• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

దిగంబర కవిగా నగ్నముని ప్రసిద్ధులు. ఆయన రాసిన కొయ్యగుర్రం దీర్ఘకావ్యం అనేక చర్చలు దారి తీసింది. నగ్నమునిది పదును దేరిన కలం. సమాజంలోని వికృతాలపై ఆయన కలం నిప్పులు కక్కుతుంది.

By Staff
|

సెలవంటూ వెళిపోతూ, మనసా వాచా కర్మణా మాతృదేశాన్నీ, మరకలు లేని ప్రజాస్వామ్యాన్నీ గాఢంగా ప్రేమించే వారికి బహుమతిగా ఓ భూకంపం లాంటి సంఘటనను సృష్టించి వెళ్లిపోయింది 2005.

అదే కోబ్రాపోస్ట్‌ వెబ్‌సైట్‌, ఆజ్‌తక్‌ టీవీ ఛానెల్‌ సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌ దుర్యోధన్‌ సృష్టించిన మహా సంఘటన.

అవి ఇప్పుడిప్పుడే గతంలోకి వెళ్లిపోయిన గత సంత్సరపు చివరిరోజులు. ఎవరూ కనీవినీ ఎరుగని, నమ్మశక్యం గాని రీతిలో రాజకీయ చరిత్రలో స్వర్ణాక్షరాలతో లిఖించివలసిన, హఠాత్తుగా సంభవించిన మహత్తర సంఘటన.

వేదాలు పుట్టిన దేశమని, మహాత్ములు నడయాడిన దేశమని, ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామిక దేశమని ఉధృతంగా ప్రచారం చేసుకునే పార్లమెంటు కింద నేల చీలి ఒక్కసారిగా అవినితీపై బద్దలయింది రాజకీయ భూకంపం. పార్లమెంటు దద్ధరల్లింది. గజగజా వొణికింది. పునాదుల్లో ప్రకంపనలు వ్యాపించాయి. పార్టీల గుండెలు దడదడలాడాయి. ఇదంతా జరిగింది ఉగ్రవాద తీవ్రవాద తుపాకీలు పేలడం వల్ల కాదు. ఒక్క క్షణం మీడియా కెమెరా క్లిక్‌మనడం వల్ల. తుపాకీ కంటే శక్తివంతమైందని నిరూపిస్తూ మీడియా కెమెరా కన్ను తెరిచింది. సాక్షాత్తూ పదకొండు మంది ఎంపి మహాత్ములు ముడుపులు దండుకుంటూ పట్టుబడ్డారు. జాతి అంతటికీ నమ్మశక్యం గాని ఈ దృశ్యం కంటబడింది.

రాజకీయ వ్యాపారమై పోయిందనీ, నాయకులు అవినీతి బురదలో మునిగి తేలుతున్నారనీ, ఎన్నికల సమయంలో యిది విశ్వరూపం ధరిస్తుందనీ, అవినీతీ రాజకీయమూ అర్థనారీశ్వరమనీ అందరికీ తెలుసు. కానీ యింత బాహాటంగా తెగించి, నిస్సిగ్గుగా యిలా ప్రవర్తిస్తారని, పట్టుబడతారని ఎవరూ అనుకోలేదు. అంతేకాదు, యింతటి ప్రమాదకరమైన పనికి పూనుకునే సాహసులుంటారని ఎవరూ వూహించలేదు. ఓ ఎలక సరాసరి ధైర్యంగా పిల్లి మెడకు గంట కట్టింది.

ఈ మొత్తం వ్యవహారంలో కీలక పాత్రధారి అనిరుద్ధ బహల్‌. మ్యాచ్‌ ఫిక్సింగ్‌ కింద దాగి వున్న చీకటి లావాదేవీల రహస్యం వెలుతురులోకి రావడంలోనూ, చీమ సైతం దూరలేదనే రక్షణశాఖలోని లొసుగులు, రంధ్రాలు, బట్టబయలు చెయ్యడంలోను, ప్రజలు నమ్మి తమ ప్రతినిధులుగా ఎన్నుకున్న ఎంపిలు తడిగుడ్డతో ప్రజాస్వామ్యం గొంతు కోస్తూ అవినీతి మడుగులో ఎలా దొర్లాడుతున్నారో కళ్లారా జాతికి చూపించిన సాహసి యువతరం పత్రికాలోక ప్రతినిధి శక్తి అనిరుద్ధ బహల్‌.

