వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లవేరియా

By Staff
|
Google Oneindia TeluguNews

-ఎబికె ప్రసాద్‌ > Column > FullStory

అవినీతిపై దండోరాకు విఠల్‌ ప్రయోగం!

పాలనాయంత్రాంగంలోను, దానికి సారధ్యం వహించే రాజకీయ (పాలక) నాయకుల్లోనూ పేరుకుపోతున్న అవినీతికి అడ్డుకట్టవేసి, శిక్షార్హులైన వారిని శిక్షించేందుకు కొత్తగా భారత విజిలెన్స్‌ కమిషన్‌ అధిపతిగా నియమితులైన ఎన్‌. విఠల్‌ ఓ కొత్త ప్రయోగం చేపట్టారు. ఇంతకాలం ఈ పనిని చేపట్టినట్టు కనపడుతున్న సి.బి.ఐ. పని విధానంలో వున్న లోపాలను, ప్రధానమంత్రి కనుసన్నల్లో మెసలుతూ ప్రధానమంత్రికి మాత్రమే జవాబుదారీగా వుండాలన్న సంప్రదాయం వల్ల రాజకీయ వత్తిడులకు సి.బి.ఐ. లోనవ్వుతున్నందున 1997లో అవినీతి కేసుల దర్యాప్తు విషయాల్లో సుప్రీమ్‌ కోర్టు జోక్యం చేసుకుని కొన్ని ఆదేశాలు జారీ చేయవలసి వచ్చింది.

నిజానికి పాలనాయంత్రాంగంలో అవినీతిని రూపుమాపడం కోసమని 1962లో సంతానమ్‌ కమిటీ చేసిన సిఫారసుల ప్రకారం సెంట్రల్‌ విజిలెన్స్‌ కమిషన్‌ ఏర్పడింది. అయితే సుప్రీమ్‌ కోర్టు 1997లో ఈ నిఘా మండలికి విశేషాధికారాలు దఖలు పరిచేదాకా కేవలం సలహామండలి పాత్ర వహిస్తూ వచ్చింది! ఈ విశేషాధికారాల్లో ప్రధానమైన అంశం-కేంద్ర గూఢచారి శాఖ (సిబిఐ) పనితీరును తనిఖీ చేసే అధికారంతో పాటు, సిబిఐ డైరెక్టర్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్ల నియామకాల్లో కూడా విజిలెన్స్‌ కమిషన్‌ పాత్ర వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

దీనికి చట్టరూపం ఇవ్వడానికి ఒక బిల్లును కూడా సిద్ధంచేశారుగానీ12వ లోక్‌సభ అర్ధంతరంగా రద్దు కావడంతో బిల్లుకు కాలం చెల్లినందున కమిషన్‌ను ఆర్డినెన్స్‌ ఆధారంగా నిర్వహిస్తూ వచ్చారు. ఇప్పుడు విజిలెన్స్‌ కమిషన్‌కు చట్టరీత్యా స్వతంత్ర ప్రతిపత్తిని పార్లమెంటు కల్పించవలసి ఉంది. కానీ కమిషన్‌ అధిపతి విఠల్‌ ఇటీవల చేస్తున్న ప్రకటనల తాకిడికి కేంద్రంలోని బి.జె.పి సంకీర్ణ మంత్రివర్గం అతలాకుతలం అవుతోంది! ఎందుకని? విఠల్‌ కమిషన్‌ పదవిని స్వీకరించిన కొలది రోజులకేపాములబుట్టను తెరిచాడు. సమాచార సాంకేతిక విప్లవం అందిస్తున్న ఆధునికమైన ఏర్పాటుఇంటర్నెట్‌ వెబ్‌ సహకారంతో పాలనా యంత్రాంగంలోని అవినీతి పరుల (రాజకీయ భాగోతాలు సహా)పై వచ్చిన తీవ్ర ఆరోపణల తాలూకు సాక్ష్యాలను దృష్టిలో పెట్టుకుని, వారి పేర్లను ప్రపంచం అంతా తెలుసుకోవడానికి వీలుగా చిఠిం ఎక్కించాలని విఠల్‌ నిర్ణయించారు.

