వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏదైనా కెసిఆర్ దే బాధ్యత

By కె. నిశాంత్
|
Google Oneindia TeluguNews

తెలంగాణపై కాంగ్రెసును ఇరకాటంలో పెట్టే పనికి తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) పూనుకుంది. తెలంగాణపై తీర్మానం చేయాలని డిమాండ్ చేస్తూ శాసనసభా కార్యక్రమాలను స్తంభింపజేసే పనికి తెరాస శాసనసభ్యులు నడుం బిగించారు. ఇందులో భాగంగా బుధవారం తెరాస శాసనసభ సమావేశాలను స్తంభింపజేసింది. ఈ కారణంగా సభను స్పీకర్ వాయిదా వేయాల్సి వచ్చింది. తాము రోజూ ఇదే విధంగా వ్యవహరిస్తామని తెరాస శాసనసభ్యులు చెబుతుండగా, మొదటి రోజు కాబట్టి వదిలేశామని, రేపటి నుంచి వారిని సస్పెండ్ చేసి సభా కార్యక్రమాలు సాగిస్తామని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి, శాసనసభా వ్యవహారాల మంత్రి కె. రోశయ్య చెప్పారు. ఇక రేపటి నుంచి శాసనసభలో జరగబోయేదేమిటో అర్థం చేసుకోవచ్చు.

ఆ విషయం అలా ఉంచితే, తెలంగాణపై కాంగ్రెస్ వైఖరికి నిరసనగా మార్చి 6వ తేదీన రాజీనామాలు చేయాలని తెరాస మొదట నిర్ణయించుకుంది. అయితే ఆ గడువు కన్నా ముందే రాజీనామా చేయాలని ఇప్పుడు భావిస్తున్నది. ఇందుకు సంబంధించిన విధివిధానాలను తెలియజేయాలని తెరాస సభ్యులు స్పీకర్ సురేష్ రెడ్డిని కోరారు. ఆయన ఈ విషయమై తెరాస సభ్యులకు తెలియజేస్తారు. దాని ప్రకారం తెరాస సభ్యుల రాజీనామాల వ్యవహారం ఉంటుంది. రాజీనామా చేసినప్పుడు సభ్యుడికి అర గంట సేపు మాట్లాడడానికి సభలో అనుమతి ఉంటుంది. ఒకేసారి మూకుమ్మడిగా రాజీనామాలు చేయాలా, ఒకరి తర్వాత ఒకరు రాజీనామాలు చేయాలా అనే విషయంపై స్పీకర్ విధివిధానాలను తెలియజేసిన తర్వాత నిర్ణయించుకుంటారు. తెరాసకు అసమ్మతి సభ్యులు పోను 16 మంది శాసనసభ్యులు ఉన్నారు. ముగ్గురు ఎమ్మెల్సీలు కూడా రాజీనామాలు చేస్తారు. పార్లమెంటులోనూ తెరాస ఇదే వ్యూహాన్ని అనుసరించనుంది.

రాజీనామాలు చేసి ఉప ఎన్నికలను ఆహ్వానించి తిరిగి గెలిచి తెలంగాణ ఆకాంక్ష తీవ్రతను కాంగ్రెసుకు రుచి చూపించాలనేది తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు వ్యూహం. అయితే ఉప ఎన్నికలను ఆహ్వానిస్తే తిరిగి గెలవడం అంత సులభమైందా అనేది ప్రశ్ననే. అయితే తిరిగి గెలవగలమనే ధీమా ఉండడం వల్లనే ఆయన అందుకు సిద్ధపడ్డారని అనుకోవాలి. ఒకవేళ గెలవకపోతే ఎదురయ్యే పరిస్థితి ఏమిటో ఆయనకు తెలియంది. కాదు. తెలంగాణ ఆకాంక్ష లేదనే ప్రచారం తీవ్రం కావడంతో పాటు తెరాసకే కాకుండా వ్యక్తిగతంగా చంద్రశేఖరరావుకు కూడా తీవ్రమైన ఇబ్బందులు ఎదురవుతాయి. ఒక రకంగా కెసిఆర్ కత్తి మీద సాముకు సిద్ధపడ్డారని అనుకోవాలి. కరీంనగర్ లోకసభ ఉప ఎన్నికలో గెలిచిన తర్వాత తెరాస నైతిక బలం పెరిగింది. ప్రస్తుతం రాజీనామాలు చేయడం వల్ల వచ్చే ఉప ఎన్నికల్లో గెలిస్తే ఆ నైతిక బలం మరింత పెరగడమే కాకుండా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని ఆలోచనలో పడేసే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డికి అనుకూలంగా వ్యవహరిస్తూ తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న తెలంగాణ కాంగ్రెస్ శాసనసభ్యులు, మంత్రులు పునరాలోచనలో పడ్తారు. తెరాస తిరిగి ఆ సీట్లను గెలుచుకోగలిగితేనే తెలంగాణ ఆకాంక్షకు మరింత బలం చేకూరుతుంది. లేకుంటే పరిస్థితిని ఊహించడం కూడా కష్టమే.

ఉప ఎన్నికల్లో ఓడిపోతే పోటీ చేసే తెరాస నాయకులకు వ్యక్తిగత నష్టం ఏమీ లేదు. రాజీనామాల వ్యవహారం, ఉప ఎన్నికలను ఆహ్వానించడం అంతా చంద్రశేఖరరావే. ఉప ఎన్నికల్లో జయాపజయాలకు బాధ్యత వహించాల్సి వచ్చేది చంద్రశేఖరరావే. ఈ విషయం ఆయనకు తెలియంది కాదు. అయినా ఆయన ఈ సాహసానికి ఒడిగట్టారంటే తెలంగాణ ప్రజల నాడి, తెలంగాణ ఆకాంక్షలను ఆయన అంచనా వేసి ఉంటారనే అనుకోవాల్సి ఉంటుంది. ఏమైనా ప్రస్తుత పరిణామాలకు కెసిఆరే స్వయంగా, వ్యక్తిగతంగా బాధ్యత వహించాల్సి ఉంటుంది. కాంగ్రెసు ద్రోహాన్ని ఎండగట్టడం, తన నైతిక బలాన్ని పెంచుకోవడమనే రెండు అంశాలకు ఆయన ప్రాధాన్యం ఇస్తున్నారు. ఒకవేళ ఆయన వ్యూహం బెడిసికొడితే పార్టీలో కూడా విభేదాలు వచ్చి, ఆయనను పార్టీలోనివారే తప్పు పట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇది ఆయన ఎదుర్కునే మరో సమస్య. ఇది కూడా ఆయన అంతరంగంలో ఉండే వుంటుంది. రాజకీయ చతురతలో కెసిఆర్ ను మించినవారు లేరని ఇప్పటి వరకు అందరూ అనుకునే మాట. ప్రస్తుతం వ్యూహం తాను అనుకున్న ప్రకారం అమలై, ఫలితాలు సాధిస్తే కెసిఆర్ కు తిరుగు ఉండదు. లేకుంటే ఆయన పరిస్థితి ఎలా ఉంటుందని చెప్పడం కూడా కష్టమే.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X