వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆటుపోట్ల ఆంధ్రప్రదేశ్‌ -నగ్నమునిఈ నవంబరు ఒకటికి ఆంధ్రప్రదేశానికి యాభై ఏళ్లు నిండాయి. అర్ధశతాబ్ది. ఒక వైపున మంద్రస్వరంలో స్వర్ణోత్సవ సంరంభం జరుగుతుంది. రేపు ఏదో మహత్తరమైన సంఘటన జరుగుతుందని, రాష్ట్రం అభ్యుదయ పథంలో వేగంగా పయనిస్తుందని ఆదర్శవాదులు స్వప్నిస్టూ వుంటారు. వాస్తవవాదులు కలతలతో కల చెదిరి కుమిలిపోతున్న రాష్ట్రాన్ని చూస్తున్నారు.యాభై ఏళ్ల క్రితం అందరి కళ్లలోనూ ఆనందం తొణికిసలాడేది. ఆదర్శాలు పువ్వుల్లా విచ్చుకునేవి. ప్రతి రోజూ పున్నమి రోజుగా గడిచేది. ఆ ఆదర్శాలు, స్వప్నాలు క్రమంగా ఆవిరైపోయాయి. ఈ అర్ధశతాబ్దిలో సాధించిందేమిటి? రాష్ట్రం ముక్కలయ్యే తీరానికి చేరుతోంది. గతంలోనూ యిటువంటి ప్రమాదం సంభవించింది. ఇప్పుడూ అటువంటి వాతావరణమే కమ్ముకుంది.రాష్ట్రం పాలనాసౌలభ్యం కోసం ఎన్ని రాష్ట్రాలుగా ముక్కలయినా ఫర్వాలేదు. కాని, ప్రతి క్షణం సామాన్యుల బతుకులు ముక్కలవుతున్నాయి. అది గమనించకపోవడమే ఆశ్చర్యం కలిగిస్తుంది. పూట గడవని సామాన్యులు ఏనాడూ ఎవరినీ నిందించరు. తమ కన్నీళ్లు తామే తాగుతూ, చిరిగిన జీవితాల్ని భుజాన వేసుకుని వలసలు పోతారు. అదీ కుదరకపోతే ఆత్మహత్యని ఆశ్రయిస్తారు. పాలకుల్ని యీ ఆత్మహత్యలు ఏ మాత్రం కదిలించవు. తమ హయాంలో యిలా జరుగుతున్నందుకు బాధపడరు, సిగ్గుపడరు. పదవీదాహం, ధనార్జనాధ్యేయం రక్తం నిండా ప్రవహిస్తూ వుంటుంది. పదికోట్లు సంపాదించిన వాడు పదకొండో కోటి ఎలా సంపాదించాలా అని ఆలోచిస్తూ వుంటాడు. నాలుగు మేడలున్నవాడు అయిదో మేడ కోసం, అరడజను వ్యాపారాలున్నవాడు ఏడో వ్యాపారం గురించి ఆలోచిస్తుంటాడు. ఎంత సంపాదించినా యింకా యింకా ఎలా సంపాదించాలా నే యావ తప్ప మరొకటి వుండదు. ఇదొక పరుగు. ఇది రాజకీయాల్లో సాధారణంగా కనబడే దృశ్యం. దీనికి పెట్టుబడి ప్రజల జీవితాలు. అన్నీ ప్రజల పేరనే జరుగుతాయి. ప్రజల కోసమే తాము అవతరించినట్లు, వారి కోసమే బతుకుతున్నట్లు గొప్పగా నటిస్తారు. నాయకుల భాష ముందు, డైలాగుల ముందు, నటన ముందు ఏ సినిమా నటుడూ పనికిరాడు. చాలా మంది నాయకుల చరిత్రను గమనిస్తే వారు రాజకీయాల్లోకి రాకముందు ఏం చేస్తుండేవారు, వారికి ఎంత ఆస్తి వుండేది, వొచ్చిన తర్వాత ఎంత సంపాదించారు అనేది చూస్తే చాలా దారుణమైన వాస్తవాలు బయటపడతాయి. అంతకు ముందు అంతగాలేని వారు కోట్లకు పడగలెత్తుతారు. పదవి దొరకగానే ప్రతి రంగంలోనూ మేధావులు అయిపోతారు. నిపుణులు అయిపోతారు. దేనినయినా సరే డబ్బుతో కొనవచ్చుననే స్థాయికి ఎదిగిపోతారు. అక్రమమైనా, సక్రమమేనని హూంకరిస్తారు. శాసిస్తారు. దేశమంతా అల్లుకున్న అవినీతి మూలాలు యివే. అన్ని విలువలూ భస్మమయ్యేది యిక్కడే.ఈ ధనదాహం, పదవీవ్యామోహం వల్ల, అంతకు ముందు ప్రజల్లో ఒకరిగా మసలినవారే, తరువాత ప్రజలతో ప్రతినిధులుగా ఎన్నుకోబడినవారే, క్రమంగా మానసికంగా ప్రజలకు దూరం కావడం కనబడుతుంది. చివరికి, సమాజ సంస్కృతిలోనే మార్పు వచ్చింది. ప్రజల సంస్కృతి వేరు, రాజకీయ రంగంలోని సంస్కృతి వేరు అనే విధంగా చీలిపోవడం జరిగింది. ఇది యిక్కడితో ఆగలేదు. ధనదాహం, పదవీ వ్యామోహం పునాదిగా ఏర్పడిన రాజకీయ సంస్కృతి ప్రజా సంస్కృతినే కాటువేస్తూ కలుషితం చేస్తున్నది. ప్రజా సంస్కృతి, రాజకీయ సంస్కృతి - యీ రెండింటిపై ఎంతో పరిశోధన చేయవచ్చు.