వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మళ్లీ మొదట్నుంచీ.... -నగ్నమునిభారతదేశం హిమాలయం ఎంత ఎత్తయినదో అంత ఎత్తయిన దేశం. సముద్రం ఎంత లోతైనదో అంత లోతైన దేశం. ప్రకృతి ఎంతగా పులకరింపజేయగలదో అంత పులకరింపజేసే దేశం. అనేక మంది మహాత్ములూ మహనీయులూ మహానుభావులూ పుట్టారు. అనేక మతలున్నాయి. భాషలున్నాయి. మత గ్రంథాలున్నాయి. ప్రవక్తలు ప్రవచించిన పరమ సూక్తులూ ఉన్నాయి. హితబోధలున్నాయి. దైనందిన జీవితంలో ఆచరణ కొరకు ఆధ్యాత్మిక భావనలున్నాయి. పక్కపక్కనే భౌతిక, అభౌతిక దర్శనాలున్నాయి. ఇతిహాసాలూ పురాణాలూ వున్నాయి. ఆయా రంగాల్లోని మహనీయులు శిఖరాయమానమైన ప్రమాణాలు నెలకొల్పిన అద్భుతాలున్నాయి. దేశ కష్టసమయంలో మాతృభూమికై ప్రాణాలు తృణప్రాయంగా అర్పించిన వీరులున్నారు. వీటన్నింటికీ సమానమైన సహనశీలురైన సామాన్య ప్రజలున్నారు. ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే మన దేశంలో మహాత్ములూ, మహా మేధావులూ పుట్టారు గానీ మహా వ్యవస్థలు పుట్టలేదు. సహనానికి ప్రతీకలైన ప్రజలున్నారు గానీ మార్గదర్శకులైన, ఆపదలో ఆదుకునే పరిపాలకులు పుట్టలేదు. అసామాన్యులు పుట్టారు గానీ, సామాన్యుల ఆక్రందనలు ఆగలేదు. రాజకీయాలు ప్రజల మధ్య ఆరాచాకాన్ని సృష్టిస్తున్నాయి గానీ బాధ్యతాయుత సమాజాన్ని తీర్చి దిద్దే ఆధునిక శాస్త్రంగా రూపొందలేదు. ఎన్ని పార్టీలు పుట్టినా, ఎన్నిసార్లు ఎన్నికలు జరిగినా యిప్పటి వరకూ అధికారంలోకొచ్చిన ప్రతి ప్రభుత్వమూ ప్రజలను రక్తమాంసాలున్న మనుషులుగా చూడలేదు. ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలిస్తూ, గతం నుండి కొట్టుకొచ్చిన సమస్యలు, వర్తమానంలో పోగుపడుతున్న సమస్యలు పరిష్కరిస్తూ క్రమంగా పరిణతి చెందుతూ, నూత్న యుగాన్ని ఆవిష్కరించే దిశలో బలమైన దేశంగా మార్చడంలో ఘోరంగా విఫలమయ్యాయి. నిజానికి పాలకుల దృష్టిలో ఈ లక్ష్యమే లేదు. బహుశా దీనికి కారణం ప్రజాప్రతినిధులు ప్రజల నుండి రాకపోవడం కావచ్చు. అంటే ప్రజల ఆత్మల నుండి రాకపోవడం కావచ్చు. సమాజంలోని భిన్న సంస్కృతులను, అవసరాలను, ప్రవాహ పరీవాహక దిశను గమనించేవారు కాకపోయి వుండవచ్చు. ఆధునిక సమాజం గురించిన ఆలోచనలే లేకపోయి వుండవచ్చు. గత వైభవం తెలిసినవారయి వుండవచ్చు. మన ప్రజా ప్రతినిధులు ఎవరికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు? ఎవరికీ ప్రాతినిధ్యం వహించడం లేదు. వారికి మాత్రమే వారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అందుకనే వారు ప్రజల నుండి రావడం లేదనడం, వారు మతాల నుండి వస్తున్నారు తప్ప ప్రజల నుండి రావడం లేదు. కులాల నుండి వస్తున్నారు తప్ప ప్రజల నుండి రావడం లేదు. పార్టీల నుండి వస్తున్నారు తప్ప ప్రజల నుండి రావడం లేదు. డబ్బు నుండి వస్తున్నారు తప్ప ప్రజల నుండి రావడం లేదు. మతంగానీ, కులంగానీ, డబ్బు గానీ యివన్నీ మనిషి కోసమే గానీ, వీటి కోసం మనిషి కాదు. మతం నుండి వొచ్చి మతాన్ని బలిష్టం చేస్తున్నారు. కులం నుండి వచ్చి కులాన్ని ప్రధానం చేస్తున్నారు. డబ్బు నుండి వొచ్చి డబ్బును పండిస్తున్నారు. ప్రజలను మరింత ముక్కలు చేస్తున్నారు తప్ప వీటికి అతీతంగా మానవ రాజకీయాన్ని లౌకిక రాజ్యాన్ని స్థాపించే దిశళో ప్రయాణించడం లేదు.