పార్లమెంటు స్పీకర్‌ యా దుర్యోధన్‌ వీరుణ్ణి అభినందించారు. చాలా సంతోషం. మరి, స్పీకర్‌గానీ, అలాగే సమయం లభించినప్పుడల్లా విద్యార్థులకు (రాజకీయ నాయకులకు కాదు) నీతిసూక్తులు, ధైర్యసాహసాల ఆవశ్యకత గూర్చి నూరిపోసే మన రాష్ట్రపతిగానీ యా సాహసవీరుడికి పద్మశ్రీ గానీ, భూషన్‌, విభూషణ్‌, అర్జున్‌ యిటువంటి వాటిలో ఏదో ఒకటి ప్రభుత్వం తరఫున యిప్పించడానికి ముందుకు వస్తారా? రారు. రాలేరు. ఎందుకంటే అటువంటి మంచి సంప్రదాయం మన వద్ద లేదు. అదీగాక, జాతికి మేలు చేకూర్చే యిటువంటి వారికి పురస్కారాలు యివ్వాలంటే, యిచ్చే ప్రభుత్వానికి కూడా నీతివర్తన, సాహసం, నిజాయితీ వుండాలి.

అయితే, ఏ మాటకా మాటే చెప్పుకోవాలి. స్పీకర్‌ గారు దీనిపై వెంటనే స్పందించారు. జరిగిన దానిపై విచారణకు ఒక సభాసంఘాన్ని నియమించారు. కాలయాపన చెయ్యకుండా, నివేదిక అందగానే, తీర్మానం ద్వారా ముడుపుల సభ్యులను సభ నుండి బహిష్కరించారు. ఇక్కడ అతి ముఖ్యంగా ఆలోచించవలసిన విషయం ఏమిటంటే, బహిష్కరణ శిక్షించడం కిందికి రాదు. బహిష్కరించారు, అంతే. ముడుపులు తీసుకున్నందుకు శిక్షించే పని జరగలేదు.

నేరాలు చేసినవారికి శిక్షలున్నాయి. లంచాలతో కుబేరులైన ఉద్యోగులు, హత్యలు చేసేవారు, అత్యాచారాలు చేసేవారు, ప్రేమించని ఆడపిల్లలపై యాసిడ్లు పోసేవారు, దొంగతనాలు చేసేవారు, దౌర్జన్యాలు చేసేవారు, దేశఃలో కల్లోలం రేపేవారు, జాతి విద్రోహులు, మొదలైన అరాచక పనులు చేసేవారికి శిక్షలున్నాయి. మరి, నేరం చేసినప్పుడు శిక్షల నుండి ప్రజాప్రతినిధులకు మినహాయింపు ఎందుకు? వారు కూడా ప్రజల్లో భాగమే కదా. ఎం. ఎల్‌. ఎ.లు, ఎంపిలు అయినంత మాత్రాన రాజ్యాంగం, పార్లమెంటు, చట్టసభలు వారిని రక్షించే కోటగోడలు కావాలా! బహిష్కరణలో సరిపెట్టేసి చేతులు దులుపుకుంటే అవినీతి పారిపోదు. దొరికిన వాళ్లే దొంగలు, దొరకని అవినీతిపరులు భవిష్యత్తులో ఎవరికీ పట్టుబడని మార్గాలు అన్వేషించి చీకటి జీవితం సాగిస్తారే తప్ప మహాత్ములుగా మారిపోరు.

