వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అసమానుడు, ఆదర్శనీయుడు - నగ్నమునిశ్రీ నర్రా రాఘవరెడ్డి అతి సామాన్యుడిగా జీవించే మహనీయుడు. లోకంలో, రాజకీయాల్లో క్షీర నీర న్యాయం తెలిసినవాడు. నల్లగొండ జిల్లా నక్రేకల్‌ నియోజకవర్గం నుంచి సిపిఐ (యం) తరఫున 1967-99 మధ్య అప్రతిహతంగా ఆరుసార్లు శాసనసభ్యునిగా ఎన్నుకోబడి నిజమైన ప్రజాప్రతినిధిగా వ్యవహరించినారు. ఆయన ప్రజాపక్షపాతి. ఏనాడూ అధికారం ప్రధానం కాని మనీషి.శ్రీ రాఘవరెడ్డి జీవితం ప్రజాసేవకు నిలువెత్తు నిర్వచనం. ఆయన సామాన్యులకు ఎప్పుడూ ఓ భరోసా. సమస్యల పరిష్కారానికై పోరాటానికి సై.ముఖ్యంగా చెప్పవలసింది - జనపథమే జ్ఞానపథమని నమ్మిన జానపద కళాకారుడు ఆయన. మరీ ముఖ్యంగా చెప్పవలసింది - కల్తీ లేని తెలుగువాడు. శాసనసభలో మొత్తం పాలన, పరిపాలన, ప్రభుత్వ వ్యవహారమంతా తెలుగులోనే జరగాలని ఉడుంపట్టు పట్టి, మొండిగా కృషి చేసిన మన మహనీయుడు. ఆయనకు ధారాళంగా ఉర్దూ వచ్చు. శాసనసభలో ఉర్దూ అనువాదాలు లభ్యమవుతాయి. ఇతరులు ఇంగ్లీషులో చదువుకొని తెలుగులో మాట్లాడుతున్నట్లు ఆయన ఉర్దూలో చదువుకొని తెలుగులో మాట్లాడవచ్చు. కాని దానికి ఆయన ఏ మాత్రం ఇష్టపడేవారు కాదు. అంతా తెలుగులోనే జరగాలనేది ఆయన మతం.1924లో జన్మించారు. కష్టాల కొలిమిలో జీవితం ప్రారంభమైంది. పసితనంలోనే మాతృవియోగం. ఇంట్లో నిరాదరణ. అందువల్ల ప్రాథమిక దశలోనే ఆగిపోయింది చదువు. రోడ్డున పడింది బతుకు. అన్నీ వుండి ఏమీ లేకపోవడమంటే యిదే. ఏవైపు నుండి ముఖ్యంగా తండ్రి నుండి ప్రేమ, ఆప్యాయతలు లేకపోవడం యివన్నీ ఆయనను నిరాశలోకి నెట్టివేయాలి. కానీ, ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినా నిరాశను దగ్గరకు రానివ్వలేదు. మనసును కుంగిపోనివ్వలేదు.చిన్నప్పట్నుంచీ తన జీవితాన్నే గాక, చుట్టూ వున్న సమాజాన్ని క్షుణ్నంగా చదవడం ప్రారంభించారు. బొంబాయి (ముంబై) వెళ్లారు. హోటల్లో పనిచేశారు. చిన్నా చితక పనులు చేశారు. అక్కడే ఆయనకు కార్మికోద్యమాలతో పరిచయమైంది. మమేకమై పాల్గొన్నారు. అప్పుడే ఆయనకు కార్మికుల జీవితాలు మరింత దగ్గరగా గమనించే అవకాశం కలిగింది. హైదరాబాద్‌ వచ్చిన తర్వాత 1949లో కమ్యూనిస్టు పార్టీ సభ్యుడయ్యారు. ప్రజల్లోకి చొచ్చుకుపోయి పార్టీ కోసం, తద్వారా ప్రజల సమస్యల పరిష్కారం కోసం తీవ్రంగా కృషి చెయ్యడం నిత్యకృత్యమైంది. పార్జీ ప్రజలకు సన్నిహితం కావడానికి, అధికారులు ప్రజల సమస్యలు పరిష్కారం చెయ్యడానికి, ఆయన ఎన్నుకున్న మార్గం జానపద కళారూపాలు. ఒగ్గుసుద్దులు చెప్పేవారు. పిట్టలదొర వేషం కట్టేవారు. లత్కోరసాబు (బహురూపి)గా ఎన్నో విషయాలు చెప్పేవారు. సన్యాసి వేషంలో జనతత్వాలు కట్టి పాడేవారు. బుర్రకథలు చెప్పేవారు. వీటన్నింటి వెనక ప్రధాన వస్తువు రాజకీయాలు; ప్రజాసమస్యలు. వీటి వల్ల వామపక్షం ప్రజల్లో బలపడేది. జానపద కళారూపాల్లో ఆయన ప్రజాసమస్యలు అధికారుల దృష్టికి తీసుకొచ్చేవారు. పర్యటన నిమిత్తం వచ్చే మంత్రులు ఒక పక్క వినోదిస్తూ, మరో పక్క కండచీమలు కొరుకుతున్నట్లు అనిపించేది. ఆ ప్రాంత