ప్రజలకు సేవ చేయడానికి మనం ప్రతినిధులను ఎన్నుకుంటాం. మదట్లో ఎన్నికల్లో నిలబడడానికి ఎవరూ ముందుకు వచ్చేవారు కాదు. తమకు నిజంగా ప్రజలకు ప్రాతినిధ్యం వహించే యోగ్యత వుందా, ప్రజా సమస్యలు తీర్చగల శక్తి వుందా, అంతటి స్థాయి వుందా? అని ప్రశ్నించుకునేవారు. నిలబడమని ఎవరన్నా అడిగినా ముందుకు రావడానికి సిగ్గుపడేవారు. మొహమాట పడేవారు. రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను వెతుక్కోవలసి వచ్చేది. ఇప్పుడు రాజకీయ రంగానికి వూహించలేనంత గిరాకీ పెరిగింది. వేల సంఖ్యలో గుంపులు గుంపులుగా తోసుకు వస్తున్నారు. మేం ప్రజా సేవ చేస్తామంటే మేం చేస్తామని పోటాపోటీలు పడుతున్నారు. టికెట్ల కోసం సూట్‌కేసులు గుమ్మరిస్తున్నారు. ప్రజాసేవారంగం రణక్షేత్రంగా మార్చివేశారు.చట్టసభలు ఏర్పడింది ప్రజలకు సేవ చేయడానికి. అందువల్ల చట్టసభల్లో ప్రజలకు ప్రాతినిధ్యం వహించే ప్రతినిధుల ఎంపికలో ప్రజలు పరిశీలించవలసినవి ఆయా అభ్యర్థులు గతంలో ప్రజలకు ఎటువంటి సేవలను అందజేశారు, చట్టాల నిర్మాణంపై రాజ్యాంగంపై వారికి నిర్దిష్టమైన అవగాహన వున్నదా - యివీ ప్రధానంగా యోగ్యతలుగా భావించాలి.ప్రజాసేవారంగంలో లేనివారికి ప్రజాసమస్యలు తెలియవు. చట్టాల నిర్మాణం గురించిన అవగాహన, రాజ్యాంగంపై పట్టులేనివారికి చట్టసభల్లో ఏం జరగాలో, ఏం జరుగుతున్నదో శాస్త్రీయంగా తెలిసే అవకాశం లేదు. ఇటువంటి యోగ్యతలు చాలా మందికి లేకపోవడం వల్ల సేవారంగం, చట్టసభలు, ఎన్నికలు మొత్తంగా అపసవ్యంగా నడిచే పరిస్థితి ఏర్పడింది. తత్ఫలితంగా అపహాస్యం పాలు కావడం జరిగింది. ఒకసారి రాజకీయరంగం సరియైన యోగ్యతలపై ఏర్పాటు చేయకపోవడం వల్లనే అది వ్యాపారరంగంగా మారిపోయింది. ఈ అయోగ్యతల చట్రంలో కొత్త పార్టీలు ఏర్పడినా, పాత పార్టీల అడుగు జాడల్లో నడవక తప్పదు. ఇవాళ ప్రతి వ్యక్తీ తన ప్రతినిధికి ఉండవలసిన పైన పేర్కొన్న మూడు లక్షణాల ఆవశ్యకత గుర్తించాలి. ఇది వ్యక్తులకే కాదు, రాజకీయ పార్టీకలు, యితర వేదికలన్నింటికీ వర్తిస్తుంది. చర్చలు బహిరంగంగా యీ యోగ్యతా లక్షణాలపై జరగాలి. రాజకీయం ప్రజాసేవా శాస్త్రంగా మారాలి. అప్పటి వరకు రాజకీయం పేర జరిగేదంతా అరాజకీయమే. రాజకీయ పార్టీలే కాదు, ప్రతి వ్యక్తీ తన జీవితం దీనితో ముడిపడి వున్నదని గుర్తించాలి.

By Staff
|
Google Oneindia TeluguNews

దిగంబర కవిగా నగ్నముని ప్రసిద్ధులు. ఆయన రాసిన కొయ్యగుర్రం దీర్ఘకావ్యం అనేక చర్చలు దారి తీసింది. నగ్నమునిది పదును దేరిన కలం. సమాజంలోని వికృతాలపై ఆయన కలం నిప్పులు కక్కుతుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X