అలాంటి వారి జాబితా ఇప్పటికి 2000కు చేరింది.ఈవిశ్వరూపాన్ని ఎంత వరకు విఠల్‌ కాపాడుకుంటారో తెలియదు కానీ, ఆయన ఆసక్తికరమైన ఒక ప్రశ్నను పాలకుల ముందు, న్యాయమూర్తుల ముందు, ప్రజల ముందూ ఉంచారు.ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి పేర్లను న్యాయస్థానంలో బహిరంగంగా వెల్లడించినపుడు అవినీతి ఆరోపణలున్న అధికారుల పేర్లను బయటపెడితే తప్పేమిటి ? ఈ ప్రశ్నకు పాలకులెవరూ సమాధానం యింత వరకూ ఇవ్వలేదు, ఇవ్వలేరు కూడా ! ఎందుకంటే, జైన్‌ హవాలా కేసులో అనేక ఆరోపణలు ఎదుర్కోవలసి వచ్చిన వివిధ రాజకీయ పక్షాలకు చెందిన (ఒక్క వామపక్షాలు మినహా) 60మందికి పైగా నాయకులు ఏదో ఒక రకంగా న్యాయస్థానాలలోని కేసుల నుంచి బయటపడుతూ వచ్చారు! అన్ని తీవ్ర ఆరోపణలు ఉండి, సిబిఐ ఎంతో శ్రమకోర్చి విచారణ జరిపి సాక్ష్యాధారాలతో కేసును సిద్ధం చేసినా వీరంతా ఎలా తప్పించుకోగలిగారన్నది నాయకులకు తెలియాలి. లేదా న్యాయస్థానాలకు తెలియాలి!

అలాంటి కేసులో ఏదో ఒక చిట్కాతో ఇటీవల బయటపడిన నాయకులపైన తిరిగి సి.బి.ఐ విచారణ జరపాలని విఠల్‌ ఆదేశించారు. జైన్‌హవాలా కేసులో ఇరుక్కున్నవారిలో బిజెపి నాయకులు కూడా వుండటం ఇక్కడ మరపురాని విషయం. ఇదీ- బిజెపి ప్రభుత్వానికి నేడు మింగుడు పడని సమస్య. కనుకనే విఠల్‌పై కన్నెర్ర చేస్తోంది. ఒక కథనం ప్రకారం సిబిఐ ఉన్నతాధికారులు కొందరిని ప్రధానమంత్రి కార్యాలయానికి పిలిపించి విఠల్‌ ఆదేశాలను తలదాల్చవద్దని హుకుమ్‌ జారీ చేశారని ఒక కథనం.

ఇదే నిజమైన పక్షంలో కమిషన్‌ అధిపతిగా విఠల్‌ నియామకం పసలేనిదవుతుంది లేదా, ఆయన కృషి బూడిదలో పోసిన పన్నీరవుతుంది. కానీ విఠల్‌కు సుప్రీంకోర్టు అండ ఉంటుంది. ఎలా ? చట్టబద్ధ ప్రతిపత్తిని కమిషన్‌కు పార్లమెంటు కల్పించేదాకా, విజిలెన్స్‌ కమిషన్‌కు సుప్రీంకోర్టు దాఖలు పరిచిన అజమాయిషీ అధికారాలు, విశేషాధికారాలు ఉంటాయి! బహుశా ఈ దన్నుతోనే విఠల్‌ హవాలా కేసు పునర్విచారణతో పాటు,ఐ.ఎ.ఎస్‌, ఐ.పి.ఎస్‌, ఐ.ఆర్‌.ఎస్‌, కస్టమ్స్‌, ఎన్జీఓ, అటవీశాఖాధికారుల అవినీతికి సంబంధించిన రకరకాల కుంభకోణాలను వెతికి తీయగా కేసుల సంఖ్య ఇప్పటికి 9200కు చేరుకుంది.

వీటిని వెబ్‌లోకి వెక్కించి వెల్లడిచేయాలని విఠల్‌ తాపత్రయం. ఈ సందర్భంగా విఠల్‌ మరో ప్రశ్నను లేవనెత్తారు.విదేశీ మారక ద్రవ్య దుర్వినియోగం ఆరోపణలున్న ఈ అఫీసర్లను విదేశీ మారకద్రవ్య నిబంధనల చట్టాన్ని ఉల్లంఘించినందుకు శిక్షించకపోయినా, కనీసం స్వాహా చేసిన డబ్బును రాబట్టుకోవడానికి సి.బి.ఐ.అధికారులు ఆదాయపు పన్ను చట్టప్రకారమైనా శిక్షించవలసిందని ఆవేదన వ్యక్తం చేశారు. అవినీతి నిర్మూలనకు సిఫారసులు చేసిన సంతానమ్‌ కమిటీ నివేదిక ఆధారంగా అవినీతి నిరోధక చట్టాన్ని కూడా సవరించవలసి వచ్చింది. లోగడ పబ్లిక్‌ సర్వెంట్‌ అంటే ఒక్క అధికారులు మాత్రమే చట్టపరిధిలోకి వచ్చేవారు. కానీ సంతానం కమిటీ నివేదిక ప్రకారం ఈ పరిధిని విస్తృత పరిచి రాజకీయ నాయకులను, పాలకులను కూడా పబ్లిక్‌ సర్వెంట్స్‌గా పరిగణించాల్సి వచ్చింది. కనుకనే కొంతకాలంగా అవినీతి నిరోధక చట్టం నుంచి ఈ పరిధిని తప్పించడానికి కొందరు పార్లమెంటు సభ్యులు పదే పదే ప్రయత్నిస్తున్నారు. గత ఎన్నికలకు ముందు కూడా ఈ ప్రయత్నం జరిగింది.

