బాబు రెండేళ్లే పదవిలో, జ్యోతిష్యులు చెప్పారు: జగన్
హైదరాబాద్: రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రెండేళ్లే ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం అన్నారు. ఆయన ఏపీ రాజధాని ప్రాంత గ్రామాల రైతులను కలిశారు. ఈ సందర్భంగా మాట్లాడారు.
రాజధాని ప్రాంత రైతుల బాధలు, సమస్యలు, వారిపై వేధింపులు వింటుంటే గుండె తరుక్కుపోతోందన్నారు. బలవంతంగా భూములు లాక్కుంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. వారి తరపున పోరాడతామన్నారు. రాజధాని ప్రాంత రైతులను మానసిక క్షోభకు గురి చేస్తున్నారని మండిపడ్డారు.

రైతులు స్వచ్ఛందంగా భూమి ఇస్తే తీసుకోవటంలో తప్పులేదని, అయితే ప్రభుత్వం మాత్రం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందని ఆరోపించారు. రోడ్లు వేసి, జోనింగ్ చేసి వదిలేయాల్సిన ప్రభుత్వం భూములు ఎందుకు లాక్కోవాలని చూస్తోందని ప్రశ్నించారు. ప్రభుత్వం పాలన చేయాలే కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారం కాదన్నారు.
అధికారాన్ని అడ్డుపెట్టుకుని చంద్రబాబు ఇష్టారీతిగా చేస్తున్నారన్నారు. ఆ అధికారం ఉండేది నాలుగేళ్లేనని, ఇంకా ముందే పోవచ్చన్నారు. మీ అన్నా, తమ్ముడో, కొడుకో అధికారంలోకి వస్తాడు తిరిగి మీ భూముల్ని మీకు ఇస్తాడని చెప్పారు. బలవంతంగా భూమి లాక్కునే ప్రయత్నం చేస్తే కోర్టులు ఉన్నాయని, అక్కడ సవాల్ చేద్దామని సూచించారు. తాము అధికారంలోకి వస్తే రైతుల ఇష్ట ప్రకారమే రాజధానిని నిర్మిస్తామన్నారు.
ఈ రోజు సాయంత్రం రైతులతో కలిసి గవర్నర్ నరసింహన్‌ను కలవనున్నట్లు జగన్ చెప్పారు. వారి సమస్యలను గవర్నర్ దృష్టికి తీసుకు వెళతామన్నారు. కాగా, అంతకుముందు రాజధాని గ్రామాల్లో పోలీసుల దుశ్చర్య, వేధింపులపై రైతులు సోమవారం జగన్‌ని కలిశారు. వారు తమ గోడును వెల్లబోసుకున్నారు.












Click it and Unblock the Notifications