వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎస్సార్సీ కొరవి

By కె. నిశాంత్
|
Google Oneindia TeluguNews

తెలంగాణ ఏర్పాటుకు రెండో రాష్ట్రాల పునర్విభజన కమిషన్ (రెండో ఎస్సార్సీ)ని వేయాలనే కాంగ్రెస్ నిర్ణయం భిన్నాభిప్రాయాలకు తావు ఇచ్చింది. తెలంగాణ కాంగ్రెస్ నాయకుల్లో తీవ్ర ఆందోళన మొదలు కాగా, తెలుగుదేశం పార్టీలో కాస్తా ఊరట కనిపిస్తున్నది. రెండో ఎస్సార్సీ వేయాలనే నిర్ణయం కాంగ్రెసు పాలిట భస్మాసుర హస్తమే కానుంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఈ ప్రాంత ప్రజలు నిర్ద్వంద్వంగా ఆశిస్తున్నారనేది తేటతెల్లమైంది. ఈ పరిస్థితిలో మూడున్నర ఏళ్లు కాలయాపన చేసి కాంగ్రెస్ ఈ నిర్ణయం తీసుకోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు నిర్ణయం తీసుకుని అందుకు ఆచరణలో సిద్ధపడితే తప్ప కాంగ్రెసును ఈ ప్రాంత ప్రజలు నమ్మే స్థితి లేదు. కాంగ్రెస్ నిర్ణయం వల్ల తెలుగుదేశం పార్టీ కాస్తా కూస్తో లాభపడే అవకాశం ఉంది. కాంగ్రెసుకు తెలంగాణ ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతుందనేది కాదనలేని వాస్తవం. కాంగ్రెస్ నష్టపోవడం వల్ల తాము లాభపడుతామని తెలుగుదేశం పార్టీ భావిస్తున్నది. ఇందులో కొంత వాస్తవం కూడా ఉంది. అదే సమయంలో తిరుగులేని విధంగా తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) లాభపడే అవకాశాలున్నాయి.

తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు విద్యార్థులను తెలంగాణ అంశాలపై విద్యార్థులను చైతన్యవంతులను చేసే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు విద్యార్థులకు 45 శిక్షణా తరగతులు నిర్వహించారు. ఇది వచ్చే ఎన్నికల్లో తెరాసకు గణనీయంగా ఉపయోగపడుతుంది. గద్దర్ వంటి నాయకులు కె. చంద్రశేఖరరావుకు వ్యతిరేకంగా ఉన్నారు. బిజెపి కూడా తెరాసను తిట్టిపోస్తున్నది. ఇది తెరాసకు నష్టం చేసే అవకాశం తక్కువ ఉంటుంది. తెలంగాణ ఆకాంక్షను తిరుగులేకుండా వ్యక్తం చేయడానికి ప్రజలు సిద్ధపడి ఉన్నారు. అందువల్ల కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు తగిన పోటీనిచ్చే తెరాస వైపై ప్రజలు మొగ్గు చూపుతారనడంలో సందేహం లేదు. కెసిఆర్ పై ఇష్టం ఉన్నా లేకపోయినా జరిగేది అదే.

తెలంగాణ నినాదాన్ని ఎత్తుకున్నా బిజెపికి ప్రజల నుంచి మద్దతు లభించడం కష్టమే. అదే విధంగా బియస్పీ అధినేత మాయావతి హామీ కూడా ఇక్కడి ప్రజలను పెద్దగా ఆకర్షించే అవకాశాలు లేవు. తాము అధికారంలోకి వస్తే తెలంగాణను ఏర్పాటు చేస్తామని ఆమె హామీ ఇచ్చారు. బిజెపి కూడా అదే మాట అంటున్నది. బిజెపి ఏమో కానీ బియస్పీ ఇప్పటికిప్పుడు కేంద్రంలో అధికారంలోకి వస్తుందనే నమ్మకం ప్రజల్లో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో లేదు. ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ఘోరంగా దెబ్బ తింటే కేంద్రంలో బిజెపి నాయకత్వంలో ఎన్డీఎ ప్రభుత్వం ఏర్పడే అవకాశం ఉంది. పరిస్థితులు ఇందుకు అనుగుణంగానే ఉన్నాయి. కాంగ్రెస్ చేజేతులా తెలంగాణ కొరివితో తల గోక్కుంటున్నది. ఇది కేంద్రంలో కాంగ్రెసును అధికారంలోకి రాకుండా అడ్డుకునే స్థాయిలో ఉండవచ్చు. రాష్ట్రాభివృద్ది మంత్రం వచ్చే ఎన్నికల్లో తమకు ఉపయోగపడుతుందని ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి చెప్పుకుంటున్నారు. గుజరాతులో నరేంద్ర మోడి విజయం ఆయనకు ఆ నమ్మకాన్ని కలగజేస్తే చేయవచ్చు. కానీ గుజరాతు పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో లేదు. తెలంగాణ ఆకాంక్ష అన్నిఅంశాలను పక్కనపెట్టేంత బలంగా ఉంది. ఈ విషయాన్ని తెలంగాణ కాంగ్రెస్ నాయకులే చెబుతున్నారు.

ఇకపోతే, చిరంజీవి రాజకీయ పార్టీ పెడితే కూడా కాంగ్రెస్ ఘోరంగా దెబ్బ తినే పరిస్థితులున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ తో పాటు తెలుగుదేశం కూడా చిరంజీవి పార్టీ పెడితే తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఉంది. తెలంగాణ రాష్ట్ర సమితిపై కూడా ఆ ప్రభావం ఉంటుంది. కానీ అది అంత తీవ్రస్థాయిలో ఉండదని ఒక తెలుగుదినపత్రిక నిర్వహించిన సర్వేలో బయటపడింది. చిరంజీవి వచ్చినా తెలంగాణ ఆకాంక్షను పక్కన నెట్టేసి తిరుగులేని ఆధిక్యతను తెలంగాణలో ప్రదర్శించే అవకాశం లేదు. నిజానికి, వామపక్షాలు చిరంజీవి ఆగమనానికి ఎదురు చూస్తున్నాయి. తెలంగాణ అంశాన్ని దెబ్బ తీయడం కూడా వాటి ఎజెండాలో ఉండడం వల్లనే చిరంజీవిని ఆహ్వానిస్తూ ఉండవచ్చు. చిరంజీవి వస్తే రాష్ట్రంలో హంగ్ ఏర్పడవచ్చు. అది తెరాసకు బాగా ఉపయోగపడుతుంది. దీనివల్ల రాష్ట్రంలో అనిశ్చిత రాజకీయ వాతావరణం చోటు చేసుకుంటుంది.

మొత్తం మీద, తెలంగాణ విషయంలో రెండో ఎస్సార్సీకే కట్టుబడి ఉంటే కాంగ్రెస్ కోలుకోలేనంతగా దెబ్బ తింటుంది. పార్టీని నిలబెట్టుకోవాలంటే కాంగ్రెసు తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధం కావడం తప్ప మరో మార్గం లేదు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X