వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఖుషీలో కూడా: సినిమాలో తెలంగాణ వెక్కిరింపులు

By Pratap
|
Google Oneindia TeluguNews

Kushi-Cameraman Ganga Tho Rambabu
తెలంగాణ ఉద్యమాన్ని కించపరుస్తూ పవన్ కళ్యాణ్ నటించి కెమెరామేన్ గంగతో రాంబాబు సినిమాలో సంభాషణలు, పాత్రలు, సంఘటనలు ఉన్నాయనే ఆరోపణతో అగ్గి రాజుకుంది. ఇప్పటికే తెలంగాణలో చిత్ర ప్రదర్శనను ఆపేశారు. పవన్ కళ్యాణ్ సినిమాలో తెలంగాణను వెక్కిరించడం ఇదే మొదటిసారి కాదు. ఖుషీ సినిమాలో విలన్ల తెలంగాణ భాషను వెక్కిరిస్తూ హీరో పవన్ కళ్యాన్ డైలాగులు విసురుతాడు. విలన్లకు తెలంగాణ భాషను వాడడం పరిపాటి అయిన కాలంలో అది జరిగింది. ఇప్పుడు తెలంగాణ ఉద్యమం ఆత్మగౌరవం నినాదంతో నడుస్తుంటే, దాన్ని దెబ్బ తీసే విధంగా కెమెరామేన్ గంగతో రాంబాబు సినిమా రూపుదిద్దుకుంది. తెలుగు సినిమా తెలంగాణకు వ్యతిరేకంగా, తెలంగాణను వెక్కిరిస్తూ ఎలా నడిచిందో చూద్దాం..

1
గోదావరి, కృష్ణానదులపై సర్‌ ఆర్థర్‌ కాటన్‌ నిర్మించిన ఆనకట్టలు మొత్తం తెలుగు సమాజం సమానస్థాయిలో అభివృద్ధి జరగకుండా చేసినై. ఈ ఆనకట్టల వల్ల కోస్తాంధ్ర ప్రాంతంలో వ్యవసాయం గణనీయంగా అభివృద్ధి చెందింది. వ్యవసాయంలో మిగులు ఆ ప్రాంత సమాజం తీరుతెన్నులను మార్చేసింది. ఈ మిగులు ఉత్పాదక రంగాల్లో కాకుండా అనుత్పాదక రంగాల్లో పెట్టుబడి అయింది. ముఖ్యంగా ఈ మిగులు సినీ, ప్రచురణ రంగాలకు తరలింది. దీంతో సినీరంగంలో కోస్తాంధ్ర ప్రాబల్యం స్పష్టంగా కనిపిస్తుంది. నిజాం పాలనలో వున్న తెలంగాణ ప్రాంతంలో ఆ సామాజిక చలన ప్రక్రియ స్తంభించింది.

సినిమా అనేది కేవలం ఒక వ్యాపారరంగమే కాదు, సాంస్కృతిక రంగంలో బలమైన సాధనం కూడా. ప్రజల జీవనవిధానాలపై బలమైన ప్రభావం వేస్తుంది. కోస్తాంధ్రుల చేతుల్లో సినీరంగం బలమైన సాధనం అయింది. వారి వ్యాపార కార్యకలాపాలను విస్తరించుకోవడానికి అది భూమికను తయారుచేసే సాధనంగా పని చేస్తూ వస్తున్నది. కోస్తా వ్యాపారవర్గాలు పెట్టుబడులు పెట్టి మరింతగా లాభాలు ఆర్జించడానికి విస్తృత సమాజం కావాలి. దాంతో వారి దృష్టి తెలంగాణపై పడింది. విశాలాంధ్ర నినాదంలోనూ, భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటును బలపరచడంలోనూ ఈ వర్గాల ప్రయోజనాలు ఇమిడి వున్నాయి. అయితే, కేవలం ప్రాంతం ఉన్నంత మాత్రాన సరిపోదు. వెనుకబడిన ప్రాంతాల సంస్కృతిని ధ్వంసం చేయాల్సి వుంటుంది. ఇందుకు కోస్తాంధ్ర సంపన్నవర్గాలకు సినిమారంగం ఆయాచితవరంగా మారింది. ఈ రకంగా చూస్తే తెలుగు సినిమా రంగం మూడు థల్లో తెలంగాణ సమాజంపై ఆధిపత్యం సంపాదించడానికి అవసరమైన కార్యాన్ని చేసి పెడుతున్నది. తెలంగాణ సమాజాన్ని కబ్జా చేయడానికి దోహదపడుతున్నది.