ఏ రాష్ట్రానికి చెందినవారైనా, ఏ ప్రాంతానికి చెందినవారైనా, ఏ భాషకు, ఏ మతానికి, కులానికి, యితరేతర సామాజిక వర్గాలకు చెందినవారయినా ప్రజల మధ్య ప్రధానంగా వుండవలసినవి ఆరోగ్యకరమైన సంబంధబాంధవ్యాలు, సహనం, సోదరసోదరీ భావన, సమత్వ దృష్టి. ఇవి లోపిస్తున్నప్పుడు సరిచెయ్యవలసిన బాధ్యత పరిపాలకులపై వుంది. కాని అలా జరగడం లేదు. పాలకులు ప్రజలను మరింతగా చీలుస్తున్నారు. అశాంతిని, అభద్రతను సృష్టిస్తున్నారు. ప్రజలను తమ స్వార్థ ప్రయోజనాలకు వుపయోగించుకుంటున్నారు. మరో మార్గం లేక ప్రజలు అమాయకంగా, కసాయిని కంచె మేక నమ్మినట్లు నమ్ముతారు. మోసపోతూ వుంటారు. తమ స్వార్థ ప్రయోజనం బయటపడకుండా వుండేందుకు, నాయకులు ఏదో ఒక సమస్యను సృష్టిస్తారు. దృష్టిని మరలుస్తారు. భారతదేశమంతటా యిలాగే జరుగుతున్నది. అందువల్ల, ప్రజలు వేరు, రాజకీయ నాయకులు వేరు అనే విషయాన్ని ప్రజలు గ్రహించాలి. ఆ గ్రహింపు ప్రజల్లో వొచ్చినప్పుడు ప్రతి రాజకీయ నాయకుడి మాటలను, చేతలను సూక్ష్మంగా గమనించడానికి, వారిలో స్వార్థమున్నదా, నిస్వార్థమున్నదా అనేది కనిపెట్టడానికి వీలవుతుంది. వాటి ఆధారంగా ప్రజలు కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి, సరికొత్త ఉద్యమాలు చేపట్టడానికి వీలవుతుంది.ఇది ఏ ఒక్క రాజకీయ పార్టీ గురించి చెబుతున్నది కాదు. ఇటువంటి దుర్లక్షణాలు అధికారంలోకొచ్చిన రాజకీయ పార్టీలలో ఎక్కువగా వున్నాయి. ఇటువంటి నాయకులు అత్యధిక సంఖ్యలో వున్నారు. నిస్వార్థంగా ప్రజాసేవ చేయాలనుకునేవారికి యీనాటి రాజకీయ రంగంలో స్థానం లేదు.మనకు స్వాతంత్య్రం వొచ్చిన నాటి నుండి నేటివరకు, మన దేశంలో, ఏ రాష్ట్రంలో, ఏ ప్రాంతంలో, ఎక్కడయినాసరే, ఎటువంటి ప్రజాసమస్య, రాజకీయ సమస్య వొచ్చినా, వాటి వెనక రాజకీయ నాయకులు వున్నారు. పరిస్థితిని సరిదిద్ది, పరిష్కరించవలసిన వారు అధికారంలో వున్నవారే కావడం వల్ల వారు ప్రవేశిస్తారు. సమస్యను మరింత జటిలం చేస్తారు. తమకు అనుకూలంగా మలుచుకుంటారు. దాని నుండి మరిన్ని సమస్యలు పుట్టేట్లు చేస్తారు. మొదట్లో, సమాజంలో అవినీతి దాదాపుగా లేదు. రాజకీయ నాయకులే ముందుగా తాము అవినీతిపరులై, తరువాత మొత్తం సమాజాన్నే అవినీతిమయం చేశారు.పాలన సులువవుతుందని, తెలుగువారు ఒక జాతిగా అభ్యున్నతి సాధించడానికి వీలవుతుందని భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ని ఏర్పాటు చెయ్యడం జరిగింది. పాలకులు ఆ సదుద్దేశాన్నే విస్మరించారు.భిన్నమైన గతం కలిగిన, అనుభవాలు కలిగిన కొన్ని ప్రాంతాలు ఎన్నో ఏళ్ల తర్వాత, ఒక రాష్ట్రంగా ఏర్పడినప్పుడు ప్రజలందరినీ ఒకే తాటిపైకి తీసుకొచ్చి అభ్యుదయం సాధించాలనే దృష్టే పాలకుల్లో లోపించింది.ఆంధ్రప్రదేశ్‌ అన్నపూర్ణ. మొత్తం దేశానికే అన్నం పెట్టగలదు. అటువంటి వ్యవసాయాన్నే నిర్లక్ష్యం చేసి, రైతు వెన్నెముక విరగ్గొట్టారు పాలకులు.ఇవాళ ఆంధ్రప్రదేశ్‌ ఎదుర్కొంటున్న ఆటుపోట్లన్నింటికీ కారకులు రాజకీయ నాయకులే. అందుకే మన నాయకుల్నే ఓ కంట కనిపెట్టమని చెప్పడం.

By Staff
|
Google Oneindia TeluguNews

దిగంబర కవిగా నగ్నముని ప్రసిద్ధులు. ఆయన రాసిన కొయ్యగుర్రం దీర్ఘకావ్యం అనేక చర్చలు దారి తీసింది. నగ్నమునిది పదును దేరిన కలం. సమాజంలోని వికృతాలపై ఆయన కలం నిప్పులు కక్కుతుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X