వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ సకల జనుల సంక్షేమ కాంక్ష

By కె. నిశాంత్
|
Google Oneindia TeluguNews

Telangana
తెలంగాణ సాధన కోసం సకల జనుల సమ్మెకు పురుడు పోస్తున్న సమయంలో ఓ కీలకమైన అంశం వెలుగులోకి వచ్చింది. అది ప్రస్తుత శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ వ్యవహారం. తెలంగాణ శాసనసభ్యుల రాజీనామాలను తిరస్కరించడానికి, ప్రస్తుతం వివాదంగా మారిన వ్యవహారానికి మూలం ఒక్కటేనా అనే ఆలోచన వచ్చి తీరుతుంది. తెలంగాణ శాసనసభ్యుల రాజీనామాలను తిరస్కరించడంలోని పరిణామాన్ని వేరుగా చెప్పాల్సిన అవసరం లేదు. అది అందరికీ అర్థమయ్యే విషయమే. కాంగ్రెసు పార్టీ అధిష్టానం ఆలోచనలకు అనుగుణంగా వ్యవహారాలు నడుస్తూ ఉంటాయని విడిగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం 2009 డిసెంబర్ 9వ తేదీన ప్రకటించిన తర్వాత సీమాంధ్రుల రాజీనామాలకు భూమి తలకిందులైందని భావించే వాతావరణాన్ని సృష్టించి, ప్రకటనను వెనక్కి తీసుకున్న ఘనత కాంగ్రెసు పార్టీ అధిష్టానానికే దక్కుతుంది. కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకున్నా అది కాంగ్రెసు అధిష్టానం తీసుకున్నట్లే. పార్టీ అధిష్టానం, చెప్పాలంటే పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అలోచనల మేరకే ప్రభుత్వం గానీ పార్టీ గానీ నడుస్తుందనేది అందరికీ ఎరుకున్న విషయమే. ఆ విషయం అలా పెట్టి ప్రస్తుతానికి వద్దాం.

తెలంగాణపై డిప్యూటీ స్పీకర్గా ఉన్నప్పుడు నాదెండ్ల మనోహర్ అమెరికా కాన్సులేట్కు తెలిపిన విషయాలను వికీలీక్స్ బయటపెట్టింది. తెలంగాణ ఉద్యమానికి నక్సలైట్లతో సంబంధం ఉందని ఆయన వెల్లడించినట్లు వికీలీక్స్ వెల్లడించింది. అంతేకాదు, తెలంగాణ విద్యార్థుల జెఎసిలో 30 ఏళ్లు దాటిన తెలంగాణ దళిత విద్యార్థులున్నారని ఆయన చెప్పారని వికీలీక్స్ బయటపెట్టింది. వాటిని నాదెండ్ల మనోహర్ కొట్టిపారేస్తున్నారు. వికీలీక్స్ విశ్వసనీయత ప్రపంచానికంతా తెలుసు. మనోహర్ కాదన్నా నమ్మే పరిస్థితి ఉండదు. అంటే, తెలంగాణ కోసం సకల జనుల సమ్మె ప్రారంభమవుతున్న క్రమంలో మనోహర్ వ్యాఖ్యలు బయటకు రావడం తెలంగాణ ప్రజలకు సీమాంధ్ర నాయకులను మరింతగా అర్థం చేసుకోవడానికి పనికి వస్తుంది. సీమాంధ్ర నాయకులు నక్సలైట్ల పేరు చెప్పి తెలంగాణ ఉద్యమాన్ని తప్పు పట్టడానికి, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం మరోటి అవసరం లేదు.

