• search

తెలంగాణ వస్తుందా?

By Staff
Subscribe to Oneindia Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts


    తెలంగాణకు అనుకూలంగా కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతున్నట్లు సూచనలు కన్పిస్తున్నాయి. రాష్ట్ర గవర్నరుగా ఎన్.డి. తివారీని వేయడం దగ్గర్నుంచి ఎఐసిసి పునర్ప్యస్థీకరణ వరకు కాంగ్రెస్ నాయకత్వం తీసుకున్న చేపట్టిన చర్యలు తెలంగాణకు మంచి రోజులను సూచిస్తున్నాయి. చిన్న రాష్ట్రాలకు అనుకూలంగా వ్యవహరించే తివారీని వాస్తవాలను తెలుసుకోవడానికే గవర్నరుగా వేశారనే మాట వినిపిస్తున్తున్నది. అలాగే కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇన్ చార్జి పదవి నుంచి దిగ్విజయ్ సింగ్ ను తప్పించడం కూడా తెలంగాణకు అనుకూలమైన నిర్ణయంగానే భావించవచ్చు. తెలంగాణపై ఆయన మొండిగా వాదిస్తూ వస్తున్నారు. ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డికి పూర్తి మద్దతు అందిస్తూ తెలంగాణకు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారనే వాదన బలంగా వినిపించింది. తెలంగాణపై వాస్తవాలను సోనియాకు సరిగా అందించడం లేదని తెలంగాణ కాంగ్రెస్ నాయకులు పలువురు పలు సందర్భాల్లో అంటూ వచ్చారు. ఈ స్థితిలో ఆయనను తప్పించడం తెలంగాణకు మేలు చేసినట్లేననే భావన ఉంది.

    దిగ్విజయ్ ని తప్పించడం మాట అటుంచి తెలంగాణ విషయంలో కాంగ్రెసులోని అతివాది నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు మధుయాష్కీ గౌడ్ ను ఎఐసిసి కార్యదర్శిగా నియమించారు. తనపై ఏ చర్యలు తీసుకున్నా ఫరవాలేదని, తాను తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు గురించి మాట్లాడుతూనే ఉంటానని ప్రకటించిన కొద్ది రోజులకే ఆయనను ఎఐసిసి కార్యదర్శిగా నియమించారు. అంటే ఆయన వాదనలను పార్టీ అధిష్ఠానం తోసిపుచ్చడం లేదని భావించడానికి వీలుంది. మధుయాష్కీ రాహుల్ గాంధీకి సన్నిహితుడు. ఈ స్థితిలో తెలంగాణ అంశాన్ని సోనియా వద్దకు తీసికెళ్లడం ఆయనకు మరింత సులువైందని చెప్పవచ్చు.

    ఇదే సమయంలో కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇన్ చార్జిగా వీరప్ప మొయిలీని నియమించడం కూడా ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డికి మింగుడు పడని విషయమే. వీరప్ప మొయిలీ కూడా చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు అనుకూలమని అంటారు. తెలంగాణ పట్ల ఎలా స్పందిస్తారో ఆయన మాస్కో నుంచి తిరిగి వచ్చిన తర్వాత గానీ తెలియదు. ఇదంతా తెలంగాణకు అనుకూలంగా కాంగ్రెసులో జరుగుతున్న అనుకూల పరిణామంగా భావించవచ్చు.

    అయితే పరిస్థితులు అలా అనిపిస్తున్నప్పటికీ మధ్యంతర ఎన్నికలు గనుక వస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అంశం వెనక్కి పోయినా ఆశ్చర్యం లేదు. అమెరికాతో అణు ఒప్పందం విషయంలో వామపక్షాల ఒత్తిడి, రామసేతు వివాదం లోకసభ మధ్యంతర ఎన్నికలకు కాంగ్రెసును తొందరపెట్టే అవకాశం ఉంది. ఈ స్థితిలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుపై నిర్ణయమేమీ తీసుకోకుండానే ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. అలా ఎన్నికలు జరిగితే తెలంగాణనే రాష్ట్రం ఎన్నికల ఎజెండా అవుతుందని కాంగ్రెస్ కోస్తా పార్లమెంటు సభ్యుడు చేగొండి హరిరామజోగయ్య అంటున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుపై నిర్ణయం జరగకుండానే ఎన్నికలు వస్తాయని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయకుడు కె. చంద్రశేఖర రావు అంచనా వేస్తున్నారు. ముఖ్యమంత్రి హడావిడి, పథకాల ప్రకటన చూస్తుంటే అసెంబ్లీకి కూడా గడువు కన్నా ముందే ఎన్నికలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ స్థితిలో ఎన్నికలు వస్తే తెలంగాణ ఎన్నికలు అంశం కావడం ఖాయం.

    తెలంగాణ రాష్ట్రం ఏర్పడకుండా ఎన్నికలు వస్తే తమ గెలుపు ఖాయమని తెలుగుదేశం పార్టీ ధీమాతో ఉంది. తెలంగాణలోని తెలుగుదేశం నాయకులు కూడా అదే ధీమాతో ఉన్నారు. తెలంగాణ అంశంపై రాజకీయాలు రెండు మూడ శిబిరాలుగా ఉన్నాయి. కాంగ్రెసులోని తెలంగాణ నాయకులు తెలంగాణ ఏర్పడకపోతే తాము మట్టి కొట్టుకుపోవడం ఖాయమని బహిరంగంగానే అంటున్నారు. అది తమకు లాభిస్తుందని తెలుగుదేశం పార్టీ భావిస్తూ ఉండవచ్చు. కొంత మేరకు అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే కరీంనగర్ లోకసభ ఎన్నిక ఫలితం పునరావృతం అవుతుందనే నమ్మికతో కెసిఆర్ ఉండవచ్చు. ఆయన అలా నమ్మడాన్ని పూర్తిగా కాదనలేం. అయితే విజయశాంతి, నరేంద్ర, గద్దర్ అనుచరులు జట్టు కట్టి తెలంగాణ ఎన్నికల బరిలోకి దిగే అవకాశాలున్నాయి. ఇది ఏ మేరకు ఫలితాన్ని సాధిస్తుందో చెప్పలేం. గద్దర్ ప్రత్యక్షంగా ఎన్నికల బరిలోకి దిగడానికి సిద్ధంగా లేరు. కానీ, విజయశాంతి, నరేంద్రలతో జట్టు కట్టే మరో ఫ్రంటుకు ఆయన అండదండలుంటాయి. ఓ వైపు తెరాస ఒంటరి పోరు, మరో వైపు తెలంగాణ ఫ్రంట్ వ్యతిరేకత తెరాసకు నష్టం చేస్తుందా అనే విషయంపై ఇప్పుడే నిర్ధారణకు రాలేం. అయితే ఈసారి తెలంగాణ శక్తులు ఓడిపోయి, తెలుగుదేశం పార్టీ గెలిస్తే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమానికి తీవ్రమైన విఘాతం కలగవచ్చు. ఈ ఆందోళనే కరీంనగర్ ఎన్నికలో తెరాసకు అనుకూలంగా భారీ ఫలితం వచ్చింది. ఇదే పునరావృతం అవుతుందని చెప్పడానికి కూడా వీలుంది.

    తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

    Oneindia బ్రేకింగ్ న్యూస్
    రోజంతా తాజా వార్తలను పొందండి

    X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more