వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నిన్నటి మేలైన విత్తనాలు - నగ్నమునినాగరిక సమాజంలో ప్రజలకు కూడు గూడు గుడ్డ భద్రతలతో పాటు భాషా సంస్కృతుల పరిరక్షణ, నవీకరణ, అనుసంధానం, అనుసరించవలసిన విధానం సందర్భంగా ఒక మాట.ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడిన కొత్తలో, అంటే 1956 నవంబరు ఒకటి తర్వాత, కొన్ని సంవత్సరాలు, ఆంధ్రేతరులకు తెలుగువారంటే ఎంతో గౌరవం వుండేది. తమ మాతృభాష ప్రాతిపదికన పోరాడి రాష్ట్రాన్ని సాధించుకోవడం గొప్పగా కనిపించేది. తెలుగువారు కార్యశూరులుగా కనిపించేవారు. దేశంలో యితర భారతీయులకు ఆదర్శంగా నిలిచారు. ఆంధ్రప్రదేశ్‌లో అన్ని రంగాల్లో కొన్ని అద్భుతాలు, ప్రయోజనకర ప్రయోగాలు జరుగుతాయని ఆశించారు.రాజధాని హైదరాబాద్‌ అన్ని విధాలా - మినీ ఇండియా, అనేక భాషల, అనేక మతాల, అనేక సంస్కృతుల కలబోసిన జీవితం, వైవిధ్య జీవనం. ప్రధానంగా తెలుగువారు, తరువాత ఉర్దూ, ఆ తరువాత యితర భాషీయులు. అనేక రంగులతో శోభాయమానంగా వుండేది.ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడక ముందు పాలన, పాలనేతర కార్యకలాపమంతా జరిగింది ఉర్దూలో. తెలుగువారికైనా, యితరులకైనా, విద్యాభ్యాసానికీ, వర్తక వాణిజ్యానికీ, అన్నింటికీ అనుసంధాన భాష, రాజ్యభాష ఉర్దూ.తెలుగు రాష్ట్రం ఏర్పడగానే ఉర్దూ స్థానంలోకి తెలుగు రాజ్యభాషగా వచ్చేస్తుందని, ప్రభుత్వ ప్రభుత్వేతర, విద్య, వర్తక, వాణిజ్య మొదలైన కార్యకలాపమంతా తెలుగులోకి మారిపోతుందని అంతా అనుకున్నారు.అదే సమయంలో, తెలుగేతరుల మనస్సులో, తమ మనుగడ, కొత్త వాతావరణంలో తాము యిమడగలమా అనే భయాందోళనలు కించిత్తు కదలిడినా, మొత్తం తెలుగులోనే జరపడానికి సంసిద్ధమయ్యారు. తెలుగు భాషా సహాయకుల కోసం ప్రయత్నించారు.1956 నవంబరు రెండవ తేదీన నేను బందరు నుండి హైదరాబాదు వచ్చాను, రాష్ట్రావతరణ పండుగ విశేషాలు చూద్దామని. ఎలాగూ వచ్చాను గదా అని ఎంప్లాయిమెంట్‌ ఏక్ఛేంజిలో నా పేరు నమోదు చేశాను. వెంటనే కొన్ని ప్రైవేటు కంపెనీల నుండి పిలుపు వచ్చింది. అక్కడ నేను చెయ్యవలసింది, వారి కార్యకలాపమంతా తెలుగులో చేసి పెట్టడం. నేను వెళ్లిన చోటల్లా యీ వాతావరణం కనిపించింది. చిన్నా పెద్దా అన్ని సంస్థలూ యిలాగే ఆలోచించాయి. తెలుగు పేరిట చాలా ఉద్యోగావకాశాలు ఏర్పడ్డాయి. సరే, నాకు సర్వీసు కమీషన్‌ నుండి పిలుపు వచ్చింది. శాసనసభలో స్థిరపడ్డాను. అది వేరే కథ.తెలుగేతరులు మొదట్లో కొంత మానసికంగా యిబ్బంది పడ్డా, క్రమంగా తామెంత మాత్రం భయపడవలసిన అవసరం లేదని తెలుసుకున్నారు. ఎందుకంటే - పాలకులు తమ వెంట తీసుకువచ్చిన పాలనాభాష తెలుగు కాదు, ఇంగ్లీషు.ఎటువంటి ఆకర్షక ప్రచారమూ, నిర్బంధమూ లేకుండా రాజ్యభాషగా, అన్నిటా తెలుగు విలసిల్లే అవకాశం, కాలం యిచ్చిన స్వర్ణావకాశం ప్రభుత్వం ఉపయోగించుకోకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది.తెరతీయగ రాదా! తెర తీయలేదు.కొత్త రాజకీయం, కొత్త రకం రాజకీయ నాయకుల ప్రవేశం మాత్రం జరిగింది. సమాజం తనని తాను ఎలా రక్షించుకోవాలో తెలీని సందిగ్ధం అరంభమవుతోంది.