సినిమాలకు బ్రేక్: హిమాలయాల బాట పట్టిన సూపర్ స్టార్
Rajinikanth: దేశంలో చార్ ధామ్ యాత్ర సందడి కొనసాగుతోంది. దేవ భూమిగా గుర్తింపు పొందిన ఉత్తరాఖండ్‌లో వెలిసిన చార్ ధామ్ పుణ్యక్షేత్రాలను సందర్శించడానికి దేశం నలుమూలల నుంచీ లక్షలాది మంది భక్తులు తరలి వెళ్తోన్నారు. ప్యాకేజీ టూర్లకు డిమాండ్ ఏర్పడింది.
ఉత్తరాఖండ్‌లోని యమునోత్రి, గంగోత్రి, కేదార్‌నాథ్, బద్రీనాథ్ ఆలయాలను చార్ ధామ్ క్షేత్రాలుగా పిలుస్తారు. భక్తుల కోసం ఆయా ఆలయాలన్నీ తెరచుకున్నాయి. ఈ నెల 10వ తేదీన గంగోత్రి, యమునోత్రి, 12వ తేదీన కేదార్‌నాథ్, బద్రీనాథ్ ఆలయాలను భక్తుల సందర్శనార్థం తెరిచారు.

మళ్లీ శీతాకాలం ఆరంభ సమయంలో అంటే నవంబర్ 12వ తేదీన గంగోత్రి, యమునోత్రి, 14వ తేదీన కేదార్‌నాథ్, బద్రీనాథ్ ఆలయాలు మూతపడతాయి. విపరీతమైన మంచు పడటం, ప్రతికూల వాతావరణం వల్ల సంవత్సరంలో ఆరు నెలలు మాత్రమే ఆయా ఆలయాల్లో భక్తులకు అనుమతి ఉంటుంది.
చార్ ధామ్ క్షేత్రాలను దర్శించుకుంటోన్న భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది ఉత్తరాఖండ్‌కు తరలివస్తోన్నారు. దీనితో ఉత్తరాఖండ్ ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలను తీసుకుంది. సామాన్య భక్తులకు దర్శనాన్ని కల్పించడానికి అధిక ప్రాధాన్యత ఇచ్చింది.
వీఐపీల దర్శనంపై విధించిన నిషేధాన్ని ఈ నెల 31వ తేదీ వరకు పొడిగించింది. ఈ మేరకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సామాన్య భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలను కల్పించడంపైనే తాము ప్రస్తుతం దృష్టి సారించామని, వీఐపీల రాక వల్ల ఇబ్బందులు కలుగుతాయనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాధా రాటూరి తెలిపారు.

ఈ పరిస్థితుల్లో సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్.. ఉత్తరాఖండ్ చేరుకున్నారు. ఈ సాయంత్రం ఆయన రాజధాని డెహ్రాడున్‌లోని జాలీ గ్రాంట్ ఎయిర్‌పోర్ట్‌లో కనిపించారు. ఆయన మళ్లీ హిమాలయాల బాట పట్టారు. చార్ ధామ్ క్షేత్రాలు బద్రీనాథ్, కేదార్‌నాథ్ ఆలయాలను సందర్శించనున్నారు.
విమానాశ్రయంలో తనను కలిసిన విలేకరులతో మాట్లాడారు రజినీకాంత్. బద్రీనాథ్, కేదార్‌నాథ్ ఆలయాలను సందర్శించాల్సి ఉందని, అందుకే ఇక్కడికి వచ్చినట్లు చెప్పారు. సినిమాల చిత్రీకరణ నుంచి స్వల్పంగా విరామం తీసుకున్నానని, కొద్దిరోజుల పాటు ఇక్కడే గడపాలని నిర్ణయించుకున్నానని అన్నారు.
ప్రస్తుతం రజినీకాంత్ వేటయ్యన్ సినిమాలో నటిస్తోన్నారు. టీజే జ్ఞానవేళ్ దర్శకుడు. అమితాబ్ బచ్చన్, ఫహద్ ఫాజిల్, రానా దగ్గుబాటి, మంజూ వారియర్, రితికా సింగ్, దుషారా విజయన్, కిషోర్.. ఇతర కీలక పాత్రల్లో నటిస్తోన్నారు. 160 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ కింద సుబాస్కరన్ నిర్మిస్తోన్నారు.












Click it and Unblock the Notifications