వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్వార్థ త్యాగి కొండ లక్ష్మణ్‌ బాపూజీ

By Pratap
|
Google Oneindia TeluguNews

Konda Laxman Bapuji
ఒక వ్యక్తి ఏకంగా 75 యేండ్ల పాటు నిరంతరాయంగా పీడిత ప్రజల పక్షాన నిలబడి, ప్రజా ఉద్యమాలను నిర్మించి నిర్వహించడమంటే దాదాపు అసాధ్యం. ఈ అసాధ్యాన్ని కొండా లక్ష్మణ్‌ బాపూజీ సాధ్యం చేసి చూపించిండు. 1938నాటి వందేమాతర ఉద్యమం మొదలు ఈనాటి ప్రత్యేక తెలంగాణ ఉద్యమం వరకు ఆయన సాగించిన ప్రజా ప్రస్థానం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోవాల్సిన ఘట్టాలు. ఎక్కడో మారుమూల ఆదిలాబాద్‌లోని వాంకిడిలో పుట్టి హైదరాబాద్‌లో స్థిరపడ్డ బాపూజీకి తెలుగుదేశం ప్రభుత్వం నిలువనీడ కూడా లేకుండా జేసింది. తాను నివసిస్తూ ఉన్న ‘జలదృశ్యం'ను ఉన్నపలానా ఖాళీ చేయించింది. అక్కడ, ఇక్కడ కిరాయి ఇండ్లల్లో ఉంటూ కూడా తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిండు. నిజానికి మలిదశ తెలంగాణ ఉద్యమం ప్రారంభమయింది ఆయన నివాసం నుంచే. జలదృశ్యం నుంచే కేసీఆర్‌ తెలంగాణ రాష్ట్రసమితిని ప్రకటించిండు.

వకాలత్‌ విద్య చదివి 1941లో ‘హైదరాబాద్‌ బార్‌'లో తన పేరుని నమోదు చేయించుకున్న బాపూజీ చాకలి ఐలమ్మ కేసు మొదలు ఎన్నో కేసులు ఫ్రీగా వాదించిండు. ఒక వైపు వకాలత్‌ చేస్తూనే సత్యాగ్రహాల్లో, క్విటి ఇండియా (1942) ఉద్యమంలో కూడా పాల్గొన్నాడు. వందేమాతర ఉద్యమంలో పాల్గొన్నందుకు జైలుకు కూడా వెళ్ళిండు. 1945లో నిజాం రాష్ట్ర పద్మశాలి మహాసభ మొదలు చనిపోయే వరకు పద్మశాలి సంఘం కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొన్నాడు.

హైదరాబాద్‌ రాష్ట్ర తొలి శాసనసభకు నల్లగొండ జిల్లా నుంచి ఎన్నికయ్యిండు. తర్వాతి కాలంలో భువనగిరి నియోజకవర్గం నుంచి గెలుపొందిండు. 195759 మధ్యకాలంలో డిప్యూటీ స్పీకర్‌గా ఆ తర్వాతి కాలంలో దామోదరం సంజీవయ్య, కాసు బ్రహ్మానంద రెడ్డి మంత్రివర్గాల్లో కేబినెట్‌ మంత్రిగా పనిచేసిండు. 1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెస్‌ పార్టీ వైఖరిని నిరసించాడు. నిరాయుధులైన విద్యార్థులు, ప్రజలపై ప్రభుత్వం కాల్పులకు తెగబడడాన్ని ఖండిస్తూ మంత్రి పదవికి రాజీనామా చేసిండు. ఢల్లీిలో జరిగిని ఎఐసీసీ సమావేశాల్లో ఇంధిరాగాంధినే నిలదీసిన ఘనత బాపూజీకి ఉంది. 196971 మధ్య కాలంలో తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీకి అధ్యక్షుడిగా కూడా బాపూజీ పనిచేసిండు.

1969 నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు అవకాశం వచ్చినా ప్రత్యేక తెలంగాణ పక్షాన నిలబడ్డ చరిత్ర బాపూజీది. ప్రత్యేక తెలంగాణ సాధన కోసం సీమాంధ్రులను ఒప్పించాలనే ఉద్దేశ్యంతో లగడపాటితో లంచ్‌ చేయడానికి కూడా వెనుకాడలేదు. ఎందుకంటే లగడపాటి అంటేనే తెలంగాణ ప్రజలందరూ ఏవగించుకుంటున్న తరుణంలో బాపూజీ ఆయనతో సమావేశమయ్యాడు. అంతేగాదు తన ఇంట్లో పురుడు పోసుకున్న తెలంగాణ రాష్ట్ర సమితి ఉద్యమాన్ని విస్మరించి, స్థబ్దంగా ఉన్న దశలో తానే పూనుకొని వివిధ ప్రజా ఫ్రంట్‌ల్ని ఏర్పాటు చేయించిండు. ఢల్లీిలో సైతం నిరహార దీక్షకు దిగి ప్రత్యేక తెలంగాణ డిమాండ్‌ని దేశవ్యాప్తంగా ప్రచారం చేసిండు.

98 యేండ్ల పండు వయసులో కూడా తానే ముందుండి తెలంగాణ ఉద్యమాల్ని నడిపించిండు. సర్వజనామోద నాయకుడు బాపూజీ కాబట్టే మందకృష్ణ మాదిగ లాంటి వారు ఆయన్నే ముఖ్యమంత్రి క్యాండిడేట్‌గా ప్రకటించాలని డిమాండ్‌ కూడా చేసిండ్రు. నిస్వార్థంగా, నిజాయితీగా ప్రత్యేక తెలంగాణ కోసం నినదించిన ఒక నిప్పుగొంతుక ఇవ్వాళ మూగబోయింది. ఈ లోటు తీర్చలేనిది. బాపూజీని శాశ్వతంగా స్మరించుకునే విధంగా బేదఖల్‌ చేసిన ‘జలదృశ్యం'లోనే ఢల్లీిలోని రాజ్‌ఘాట్‌ మాదిరిగా ‘బాపూజీ ఘాట్‌' (కొండా లక్ష్మణ్‌ బాపూజీ)ని ప్రభుత్వమే ఏర్పాటు చేయాలి. తాను ప్రాతినిధ్యం వహించిన నల్లగొండ జిల్లా భువనగిరి నియోజకవర్గంలో నిర్మిస్తున్న నిమ్స్‌ హాస్పిటల్‌కు ‘కొండా' పేరుని పెట్టాలి.

- సంగిశెట్టి శ్రీనివాస్‌

English summary
Konda Laxman Bapuji, freedom fighter, has passed away without fulfilling his Telangana dream. A researcher Sangisetti Srinivas pays homage to Konda Laxman Bapuji.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X