చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ దూకుడు- బిగ్ జాక్ పాట్

భారత క్రికెట్ యువ సంచలనం, వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ క్రికెట్ పై తనదైన ముద్ర వేస్తోన్నాడు. ఇటీవల ముగిసిన జింబాబ్వే పర్యటనలో అద్భుతంగా రాణించిన ఈ టీనేజ్ బ్యాటర్.. ఐసీసీ లేటెస్ట్ టీ20 ర్యాంకింగ్స్‌లో ప్రభంజనం సృష్టించాడు. ఏకంగా 230 స్థానాలను ఎగబాకాడు. జింబాబ్వే పర్యటనకు ముందు ఎక్కడో 300 వరకు ఉన్న అతని ఐసీసీ టీ20 ర్యాంక్ రాకెట్ లా ఎగిరింది. ఇప్పుడు 48వ స్థానానికి చేరుకున్నాడు. తానేంటో నిరూపించుకున్నాడు.

Advertisement

జింబాబ్వేతో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో వైభవ్ సత్తా చాటాడు. ఈ సిరీస్‌ను టీమిండియా 3-0తో క్లీన్‌స్వీప్ చేయడంలో కీలకపాత్ర పోషించాడు. ఈ మూడు మ్యాచ్‌లలో 50.33 సగటుతో రెండు అర్ధ సెంచరీల సాయంతో మొత్తం 151 పరుగులు ఖాతాలో వేసుకున్నాడు. జింబాబ్వే బౌలర్లను ముప్పుతిప్పలు పెడుతూ దూకుడుగా ఆడిన తీరు అతన్ని భవిష్యత్ సూపర్ స్టార్‌గా నిలబెట్టింది. ఈ నిలకడ ప్రదర్శనతో ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అతడి రేటింగ్ పాయింట్లు 536కు చేరుకున్నాయి.

Advertisement

టీ20 బ్యాటింగ్ కేటగిరీలో టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ 910 రేటింగ్ పాయింట్ల నంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్నాడు. జింబాబ్వేతో సిరీస్‌లో రాణించిన తిలక్ వర్మ, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కూడా తమ స్థానాలను మరింత మెరుగుపరుచుకున్నారు. తిలక్ వర్మ రెండు స్థానాలు ఎగబాకి ఆరో స్థానానికి చేరుకోగా, శ్రేయస్ అయ్యర్ ఏడు స్థానాలను మెరుగుపర్చుకుని 24వ ర్యాంకును దక్కించుకున్నాడు.

విద్యార్థులను కేంద్రం అంధభక్తులుగా మార్చుతోంది- సమస్య అంతా ఆర్ఎస్ఎస్ తోనే

ఇషాన్ కిషన్- 910- సాహిబ్జాదా ఫర్హాన్- 848, అభిషేక్ శర్మ- 819, ఫిల్ సాల్ట్- 799, పాథుమ్ నిశ్శంక- 751 పాయింట్లతో టీ20 ర్యాంకింగ్స్ లల్లో తొలి అయిదు స్థానాల్లో ఉన్నారు. తిలక్ వర్మ- 750, జోస్ బట్లర్- 748, హ్యారీ బ్రూక్- 734, మిఛెల్ మార్ష్- 706, డెవాల్డ్ బ్రెవిస్- 702, టిమ్ సీఫర్ట్- 698 పాయింట్లతో చివరి అయిదు స్థానాలను దక్కించుకున్నారు.

Advertisement

మరోవైపు వన్డే క్రికెట్ ఫార్మాట్‌లో కూడా భారత క్రికెటర్ల దూకుడు కనిపించింది. టీమిండియా వన్డే ఫార్మట్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్ మరోసారి అగ్రస్థానానికి చేరుకున్నాడు. న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్ డారిల్ మిచెల్‌ను వెనక్కి నెట్టి ఐసీసీ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో మళ్లీ నంబర్ వన్ స్థానానికి దూసుకెళ్లాడు. ఈ ఏడాది జనవరి నుంచి అగ్రస్థానంలో కొనసాగుతున్న మిచెల్‌ను గిల్.. తన అద్భుత ప్రదర్శనతో రెండో స్థానానికి నెట్టేశాడు.

బౌలింగ్ విభాగంలో లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ కూడా 31 స్థానాలను ఎగబాకి 41వ ర్యాంకును సొంతం చేసుకున్నాడు. గాయం కారణంగా జింబాబ్వే పర్యటనకు దూరంగా ఉండాల్సి వచ్చిన మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి మూడు స్థానాలను కోల్పోయినప్పటికీ.. ఐసీసీ బౌలర్ల జాబితాలో టాప్-10లో తన స్థానాన్ని కాపాడుకోగలిగాడు.

English Summary

Vaibhav Sooryavanshi Soars 230 Spots to Career-Best 48th in ICC T20I Batting Rankings Shubman Gill. The 15-year-old rose a total of 230 places to find a new career-best rating in 48th position for T20I batters behind No.1 ranked teammate Ishan Kishan at the top of the rankings.