ఈ కేసులన్నీ ఏ గంగలో కలిపారు?!

అవినీతి నిర్మూలన కోసం దఫాదఫాలుగా కేంద్ర స్థాయిలో జరిగిన ప్రయత్నాలు పూర్తిగా సఫలం కావడం లేదు. అందుకు పాలకుల్లో చిత్తశుద్ధి లేకపోవడమే కారణం. 1951లో ఎ.డి.గోర్వీలా రిపోర్టు దగ్గర నుంచి సంతానం కమిటీ నివేదికదాకా ఎన్నో పరిణామాలు చూశాం.అంతకు ముందు 1935 చట్టం, ప్రకారం 1937లో ఆరు రాష్ట్రాల్లో (ప్రొవిన్సెస్‌) కాంగ్రెస్‌ మొదటిసారిగా మంత్రివర్గాలు ఏర్పరిచిన నాటి నుంచీ ఈ అవినీతికి విడుపులేదు.

అధికారంలోకి వచ్చిన తరువాత కాంగ్రెస్‌ ఎలా చెడిపోయిందో గాంధీజీకి తెలుసు. రాజగోపాలాచారికి , కొండా వెంకటప్పయ్యకు రాసిన ఉత్తరాలలో ఆయన కాంగ్రెస్‌లో పెరుగుతున్న అధికార అవినీతి గురించి ఆవేదన ప్రకటించారు. ఆ బాధతోనే ఆయన ,1939లో కాంగ్రెస్‌ మంత్రివర్గాలు రాజీనామాలు సమర్పించవలసి వచ్చినప్పుడు ఎగిరి గంతేశాడు!ఈ పరిణామం మంచికే వచ్చింది. ఈ దెబ్బతో అయినా కాంగ్రెస్‌ నుంచి పరాన్న భుక్కులను బయటకు నెట్టేయవచ్చునని రాజగోపాలాచారికి రాసిన లేఖలో గాంధీజీ పేర్కొన్నారు!నిజానికి ఇవాళ విఠల్‌ చేస్తున్న ప్రయత్నం కన్నా ప్రచారం రీత్యా పెద్ద పథకమే వూహించారు జవహర్‌లాల్‌ నెహ్రూ.

1945లో జైలు నుంచి విడుదలకాగానే ఆయన ఇలా అన్నారు. ఈ కుబేరులందరినీ ఉరితీస్తే నా కన్నా సంతోషించేవాడుండడుఅన్నారు. అవి మాటలు. కానీ గాంధీకి చేతలు కావాలి. కాంగ్రెస్‌ నిధి కింద స్వాతంత్య్రద్యమ దశలో జె.డి.బిర్లా రు.70,000 చెక్కును తనకు అందజేయబోతే, వెంటనే తిరస్కరించినవాడు గాంధీజీ.

ఆది నుంచీ మనకు ధర్మార్ధకామ మోక్షాలనే త్రిసూత్ర పధకం సంపద పెంచుకోవడం మీదనే ఎక్కువ ఆసక్తి చూపడం,ధర్మశాస్త్రాలునేర్పిన కూసు విద్య. ఈ వాస్తవాన్ని పేర్కొంటూ, పద్మభూషణ్‌, కేంద్ర ప్రభుత్వ విశిష్ట కార్యదర్శులలో ఒకరుగా పని చేసిన ఎస్‌.ఎస్‌.గిల్‌ ఇలా అన్నారు.డబ్బు అంటే అతి ప్రేమను కురిపించే ఏకైక మతం హైందవం. మరో మతానికి ఈ లక్షణం అలవాటు లేదు. సంపద పోగు చేయడం అన్నది ఒక ఆరాధనగా మార్చింది హైందవం. ఎనిమిది మంది వైదిక దేవుళ్ళలో ఒకరైన కుబేరుడు సంపదకు అధిపతి. పైసే పరమాత్మగా ఆరాధించే ఆరాధ్య దేవతలలో ఒకరు లక్ష్మి. సామాన్యుడికి అర్ధాన్ని పురుషార్ధాలలో ఒకటిగా చేశారు.

