వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ: పార్టీల ఎత్తులు జిత్తులు

By కె. నిశాంత్
|
Google Oneindia TeluguNews

Komatireddy Venkat Reddy
తెలంగాణ ఇప్పుడు రాజకీయ వ్యూహప్రతివ్యూహాలకు వేదికగా మారింది. పార్టీల మధ్య ఆధిపత్య పోరు చోటు చేసుకుంది. తెలంగాణ కోసం పోరాటంలో తామే ముందుండాలంటే తామే ముందుండాలనే తాపత్రయంతో పాటు ఎదిరి పక్షాలను దెబ్బ కొట్టే ప్రయత్నాలు కూడా సాగుతున్నాయి. స్వాతంత్ర్య సమరయోధుడు, కురు వృద్ధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ ఢిల్లీలో ఏడు రోజుల నిరవధిక నిరాహార దీక్షకు పూనుకోగా, మాజీ మంత్రి, కాంగ్రెసు శాసనసభ్యుడు కోమటిరెడ్డ వెంకటరెడ్డి నల్లగొండలో ఆమరణ నిరాహార దీక్షకు కూర్చున్నారు. ఆరోగ్యం క్షీణించడంతో ఐదు రోజుల తర్వాత కోమటిరెడ్డి వెంకటెరెడ్డిని హైదరాబాదులోని నిమ్స్ కు తరలించారు. ఈ రెండు దీక్షల నడుమ తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ఇతర పార్టీల ప్రజాప్రతినిధులను తమ పార్టీలోకి ఆహ్వానించే పనిలో పడింది. తెలంగాణలోని ముగ్గురు కాంగ్రెసు శాసనసభ్యులు ఆ పార్టీకి, శాసనసభా సభ్యత్వాలకు రాజీనామాలు చేసి తెరాసలో చేరారు. రాష్ట్ర రాజకీయాలను ఇదో కుదుపు కుదిపింది. కాంగ్రెసు గుండెల్లో రాయి పడింది. మరింత మంది కాంగ్రెసు శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు తెరాసలో చేరుతారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఈ వ్యవహారాల నడుమనే ఎమ్మార్పీయస్ నేత మందకృష్ణ మాదిగ తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుపై, గజ్జెల కాంతం తెలంగాణ జెఎసి చైర్మన్ కోదండరామ్పై విరుచుకుపడుతూ తెరాసను అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. పరిస్థితి చూస్తుంటే తెలంగాణలో పరిస్థితి అయోమయంగానూ గందరగోళంగానూ కనిపిస్తున్నది.

కొండా లక్ష్మణ్ బాపూజీ దీక్షకు తెరాస మద్దతు ఇవ్వడం లేదనే విమర్శ వినిపిస్తున్నది. ఈ ప్రశ్నలో సామంజస్యం, న్యాయం ఉన్నట్లే కనిపిస్తుంది. కానీ, తెలంగాణపై తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని ఒప్పించకుండా కొండా లక్ష్మణ్ బాపూజీకి తెలుగుదేశం పార్టీ మద్దతు ఇస్తుందనే అభిప్రాయం ఉంది. తెలుగుదేశం తెలంగాణ నాయకులకు తెలంగాణపై సాధన కన్నా తెలంగాణలో తమ పార్టీని కాపాడుకోవడంపై, చంద్రబాబు నాయకత్వాన్ని నిలబెట్టడంపైనే ఎక్కువ మక్కువ ఉందనే అభిప్రాయం బలంగా ఉంది. అదే సమయంలో కొండా లక్ష్మణ్ బాపూజీ తెరాసను వ్యతిరేకిస్తున్న మందకృష్ణ మాదిగ మద్దతు పొందుతున్నారు. తెలంగాణ ఆంతరంగిక వివాదాలను, మిత్ర వైరుధ్యాలను మందకృష్ణ బహిరంగ వివాదంగా, శత్రు వైరుధ్యంగా మార్చి వేశారు. నిజానికి, తెలంగాణలో సామాజిక న్యాయానికి ఎవరూ వ్యతిరేకం కాదు. మందకృష్ణ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు లభించిన మద్దతే రేపు తెలంగాణ వచ్చిన తర్వాత దళితులు, బలహీన వర్గాలవారు అధికారంలో అగ్రభాగాన ఉండాలనే వాదనకు కూడా మద్దతు లభిస్తుందనేది అవగాహనలో ఉండాల్సిన విషయం. అది మందకృష్ణ మాదిగకు తెలియదని కాదు, మొత్తం వ్యవహారంలోనే తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్న చంద్రబాబు నాయుడి రాజకీయాలు ఉన్నాయనే అనుమానాలున్నాయి. ఈ అనుమానాలు నివృత్తి కాకుండా కెసిఆర్ నుంచి గానీ కోదండరామ్ నుంచి గానీ లేదుంటే తటస్థ తెలంగాణవాదుల నుంచి గానీ కొండా లక్ష్మణ్ బాపూజీకి మద్దతు లభించే అవకాశం లేదు. వారి అనుమానాలు నిజం కాకపోవచ్చు, కానీ వాటిని కొండా లక్ష్మణ్ బాపూజీ గానీ మందకృష్ణ గానీ నివృత్తి చేయాల్సిన అవసరమే ఉంటుంది.