గతాన్ని సెంటిమెంటల్‌గానో, నోస్టాలిజియాతోనో పొగడడం కాదు గాని, ఆ రోజుల్లో హైదరాబాద్‌ స్నిగ్ధ సౌందర్యంతో వుండేది. ఇంకా మరకపడని అమాయకమైన అందం వుండేది. హైదరాబాదుకు ఆమడ దూరంగా ప్రశాంతంగా వుండేది. పావురంలా వుండేది. కువకువల్తో మెల్లగా చల్లగా నిశ్శబ్దంగా నడిచేది. ఎయిర్‌ కండిషన్డు సిటీలా వుండేది. అర్థరాత్రి వర్షం అతిథిలా వచ్చి నగరాన్ని స్నానమాడించి తెలవారక మునుపే వెళ్లిపోయేది. చెట్ల ఆకుల నుంచి జారే నీటి బిందువులే సాక్ష్యం పలికేవి. ఇరానీ చాయ్‌, గజళ్లు, గండిపేట నీళ్లు, హిందూస్థానీ సినిమా గుండె లోతుల్లోని పాటలు, రిక్షాలు, టాంగాలు, పాన్‌లు, మతం కులం అడ్డురాని సామాన్యుల స్నేహాలు హైదరాబాదుకు అద్దిన పరిమళాలు. అర్థరాత్రి సమీపిస్తుండగా రోడ్ల కూడలిలోని పాన్‌షాపులు మూసివేశాక అక్కడే, దానిపై ఓ చెక్క పరచి దాని మీద హర్మోని పెట్టె పెట్టుకుని, అంతవరకూ పాన్‌లు కట్టిన వాళ్లే తాన్‌సేన్‌లయిపోయేవారు. గజళ్లు ఆలపించేవాళ్లు. ఎదురుగా రోడ్డు మీదనే జనం కూచుని ప్రతిగా ప్రతి కవితా వాక్యం అందుకునేవారు. క్రమంగా కాలం యవనికపై నుండి యీ దృశ్యం అదృశ్యమైంది.హైదరాబాద్‌ ఫ్యూడల్‌ సంస్కృతికి ప్రతీక కాదని కాదు. కానీ, అగ్రభాగాన వుండి, ఆధిపత్యం చెలాయించే అధికార దాహం గురించి కాదు, నేను మాట్లాడేది. కింద, రోడ్డు మీది, హైదరాబాద్‌ గురించి.నాటి ఫ్యూడల్‌ సంస్కృతే, నేటి రాజకీయ సంస్కృతిగా మారడం గమనించవచ్చు.మరో ముచ్చట. ఆ రోజుల్లో హైదరాబాద్‌ కవి సమ్మేళనాల్లో అనేక హైదరాబాదీలను ఏకం చేసే ఒక గొప్ప సంస్కృతి కూడా యిమిడి వుండేది. సభలో తెలుగు కవులు ఒక వైపున, ఉర్దూ కవులు మరొక వైపున పక్కపక్కనే కూచుని వుండేవారు. రెండు భాషలూ క్షుణ్ణంగా తెలిసిన పెద్దాయన ఒకాయన అధ్యక్ష స్థానంలో వుండేవాడు. తెలుగు కవి తన కవిత చదవగానే అధ్యక్షుడు దానిని ఉర్దూలోకి అనువదించేవాడు. తరువాత ఉర్దూ కవి చదవగానే దానిని తెలుగులోకి అనువదించేవాడు. దీని వల్ల కవులంతా పరిచయమై, సన్నిహితులయ్యేవారు. రెండు భాషల్లోని ధోరణులూ తెలిసేవి. ఇప్పుడే సమ్మేళన సమావేశాలూ లేవు. తెలగు కేంద్రంగా, హైదరాబాదులోని యితర భాషా కవులతో కూడిన కవి సమ్మేళనాలు, పై విధంగా ప్రోత్సహించివుంటే, ఒక నవ్య సంస్కృతి అంటుకట్టేది. అన్ని భాషల్లోకి తెలుగుకవి వెళ్లేవాడు. అన్ని భాషీయులూ తెలుగు భాషా సదనంలో ఆతిథ్యం తీసుకునేవారు. ఇలా, నాటి విశేషాలు అన్ని రంగాల నుండీ తెలుసుకోవచ్చు.అదే కొనసాగితే మినీ ఇండియా, మినీ తెలుగిండియాగా మారి వుండేది.తద్వారా అ ఆలు అంతర్జాతీయం వైపు ప్రయాణించేవి. అయినా, నిరాశను పక్కన పెడదాం.రేపు ఎప్పుడూ బావుంటుంది. మరో ప్రయత్నం చేద్దాం.ఆశావహంగా ప్రయాణిద్దాం.నిన్నటి ధాన్యాగారం నుండి మేలైన విత్తనాలను ఏరుకుని, కొత్త పంటకు నాంది పలుకుందాం.

By Super
|
Google Oneindia TeluguNews

దిగంబర కవిగా నగ్నముని ప్రసిద్ధులు. ఆయన రాసిన కొయ్యగుర్రం దీర్ఘకావ్యం అనేక చర్చలు దారి తీసింది. నగ్నమునిది పదును దేరిన కలం. సమాజంలోని వికృతాలపై ఆయన కలం నిప్పులు కక్కుతుంది.

English summary
Column by Nagnamuni on Shaik Nazar
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X