మొదటి థలో కోస్తాంధ్ర సంపన్నవర్గాలకు తెలంగాణ అంటే ఉన్న భయాలను, ఆందోళనను, అనుమానాలను తొలగించే పాత్రను సినిమారంగం పోషించింది. ఆంధ్రప్రదేశ్‌ అవతరణకు ముందు కోస్తాంధ్రులకు హైదరాబాద్‌ కన్నా మద్రాసు చాలా దగ్గర. రాజకీయంగా కూడా వారి అనుబంధం మద్రాసుతోనే. అందుకే తెలుగు సినిమారంగం కూడా మద్రాసు కేంద్రంగానే మొదలై విస్తరించింది. తమిళనాడు ఆధిపత్య ధోరణిని నిరసిస్తూ పొట్టి శ్రీరాములు, తదితరులు చేసిన పోరాటాల ఫలితంగా ఆంధ్రరాష్ట్రం ఏర్పడింది. (నవంబర్‌ 1వ తేదీన తల్చుకుంటున్న పొట్టి శ్రీరాములుకు ఆంధ్రప్రదేశ్‌ అవతరణతో ఏ సంబంధమూ లేదు, ఆయన ప్రాణార్పణ చేసింది కూడా ఆంధ్రప్రదేశ్‌ అవతరణ కోసం కాదు). ఆంధ్ర రాష్ట్ర అవతరణ తర్వాత హైదరాబాద్‌ రాష్ట్రాన్ని కలుపుకొని ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడింది. (తెలంగాణ ప్రజల సందేహాలను బేఖాతర్‌ చేస్తూ ఈ చారిత్రక సంఘటన చోటు చేసుకుంది). ఈ స్థితిలో సినిమారంగం కోస్తాంధ్ర సంపన్నవర్గాలు తెలంగాణా ప్రాంతంలో కాలు పెట్టడానికి చైతన్యాన్ని అందించే పాత్రను పోషించింది. ఇందుకు ఉదాహరణకుగా 'ఎంఎల్‌ఎ' చిత్రంలోని ఒక దృశ్యాన్ని చెప్పుకోవచ్చు. ఆ సినిమాలో హీరోను తల్లి 'ఎక్కడికి వెళ్తున్నావు?' అని అడుగుతుంది. 'హైదరాబాద్‌కు' అని అతను చెప్తాడు. 'అక్కడ రౌడీలు, గుండాలు వుంటారు' అని ఆమె భయం వ్యక్తం చేస్తుంది (బహుశ తురకం అని కూడా అంటుందేమో). 'హైదరాబాద్‌ మన రాజధాని, భయపడాల్సిన అవసరం లేదు' అని చెప్తాడతను. ఇది హైదరాబాద్‌కు తరలి రావడానికి ఇక్కడి ఉద్యోగాలను, సమస్త అవకాశాలను కొల్లగొట్టడానికి కోస్తాంధ్రులను సంసిద్ధం చేయడంలో సినిమా రంగం తన వంతు పాత్రను నిర్వర్తించిందని చెప్పడానికి ఉదాహరణ. ఇదే సందర్భంలో ఇంకో విషయాన్ని కూడా గుర్తు చేసుకోవాలి. 'ఇదేనండి ఇదేనండి భాగ్యనగరం/ మూడు కోట్ల ఆంధ్రుల ముఖ్యపట్టణం' అనే పాట కూడా ఇందులో భాగంగానే వచ్చిందనుకోవాలి. కోస్తాంధ్రులకు హైదరాబాద్‌ను పరిచయం చేయడంలో భాగంగానే ఆ పాట సినిమాలో చోటు చేసుకుందని భావించాలి (స్థానికులకు హైదరాబాద్‌ను పరిచయం చేయాల్సిన అవసరం లేదు). కోస్తాంధ్రుల తెలంగాణ వలసకు పునాదిని సినిమా రంగం వేసింది.

