వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పోతన హైజాక్

By కె. నిశాంత్
|
Google Oneindia TeluguNews

కడప ద్విదశాబ్ది ఉత్సవాల్లో మహాకవి బమ్మెర పోతనపై అసత్య ప్రచారం చేస్తున్నారని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు విమర్శించారు. అందుకు జిల్లా కలెక్టర్, ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని ఆయన గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో డిమాండ్ చేశారు. భాగవతాన్ని ఆంధ్రీకరించిన బమ్మెర పోతన వరంగల్ జిల్లాలోని బమ్మెరకు చెందినవాడని సాహిత్య చరిత్రకారులు అంగీకరించి చరిత్రలో రికార్డు చేసిన తర్వాత కూడా అతను కడప జిల్లాలోని ఒంటిమిట్టకు చెందినవాడని కడప జిల్లా ద్విదశాబ్ది ఉత్సవాల్లో ప్రదర్శించుకోవడాన్ని ఆయన తప్పు పట్టారు.

బమ్మెర పోతన కడప జిల్లాకు చెందినవాడని చెప్పుకోవడాన్ని నిరసిస్తూ తెలంగాణ రచయితల వేదిక ఆధ్వర్యంలో గురువారంనాడు హైదరాబాదులోని ట్యాంకుబండ్ మీద గల పోతన విగ్రహం వద్ద రచయితలు, కవులు, మేధావులు ధర్నా చేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత సి. నారాయణరెడ్డితో పాటు జయశంకర్, టంకశాల అశోక్ తదితరులు పాల్గొన్నారు. భాగవత కర్త పోతన వరంగల్లు జిల్లావాడని నిర్ధారణ అయిన తర్వాత కూడా వివాదం సృష్టించడాన్ని సి. నారాయణ రెడ్డి తప్పు పట్టారు.

భాగవత కర్త బమ్మెర పోతనను కడప జిల్లావాడిగా చెప్పుకోవడం పట్ల తెలంగాణలో తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. కడప జిల్లా ద్విదశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఆహ్వాన పత్రంపై పోతన బొమ్మ వేసి అతను కడప జిల్లా వాడని చెప్పుకున్నారు. పోతన వరంగల్ జిల్లాలోని బమ్మెర వాడా, కడప జిల్లాలోని ఒంటిమిట్ట వాసియా అనే విషయంపై చాలా కాలం క్రితమే వాదోపవాదాలు విరివిగా జరిగాయి. పోతన మార్గ కవితా పథగామియే అయినప్పటికీ ఆయన రాసిన భాగవత పద్యాలు అత్యంత సరళంగా, మధురంగా ఉండి ప్రజల నాలుక మీద నర్తిస్తున్నాయి. పోతన అఖిలాంధ్ర కవియే కాకుండా ఒక రకంగా ప్రజాకవి కూడా. రాజాశ్రయాన్ని తిరస్కరించి హలాన్ని, కలాన్ని ఏక కాలంలో నడిపించిన యోధుడాయన. స్థలకాలాలపై విరివిగా చర్చలు జరిగిన తర్వాత పోతన తెలంగాణలోని వరంగల్లు జిల్లా బమ్మెరవాసి అని సాహిత్య చరిత్రకారులు నిర్ధారించారు. ఇటువంటి సమయంలో కడప జిల్లా ఉత్సవాలు వివాదాన్ని సృష్టించాయి. సాహిత్య చరిత్రలో తెలంగాణకు అన్యాయం జరిగిందని, సాహిత్య చరిత్రలో తెలంగాణవారికి తగిన స్థానం లభించలేదని ఈ ప్రాంత రచయితలు, మేధావులు గత దశాబ్ది కాలంగా విమర్శలు చేస్తూనే ఉన్నారు. మరుగున పడిపోయిన తెలంగాణ రచయితలను, కవులను, చరిత్రకారులను, సామాజిక కార్యకర్తలను వెలికి తెచ్చి వారి కృషిని వివరిస్తూనే ఉన్నారు. తమ ప్రాంతానికి చెందిన కవులను, రచయితలను తెలంగాణేతర ప్రాంతాలవారు సరిగా గుర్తించడం లేదని, వారికి తగిన స్థానం ఇవ్వడం లేదని వీరు ఆవేదన చెందుతున్నారు. అందువల్ల తెలంగాణ కవులను ఇతర ప్రాంతాలవారు తగిన రీతిగా చూడాలనే అభిప్రాయమే వారు వ్యక్తం చేస్తున్నారు తప్ప వారు తెలంగాణకు చెందినవారు కారనే వక్రీకరణలను వారు వ్యతిరేకిస్తున్నారు. బమ్మెర పోత తెలంగాణవాడు కాదని కడప జిల్లా వారు చెప్పడం తమ ఆత్మగౌరవాన్ని దెబ్బ తీయడంగా వారు భావిస్తున్నారు.