నిజానికి మమూలు నేరస్తుల స్థాయి కంటే, ప్రజా ప్రతినిధులు చేసేవి అంతకంటే తీవ్రమైనవీ, పెద్ద స్తాయిలోనివీ అవుతాయి. ఎందుకంటే - రాజకీయాలను సేవారంగంగా తీర్చిదిద్దకుండా వ్యాపార రంగంగా మార్చినందుకు; అవినీతిలో తాము భాగమై, యిచ్చినవాడు పుచ్చుకున్నవాడు యిద్దరూ నేరస్తులే అన్నట్లు, ఆ విధంగా వారు అవినీతిని ప్రోత్సహించినందుకు; ప్రతినిధులు తమకు సేవ చేస్తారి, తమ అవసరాలు తీరుస్తారని, భద్రత కల్పిస్తారని, తమకు ఆదర్శంగా మార్గదర్శకంగా వుంటారని నమ్మి ప్రజలు తమ ప్రతినిధులుగా ఎన్నుకున్నప్పుడు, వాటికి వ్యతిరేకంగా వారు ప్రవర్తిస్తే ఆ నేరాలతో పాటు, వారు చేసింది దేశద్రేహం, నమ్మకద్రోహం కూడా అవుతుంది. అందువల్ల వారిపై జీవిత ఖైదుకు మించిన శిక్ష వెయ్యవలసి వుంటుంది గదా. అలాంటప్పుడు ప్రజాప్రతినిధుల నేరాల నిమిత్తం ప్రత్యేకంగా ప్రతినిధుల శిక్షాస్మృతి ఏర్పాటు చేసుకోవాల్సి వుంటుందేమో. అవినీతిపనై విజయం సాధించాలంటే యా విషయంపై కూడా ఆలోచించవలసి వుంది. ఇదంతా ఎందుకంటే, బహిష్కరణ శిక్ష కాదని చెప్పడానికి. సభ నుంచి బహిష్కరించినా, పార్టీ నుంచి బహిష్కరించినా, ఎన్నికల్లో పార్టీ నిలబడనివ్వకపోయినా, స్వతంత్ర అభ్యర్థిగా, లేక తమ కుటుంబంలోంచి మరొకరిని నిలబెట్టి, పాత పద్ధతిలోనే ( ఓట్లు కొనడం వగైరా) గెలిపించి, అవినీతి మార్గంలోనే కొనసాగరని నమ్మకమేమిటి? కఠినాతి కఠిన శిక్ష పడితే దాని ప్రభావం ప్రజల్లో మరో రకంగా వుంటుంది. అందువల్ల వీరిపై కఠిన శిక్షలు అవసరం.

ఇక్కడే మరో విషయం చెప్పాలి. పార్లమెంటు ప్రతిష్ట కోసం కెమెరాకు పట్టుబడిన సభ్యులను బహిష్కరిస్తున్నట్లు స్పీకర్‌ చెప్పారు. ప్రతిష్ట పార్లమెంటు వరకే చూసుకుంటే సరిపోతుందా? దొరకని అవినీతి సభ్యుల సంగతేమిటి? దేశం ప్రతిష్ట సంగతేమిటి? ఇవాళ్లి సంఘటన అవినీతిపై పటిష్టమైన చర్యలు తీసుకోవడానికి పార్లమెంటుకు దొరికిన సువర్ణావకావం కాదా?

ఇవాళ దైనందిన జీవన కార్యకలాపాల్లో అవినీతి ఒక ముఖ్యమైన భాగం అయిపోయింది. దాని నుంచి తప్పించుకుని బతకడం ఎవరికీ సాధ్యం కావడం లేదు. అవినీతి లేని దేశంగా నిర్మించవలసిన బాధ్యత పార్లమెంటు మీదా, చట్టసభల మీదా లేదా? ప్రతి రాజకీయ పార్టీ తమ సభ్యులు అవినీతిపరులు కాకుండా, నీతినియమాలు ఉల్లంఘించకుండా ప్రవర్తించేందుకు స్వీయ నిఘా విభాగాలను ఏర్పాటు చేసుకోవలసిన అవసరం లేదా? ఎలక్షన్లో ఎలాగైనా గెలవాలని సభ్యులూ, అధికారంలోకి వచ్చి తీరాలని పార్టీలూ తప్పుడు మార్గాలనాశ్రయిస్తున్నప్పుడు అవినీతి ఎలా తగ్గుతుంది?