తెలంగాణపట్ల ఉన్న అనుమానాలను, భయాలను నివృత్తి చేసినతర్వాత ఆ ప్రాంతాన్ని కబ్జా చేయడానికి అవసరమైన అన్ని పాత్రలనూ సినిమా రంగం పోషించింది. ఇందులో ప్రధానమైంది తెలంగాణ సంస్కృతిని ధ్వంసం చేయడం. ఆధిపత్య సమాజం ఎప్పుడూ తన విస్తరణను సాంస్కృతిక విధ్వంసం ద్వారానే మొదలు పెడుతుంది. పాలకులు పాలితులను న్యూనత పరిచే ఒక ప్రక్రియ ఇందులో ఇమిడి ఉంటుంది. ఇందులో అది మొదట ఎంచుకునే పద్ధతి వేషభాషలను, యాసను, ఆచారాలను కించపరచడం. ఇందులో భాగంగానే తెలంగాణ భాషను, యాసను కించపరిచే పద్ధతిని సినిమా రంగం సమర్థంగా చేసింది, చేస్తున్నది. జోకర్లకు, విలన్లకు తెలంగాణ భాషను, యాసను వాడుతూ హీరోలకు కోస్తాంధ్ర భాషను, యాసను (అది కూడా రెండున్నర జిల్లాల భాషను, యాసను) వాడుతూ తెలంగాణ ప్రజలు తమ భాషకు, యాసకు తామే సిగ్గుపడే పరిస్థితిని కల్పించింది. ఇక్కడ జరిగిన ఇంకో కుట్ర ఏమిటంటే అసలైన తెలంగాణ భాషను, యాసను వీరు తీసుకోలేదు. తురకం కలిపిన ఒక కొత్త మాండలికాన్ని, తెలంగాణ భాషను, యాసను వీరు సృష్టించినారు. తెలంగాణ భాష అంటూ ప్రత్యేకంగా ఏమీ లేదు. అట్లా వుండడానికి అవకాశం కూడా లేదు. ఏ ప్రాంతం భాషలో కూడా ఏకరూపత వుండదు. ఇది భాషా శాస్త్రవేత్తలకు తెలుసు. అందుకే ఆంధ్రలో శిష్టవ్యవహారిక భాషోద్యమం నడిచిందనేది ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి.

భాషా దౌర్జన్యం ఇంకా కొనసాగుతూ వున్నది. ఇటీవల వచ్చిన ఓ సినిమాలో కూడా ఈ అహంకారపూరిత, ఆధిపత్య ధోరణి వ్యక్తం కావడం చూస్తాం. ఈ సినిమాలో హీరో మోహన్‌బాబు తల్లి వద్ద ఒక గమ్మత్తయిన తెలంగాణ భాషలో మాట్లాడతాడు. దీనికి ఆమె ఆశ్చర్యపోయి నీ భాష ఇంత అధ్వాన్నంగా మారిపోయిందేమిటి అనే పద్దతిలో మాట్లాడుతుంది. తాను రాజమండ్రి జైలులో వున్నప్పుడు తనతోపాటు ఒక తెలంగాణ వ్యక్తి వున్నాడని, అతని వద్ద ఈ భాష నేర్చుకున్నానని చెప్తాడు. సినిమాలో ఈ దృశ్యానికి, ఈ సంభాషణకు వున్న ప్రాధాన్యం ఏమిటి? కథ ముందుకు సాగడానికి ఇదేమైనా ఉపయోగపడుతుందా? ఏమీ లేనప్పుడు ఎందుకిదంతా అనే ప్రశ్న రావడం సహజం. కేవలం కోస్తా ఆధిపత్యాన్ని ప్రదర్శించే అహంకారంతో కూడిన వ్యవహారం తప్ప మరోటి కాదని అనుకోక తప్పదు కదా!

