• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఉప ఎన్నికల హోరు

By కె. నిశాంత్
|
Google Oneindia TeluguNews

రాష్ట్రాన్ని ఉప ఎన్నికల వేడి తాకింది. సాధారణ ఎన్నికలు గడువు కన్నా ముందుగా జరగవని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి సోమవారం నిర్వహించిన తెలంగాణ మంత్రుల సమావేశం స్పష్టంగానే తెలియజేసింది. గడువు మేరకే ఎన్నికలు జరుగుతాయని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ మంగళవారం పార్లమెంటరీ పార్టీ సమావేశంలో స్పష్టం చేశారు. ఉప ఎన్నికలు జరుగుతాయని ఎన్నికల కమీషన్ తెలిపింది. దీంతో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) రాజీనామా చేసిన 4 లోకసభ స్థానాలకు, 16 శాసనసభా స్థానాలకు ఉప ఎన్నికలు ఖాయమైపోయినట్లే. వీటితో పాటు శాసనసభ్యుల మృతి వల్ల ఖాళీ అయిన రాష్ట్రంలోని తెర్లాం, ఖైరతాబాదు స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతాయి.

రాజీనామా చేసిన స్థానాల్లో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ఇప్పటికే తన బలాన్ని చాటుకునేందుకు, ఓటర్ల మద్దతును పొందడానికి కృషి మొదలు పెట్టింది. రాజీనామా చేసినవారికే టికెట్లు ఇస్తామని తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు ప్రకటించడంతో వారు తమ తమ నియోజకవర్గాల్లో తిరుగుతున్నారు. కాంగ్రెసుకు మాత్రం అభ్యర్థుల కరువు తీవ్రంగానే ఉంది. తెలంగాణ సెంటిమెంటు బలంగా ఉందని, తెరాస ఆ స్థానాల్లో తిరిగి గెలవడం ఖాయమని కాంగ్రెసులోని తెలంగాణవాదులు గట్టిగానే చెబుతున్నారు. అయితే తెరాసను అడ్డుకునేందుకు ముఖ్యమంత్రి మంత్రులను ఇంచార్జీలుగా వేశారు. ఈ ఎన్నికలు తెరాసకే కాకుండా ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డికి వ్యక్తిగతంగా ప్రతిష్టాత్మకమైనవి. ఈ స్థానాల్లో కాంగ్రెస్ పాగా వేయకపోతే కాంగ్రెసులో తెలంగాణ వాదం మరింత బలం పుంజుకునే అవకాశం ఉంది.

ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీ కూడా అభ్యర్థుల వేటలో పడింది. కొన్ని చోట్ల తెలుగుదేశం పార్టీకి బలమైన అభ్యర్థులే ఉన్నప్పటికీ తెలంగాణ ఆకాంక్ష తీవ్రత ముందు నిలబడుతారా అనేది ప్రశ్నార్థకంగానే మారింది. స్టేషన్ ఘనపూర్ నుంచి కడియం శ్రీహరి పోటీ చేయడం అనుమానంగానే ఉంది. తెలంగాణ అనుకూలంగా పార్టీ నిర్ణయం తీసుకుంటే మాత్రమే ఆయన పోటీ చేయవచ్చు. లేదంటే ఆయన పోటీ నుంచి తప్పుకోవచ్చు. నిజానికి గత ఎన్నికల్లో కాంగ్రెసుతో తెరాస పొత్తు పెట్టుకుని తెలుగుదేశం పార్టీ బలంగా ఉన్న స్థానాలను తీసుకుంది. అలా తీసుకుని కడియం శ్రీహరి, ముత్యంరెడ్డి వంటి హేమాహేమీలను ఓడించింది. తెరాస నుంచి పోటీ చేసినవారు రాజకీయాలకు కొత్తవారు, రాజకీయ జీవితాన్ని చాలించే దశలో ఉన్నవారు. ఈటెల రాజేందర్, సోలిపేట రామలింగారెడ్డి, హరీష్ రావు వంటి కొత్త ముఖాలు తెరాస కారణంగా శాసనసభలో అడుగు పెట్టారు. రాజకీయాలకు దాదాపు దూరమైన పరిస్థితిలో ఉన్న విజయరామారావు, సంతోష రెడ్డి వంటివారికి తెరాస రాజకీయంగా కొత్త జీవితాన్ని ఇచ్చింది. ఇప్పుడు కూడా పాతవారే 16 స్థానాల్లో అభ్యర్థులు కావడంతో తెరాసలో అభ్యర్థుల విషయంలో అయోమయం లేదు. తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు అభ్యర్థుల కోసం అన్వేషించాల్సిన పరిస్థితిలో పడ్డాయి. తెలుగుదేశం పార్టీకి ఇ. పెద్దిరెడ్డి, దామోదర్ రెడ్డి వంటి రాజకీయ ప్రాబల్యం గల నాయకులు అందుబాటులో ఉన్నారు. కాంగ్రెసుకు ఆ పరిస్థితి కూడా లేదు. ఇంచార్జీలుగా నియమితులైన మంత్రుల్లో డి. శ్రీనివాస్, కె. జానారెడ్డి వంటి ఇద్దరు ముగ్గురు తప్ప మిగతా మంత్రులెవరూ పెద్దగా ప్రభావం చూపేవారు కారు. ఇది కూడా కాంగ్రెసుకు గడ్డు పరిస్థితిలనే కల్పించవచ్చు.

