వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణపై సోనియా పాతకథనే కొత్తగా..

By Pratap
|
Google Oneindia TeluguNews

Telangana
తెలంగాణ విషయంలో కొండ తవ్వి కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ ఎలుకను కూడా పట్టేట్లు లేరు. చర్చలు, శ్రీకృష్ణ కమిటీ, అఖిల పక్ష సమావేశాలు వంటి వ్యవహారాలతో ఇప్పటికే ఏళ్లు తీసుకున్న సోనియా గాంధీ పాత కథను కొత్తగా ముందు పెట్టి 2014 ఎన్నికలకు తొవ్వను సాఫ్ చేసుకునే పనిలో పడినట్లు కనిపిస్తున్నారు. ఇందులో భాగంగానే చట్టబద్దమైన తెలంగాణ ప్రాంతీయ మండలి ఏర్పాటు ప్రతిపాదన ముందుకు వస్తున్నది. తెలంగాణ అంశం తమకు అడ్డురాకుండా చూసుకోవడానికి తగిన వ్యూహాన్ని కాంగ్రెసు అధిష్టానం పన్నుతున్నది తప్ప తెలంగాణ ప్రజల ఆకాంక్షను తీర్చే మార్గంలో ఆలోచన చేయడం లేదనేది స్పష్టంగానే తెలిసిపోతున్నది.

తెలంగాణ ప్రాంతీయ బోర్డు ఏర్పాటు అనేది కొత్త విషయమేమీ కాదు. ఇది వరకు ప్రాంతీయ మండళ్లు ఏర్పాటై పనిచేయలేక చచ్చుపడిన విషయం తెలియంది కాదు. ప్రాంతీయ బోర్డులను ఆంధ్ర పలస పాలకులు క్రమక్రమంగా నీరు గార్చి వాటిని తుడిచిపెట్టేశారు. దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో కూడా ప్రాంతీయ మండళ్లను ఏర్పాటు చేశారు. అప్పటి సీనియర్ శానససభ్యుడు పురుషోత్తమ రెడ్డి చైర్మన్‌గా తెలంగాణ ప్రాంతీయ మండలిని ఏర్పాటు చేసినప్పటికీ దానికి ఏ విధమైన అధికారాలూ ఇవ్వలేదు. దీంతో అది దానంతటదే కనుమరుగై పోయింది. ఇప్పుడు అదనంగా చట్టబద్దమైన అధికారాలు కట్టేబెట్టే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు. ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహను దానికి చైర్మన్‌గా వేస్తారని కూడా ప్రచారం జరుగుతున్నది.

కాంగ్రెసు అధిష్టానం తీరును, కాంగ్రెసు సీమాంధ్ర నాయకుల వ్యవహారశైలిని చూస్తుంటే ప్రాంతీయ బోర్డుకు గ్రీన్ సిగ్నల్ లభించినట్లే కనిపిస్తున్నది. దీనికి తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావును కూడా ఒప్పించే అవకాశాలు లేకపోలేదు. కెసిఆర్ కూడా 2014 ఎన్నికలనే లక్ష్యం చేసుకుని ప్రాంతీయ బోర్డుకు అంగీకరించినా ఆశ్చర్యం లేదు. ప్రాంతీయ బోర్డు ద్వారా ఫలితం కనిపించకపోతే 2014 ఎన్నికల తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామని కాంగ్రెసు అధిష్టానం తప్పించుకునేందుకు వీలైన ప్రకటన చేయవచ్చు.

కాంగ్రెసు తెలంగాణ నాయకుల్లో చాలా మంది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రత్యామ్నాయం లేదని అంటున్నారు. తెరాస నాయకులు కూడా అదే మాట అంటున్నారు. తెలంగాణపై జులై మొదటి వారంలో కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు దీక్షలు చేపట్టాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో వారితో చర్చలు జరిపి, ప్రాంతీయ బోర్డుకు ఒప్పిస్తారేమో తెలియదు. ఇందుకు అనుగుణంగా కాంగ్రెసు అధిష్టానం ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహతో కసరత్తు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. సీమాంధ్ర, తెలంగాణ నాయకులతో ఇందుకు అవసరమైన చర్చలు జరుగుతున్నట్లు చెబుతున్నారు.

తెలంగాణ ప్రాంతీయ బోర్డు ఏర్పాటు ద్వారా తెలంగాణ ప్రజలకు న్యాయం జరగదనేది అనుభవపూర్వకంగా తేలింది. మళ్లీ పాత బోర్డునే కొత్త తీసుకురావడం వల్ల తెలంగాణ ప్రజలకు ఒరిగేదేమీ లేదు. పైగా అది మోసపూరితమైన చర్య కూడా అవుతుంది. దీన్ని తెలంగాణ ప్రజలు అంగీకరించబోరనేది తెలిసి పోతూనే ఉన్నది.

- కె. నిశాంత్

English summary
K Nishanth opposes the proposal of Telangana regional board. He opins that only statehood for Telangana is accepted.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X