ప్రజాసమస్యల పరిష్కారానికి పూనుకునేవారు. కళారూపాలను భృతికో, వినోదానికో, స్వీయకీర్తికో పరిమితం చెయ్యడం కాకుండా ప్రజా కళారూపాలతో తిరిగి ప్రజలను చైతన్యవంతులను చెయ్యడానికి వినియోగించడం, వారి సమస్యల పరిష్కారానికి ఆయుధంగా మలచడం రాఘవరెడ్డిగారు చేశారు. కళా ప్రయోజనాన్ని పునర్‌ నిర్వచించారు. ఆయన శాసనసభ్యుడిగా ఎన్నిక కాగానే నియోజకవర్గంలోని 89 గ్రామాలూ, ఆనాడు ఎడారిగా వుండిపోయిన మరో అయిదు గ్రామాలూ, ఒక్క అంగుళం విడిచిపెట్టకుండా పర్యటించారు. ఎక్కడ ఏ సమస్య వుందో, స్వయంగా తెలుసుకునేవారు. రోడ్లు వేయించడం, కరెంటు సౌకర్యం కల్పించడం, పేదలకు బంజర్లు యిప్పించడం, కౌలుదారీ చట్టం అమలు చేయించడం, వ్యవసాయ కూలీల రేటు పెంచడం యిటువంటి ఎన్నో పనులు ప్రభుత్వం చేత చేయించడానికి ఎంతో కృషి చేశారు. ప్రజల పని తనపనిగా భావించి అది నెరవేరే వరకూ నిద్రపోకుండా పనిచేసేవారు. శాసనసభలో అవకాశం ఏ మాత్రం విడిచిపెట్టకుండా, ప్రతి నిమిషం క్షుణ్ణంగా అధ్యయనం చేసి పాల్గొనేవారు. చక్కని తెలుగులో మాట్లాడేవారు. ఆయన వుపన్యాసం విని తీరాలి. గ్రామం శాసనసభలోకి నడచి వచ్చినట్లుండేది. నుడులు, నానాడులు, సామెతలు, చిక్కని చక్కని హాస్యం, ప్రభుత్వాన్ని కుట్టే తేళ్లు - మొత్తంగా ఆయన భాష కమ్మదనంతో నిండి వుండేది. 80 శాతం ప్రజలకు తెలుగు తప్ప మరో భాష రాదు. మరి ఎందుకని మొత్తం కార్యకలాపం ఇంగ్లీషులో నిర్వహిస్తున్నారు. ఏమిటా వ్యామోహం! ఎవరి కోసమీ పరిపాలన అని సూటిగా అడిగేవారు. రాజ్యాంగం తెలుగులో వుండాలి. శాసనాలు తెలుగులో చెయ్యాలి. మొత్తం తెలుగులోనే జరగాలి. భాష విషయంలో మనం బానిసలుగా బతుకుతున్నాం. నైజాం కాలంలో ఉర్దూలో మాట్లాడ్డం గొప్ప. ఇప్పుడు ఇంగ్లీషులో మాట్లాడ్డం గొప్ప. మన భాషని మనమే కించపరుస్తున్నాం. మాతృభాషను అవమానించే యా బుద్ధి పోవాలి. ఈ కాగితాలు ఇంగ్లీషులో ఉన్నాయి. నాకు తెలుగులో యివ్వండి అని శాసనసభలో నిలదీసేవారు రాఘవరెడ్డిగారు. ఆయన మూర్తీభవించిన తెలుగువాడు. తెలుగుదనం వెలిగించడానికి పూనుకున్నవాడు. ఆయన జీవితం ఓ వాస్తవ సినిమాలా కనిపిస్తుంది. ఆ పోరాటాల కథనాన్ని ఎవరయినా సినిమాగా తియ్యవచ్చు. ఇప్పటికీ మన మధ్యనే వున్నారు. గొంతుక ఖనేల్మంటోంది. వృద్ధాప్యం అందరికీ రాలేకపోతోంది. ఇప్పటికీ అంతర్జాతీయ, జాతీయ, ప్రాంతీయ విషయాలపై అధ్యయనం చేస్తూనే వుంటారు. ఏ విశ్వవిద్యాలయమో, రాజకీయ పార్టీ సాంస్కృతిక విభాగమో ఆయన అనుసరించిన జానపద కళారూపాలను రికార్డు చేస్తే భావితరాలకు సంపదగా వుపయోగపడతాయి. రాఘవరెడ్డి గారి జీవితం, సమాజాన్ని అధ్యయనం చేసేవారికి పాఠ్యగ్రంథం. ఆయన ఆశయాలు, అందరికీ, మరీ ముఖ్యంగా రాజకీయ రంగంలోని వారికి ఆదర్శనీయం.ఆయనను గౌరవిస్తానుమనసారా నమస్కరిస్తాను.

By Staff
|
Google Oneindia TeluguNews

దిగంబర కవిగా నగ్నముని ప్రసిద్ధులు. ఆయన రాసిన కొయ్యగుర్రం దీర్ఘకావ్యం అనేక చర్చలు దారి తీసింది. నగ్నమునిది పదును దేరిన కలం. సమాజంలోని వికృతాలపై ఆయన కలం నిప్పులు కక్కుతుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X