• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

పరువు పోయె, ఫలితం లేదాయె

By కె. నిశాంత్
|
Google Oneindia TeluguNews

తెలంగాణ విషయంలో కాంగ్రెస్ నాయకులను నమ్మె పరిస్థితి పూర్తిగా పోయినట్లే. తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లు వ్యవహరించిన తీరు కాంగ్రెస్ నేతల నీతిని మరోసారి బయటపెట్టింది. తెలంగాణ రాష్ట్రం వచ్చే వరకు పోరాడుతామని ప్రకటించిన వారి ప్రకటనలు ప్రగల్భాలే అయ్యాయి. ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డికి వ్యతిరేకంగా సోనియా గాంధీ వద్ద తమ వాదనలు వినిపించడానికి మాత్రమే తెలంగాణ అంశాన్ని వారు ఎత్తుకున్నారనే అపవాదు నుంచి వారు బయటపడడం కష్టమే. ఢిల్లీ వెళ్లి తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిసే వరకు వారు గట్టిగానే ఉన్నారు. సోనియాను కలిసి తర్వాత ఏమైందో తెలియదు కానీ సీనియర్లు తలో మాట ఎత్తుకున్నారు. నల్లగొండ జిల్లా భువనగిరిలో తలపెట్టిన తెలంగాణ రణభేరీ సభ జరిగి తీరుతుందని వారు చెప్పారు. సభ విషయంలో కాంగ్రెస్ సీనియర్ శాసనసభ్యుడు ఉప్పునూతల పురుషోత్తమ రెడ్డి మరీ పట్టుగా ఉన్నట్లు కనిపించారు. కానీ ఢిల్లీ వెళ్లి వచ్చిన తర్వాత ఉదయం చెప్పిన మాటకు, సాయంత్రం మాట్లాడిన మాటకు పొంతన లేకుండా పోయింది. భువనగిరి సభ నిర్వహిస్తామని ఉదయం చెప్పిన ఆయన సభను వాయిదా వేస్తున్నట్లు సాయంత్రం చెప్పారు.

పురుషోత్తమరెడ్డి సభను వాయిదా వేయడంపై సీనియర్ పార్లమెంట్ సభ్యుడు జి. వెంకటస్వామి గుర్రుమన్నారు. ఇరువురి మధ్య విభేదాలు రచ్చకెక్కాయి. దాంతో సీనియర్ల మధ్య విభేదాలు ముదిరి ఐక్యతకే భంగం ఏర్పడి తెలంగాణ అంశం మీద పోరాటం అటకెక్కింది. తెలంగాణ సీనియర్లు కోరుకున్నది అదేనా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. తెలంగాణ అంశంపై ఏఐసిసి కోర్ కమిటీలో చర్చిస్తామని సోనియా హామీ ఇచ్చినట్లు చెప్పారు. అయితే కోర్ కమిటీలో తెలంగాణ అంశమే చర్చకు రాలేదని సోనియా రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ చెప్పారు. నిజానికి, సీనియర్లలో అంతకు ముందు నుంచే విభేదాలు బయటపడుతూ వస్తున్నాయి. భువనగిరి సభ విషయంలో సీనియర్ కాంగ్రెస్ శాసనసభ్యుడు ఎం. సత్యనారాయణ రావు నిరాసక్తతను ప్రదర్శిస్తూ వస్తున్నారు. సభను రద్దు చేసుకోవాలని పార్లమెంటు సభ్యుడు వి. హనుమంతరావు సీనియర్లకు సూచిస్తూ వచ్చారు. సీనియర్లతో చెట్టాపట్టాల్ వేసుకుని తిరిగిన మరో పార్లమెంటు సభ్యుడు సర్వే సత్యనారాయణ తన విధేయతలు మార్చి భువనగిరి సభ నిర్వహణను వ్యతిరేకించారు. ఇదంతా సభా నిర్వాహకులకు చిరాకు కలిగించే విషయమే.

ఇకపోతే, సోనియా సీనియర్లతో భేటీకి అంగీకరించి వారితో మాట్లాడారు. అయితే ఆమెతో ఏం మాట్లాడారనే విషయం బయటకు రాలేదు. తాము చెప్పాల్సిందంతా చెప్పామని అంటూ తెలంగాణకు సోనియా అనుకూలంగా ఉన్నారనే పాత మాటనే కొత్త మాటగా వినిపించే ప్రయత్నం చేశారు. కోర్ కమిటీలో తెలంగాణపై చర్చిస్తామని ఆమె హామీ ఇచ్చారనేదే కొత్తగా వినిపించిన మాట. అయితే చర్చ జరగలేదు. దీన్ని బట్టి నిజంగానే సోనియా సీనియర్లకు ఆ హామీ ఇచ్చారా అనే అనుమానం తలెత్తడం సహజం. ఇప్పుడు ఈ విభేదాలను ఆసరాగా తీసుకుని కొంత కాలం వరకు తెలంగాణపై మౌనవ్రతం పడుతానని జి. వెంకటస్వామి సౌకర్యంగా పక్కకు తప్పుకునేందుకు సిద్ధపడ్డారు. తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పేసి చేతులు దులుపుకున్నారు. పురుషోత్తమ రెడ్డి లేనంత మాత్రాన, ఆయన ద్రోహం చేసినంత మాత్రాన పోరాటాన్ని సాగించలేని అశక్తతలో వెంకటస్వామి ఉన్నారా. పురుషోత్తమరెడ్డి పక్కకు తప్పుకున్నా పోరాటాన్ని కొనసాగించే వీలుంది. అంటే పోరాడే మనసు లేదని అనుకోవాల్సి ఉంటుంది.

ఇలా సీనియర్లు తోక ముడవడానికి సోనియా గాంధీ చీవాట్లు పెట్టడమే కారణమని అంటున్నారు. తెలంగాణ అంశం తమ పరిశీలనలో ఉందని, ఇటువంటి సమయంలో ప్రతి రోజూ ఏదో రూపంలో ప్రకటనలు చేస్తూ ఒత్తిడి తేవడం వల్ల పార్టీకి నష్టం చేస్తున్నారని ఆమె అన్నట్లు ప్రచారం జరుగుతోంది. మీకు ఏం తక్కువ చేశామని అలా నోరు పారేసుకుంటున్నారని ఆమె అడిగినట్లు తెలిసింది. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)ను బలోపేతం చేయడానికి పని చేస్తున్నట్లుందని కూడా అన్నారని చెబుతున్నారు. సోనియా సీనియర్లను చీవాట్లు పెట్టిన విషయం ఎంత వరకు నిజమో గానీ, హస్తినకు వెళ్లితే అంతే అవుతుందని సత్యనారాయణ రావు అన్న మాటల్లో ఏదో గూడార్థం ఉందనే అనుకోవాల్సి ఉంటుంది. ఈ సంఘటన వల్ల కాంగ్రెస్ సీనియర్ల చిత్తశుద్ధిపై, నిజాయితీపై తెలంగాణ ప్రజల్లో మరోసారి అనుమానాలు బలపడ్డాయి.

English summary
K Nishanth on Congress Telangana Seniors attitude
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X