బమ్మెర పోతన విషయంలో కడప ద్విదశాబ్ది ఉత్సవాలు అనుసరిస్తున్న వైఖరిని నిరసిస్తూ ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆచార్యులు, అధ్యాపకులు ఒక ప్రకటన చేశారు. పోతన స్థలనిర్దారణపై వారు సాహిత్య చరిత్రలో జరిగిన చర్చను ప్రస్తావిస్తూ ఆ ప్రకటన చేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆచార్యులు కిషన్ రావు, ఎం. అండమ్మ, డిగ్రీ కళాశాలల అధ్యాపకులు నందిని సిధారెడ్డి, నాళేశ్వరం శంకరం, సుంకిరెడ్డి నారాయణ రెడ్డి, తూర్పు మల్లారెడ్డి వంటి పలువురు ఆ ప్రకటనపై సంతకాలు చేశారు.

పోతన విషయంలో అనుసరిస్తున్న వైఖరిని నిరసిస్తూ తెలంగాణ రచయితల వేదిక నాయకులు ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డికి ఒక లేఖ రాశారు. తెలంగాణ నీళ్లు, నిధులు, సంస్కృతి, ఉద్యోగాలను దోపిడీ చేసినట్టుగా సాహిత్యాన్ని కూడా ఆంధ్ర పాలకులు హైజాక్ చేయడాన్ని తెలంగాణ రచయితల వేదిక అధ్యక్షుడు జూకంటి జగన్నాధం, కార్యదర్శి అన్నవరం దేవేందర్, కరీంనగర్ జిల్లా ఇతర రచయితలు ఆ లేఖపై సంతకాలు చేశారు. ఈ లేఖ ప్రతిని కడప జిల్లా కలెక్టరుకు ఫాక్స్ ద్వారా పంపారు.

తెలుగు కవుల చరిత్ర రాసిన కందుకూరి వీరేశలింగం పోతనను వరంగల్ జిల్లా బమ్మెర గ్రామానికి చెందినవాడిగా నిర్ధారించారు. పి.వి. నరసింహారావు ప్రధానిగా ఉన్నప్పుడు వరంగల్లులో పోతన పంచ శతాబ్ది ఉత్సవాలు జరిగాయి. అదే సందర్భంలో వరంగల్లులోని టెలిఫోన్ భవనానికి పోతన పేరు పెట్టారు. స్పష్టమైన ఆధారాలు ఉన్నప్పటికీ పోతన జన్మస్థలాన్ని వివాదం చేయడం తెలంగాణ రచయితలు నచ్చడం లేదు. అది సహజం కూడా. తెలంగాణ అస్తిత్వ ఉద్యమం పెద్ద యెత్తున సాగుతున్న ఈ కాలంలో ఇటువంటి చర్యలు అగ్నికి ఆజ్యం పోస్తాయి. తెలంగాణకు అన్ని రంగాల్లో అన్యాయం జరిగిందని, తెలంగాణ తెలంగాణేతర ప్రాంతాల్లో సామాజిక, ఆర్థిక, ఆర్థిక, సాంస్కృతిక సమన్వయం కుదరలేదని వాదిస్తున్న తరుణంలో పోతనను హైజాక్ చేయడం వల్ల తెలంగాణ ప్రజల మనోభావాలు మరింతగా దెబ్బ తింటాయనే విషయాన్ని గమనించడం అవసరం.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X