కౌటిల్యుడూ(చాణుక్యుడు) చెప్పాడుః డబ్బు, డబ్బు, డబ్బే ముఖ్యమైనది. ధర్మం, కామం, అనుభవంలోకి రావాలంటే అవి ఆధారపడవలసింది డబ్బు మీద కాదు. ప్రాచీన భారతంలో మనకు ప్లాటో లేడు. ఉండివుంటే కథ వేరుగా ఉండేది. హైందవ ధర్మశాస్త్రాలు మానవ సంబంధాలలో డబ్బుకే (సంపద పోగు చేసుకోవడానికే) ఎక్కువ ప్రాధాన్యం యిచ్చినందున నైతిక విలువలకు తగిన ప్రాధాన్యం ఎదిగి రాలేదు. కనుకనే సుప్రీంకోర్టు కూడా ఇటీవల ఇండియన్‌ బ్యాంక్‌లో జరిగిన కుంభకోణం కేసును విచారణకు స్వీకరించిన సందర్భంగా పాలనా వ్యవస్థపైన పాలకుల పైన చురక వేయవలసి వచ్చింది. అవినీతి గురించి మాటలు చాలా చాలా వింటున్నాం. కానీ అవినీతిని

అరికట్టేందుకు ఇంత వరకు చేసిందేమీ లేదు. ప్రతివాడూ, అవినీతిని తొలగించాలని మాట్లాడే వాడేగానీ, ఆచరణకు వచ్చే సరికి పూచిక పుల్ల కూడా కదలడం లేదు!

పూచికపుల్ల కూడా ఇండియాలో కదలదనడానికి తాజా చరిత్ర నుంచి ఎన్నో ఉదాహరణలు చూపవచ్చు. బోఫోర్స్‌, సెయింట్‌ కీట్స్‌, జె.ఎమ్‌.ఎమ్‌,జైన్‌ హవాలా , లఖూభాయ్‌ పాఠక్‌కేసులు, ఏలేరు భూముల నష్టపరిహారం కుంభకోణం కేసూ, మంత్రులపైన, ముఖ్యమంత్రిపైన, హైకోర్టుల్లో నానుతున్న చీటింగ్‌ కేసులూ, రాజకీయనాయకుల దొంగ కరెన్సీ కేసులూ, పెక్కు రాజకీయ హత్యలకు చెందిన కేసులూ ఏ ఒక్కటైనా ఒక కొలిక్కి వచ్చిందా ?

చివరికికనకదుర్గముక్కెర, ఇతర ఆభరణాలు, ఎవరి చేతి సొమ్ములుగా ఎగిరిపోయాయి? అందులో మంత్రులకు పాత్ర ఉందన్న ఆరోపణకు ఇంత వరకు పరిష్కారం దొరకలేదెందుకని ?

బాధితులకు ఊరట కలిగించగల రీతిలో ఎన్ని తీర్పులొచ్చాయి? ఏలేరు భూముల నష్టపరిహారం స్కామ్‌ను వెలికితీస్తూ విచారణ పూర్తి చేసి, తీర్పు చెప్పడానికి సిద్దమైన సోమశేఖర్‌ కమిషన్‌కు తెలుగుదేశం ప్రభుత్వం పట్టించిన గతి గురించి ఆలోచించిన న్యాయస్థానం వుందా ?పాలకుడున్నాడా ?ఈ సందర్భంగా ప్రముఖ రాజనీతిజ్ఞుడు-తత్వవేత్త అయిన డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌(1947) చెప్పిన మాటలు ఏ రోజుకైనా మనకు శిరోధార్యం కావాలి.

ఉన్నత స్థానాలలో పేరుకుంటున్న అవినీతిని మనం నాశనం చేయాలి. ఆశ్రిత పక్షపాతాన్ని , అధికార వ్యామోహాన్ని , లాభాపేక్షనూ, బ్లాక్‌ మార్కెటింగ్‌నూ కూకటి వేళ్లతో నిర్మూలించాలి.ఉన్నతస్థానాల్లో , ఉన్నత స్థాయిలో చేసే ఈ తప్పుడు పనుల వల్లనే ఈ దేశానికున్న మంచి పేరుకాస్తా గంగలో కలిసింది.

ఈ అవినీతి పనులు అంతమయ్యేదాకా పాలనావ్యవస్థలో సామర్ధ్య ప్రమాణాలను మనం పెంచలేం. ఉత్పత్తి ప్రమాణాలనూ, జీవనానికి అవసరమైన వస్తు సంపద పంపిణీ ప్రమాణాలనూ వృద్ధి చేసుకోలేము.

ఆధునిక తెలుగు ప్రతికారంగ వైతాళికుడు ఎబికె ప్రసాద్‌ కొన్ని దశాబ్దాలుగా సామాజిక మార్పు కోసం అక్షరయజ్ఞం చేస్తున్నారు. ఆయన ఇండియా ఇన్ఫోకు ప్రత్యేకంగా రాస్తున్న వ్యాసపరంపర ఇది. హోమ్‌ పేజి

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X