Fact Check : రేపటి నుంచి దేశవ్యాప్త లాక్ డౌన్ నేడు ప్రధాని మోడీ ప్రకటన-వాస్తవమెంత ?
దేశవ్యాప్తంగా కోవిడ్ 19 కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఓమిక్రాన్ వేరియంట్ ప్రభావంతో రోజువారీ కోవిడ్ కేసుల సంఖ్య రెండు లక్షలు దాటిపోయింది. దీంతో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించాల్సిన పరిస్దితులు నెలకొంటున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ ఈ నెల 25 వరకూ దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించినట్లు ప్రచారం జరుగుతోంది. ఇందులో నిజానిజాల్ని తెలుసుకునేందుకు వన్ ఇండియా తెలుగు ప్రయత్నించింది.
దేశవ్యాప్తంగా కరోనా కేసులు కల్లోలం రేపుతున్న నేపథ్యంలో ఇవాళ ప్రధాని మోడీ ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. ఇందులో ముఖ్యమంత్రుల అభిప్రాయాలు తీసుకున్న తర్వాత లాక్ డౌన్ పై ప్రకటన చేస్తారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అదీ రేపటి నుంచి జనవరి 25 వరకూ ఉంటుందని ఈ ప్రచారం సారాంశం. ఇందులో నిజానిజాల్ని వన్ ఇండియా నిర్ధారించింది. సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నట్లు ప్రధాని మోడీ రేపటి నుంచి లాక్ డౌన్ విధించాలని ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, ప్రకటనా చేయలేదని వన్ ఇండియా నిర్ధారణకు వచ్చింది. కాబట్టి అబద్ధపు ప్రచారాలకు సంబంధించి ఎలాంటి సమాచారాన్ని కానీ, చిత్రాలను కానీ సోషల్ మీడియాలో షేర్ చేయొద్దని ప్రభుత్వం కూడా కోరుతోంది.

మరోవైపు దేశవ్యాప్తంగా కోవిడ్ కల్లోలం నేపథ్యంలో పలు రాష్ట్రాలు స్ధానికంగా రాత్రిపూట కర్ఫ్యూలతో పాటు పలుచోట్ల పగటి పూట ఆంక్షలు కూడా విధిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం మాత్రమే ఈ ఆంక్షల విధింపు ఉంటుంది. కానీ కేంద్రం కానీ, ప్రధాని మోడీ కానీ దీనిపై ఎలాంటి ప్రకటనా ఇప్పటివరకూ చేయలేదు. ఇప్పటికే ప్రధాని మోడీ ఆరోగ్యశాఖకు చెందిన ఉన్నతాధికారులతో ఉన్నతస్ధాయి సమీక్షలు మాత్రం నిర్వహిస్తూనే ఉన్నారు. కానీ ఎక్కడా లాక్ డౌన్ విధించమని కూడా కోరడం లేదు.

Fact Check
వాదన
జనవరి 25 వరకూ లాక్ డౌన్ విధిస్తూ ప్రధాని మోడీ ప్రకటన
వాస్తవం
లాక్ డౌన్ విధింపు వార్తలు ఫేక్ గా నిర్ధారించిన కేంద్రం