సకల జనుల సంక్షేమం సీమాంధ్ర నాయకుల అభీష్టమైతే సకల జనుల సమ్మె దాకా తెలంగాణ ఉద్యమం ఎందుకు సాగిందని గానీ నక్సలైట్ ఉద్యమానికి వెనక గల మూలాలూ నేపథ్యమూ ఏమిటని గానీ ఆలోచించి ఉండేవారు. ఇంతదాకా, తెలంగాణవాళ్లందరినీ నక్సలైట్లుగానో, కోపిష్టులుగానో జత కడుతూ తెలంగాణ పాలక వర్గాలకే తెలంగాణ ప్రజలను దూరం చేసిన ఖ్యాతి సీమాంధ్ర పాలకవర్గాలకు దక్కుతుంది. నిజంగానే నక్సలైట్ ఉద్యమానికి మూలాలనూ నేపథ్యాలనూ పరిశీలించి, సమస్యను పరిష్కరించదలుచకుంటే - సీమాంధ్ర ఆధిపత్యంలోని రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించే పద్ధతి గత 60 ఏళ్లుగా కొనసాగినట్లు ఉండేది కాదు. కోస్తాంధ్ర ప్రాంతంలోని గిరిజన ప్రాంతాల్లో, ఉత్తరాంధ్రలో, బీడు పడిన పల్నాడు వంటి ప్రాంతాల్లో, ఏదో ఒక మేరకు రాయలసీమలో నక్సలైట్ ఉద్యమానికి కూడా అవే మూలాలూ నేపథ్యమూ ఉఁదనే విషయాన్ని సీమాంధ్ర ఆధిపత్య పర్గాలు అంగీకరించాల్సి ఉంటుంది.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం 1969లో జరిగిన తెలంగాణ ఉద్యమం మోసపోకుండా ఉంటే, నక్సలైట్ ఉద్యమం తెలంగాణలో ఈ స్థాయిలో ఉండేదా అని వారు ప్రశ్నించుకోవాల్సి ఉంటుంది. హింసామార్గం తప్పితే నక్సలైట్ ఉద్యమం పెడుతున్న డిమాండ్లు అంగీకారయోగ్యమైనవి కావా అని ప్రశ్నించాల్సి ఉంటుంది. సరే, ఆ విషయాన్ని పక్కన పెడితే, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం మలి విడత ఊపందుకుని దశాబ్ద కాలంపైగానే గడిచింది. ఈ కాలంలో తెలంగాణ ఉద్యమం సాధించిన విజయాలు లేవా అని కూడా ప్రశ్నించుకోవాల్సి ఉంటుంది. మౌలికంగా అనేక విజయాలను తెలంగాణ ఉద్యమం సాధించింది. కె. చంద్రశేఖర రావు తెలంగాణ రాష్ట సమితి (తెరాస)ని ఏర్పాటు చేయడం ఉద్యమ ఫలితమే. అంటే, తెలంగాణలో సీమాంధ్రుల కుట్రలనూ కుతంత్రాలనూ తిప్పికొట్టడానికి తెలంగాణ ప్రజలకు అంది వచ్చిన మొదటి అస్త్రం అది.

సీమాంధ్ర పాలక వర్గాలకు ఊడిగం చేస్తున్న తెలంగాణ పెత్తందార్లు, అధిపత్య కులాలూ వర్గాలూ ప్రశ్నించే ప్రతి తెలంగాణవాడిని లోపల పడేసే నిర్బంధపూరిత వాతావరణంలో తెరాస ఆవిర్భావం జరిగింది. ప్రజల గొంతుకు ప్రతినిధిగా నిలిచే రచయితలను కూడా పోలీసులు కటకటాల వెనక్కి నేట్టే తీవ్రమైన నిర్బంధ వాతావరణాన్ని అది ఛేదించింది. ప్రశ్నించే ఆయుధాన్ని తిరిగి ప్రజల చేతికి తెరాస అందించింది. తెలంగాణ పాలక పర్గాలకూ ప్రజలకూ మధ్య సంభాషణకు, ఘర్షణకు అవకాశం కల్పించింది. ఇవాళ్ల తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావును కూడా ప్రశ్నించే ఆయుధం తెలంగాణ ప్రజలకు అక్కడి నుంచే లభించింది. ఆ ఆయుధం ఇప్పుడు సీమాంధ్ర ఆధిపత్య, పాలక వర్గాలకు కంటగింపుగా మారింది. అందుకే, కెసిఆర్పై అంతగా దాడి జరుగుతోంది. కెసిఆర్ చేసిన తప్పులు ఉండవచ్చు గాక, కానీ స్వేచ్ఛాపూరిత వాతావరణాన్ని కల్పించి పెట్టిన కీర్తి మాత్రం ఆయనకే దక్కుతుంది. కెసిఆర్ను దెబ్బ తీయడానికి మరో ఆస్త్రాన్ని కూడా సీమాంధ్ర నాయకులు ప్రయోగిస్తున్నారు. కెసిఆర్ కుటుంబ సభ్యుల రాజ్యంగా తెరాస మారిందనేది ఆ వారు ప్రయోగించే అస్త్రం. నిజానికి, కుటుంబ పాలన పార్టీల్లో కొనసాగడానికి సీమాంధ్ర ఆధిపత్య వర్గాలూ కులాలూ ఎంతగా ప్రయత్నిస్తున్నాయో ఉదాహరణలు చెప్పవచ్చు.

