వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆర్‌.కె.కొండెపాటి జర్మనీలో ఉంటున్నారు. ఆయనరీసెర్చ్‌ స్కాలర్‌. రాస్ట్రంలోని సామాజిక,రాజకీయ పరిణామాలపై ఆయనఎప్పటికప్పుడు ప్రతిస్పందిస్తుంటారు.

By Staff
|
Google Oneindia TeluguNews

బహుశా వర్తమాన కాలగమనంలో ఊహించలేనంత వేగం పెరిగింది. ఎటు వైపు దౌడు తీస్తున్నదో తెలీనంతటి వేగం. మెరుపుల కాంతి నమ్ముకుని చేసే ప్రయాణంలోని వేగం.

గతంలో ఎప్పుడన్నా ఉలికిపాటుతో ఒక ఉద్రిక్త సంఘటన జరిగేది. దాన్నుంచి తేరుకునేంత వ్యవధి వుండేది. రెండు భయానక సంఘటనల మధ్య ఊపిరి తీసుకునేంత విరామం వుండేది. ఇప్పుడు విశ్లేషించుకునేంత వ్యవధి లేకుండా భయంకరమైన సంఘటనలు ప్రతి రోజూ జరిగిపోతున్నాయి. మీడియా అవిశ్రాంతంగా ప్రజల మెదళ్ల మీద దాడి చేస్తున్నంత శీఘ్రంగా ప్రసారం చేస్తున్నాయి. హింసాత్మక సీరియల్‌ మన మధ్య, మన చుట్టూ ఆపలేనంతగా జరిగిపోతూ ఉంటుంది. ప్రభావ ప్రకంపనలు కదిలిపోతున్నాయి.

పట్టపగలు కళ్ల ముందు నడిరోడ్డుపై హత్యాకాండ జరుగుతుంది. ప్రజల ముఖం మీద రక్తం చిందుతుంది. గగుర్పాటు, ప్రాణభయం, పరుగులు, తొక్కిసలాట. హంతకులు సిగరెట్లు వెలిగించి నెమ్మదిగా నడిచి వెళిపోతారు. అంతా తిరిగి మామూలు, పోలీసు హడావిడి, యిదంతా సాధారణం అన్నట్లుగా అయిపోవడం, ఫలితం, యిళ్లు భళ్లున వేసుకున్న తలుపుల వెనక అభద్రత జరజర పాకుతుంది.

ఎక్కణ్ణుంచో మొదలు పెట్టాలి కాబట్టి, యిక్కణ్నుంచే మొదలు పెట్టవచ్చు.

జూలకంటి శ్రీనివాసరెడ్డి ఉరఫ్‌ మొద్దు శీను దొరికాడు. దొరకలేదు, తప్పనిసరి పరిస్థితుల్లో దొరకబడ్డాడు. గమనించబడ్డాడు. పోలీసులు పట్టుకోలేదు, గమనించలేదు. తానే స్వయంగా తయారు చేస్తున్న బాంబుల భారీ పేలుడు వల్ల గాయపడి, ఆసుపత్రికి తరలిస్తే ఆ గాయపడిన వ్యక్తి మొద్దు శీను అయి ఉంటాడని ఈనాడు - ఈటివి బయటపెడితే అందరికీ తెలిసింది. ఆ తర్వాతే, నెమ్మదిగా, పోలీసులకి తెలిసింది.

ఇదొక హింసాత్మక సీరియల్‌ సినిమా లాంటిది. దీనికి నిర్మాత, దర్శకుడు యితర సాంకేతిక నిపుణులు ఎవరో తెలీదు. పాత్రలు, సంఘటనలు మాత్రం అప్పుడప్పుడు తెర మీదకొస్తాయి. దీనికి ప్రజలు ప్రేక్షకులు మాత్రమేనా? కాదు, బాధితులు కూడా. ఇటువంటి సంఘటనల వల్లనే సమాజం నేరమయం అవుతుంది.

పరిటాల రవి హత్య కేసులో ప్రధాన నిందితుడు, జయప్రదంగా తప్పించుకుని, అజ్ఞాతంలోకెళ్లిపోయి యింటర్వ్యూలు యిచ్చిన మోస్ట్‌ వాంటెడ్‌ క్రిమినల్‌ అని పేర్కొనబడే మొద్దు శీనున మన పోలీసులు పట్టుకోలేరా? పట్టుకోగలరు. మన పోలీసులకు ఆ శక్తి ఉంది. కానీ, పట్టుకోలేదు. కారణం తెలీదు.

