెట్ యూనియన్ (ZCU) గత వారం ఓ అధికారిక ప్రకటన జారీ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. జెడ్సీయూ జారీ చేసిన ఈ ప్రకటన మొత్తం టోర్నమెంట్ పైనే ప్రశ్నలను లేవనెత్తింది.
చరిత్రను మార్చే సన్నాహాలు.. వైభవ్ సూర్యవంశీ చేతిలో బిగ్ రికార్డ్!
ఈ లీగ్ కోసం డజనుకు పైగా మాజీ పాకిస్తానీ ఆటగాళ్లు ఒప్పందాలపై సంతకాలు చేసినట్లు సమాచారం. వీరిలో మహమ్మద్ హఫీజ్, షోయబ్ మాలిక్ , ఉమర్ అక్మల్ వంటి ఇతర ప్రముఖ పేర్లు ఉన్నాయి. ఈ లీగ్‌లో వారి భాగస్వామ్యంపై ఇప్పుడు పీసీబీ విచారణ జరుపుతోంది. జాంబియా క్రికెట్ యూనియన్ ప్రకటన అనంతరం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కూడా అధికారికంగా స్పందించింది. ఈ అనుమతి లేని టోర్నీలో పాకిస్తానీ ఆటగాళ్లు పాల్గొనడాన్ని తాము తీవ్రంగా పరిగణించినట్లు పీసీబీ పేర్కొంది. పీసీబీ నుంచి అవసరమైన అనుమతి పొందకుండా ఈ ఈవెంట్లో పాల్గొన్నట్లు తేలిన ఏ ఆటగాడిపైనైనా క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని బోర్డు తెలిపింది.
నిబంధనలను ఉల్లంఘించినట్లు తేలిన ఆటగాళ్లపై రెండేళ్ల వరకు నిషేధం విధించవచ్చని పీసీబీ తన ప్రకటనలో స్పష్టం చేసింది. అంతేకాకుండా ఈ కాలంలో వారు పీసీబీ, పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్)కు సంబంధించిన ఎలాంటి క్రికెట్, కోచింగ్, కన్సల్టెన్సీ, మెంటరింగ్ లేదా ఇతర అధికారిక బాధ్యతలకు అర్హులు కారు. ఏదైనా విదేశీ లేదా ప్రైవేట్ లీగ్‌లో పాల్గొనే ముందు ఆటగాళ్లు తప్పనిసరిగా తగిన అనుమతి పొందాలని బోర్డు భావిస్తోంది. అందువల్ల అనుమతి లేకుండా ఆటగాళ్లు టోర్నమెంట్‌లో పాల్గొన్నారని విచారణలో రుజువైతే, వారిపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఇప్పుడు అందరి దృష్టి పీసీబీ విచారణ, తుది నిర్ణయంపైనే ఉంది. బోర్డు పేర్కొన్న విధంగా చర్యలు తీసుకుంటే, పలువురు మాజీ పాకిస్తానీ అంతర్జాతీయ క్రికెటర్లు రాబోయే రెండేళ్లపాటు అధికారిక క్రికెట్ కార్యకలాపాల నుంచి బహిష్కరణకు గురయ్యే అవకాశం ఉంది.బ్యాంక్ ఉద్యోగిగా టీమిండియా స్టార్ క్రికెటర్.. జీతం ఎంతో తెలుసా?