ఒక విగ్రహాన్ని తయారు చేసి, దాని చుట్టూ కుటుంబ వారసత్వాన్ని, ప్రాబల్యాన్ని, తద్వారా సీమాంధ్ర పాలక, ఆధిపత్య, పెట్టుబడిదారు, పారిశ్రామిక వర్గాల ప్రయోజనాలను కాపాడడానికి సాగుతున్న ప్రయత్నాల్లో తాజా ఉదాహరణగా జగన్ వ్యవహారాన్ని చెప్పుకోవచ్చు. వైయస్ రాజశేఖర రెడ్డిని ఉత్తమోత్తమ పురుషుడిగానే కాదు, దైవంగా చిత్రీకరించి, నిలబెట్టేది ఎవరి కుటుంబాన్నో, ఏ కుటుంబ వారసత్వాన్నో మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే. స్వర్గీయ ఎన్టీ రామరావు వారసత్వం చుట్టూ ముప్పై ఏళ్లుగా సాగుతున్న తతంగాన్ని తెలుగు ప్రజలు అనుభవిస్తూనే ఉన్నారు. ఎన్టీరామారావును దైవస్వరూపుడిగా చేసి పెట్టారు. ఆ ఇద్దరు నాయకుల పేర్లతో ప్రజలను మభ్యపెట్టి వనరులను, సంబదను దోచుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయనేది నేటి పరిణామాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. సీమాంధ్రలో జిల్లాలవారీగా సామ్రాజ్యాలు ఏర్పాటు చేసుకున్న నాయకుల జాబితా కూడా బయటకు తీయాల్సిందే. ఆలా చూస్తే, తెలంగాణలో ఆ జాబితా లేదని చెప్పిలేం గానీ చాలా తక్కువగా ఉంటుందని మాత్రం కచ్చితంగా చెప్పవచ్చు.

ప్రపంచ బ్యాంక్ ఆదేశాలకు అనుగుణంగా వ్యవహరించే లక్షణాలు లేకపోవడం వల్లనే ఎన్టీ రామారావు పదవీచ్యుడు కావాల్సి వచ్చిందనేది భాషా ప్రయుక్త రాష్ట్రాల పేరిట తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకిస్తున్న సిపిఎం గుర్తించకపోవడం వెనక పనిచేస్తున్న ఆధిపత్య వర్గ, కుల స్వభావాన్ని అర్థం చేసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు, అందునా తెలంగాణ మేధావివర్గం అది ఏమంత కష్టం కాదు. ఎన్టీ రామారావును పదవీచ్యుతుడిని చేసి అధికారంలోకి వచ్చి తెలుగుదేశం పార్టీని, ప్రభుత్వాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకున్న చంద్రబాబు ఏం చేశారని అడిగితే, వైయస్ రాజశేఖర రెడ్డి పందేరానికి ప్రారంభం ఆయన నుంచే జరిగిందని చెప్పాల్సి ఉంటుంది. అగ్గువ సగ్గువకు తెలంగాణ భూములను, పరిశ్రమలను, ఇతర వనరులను ప్రైవేట్పరం చేసే క్రమంలో ప్రయోజనాలు పొందింది ఎవరో ఆరా తీస్తే గుట్టు బయటపడుతుంది. చట్టాల ఉల్లంఘన, అక్రమాలు జరిగాయనే విషయం మన బుద్ధికి అందకపోవచ్చు గానీ చంద్రబాబు లాబీ, సీమాంధ్రకు చెందిన ఆధిపత్య, అగ్రకుల సమాజం ఒక్కటి ఇవాళ్ల లాభపడిందనే విషయం సాధారణ బుద్ధికి అందుతుంది. చంద్రబాబు కొనసాగింపే వైయస్ రాజశేఖర రెడ్డి.