ఇంకాస్త వెనక్కడి వెడితే, ఎవరు ఏ రాజకీయ పార్టీకి చెందినవారయినా, కారణాలు, సందర్భాలు, ఎంత ఘోరమైనవీ, బలవత్తరమైనవీ అయినా, పరిటాల రవి హత్యకు ముందు అటువైపు కొన్ని హత్యలు, యిటు వైపు కొన్ని హత్యలు జరిగాయి. తరతరాలుగా ముఠాలు కట్టి రక్తనదులు పొంగిపొర్లాయి. ప్రజా జీవితం అల్లకల్లోలమైంది. బాంబులు, వేటకొడవళ్లు విసరడం, నరుక్కోవడం, మనుషుల జీవితాలు మధ్యలోనే అంతమవడం, మొదట్లో భయోత్పాతం, క్రమంగా అదంతా జంతు బలిలా మామూలైపోవడం. అధికారంలో ఏ రాజకీయ పార్టీకి చెందివారున్నా, ఆ ప్రభుత్వం ఎలక్షన్లు ముగిశాక, పార్టీలకతీతంగా దృఢ నిశ్చయంతో యా హత్యాకాండ ఆపలేదా? ఇంత వరకూ ఏర్పడిన ఏ ప్రభుత్వమైనా దానిని ఆపగలదు. ఇంకా మన ప్రభుత్వాలకు ఆ శక్తి ఉంది. కాని, ఎవరూ శాశ్వతంగా ఆపడానికి పూనుకోలేదు.

అధికారంలోకొచ్చే ప్రజాప్రతినిధులు కక్ష, కసి తీర్చుకునే వ్యక్తులుగా స్పందిస్తున్నారు తప్ప చెమ్మగిల్లిన నయనంతో, ప్రభుత్వంగా బాధ్యతతో ప్రజలకు రక్షణ యివ్వాలని ఆలోచించడం లేదు. ఈ దృష్టిలో మార్పు రానంతవరకు హత్యలు, ప్రతిహత్యలు కొనసాగుతూనే ఉంటాయి.

ఒక వైపు ఆకాశమంత ఆలోచనలు, అభివృద్ధికి ప్రణాళికలు, సమాలోచనలు, సంపద సృష్టికి కృషి జరుగుతూనే వుంటాయి. మరో వైపు నేలంతా రక్తం చిమ్ముతూ మహా స్మశానం విస్తరిస్తూనే వుంటుంది. ఇలాగే కొనసాగితే హరితాంధ్రప్రదేశ్‌ హతులాంధ్రప్రదేశ్‌గా మారే ప్రమాదం పొంచి ఉంది.

అందుకే, మన రాష్ట్రాన్ని బీహార్‌తో పోల్చడం ప్రారంభమైంది. దీనిపై యింకా చీమ కుట్టినట్లయినా లేదు, ప్రభుత్వానికి.

స్వాతంత్య్రం సాధించడానికి ముందు తొలి సంవత్సరాల్లో అభ్యుదయ విలువలకు నష్టం కలిగేదేదయినా జరిగితే, అది సమాజం వెలుపలే వుండేది. కొందరు వ్యక్తుల వద్దనే ఆగిపోయేది. సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ అది క్రమంగా వ్యక్తులను దాటి, లోపలికి చొచ్చుకొని వచ్చి మొత్తం సమాజాన్నే ఆక్రమించింది. దానికి అవినీతి ఒక వుదాహరణ. మొదట్లో అవినీతిపరులు అక్కడక్కడ కొద్ది మంది వ్యక్తులు ఉండేవారు. అందరికీ వారు తెలిసిపోయేవారు. వారిని యితరులు బహిష్కరించకపోయినా, దాదాపుగా అందరూ వారిని మచ్చపడిన వారిగా చూసేవారు. ప్రభుత్వం దీనిపై అధికార ఆయుధం ప్రయోగించకపోవడం వల్లా, దానిని నిరోధించడం ఆదర్శం కాకపోవడం వల్లా, క్రమంగా అవినీతి సమాజాన్నంతా కమ్ముకుంది. జీవన విధానంగా మారిపోయింది. సాధారణం అయిపోయింది. ఇవాళ అవినీతి ద్వారా సంపాదించేది నల్లధనంగా మారి సమాజంలోని ప్రతి అంగాన్నీ పరిపాలిస్తోంది. నల్లధనం నల్లటి ఆలోచన్లతో, నల్లటి సంస్కృతిని పెంచి పోషిస్తోంది. అసలు ధనశక్తిని నిర్వీర్యం చేస్తోంది. రాజకీయుల వెనక నిలబడి, నల్లధనశక్తి రాజ్యమేలుతోంది. అందువల్లనే, నల్లధనశక్తి గుప్పిట నుండి ప్రజాస్వామ్య శక్తి బయటపడలేకపోతోంది. నత్లధనం పునాదిగా గల రాజ్యం తెల్లటి పాలనను ఇవ్వలేదు.

