Fact check : ఇండియన్ పాస్‌పోర్టులో ఆ కాలమ్‌ను తొలగించారా...?
భారత ప్రభుత్వం ఇండియన్ పాస్‌పోర్ట్ నుంచి 'జాతీయత' అనే కాలమ్‌ను తొలగించిందా..? అవును... నిజమేనంటూ హిందీలో ఓ కథనం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 'లీగల్ అప్డేట్... భారత పాస్‌పోర్టుల నుంచి మోదీ ప్రభుత్వం జాతీయత అనే కాలమ్‌ను తొలగించింది. కాబట్టి మీ పాత పాస్‌పోర్టులను కోల్పోకుండా చూసుకోండి.' అని అందులో పేర్కొన్నారు. డా.సయ్యద్ ఎతేమద్ ఉద్దీన్ అనే న్యాయవాది పేరుతో ఈ మెసేజ్ సర్క్యులేట్ అవుతోంది.
ఈ ప్రచారంపై భారత విదేశాంగ శాఖ స్పందించింది. ఇందులో ఎటువంటి నిజం లేదని స్పష్టం చేసింది. వన్ఇండియా టీమ్ విదేశాంగ శాఖతో సంప్రదించగా... ప్రతీ ట్రావెల్ డాక్యుమెంట్లో కచ్చితంగా జాతీయత కాలమ్ ఉంటుందని,ఇండియన్ పాస్‌పోర్టులోనూ అది తప్పనిసరి అని తెలిపింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని కొట్టిపారేశారు.
ప్రస్తుతం సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న ఆ మెసేజ్ పూర్తిగా అవాస్తవమని పేర్కొంది.

కేంద్ర ప్రభుత్వం ఇండియన్ పాస్‌పోర్టుల్లో జాతీయత కాలమ్‌ను తొలగించినట్లు ఎక్కడా వార్తా కథనాలు కూడా రాలేదు. పాస్‌పోర్ట్ సేవా కేంద్రా వెబ్సైట్లోనూ ఇలాంటి నోటిఫికేషన్ ఏదీ కనిపించలేదు. కాబట్టి ఈ ఫేక్ ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దు. ఇండియన్ పాస్‌పోర్టులో జాతీయత కాలమ్‌ను ప్రభుత్వం తొలగించలేదు.

Fact Check
వాదన
ఇండియన్ పాస్‌పోర్టు నుంచి జాతీయత కాలమ్‌ను మోదీ ప్రభుత్వం తొలగించింది.
వాస్తవం
కేంద్ర ప్రభుత్వం అలాంటి నిర్ణయమేదీ తీసుకోలేదు.