కాగా, తెలంగాణపై ఏ క్షణంలోనైనా ప్రకటన వెలువడవచ్చునని పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ తాజాగా ప్రకటన చేశారు. అయితే, ఆయన ప్రటనను ఎంత వరకు నమ్మవచ్చుననేది కాంగ్రెసు జరుగుతున్న అంతర్గత పరిణామాలకు మాత్రమే వదిలేయాల్సి ఉంటుంది. లేదంటే, పరిస్థితిని సాధారణ స్థితికి తేవాలనే ఎత్తుగడలో భాగంగా ఆయన ఆ ప్రకటన చేసి ఉండవచ్చు. కాగా, బక్రీద్ తర్వాత, అంటే నవంబర్ 7వ తేదీ తర్వాత కేంద్రం తెలంగాణపై ఓ ప్రకటన చేస్తుందని కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం ప్రకటించారు ఎఐసిసి అధికార ప్రతినిధి అబిషేక్ మను సింఘ్వీ ప్రకటన మరో విధంగా ఉంది. జనవరి లోపు తెలంగాణపై ప్రకటన వస్తుందని రాష్ట్రంలోన కాంగ్రెసు నాయకులందరికీ తెలుసునని ఆయన అన్నారు అంటే, కాంగ్రెసు అధిష్టానం గానీ కేంద్రం గానీ అంత త్వరగా తెలంగాణపై నిర్ణయం ప్రకటించడానికి సిద్ధంగా లేదనే అబిప్రాయానికే బలం చేకూరుతుంది. ఒక వేళ, పార్లమెంటు సమావేశాలు ప్రారంభమయ్యేలోగా ప్రకటన వెలువడితే అదో వింత మాత్రమే అవుతుంది. ఆ ప్రకటన ఎలా ఉంటుందనేది పక్కన పెడితే, తెలంగాణపై ఓ స్పష్టమైన నిర్ణయం తీసుకునే సాహసం కాంగ్రెసు అధిష్టానం చేస్తుందా అనేది సమాధానం దొరకని ప్రశ్న.