మావను పెళ్లి చేసుకోవడం తెలంగాణ సంస్కృతి కాదు. కానీ, మావతో ప్రేమలను, పెళ్లిళ్లను ఎన్ని సినిమాల్లో చూసినామో, చూస్తున్నామో లెక్క లేదు. ఈ రకంగా ఆచారవ్యవహారాలను మార్చేసే ప్రక్రియను తెలుగు సినిమారంగం పెద్ద యెత్తున చేపట్టి నిర్వహిస్తున్నది. ఇదంతా తెలంగాణ సంపదపై, వనరులపై ఆధిపత్యానికి పాదులు వేయడానికి ఉపయోగపడింది. మూడవ థ ఈ సంపదపై, వనరులపై ఆధిపత్యం సంపాదించుకుంటూ సాగింది. తెలుగు సినిమారంగం హైదరాబాద్‌కు తరలడమనే నినాదం నుంచి మొదలు పెడితే, ఇక్కడ నిర్మించే సినిమాలకు రాయితీలు ఇవ్వాలనే డిమాండు వరకు అన్నీ సంపదలపై ఆధిపత్యం కోసం జరిగినవేనని అర్థం చేసుకోవచ్చు. సినిమారంగం హైదరాబాద్‌లో స్థిరపడాలనే లక్ష్యం నెరవేర్చే క్రమంలో హైదరాబాద్‌లోని వేలాది ఎకరాలను కోస్తాంధ్రులు సొంతం చేసుకున్నారు. స్టూడియోల నిర్మాణం ఇందుకు సరైన ఉదాహరణ.రామకృష్ణ, పద్మాలయా, అన్నపూర్ణా, రామానాయుడు స్టూడియోల నుంచి ఇటీవలి రామోజీ ఫిల్మ్‌ సిటీ వరకు జరిగిందంతా అదే (సినిమాల నిఆర్మణం, స్టూడియోల నిర్మాణం ఏ విధంగా ఉపయోగపడుతుందో ఏలినవారే చెప్పాలి. వ్యాపారంగా మాత్రమే సినీ పరిశ్రమ అభివృద్ధి చెందినపుడు వాటికి ప్రభుత్వ అవార్డులు, రాయతీలు ఇవ్వడం ఏ కోవలోకి వస్తుందనేది కూడా చర్చనీయాంశమే. ఇందులో ఇమిడి వున్న రాజకీయాన్ని కూడా అర్థం చేసుకోవాల్సే వుంటుంది). ఇవ్వాళ్ల బడా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు కూడా ఈ సినిమా రంగం నుంచి పుట్టుకురావడం యాదృచ్ఛికం ఎలా అవుతుంది? రాజకీయాలను వారు నడపడం ఎలా సాధారణ విషయం అవుతుంది?

2
సీనిరంగం అనేది కేవలం వలసవాద దృక్పథంతో అభివృద్ధి చెందిందని చెప్పడం కూడా పూర్తిగా సరి కాదు. అది లాభార్జనాపేక్షతో ముందుకు వచ్చిందే. అయితే, తొలిథలో అన్ని రంగాలకు మాదిరిగానే సినిమారంగానికి కూడా ఎంతో కొంత సుగుణం వుంది. తొలి థలో పౌరాణికాలను తెర మీదికి ఎక్కించినారు. ఆ తర్వాత సంఘ సంస్కరణ దృష్టి సినిమారంగంలో చోటుచేసుకుంది. మాలపిల్ల, సుమంగళివంటి సినిమాలు రావడం ఇందులో భాగమే. ఆ థలో సినిమా రంగంలోకి కాలు పెట్టింది చాలామంది మార్క్సిస్టులు కావడమే అందుకు కారణం కావచ్చు. జానపదాలు కూడా ఆ తర్వాత ప్రజలను ఉర్రూతలూగించినై. కోస్తాంధ్ర సాహిత్యంపై ఆంగ్ల సాహిత్య ప్రభావం, ఆ తర్వాత బెంగాలీ సాహిత్య ప్రభావం ఎక్కువ. శరచ్ఛంద్ర నవలల తెలుగు అనువాదాలు పుంఖానుపుంఖంగా తెలుగులోకి వచ్చినై. ఇందులో భాగంగానే దేవదాసు వంటి నవలలు తెలుగుతెర మీదికి ఎక్కినై. జానపద సినిమాల్లో ఎంతో కొంత సుగుణం వుండేది. అయితే, తెలంగాణ ప్రాంతానికి చెందిన కథలుగానీ, వస్తువుగానీ తెలుగు సినిమా రంగానికి ముడిసరుకు కాలేదు. ఆ తర్వాత డాక్టర్‌ చక్రవర్తివంటి తెలుగు నవలలు సినిమాలుగా వచ్చినై. అక్కినేని నాగేశ్వరరావు కథా నాయకుడిగా ఇటువంటి నవలలు మధ్యతరగతి జీవుల మనోరథాలను సంతృప్తి పరుస్తుండగా ఎన్‌.టి. రామారావు మాస్‌ అప్పీల్‌ పాత్రలు ధరిస్తూ వచ్చారు. పౌరాణిక పాత్రల ద్వారా ఆయన తెలుగు ప్రజల మనసు దోచారు. హీరో వర్షిప్‌ తెలుగు సినిమా రంగంలో బలంగా నాటుకుపోయింది.