ఇక్కడే మరొక ముఖ్యమైన విషయం చెప్పవలసి వచ్చింది. పార్లమెంటులో గాని, చట్టసభల్లో గాని సభ్యులంతా అవినీతి పరులు కాదు. త్యాగధనులున్నారు. ప్రజాసేవకు, విలువలకు అంకితమైన వారున్నారు. ఉద్యమాలు నడిపిన వారున్నారు. ఆర్థికంగా దెబ్బ తిన్నవారున్నారు. ఉన్నది కాస్తా హారతి కర్పూరంలా కరిగిపోతున్న వారున్నారు. అయితే, మొత్తం మీద చూస్తే వీరి సంఖ్య తక్కువ. మెజారిటీ సభ్యులు తమ పదవిని ఉపయోగించుకుని ఏదో ఒక రూపంలో ధనస్వాములవుతున్నారు.

ఈ ధనదాహ క్రీడ ఎన్నికలతో ప్రారంభమవుతుంది. కోట్లు ఖర్చు పెడతారు. తరువాత, దానికింకింత రాబట్టుకోవడానికి ప్రయత్నిస్తారు. అంచెలంచెలుగా పెద్దవాళ్లయిపోతారు. ఆ క్రమంలో ఉద్యోగులను అవినీతిలోకి లాగుతారు. అన్ని రంగాలలోకీ అవినీతిని ప్రవేశపెడతారు.

ఇటీవల పోలీసులకు పట్టుబడిన ఓ గజదొంగ యిలా అన్నాడు. మేం చేస్తే అది దొంగతనం, పెద్దవాళ్లు చేస్తే కుంభకోణం. అతను చేసేది దొంగతనమే, చెప్పింది నిజం.

ఇవాళ మన ముందు విశ్వరూపంలో వున్నది అవినీతి. ఇటువంటి స్థితిలో సంభవించిందే ఆపరేషన్‌ దుర్యోధన్‌. నిజంగా, ఇప్పుడే దేశ చరిత్రలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. యువతరం మేల్కొంది. దీనిని అంతా ఆహ్వానించవలసి ఉంది. మన దేశాభివృద్ధికి అడుగడుగునా అద్దం పడుతున్నది అవినీతి. దీనిని తరిమి కొట్టడానికి రాజ్యాంగం నేటి అవసరాల నిమిత్తం ఎలా వుండాలి; పార్లమెంటు, చట్టసభలు, సభ్యుల ప్రవర్తన, సమాజంలోనూ, పరిపాలనా విభాగాల్లోనూ ఎటువంటి మార్పులు తీసుకురావాలనే దిశలో మొత్తం వ్యవస్థల్ని పునః పరిశీలన చెయ్యవలసి వుంది. ఈ పని పత్రికలే చెయ్యవలసి వుంది. ఎందుకంటే ఇవాళ నిజమైన నూత్న విప్లవానికి నడుం కట్టింది ఆపరేషన్‌ దుర్యోధన్‌ యువ పత్రికా రచయితలు కాబట్టి.

గతంలో జాతి వికాసానికి పత్రికల కృషి అసాధారణమైనది. ఇప్పుడు కూడా నూత్న సమాజ, రాజ్య నిర్మాణానికి పత్రికా రంగం ఒక ఆయుధంగా మలుచుకుని ముందుకు వస్తున్నది. దీనిని కాపాడుకోవలసిన బాధ్యత అందరిపై వుంది.

ఇటువంటి కొత్త ఆయుధాలతో, కొత్త ఆలోచనలతో, కొత్త సంవత్సరంలో కొనసాగుదాం.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more