ఒక ప్రాంతీయ పార్టీ అధినేతగా చేయడానికి చంద్రబాబు కొన్ని విషయాల్లో వెనక్కి తగ్గి ఉండవచ్చు గానీ జాతీయ పార్టీ అండదండలతో తనకు తిరుగు ఉండదనే మితిమీరిన విశ్వాసంతో వైయస్ రాజశేఖర రెడ్డి చేసిన ఆగడాలు తెలంగాణ ప్రజలు అనుభవిస్తున్నారు. తెలంగాణలోని విలువైన భూములను, హైదరాబాదు పరిసరాల్లోని భూములను వైయస్ రాజశేఖర రెడ్డి పేరు చెప్పి, పులివెందుల పేరు చెప్పి కొల్లగొట్టిన వైనాలు ఉన్నాయి. ఈ రోజు ఆ గొంతులు బయటకు వస్తున్నాయి.. రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని గంజాయి వనంగా మార్చిన ఘనత కూడా వైయస్ రాజశేఖర రెడ్డిదే. ప్రభుత్వ పథకాలను ప్రకటించి, తన వర్గానికి చెందినవారు లాభపడే విధంగా వ్యవహరించి, చివరగా వైయస్ జగన్ ఆస్తులు పోగు పడడానికి చేసిన ప్రయత్నాలు వెర్రి తలలు వేశాయి. ఫ్యాబ్ సిటీ అందుకు ఓ ఉదాహరణ. తెలంగాణ ప్రాంతంలోనే కాదు, సీమాంధ్ర ప్రాంతాల్లోనూ ఓ బృహత్తరమైన ప్రాజెక్టు వైయస్ రాజశేఖర రెడ్డి నోటి వెంట జాలువారడానికి ముందే పెద్ద యెత్తున భూములు కొనేసి, ఆ ప్రాజెక్టును ప్రకటించిన వెంటనే కొండంత రేటును గోరంత చేసుకుని అమ్ముకుని లాభాలు గడించిన పెద్దలు ఎవరనే విషయం తేలాల్సే ఉంది. ఆ ప్రాజెక్టులు ఏ మేరకు రూపుదిద్దుకున్నాయి, సీమాంధ్రులు చెప్పినట్లు తెలంగాణ ప్రజలకు ఉపయోగపడే ప్రాజెక్టులు ఎన్ని వచ్చాయో కూడా సామాన్యుడికి కూడా తెలిసి వస్తున్నది. వైయస్ జగన్మోహన్ రెడ్డిపై సిబిఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసులు పెట్టడం వెనక ఏ రాజకీయామైనా ఉండవచ్చు గాక, కానీ సీమాంధ్ర పాలక వర్గాల దోపిడీ విధానాన్ని తెలియజేస్తున్నది. చట్టాలకు దొరకకుండా కూడా అటువంటి పనులు చేసి ఉండవచ్చు.

ప్రపంచ బ్యాంక్ పథకాలు కొత్త భూస్వామ్య వర్గాన్ని తయారు చేసి పెట్టాయి. వందల ఎకరాలు సొంతం చేసుకునే ఓ వెసులుబాటును కల్పించాయి.. ప్రత్యేక ఆర్థిక మండళ్ల పేరు మీద జరిగింది అదే. అతి ఎక్కువ సెజ్లకు అనుమతి పొందిన ఘనత వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వానికే దక్కుతుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారం, భూములను స్వవర్గం లాభం మూడు పువ్వులు ఆరు కాయలుగా విస్తరిల్లింది. వైయస్ జగన్ను రాజకీయంగా దెబ్బ తీయడానికి అదే ఒక పెద్ద ఆయుధంగా లభించింది. రాజశేఖర రెడ్డి గానీ, ఎన్టీ రామారావు గానీ సంక్షేమ పథకాలకు పెట్టిన ఖర్చు ఎంత, ఆ ఖర్చు ఎవరి జేబులోంచి వచ్చింది., ప్రజల నుంచి వసూలు చేసిన సొమ్ము సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు చేరింది ఎంత, వనరులనూ ప్రజలనూ దోచుకోవడం ద్వారా ప్రయోజనాలు పొందింది ఎవరు అనే విషయాలు తెలంగాణ ఉద్యమానికి ఆయువు పట్టు. ఈ ప్రశ్నలు సంధిస్తుండడం వల్లనే బహుశా, నక్సలైట్ల చర్చను సీమాంధ్ర నాయకులు ముందుకు తెస్తూ ఉండవచ్చు. నక్సలైట్ల చర్చ ముందుకు తెచ్చి వారు ఎవరిని భయపెడుతున్నారు, కేవలం కేంద్ర ప్రభుత్వాన్ని. ఒక రకంగా తప్పుడు విశ్లేషణల ద్వారా తమ ప్రయోజనాలను కాపాడుకునేందుకు తప్పుడు మార్గాలను వారు కేంద్ర ప్రభుత్వానికి సూచిస్తున్నారు.

