ఫుట్‌బాల్ లో సూపర్ స్టార్.. అయినా ఎంబాప్పెకు తప్పలేదు: ఫిఫా, ఫ్రాన్స్ అండ

ఫుట్‌బాల్ గ్రౌండ్ లో ఆటగాళ్ల మధ్య శారీరక ఘర్షణలు సాధారణమే. అవి వ్యక్తిగత విమర్శలు, జాతి వివక్షకు దారితీసేంతగా తయారయ్యాయి. ఫ్రాన్స్ కేప్టెన్ జట్టు కిలియన్ ఎంబాపెపై సైతం ఈ జాతి వివక్ష వ్యాఖ్యలకు గురయ్యాడు. పరాగ్వే సెనేటర్ సెలెస్టే అమరిల్లా చేసిన ఈ వివాదాస్పద వ్యాఖ్యలు అంతర్జాతీయంగా తీవ్ర దుమారం రేపాయి. ఈ నేపథ్యంలో ఎంబాపెకు మద్దతుగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మక్రాన్ నేరుగా రంగంలోకి దిగారు. జాతి వివక్షకు వ్యతిరేకంగా ఎంబాపె మరో అద్భుతమైన గోల్ కొట్టాడంటూ కొనియాడారు.

Advertisement

ఫిఫా వరల్డ్ కప్ లో భాగంగా ఫ్రాన్స్, పరాగ్వే జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ఎంబాప్పే జాతి వివక్షను ఎదుర్కొన్నాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత పరాగ్వే సెనేటర్ సెలెస్టే అమరిల్లా సోషల్ మీడియా వేదికగా ఎంబాపెపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అతన్ని వలసపాలన కాలంనాటి కామెరూన్ వ్యక్తి.. అని అవహేళన చేశారు. అతడికి అసలు ఫ్రెంచ్ సంస్కృతి లేదని, అహంకారి మాత్రమే ఉందంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

Advertisement

దీనిపై ఎంబాప్పె తీవ్రంగా స్పందించాడు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఇలాంటి విద్వేషపూరిత వ్యాఖ్యలు చేయడం ఆమె దిగజారుడుతనానికి నిదర్శనమని ధీటుగా సమాధానం ఇచ్చాడు. ఈ వివాదం ప్రపంచవ్యాప్తంగా దుమారం రేపింది. ఫిఫాలోనూ కలకలం చోటు చేసుకుంది. ఇమ్మాన్యుయేల్ మక్రాన్ సోషల్ అతనికి మద్దతు ప్రకటించారు. "కిలియన్ ఎంబాపె మరో గోల్ సాధించాడు. ఈసారి అది జాతి వివక్షకు వ్యతిరేకంగా పడింది. అమర్యాదపూర్వక పదజాలంతో దాడి జరిగినప్పుడు మనం విలువలు, గౌరవం, సోదరభావంతోనే సమాధానం చెప్పాలి.." అని ట్వీట్ చేశారు.

మరోవైపు ఫ్రెంచ్ ఫుట్‌బాల్ ఫెడరేషన్ (FFF) కూడా ఎంబాపెకు అండగా నిలిచింది. పరాగ్వే సెనేటర్ చేసిన వ్యాఖ్యలను నేరపూరితమైనవిగా వ్యాఖ్యానించింది. ఈ వ్యవహారంపై చట్టపరమైన చర్యల కోసం ప్రాసిక్యూటర్ కార్యాలయానికి నివేదికను సమర్పిస్తున్నట్లు బోర్డు వెల్లడించింది. క్రీడల్లో ఇలాంటి అసహ్యకరమైన వివక్షను ఎట్టిపరిస్థితుల్లోనూ సహించేది లేదని స్పష్టం చేసింది.

Advertisement

ఈ వివాదం అంతర్జాతీయ దౌత్య సంబంధాలపై ప్రభావం చూపకుండా ఉండేందుకు పరాగ్వే ప్రభుత్వం త్వరితగతిన స్పందించింది. నష్టనివారణ చర్యలు చేపట్టింది. సెనేటర్ అమరిల్లా చేసిన వ్యాఖ్యలను పరాగ్వే ప్రభుత్వం అధికారికంగా ఖండించింది. ఆమె చేసిన వ్యాఖ్యలు ఏమాత్రం ఆమోదయోగ్యం కావని, దేశ ప్రజాస్వామ్య విలువలకు అవి వ్యతిరేకమని తేల్చి చేసింది. ఆ వ్యాఖ్యలు సదరు సెనేటర్ వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమేనని, వాటితో పరాగ్వే ప్రభుత్వానికి గానీ, అక్కడి ప్రజల ఆలోచనలకు గానీ ఎలాంటి సంబంధం లేదని తెలిపింది.

తమదేశం ఎప్పుడూ మానవ హక్కులను సమర్థిస్తుందని పునరుద్ఘాటించింది పరాగ్వే. అంతర్జాతీయ క్రీడల్లో ఎంతటి తీవ్రమైన పోటీ ఉన్నప్పటికీ, రంగు, జాతీయత ఆధారంగా ఆటగాళ్లపై వివక్ష చూపడం క్రీడా స్ఫూర్తికే విరుద్ధమని ప్రపంచవ్యాప్తంగా క్రీడాభిమానులు అభిప్రాయపడుతున్నారు. మ్యాచ్‌లలో ఉండే వ్యూహాత్మక శత్రుత్వాన్ని మైదానం వరకే పరిమితం చేయాలని, దానిని వ్యక్తిగత ద్వేషంగా మార్చడం సమాజానికి ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు.

English Summary

Superstar Mbappe Faces Racism France President Macron and FIFa Backs Him says Another Goal Against it. Macron has backed Kylian Mbappe after he criticised racist remarks attributed to Paraguay senators. The French President’s support highlights a firm stance.