తెలంగాణపై రోజుల్లో ప్రకటన వెలువడుతుందనే నమ్మకం లేకపోవడం వల్లనే ప్రస్తుత పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తెలంగాణపై 2014కు ముందు కాంగ్రెసు అధిష్టానం నుంచి గానీ కేంద్ర ప్రభుత్వం నుంచి గానీ ప్రకటన వస్తుందని ఎవరూ అనుకోవడం లేదు. శ్రీ కృష్ణ కమిటీ నివేదిక సమర్పించడానికి ముందున్న ఉత్కంఠ ఇప్పుడు లేదు. ఫలానా తేదీన తెలంగాణపై తాము ప్రకటన చేస్తామని కాంగ్రెసు ప్రకటించగలిగితే రాజకీయాలు పక్కకు వెళ్తాయి. ఆ ప్రకటన చేసే తెగువ కాంగ్రెసు అదిష్టానానికి ఉందా అనేది కూడా సందేహమే. అందువల్లనే బలాలను పెంచుకునే ఎత్తుగడల్లో రాజకీయ పార్టీలు ఉన్నాయి. తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోకపోతే తెలంగాణలో పార్టీ నామరూపాలు లేకుండా పోతుందని కాంగ్రెసు తెలంగాణ నాయకులు నెత్తీనోరు పెట్టుకుని చెబుతూనే ఉన్నారు అయినా అధిష్టానం పట్టించుకోవడం లేదు. దీంతో తమ తమ నియోజకవర్గాల్లోనైనా తమ ఉనికిని కాపాడుకునే ప్రయత్నంలో పడ్డారు. అందులో భాగంగానే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆమరణ నిరాహార దీక్ష చేశారని చెప్పవచ్చు. తమ ఉనికికి ప్రమాదం వాటిల్లుతుండడమే కాకుండా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డ వివక్షకు గురి చేస్తుండడంతో ముగ్గురు శాసనసభ్యులు రాజీనామాలు చేసి తెరాసలో చేరారు. అలా వివక్షకు గురవుతూ తమ తమ ప్రాంతాల్లో తిరగలేని మరింత మంది శాసనసభ్యులు తెరాసలోకి వచ్చే అవకాశాలున్నాయి. తమ అధిష్టానంపై నమ్మకం సన్నగిల్లుతున్న కొద్దీ వలసలు పెరుగుతాయి. ఇప్పటికిప్పుడు కాకపోయినా 2014 ఎన్నికల నాటికి తెరాస ఇతర పార్టీల నాయకులతో నిండిపోయే అవకాశం ఉంది.

కాంగ్రెసు అధిష్టానం తెలంగాణపై స్పష్టమైన ప్రకటన చేసే స్థితిలో లేదు కాబట్టి వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అత్యధిక సీట్లను సాధించి, కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించడంతో పాటు రాష్ట్రంలో తెలుగుదేశం, కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీల్లో దేనికీ మెజారిటీ రాకుండా చేయాలనే వ్యూహంతో కెసిఆర్ ముందుకు సాగుతున్నారు. దీన్ని కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు ఎలా ఎదుర్కుంటాయనేది వేచి చూడాల్సిందే.

తమ పార్టీని దెబ్బ తీయడానికి అణచివేత చర్యలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని తెరాస నాయకులు భావిస్తున్నారు. పిడి యాక్ట్, నాసాలు ప్రయోగించి, తమ పార్టీ నాయకులను అరెస్టు చేసే వ్యవహారాన్ని వేగవంతం చేసే పనికి పూనుకోవచ్చునని అంటున్నారు. నల్లగొండ జిల్లా నక్రేకల్కు చెందిన పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు డాక్టర్ చెరుకు సుధాకర్పై పిడి యాక్ట్ కింద కేసు పెట్టి వరంగల్ జైలుకు పంపించడాన్ని అదే కోణం నుంచి తెరాస నాయకత్వం చూస్తున్నది. అయితే, కాంగ్రెసు, తెలుగుదేశం నాయకత్వాలకు అర్థం కాని విషయం ఏమంటే, తెలంగాణ నాయకులు లేనప్పటికీ తెలంగాణ ప్రజలు స్థిరనిర్ణయంతో ఉన్నారు. తెలంగాణ ప్రజల నిర్ణయం ఫలితాన్ని కాంగ్రెసు, తెలుగుదేశం అనుభవించక తప్పదు.

English summary
K Nishanth analyses that as Congress high command is not in a position to solve Telangana issue, political parties in Telangana are trying to take political advantages.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X