ఆ తర్వాత తెలుగు సినిమా వెర్రితలలు వేయడం స్పష్టంగా చూస్తాం. పాటల్లోనూ, సంభాషణల్లోనూ ద్వంద్వార్థాలు చోటు చేసుకున్నై. 'ఆకు చాటు పిందె తడిసె' వంటి పాత్రల్లో ఎన్‌.టి. రామారావు కుప్పిగంతులు చూస్తాం. సినిమాలకు అర్థం పర్థం లేకపోవడం చూస్తాం. అంతేకాదు, హీరోహీరోయిన్ల మధ్య ప్రేమవ్యవహారాన్ని ఒక మోటు సరసం కిందికి దిగజార్చినారు. 'యమగోల' సినిమాలో ఎన్టీ రామారావు, హీరోయిన్‌ జయప్రదను వాటేసుకున్న దృశ్యంపై 'రామచిలుకను గండుపిల్లి పట్టుకున్నట్లు ఉంది' అని గజ్జెల మల్లారెడ్డి వ్యాఖ్యానించడంలోని సామంజస్యాన్ని మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలి. మరోవైపు పాత ప్రేమకథలను కొత్త మూసలో పోసి అందించడం కూడా పరిపాటి అయింది. దాసరి నారాయణ రావు దర్శకత్వం వహించిన 'బెబ్బులి పులి' వంటి సినిమాలు ఎన్‌.టి. రామారావును ఎవర్‌ గ్రీన్‌ హీరోగా నిలబెట్టినై. తెలుగుదేశం ఆవిర్భావానికి, కోస్తాంధ్రలోని ఒక వర్గం నాయకత్వాన్ని నిలబెట్టడానికి సినిమా తన వంతు కృషి చేసింది.

ఈ సినిమాలు ఏ విధంగానూ తెలంగాణ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించేవి కావు. ఆయినప్పటికీ ఎన్‌.టి. రామారావును తెలంగాణ ప్రజలు తమవాడిగానే అక్కున చేర్చుకున్నారు, ఆదరించినారు. దీనికి వారు చెల్లించిన మూల్యం చెప్పనలవి కానిది. హైదరాబాద్‌ ఉర్దూ తన ఉనికిని కోల్పోయింది. ఇక్కడి ఆటోవాలాలు దోపిడీదారులుగా, మోసగాళ్లుగా ముద్రలు వేయించుకున్నారు. ఈ సమయంలోనే తెలంగాణ భాష బాహాటంగా వెక్కిరింతకు గురి కావడమే కాదు, దిక్కు దివాణం లేనిదైపోయింది. నిజానికి తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాతనే హైదరాబాద్‌ను కేంద్రంగా చేసుకొని తెలంగాణ అంతటా ఆంధ్రులు విస్తరించడానికి తగిన ఆత్మస్థయిర్యం చేకూరింది. హైదరాబాద్‌లో తెలంగాణ ప్రజల కళ్లలో కారం చల్లినట్లు కోస్తాంధ్ర కాలనీలు వెలిసినై.