ఆదిలాబాద్, కరీంనగర్, హన్మకొండ, వరంగల్ లోకసభ స్థానాల్లో తెరాస బలంగానే ఉంది. శాసనసభ్యుల్లో నాయని నర్సింహారెడ్డి (ముషీరాబాద్), లక్ష్మారెడ్డి (జడ్చర్ల), జి. నగేష్ (ఆలేరు) కాస్తా బలహీనంగా ఉన్నట్లు ఒక దినపత్రిక సర్వేలో వెల్లడైంది. అయితే తెలంగాణ సెంటిమెంటు మాత్రం అన్ని నియోజకవర్గాల్లో బలంగా ఉన్నట్లు ఆ సర్వే తెలియజేసింది. అభ్యర్థులపై కొంత మేరకు ఓటర్లలో అసంతృప్తితో ఉన్నప్పటికీ తెలంగాణ ఆకాంక్ష తీవ్రత బలంగా ఉందని, దాని వల్ల తెరాసకు విజయం ఖాయమని ఆ సర్వే వెల్లడించింది. అయితే కాంగ్రెస్ రెండో స్థానంలో ఉండగా, తెలుగుదేశం మూడో స్థానంలో ఉన్నట్లు సర్వే ఫలితం వెలువడింది. ఈ సర్వే ఫలితాలు తారుమారు చేశారని అనుకోవడానికి కూడా లేదు. ఆ పత్రికకు తెలుగుదేశం అనుకూల పత్రికగా పేరుంది. ఆ విషయాన్ని పలు సందర్భాల్లో ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డే అన్నారు. అందువల్ల సర్వేను నమ్మడానికి వీలుందని అంటున్నారు.

రాజీనామాలతో తెరాస ప్రతినిధుల ప్రతిష్ట పెరిగిందనేది నిజం. అది విజయానికి ఉపయోగపడుతుందని కూడా చెప్పవచ్చు. ఒక రకంగా రాజీనామాలతోనే తెరాస మిగతా పార్టీలపై కొంత మేరకు నైతిక విజయం సాధించింది. ఇక సాధించాల్సింది ప్రజల మద్దతే. తెలంగాణ ప్రజలు తెలంగాణ రాష్ట్రాన్ని కోరుకుంటున్నారనేది వాస్తవం. తెలంగాణ ఆకాంక్ష తీవ్రత నివురు గప్పిన నిప్పులా ఉంది. అది ఉప ఎన్నికల్లో తీవ్రంగానే బయటపడవచ్చు.

English summary
K Nishanth coming bye election
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X