కాలం శాన్యంలో ఉండదు. ఎప్పుడూ ఏదో ఒక వాదం లేక ఇజం ఆచరణలో వుంటుంది. ఇప్పుడు హంతక కిరాయి గుండాయిజం నడుస్తోంది. యిది మొదట్లో ప్రైవేటు వ్యక్తుల మధ్య వుండేది. వ్యాపారాల్లో, ఆదాయ మార్గాల్లో, లాభాల్లో అడ్డం వస్తున్నారనుకునే తొలగించుకోవడానికి యిలాంటి సైన్యాన్ని తయారు చేసుకునేవారు. క్రమంగా యిది ఎలక్షన్లలోకి వచ్చేసింది. హంతక కిరాయిగుండా సంస్కృతి సమాజంలోకొచ్చేసింది. ఇవాళ్ల రాజకీయం వెనక హంతక కిరాయి గూండాయిజం ఉంది. రెండూ కలగలసిపోవడం వల్ల అన్ని అరిష్టాల వెనకా రాజకీయాలు చోటు చేసుకున్నాయి. ఒకప్పుడు వెలుపల వుండేవన్నీ యివాళ మన వ్యవస్థలో భాగాలైపోయినై.

నల్లధనం పెంచి పోషించే, రాజకీయాల్ని ఆదేశించే నేరమయ విధానంలో, హంతకులెవరూ యివాళ న్యాయస్థానాలను చూసి భయపడడం లేదు. వారి బలం ఎంతగా పెరిగిందంటే, ఉరిశిక్ష పడినా దానిని జీవితఖైదు కిందికి మార్పించుకోవచ్చు. తరువాత, కులం పేరు మీదో, మతం పేరుమీదో, అధికార పార్టీ అండదండలతోనో క్షమాభిక్షతో సరాసరి సమాజంలోకి వచ్చెయ్యవచ్చు. తిరిగి గతంలో వలె బాహాటంగా ప్రవర్తింవవచ్చు.

ఈ నరహంతక నేరస్తులు రోజూ పత్రిక పతాక శీర్షికల్లో వివిధ భంగిమల్లో దర్శనమిస్తుండడం వల్లా, జైళ్లలో వి ఐపిలుగా విలాసవంతమైన జీవితం గడుపుతూ, దేనికీ, ఎవరికీ భయపడకుండా తమ వ్యూహకార్యక్రమాలన్నీ అక్కడి నుంచే నిర్వహిస్తూ దిగులుగాని, తప్పు చేశామనే భావన లేశమాత్రం లేకుండా, టి.వి. ఛానెళ్లలో పరమ కులాసాగా కనబడుతుండడం వల్లా, కొందరి దృష్టిలో వీళ్లు హీరోలుగా కనబడసాగారు. దీనికి గ్లామర్‌ జోడించి, యువత పక్కదారి పట్టడానికి యిదొక పార్శ్వం.

అయినా, ప్రభుత్వం, పోలీసు, నిఘా, జైళ్లు మొదలైన వ్యవస్థలేవీ చెయ్యని పనులను యివాళ పత్రికలు ఎంతో ధైర్యంగా, ఎన్నో కష్టనష్టాలకోర్చి, ప్రమాదాలనెదుర్కొంటూ చేస్తున్నాయి. మాఫియా చీకటి సామ్రాజ్యంలోని కార్యకలాపాలు వెలికి తీస్తున్నాయి. సమాజాన్ని మేల్కొలుపుతున్నాయి.

బహుశా, యా నరహంతక చీకటి సంస్కృతిని రూపు మార్చడంతో పాటు, ప్రభుత్వం నిద్ర నటిస్తున్న అనేక సామాజికాంశాలపై బాధ్యతను తీసుకొని, మన దేశ భవిష్యత్తు నిర్మించే మహోద్యమం పత్రికలే నిర్వహిస్తాయని నేను అనుకుంటున్నాను.

పత్రికలే నేటి జాతీయ నాయకులు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X