3
ఇదంతా ఒక ఎత్తయితే మరోవైపు విప్లవ సినిమాలు తెరమీదికి ఎక్కడం ప్రారంభమైంది. మాదాల రంగారావు 'యువతరం కదిలింది' వంటి సినిమాలు కొన్ని తొలి థలో విజయం సాధించినై. అయితే ఆ తర్వాత ఆయన అంతగా విజయం సాధించలేక దుకాణం మూసుకోవాల్సి వచ్చింది. రామోజీరావు సినిమారంగ ప్రవేశం మరో మలుపు. ప్రగతిశీల సినిమాలు తీసే నెపంతో తెలంగాణవారిని విలన్లుగానూ, కోస్తాంధ్ర వారిని హీరోలుగానూ బాహాటంగా చూపే థ ప్రారంభమైంది. 'ప్రతిఘటన' సినిమాలో ఈ పంథాను మనం స్పష్టంగా చూడవచ్చు. ఈ ధోరణి సినిమా రంగంలో బలంగా వచ్చింది. 'గాయం' సినిమాను ఇందుకు మంచి ఉదాహరణగా చెప్పవచ్చు. ఇందులోని హీరో జగపతిబాబు ధరించిన పాత్ర పరిస్థితుల ప్రభావంవల్ల రౌడీగా మారిన విషయాన్ని చక్కగా చూపెడుతుంది. ఈ సినిమాకు ముడిసరుకు రంగా ఉదంతం. తెలివి, సంస్కారం, జ్ఞానం కొరవడి హైదరాబాద్‌ ప్రజలను పిండి పిప్పిచేస్తున్న స్థానికరౌడీల పనిపడ్తాడు జగపతిబాబు ఈ సినిమాలో. తెలంగాణ ప్రాంత రాజకీయ నాయకులు రౌడీలతో కుమ్మక్కయ్యి హైదరాబాద్‌లో మతకల్లోలాలను సృష్టించడానికి పథకం వేస్తే పోలీసులు జగపతిబాబు సహకారం తీసుకుని ఈ పథకాన్ని వమ్ము చేస్తారు. మర్రి చెన్నారెడ్డి హయాంలో పెద్ద యెత్తున హైదరాబాద్‌లో మతఘర్షణలు చెలరేగినై. ఇందులో అమాయకుల ప్రాణాలు పిట్టల ప్రాణాల మాదిరిగా లేచిపోయినై. దీంతో మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రి పదవిని వదులుకోవలసి వచ్చింది.

హైదరాబాద్‌లో ఈ ఊచకోతకు విజయవాడ గూండాలే కారణమని ఆ సమయంలో మర్రి చెన్నారెడ్డి ఒక ప్రకటన చేసినట్లు గుర్తు. ఈ 'అపవాదును' తొలగించుకోవడానికే అన్నట్లు 'గాయం' సినిమా వచ్చింది. ఇలాంటి కథావస్తువులతో సినిమాలు చాలా వచ్చినై. ఇక నారాయణమూర్తిది ఓ స్టయిల్‌. తెలంగాణ పాటను కొల్లగొట్టిన చరిత్ర ఆయనది. విప్లవ సినిమాలు మాత్రమే తీసిన 'త్యాగచరిత్ర' ఆయనది. జనాదరణ పొందిన పాటలను ఆయన కమర్షియలైజ్‌ చేసినారు. ఈ సినిమాలు తెలంగాణకు, విప్లవానికి ఎంతో దోహదం చేసినాయనే భ్రమ వుంది. కానీ, ఆయన సినిమాలు తెలంగాణ జీవితాలను ఏ మాత్రం ప్రతిబింబించకపోవడం విషాదం. ఆయన వల్ల చేకూరిన లాభమేమైనా వుందంటే తెలంగాణ ప్రజాకవులు సినిమాపాలయ్యారు. దీంతో కృష్ణ, మోహన్‌బాబులాంటి వాళ్లు 'ఎర్ర సినిమాలు' తీయాల్సిన పరిస్థితిలో పడ్డారు. కృష్ణ సొంత సినిమా 'ఎన్‌కౌంటర్‌' గానీ, మోహన్‌బాబు 'అడవిలో అన్నలు' గానీ, రోజా నటించిన 'స్వర్ణక్క' గానీ తెలంగాణ సినిమాలు ఎంత మాత్రం కావు. అవి తెలంగాణ జీవితాలను ప్రతిబింబించలేదు. హీరోయిజాన్ని మరో రూపంలో ప్రతిబింబించిన సినిమాలు మాత్రమే. ఒక రకంగా ఇవి తెలంగాణ ప్రజలను అపహాస్యం పాలుచేసినై. తెలంగాణ పాటలను, వస్తువును కొల్లగొట్టి ఇక్కడి జీవితాలను తలకిందులుగా చూపినై ఈ సినిమాలు.