వైయస్ జగన్ కోసం 29 మంది శాసనసభ్యులు రాజీనామాలు చేయడానికి ముందుకు రావడం వెనక ఉన్న రాజకీయాలు ఏమిటనేది కూడా ప్రశ్నించుకోవాల్సి ఉంటుంది. జగన్ కోసం 29 మంది శాసనసభ్యులు రాజీనామాలు చేస్తే, తెలంగాణ కోసం కాంగ్రెసు, తెలుగుదేశం శాసనసభ్యులు రాజీనామాలు చేస్తే చస్తారా అని కెసిఆర్ ప్రశ్నిస్తే తెలుగుదేశం తెలంగాణ నాయకులకు రోషం పొడుచుకొచ్చింది. అసలు చంద్రబాబు తెలంగాణకు అనుకూలమో, వ్యతిరేకమో తేలకుండా వారు తెలంగాణను ఎలా సాధిస్తారని, తెలంగాణ వ్యతిరేకి చంద్రబాబు నాయకత్వంలో తెలంగాణ ఎలా సాధిస్తారని అడిగితే తెలుగుదేశం తెలంగాణ నాయకులు ఏ విధమైన సమాధానం ఇస్తారో తెలంగాణ ప్రజలకు తెలియంది కాదు. అందుకే, రాజీనామాలు చేసి, తెలంగాణలో పర్యటించినా తెలుగుదేశం తెలంగాణ నాయకులు విశ్వసనీయతను పొందలేకపోయారు. తెలంగాణను సాధించడానికి ప్రస్తుత సంక్షోభం కన్నా మించిన సందర్భం ఉండదని తెలంగాణ కాంగ్రెసు శాసనసభ్యులకు తెలియదని కాదు, తెలిసీ వారు నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సమయంలో కాంగ్రెసు తెలంగాణ శాసనసభ్యులు రాజీనామాలు చేస్తే పరిస్థితి పూర్తిగా తెలంగాణకు అనుకూలంగా మారిపోతుందని తెలంగాణలోని పసి పోరడిని అడిగినా చెబుతాడు. నిజంగానే, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలనే చిత్తశుద్ధి తెలంగాణ కాంగ్రెసు నాయకులకు ఉంటే, వైయస్ జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యులు రాజీనామాలు చేసిన నేపథ్యంలో వారు కూడా రాజీనామాలు చేసి ఉండేవారు. తెలంగాణ సాధించుకున్న తర్వాత తమ తమ పార్టీలను కాపాడుకోవడానికి వారు ఏ నాటకాలైనా ఆడడానికి వీలుంటుందనేది వారు గ్రహించాల్సిన సందర్భం ఇది.

తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ కోదండరామ్పై సీమాంధ్ర నాయకులు విమర్శలు ఎక్కుపెడుతున్నారు. విశ్వవిద్యాలయ ఆచార్యగిరితో ఆయన వ్యక్తిగత జీవితం హాయిగా కాలు మీద కాలేసుకుని మూడు పూటలా పంచభక్ష్య పరమాన్నాలు తినడానికి సరిపోతుంది. అది చాలకపోతే, ప్రభుత్వ పెద్దల చుట్టూ చక్కర్లు కొట్టి ఏదో విధమైన అవార్డులను, ప్రతిష్టలను పెంచి పోషించుకోవచ్చు కూడా. అయితే, ఆయన ఈ తెలంగాణ సంక్షోభంలోకి ఎందుకు కాలు పెట్టారనే విషయం ఆలోచిస్తే, తెలంగాణ బౌద్ధిక జీవుల సామాజిక తపన, ప్రాపంచిక జ్ఞానం, సకల జనుల సంక్షేమ కాంక్షలను అర్థం చేసుకోవచ్చు. కోదండరామ్ దాటికి తట్టుకోలేని సీమాంధ్ర ఆధిపత్య, అగ్రకుల ప్రవక్తలు తెలంగాణలో సామాజిక తెలంగాణ కూర్పు గురించి మాట్లాడుతున్నారు. సామాజిక న్యాయం గురించి అడుగుతున్నారు. నిజానికి, ఇవాళ తెలంగాణ కావాల్సింది ఈ ప్రాంతంలోని దళిత, బహుజనులకు. తమ ప్రాంతంలో అక్కరకు రాని, అక్కరకు రావాల్సిన అవసరం లేని అగ్ర కులాల ఆధిపత్యం ఏ రీతిలో కొనసాగుతున్నదో ఎన్నడైనా విశ్లే,షించారా అని ప్రశ్నించాల్సి ఉంటుంది. ఇవాళ కేంద్రంలో పదవులు దక్కలేదని నిరసన గళాలు వినిపిస్తున్నది ఏ అగ్ర కుల నాయకులు, ఒకే కులానికి పదవులు ఇచ్చి అప్రతిష్టపాలై, విమర్శలు పాలు కాకుండా కాంగ్రెసు అధిష్టానం జాగ్రత్త పడుతున్న వైనం రేపు పేలబోయే అగ్నిపర్వతంలా ఉంది. రాయపాటి సాంబశివ రావు నిరసన గళం వెనక, కావూరి సాంబశివ రావు తాపత్యం వెనక, లడపాటి రాజగోపాల్ ఆరాటం వెనక దాగి ఉన్నది ఏమిటనేది కూడా ఆలోచించాల్సే ఉఁది. తెలంగాణను వ్యతిరేకిస్తున్న వీరు సీమాంధ్రలో పదవులు ఏ సామాజిక న్యాయం ప్రకారం పంచాలో చెప్పగలుగుతారా అని సీమాంధ్ర ప్రజలు, దళితులు, బహుజనులు ప్రశ్నించాల్సి ఉంటుంది. తెలంగాణలోని అగ్రకుల మేధావులు దళిత, బహుజన నాయకత్వాన్ని మనసారా ఆహ్వానిస్తున్నారు. దళిత ఉద్యమాన్ని బలపరిచిన మేధావుల జాబితా చూస్తే ఆ విషయం బయట పడుతుంది.

ఈ సందర్భంలోనే స్పీకర్ నాదెండ్ల మనోహర్ తెలంగాణపై చెప్పిన మాటలను వికీలీక్స్ బయటపెట్టిన విషయాన్ని మననం చేసుకోవాల్సి ఉంటుంది. తెలంగాణకు చెందిన అన్ని శాఖల ప్రభుత్వ ఉద్యోగులు ఓ వ్యక్తిగత ప్రయోజనాల కోసం, ప్రమోషన్ల కోసం, ఆర్థిక లాభాల కోసం సకల జనుల సమ్మెకు దిగడం లేదనే విషయాన్ని నిండు మనసుతో గ్రహించగలిగితే, అందులోని సకల జనుల సంక్షేమ కాంక్ష బయటపడుతుంది. ఒక నెల జీతం రాకపోతే ఓ కుటుంబం ఎంతగా విలవిలలాడుతుందో తెలియక వాళ్లు సమ్మెకు దిగడం లేదు. తమ వ్యక్తిగత ప్రయోజనాలను ఫణంగా పెట్టడమే కాదు. కుటుంబ జీవితాన్ని కూడా సంక్షోభంలోకి నెట్టి దిగుతున్నారని తెలుసుకోవాల్సి ఉంటుంది. తెలంగాణ కాంగ్రెసు, తెలుగుదేశం నాయకులు సకల జనుల సమ్మెకు సహకరించడం కాదు, వారే సమ్మెలోకి దిగాలి. తమ తమ పార్టీల అధిష్టానాలకు సహకరించడం మానేయాలి. అలా చేసినప్పుడు నిప్పులు గుండంలోకి దిగుతున్న తెలంగాణ ప్రజలను కాపాడినవారు అవుతారు. సీమాంధ్ర దళిత, బహుజన మేధావులు తమ తమ ప్రాంతంలోని ఆధిపత్య, అగ్ర కుల నాయకత్వాలను ప్రశ్నించాల్సిన సందర్భం కూడా ఇదే.

English summary
K Nishanth expressed his opinion about Telangana token strike and Telangana political leaders attitude.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X