4
సినిమాల్లో తాజా ట్రెండ్‌ ప్రేమకథలు. ఈ ప్రేమకథలకు ఓ ప్రత్యేకత వుంది. ఈ ట్రెండ్‌ రామోజీరావు నిర్మించిన 'చిత్రం'తో ప్రారంభమైందని చెప్పుకోవాలి. ఈ సినిమాలు ప్రేమ చాటున వ్యక్తిత్వ వికాసాన్ని సందేశంగా అందిస్తున్నాయి. రామోజీరావు 'పాడుతా తీయగా' సినిమానే పలు రూపాల్లో తెర మీదికి వస్తున్నది. ఈ సినిమాలో హైదరాబాద్‌లో జరుగుతాయని చెప్పే మోసాలను రంగుటద్దాలలో చూపినారు. ఒక రకంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రభుత్వ విధానాలను సమర్థించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. 'ప్రేమకు వేళాయెరా' సినిమా ఎస్వీ కృష్ణారెడ్డి అందుకే తీసినట్లు స్వయంగా చెప్పుకున్నారు. అవకాశాలు ఎన్నో ఉన్నాయి, వాటిని అందిపుచ్చుకోవడానికి కష్టపడాలనే సందేశాన్ని ఈ సినిమాలు ఇస్తున్నై. వ్యక్తిగత అభివృద్ధి గీటురాయిగా ఈ సినిమాలు వెలువడుతున్నై. ఇటీవల వచ్చిన 'నువ్వు - నేను' సినిమా తెలంగాణ వ్యతిరేక సినిమా. అంతేకాదు, వుండాల్సిన అవలక్షణాలన్నీ వున్నై. తెలంగాణ గొల్లకుర్మలకు, స్త్రీలకు, లెక్చరర్లకు వ్యతిరేకమైన సినిమా కూడా. ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ ఊదరలో ఆశయాలు, విలువలు లేని ఒక మిథ్యాలోకం యువతరానికి ఈ సినిమాలు ప్రతిరూపాలు. పైగా, తెలంగాణ జానపద గేయబాణీలన్నీ సినిమా పాటలకు ముడిసరుకులు అవుతున్నాయి. ఇదంతా తెలంగాణ జనజీవితాలను అపహాస్యం చేసే విధానం తప్ప మరోటి కాదు. ఇప్పటికే అన్ని అవకాశాలను కొల్లగొట్టిన కోస్తాంధ్ర సంపన్నవర్గాలకు మరింత వెసులుబాటును, విశ్వాసాన్ని కల్పిస్తూ, తెలంగాణ రైతుల భూములను పూర్తిగా వదులుకునే ప్రక్రియను వేగవంతం చేయడానికి అనుసరిస్తున్న చంద్రబాబు ప్రభుత్వ విధానాలకు సినిమా రంగం బాసట అందిస్తున్నది. ఇందులో భాగంగానే కోస్తాంధ్ర సినిమా నటులు, నటీమణులు రాజకీయంలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. సినిమాలకు, రాజకీయాలకు విడదీయరాని అనుబంధం పెనవేసుకుని పోయిన కాలమిది. తెలంగాణకు ఏ మాత్రం సంబంధం లేని సినిమాను ఇప్పుడు మనం ఆదరిస్తున్నాం, కళ్లకు అద్దుకుంటున్నాం. ఆ రకంగా మన అస్తిత్వాలను, మూలాలను కోల్పోయే మూలమలుపులో ఉన్నాం. దీని నుంచి ఆత్మరక్షణ చేసుకోవలసిన సమయం వచ్చింది.

- కె. నిశాంత్

English summary
K Nishanth writes how Telugu cinema mocked Telangana language and culture mocked in the context of Pawan Kalyan's Cameraman Gangatho created controversy. In 'Khushi', another hit Pawan Kalyan-starrer, the hero mocks those who speak in the Telangana dialect by imitating the villains.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X