వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ: కళాకారులపై కుట్ర కేసులా?

By Pratap
|
Google Oneindia TeluguNews

Sridhar Dharmasanam
అరవై నాలుగు కళల్లో అరవదైన 'గాయకా'నికి నేడు గాయమైంది. వలసవాద బిగి కౌగిలి నుంచి తెలంగాణ సమాజాన్ని విముక్తి చేయడానికి ఆరు దశాబ్దాలుగా సాగుతున్న విముక్తి పోరులో అంతా తామై కాలి గజ్జెల సవ్వడి తోడుగా ప్రజల గుండెల్లోని భావాలకు గొంతుకలై నిలుస్తున్న కళాకారులపై నేదు ప్రభుత్వం కక్ష కట్టినట్లుగా ఉన్నది. గత 40 సంవత్సరాలుగా ప్రజా సాంస్కృతికోద్యమంలో తన జీవితాన్నే సమిధగా మార్చిన ప్రజా కళాకారిణి విమలక్కపై కుట్ర కేసును బనాయించడం వెనక మతలబు కేవల తెలంగాణ ఉద్యమాన్ని నీరు గార్చే ఉద్దేశ్యమే.

ఉద్యమ నేపథ్యం కలిగిన కుటుంబం నుంచి వచ్చిన విమల తన ఎనిమిదవ యేటనే కాళ్లకు గజ్జె కట్టి ప్రదర్శనలు ఇచ్చింది. అప్పటి నుంచే తన గొంతుకను ప్రజా గొంతుగా మార్చి ఇప్పటి వరకు 40 ఏళ్ల ప్రస్థానంలో అనేక ఆటుపోట్లను, ఒడిదొడుకులను ఎదుర్కుంది. తన జీవన సహచరుడైన అమర్ విప్లవోద్యమంలో భాగంగా దాదాపు 25 ఏళ్లు రహస్య జీవితాన్ని గడిపాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అటు ఇంటా ఇటు బయటా ఒక తల్లిగా, ఇల్లాలిగానే కాకుండా ఒక ప్రజా కళాకారణిగా తన వంతు బాధ్యతను నిర్వర్తిస్తూనే వచ్చింది.

అయినప్పటికీ విమలక్కపై ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. అటువంటిది తెలంగాణ సాధనోద్యమంలోకి వచ్చిన కేవలం పదిహేనేళ్లలోనే కుట్ర కేసును ఎదుర్కోవాల్సి వచ్చిందంటే పాలకుల లక్ష్యం ఆమె గత నేపథ్యం కాదు, కేవలం తెలంగాణయే అనేది సుస్పష్టం. దాన్ని అణచడానికే ఈ కుట్ర కేసు తతంగం అని చెప్పవచ్చు.

ఎమ్మార్ ప్రాపర్టీస్ అక్రమాలను వెలికి తీసి, ఆ భూములననీ రైతులకు పంచాలనడం కుట్రనా.. వక్ఫ్ భూములపై ల్యాంకో హిల్స్ నిర్మించడం అక్రమమని చాటి చెప్పడం కుట్రనా... గౌరవ హైకోర్టు కూడా ఇవి వక్ఫ్ భూములని తీర్పునిచ్చింది. కోర్టు ఆదేశాలతోనే ఎమ్మార్ ప్రాపర్టీస్ అక్రమాలపై కేసులు నమోదై విచారణ కొనసాగుతున్నది. శంషాబాద్ విమానాశ్రయం నిర్మాణంలో జిఎంఆర్ సంస్థకు 5 వేల ఎకరాల భూమి కేటాయించడంపై సాక్షాత్తు సుప్రీంకోర్టే ఆశ్చర్యం వ్యక్తం చేసింది.

సుప్రీంకోర్టు మార్గదర్శకాలను సైతం లెక్కచేయకుండా ప్రజాహితాన్ని, పర్యావరణాన్ని మరిచి కరీంనగర్ చుట్టు ఉన్న 570 గుట్టలను సీమాంధ్రులకు కట్టబెట్టడాన్ని నిరసిస్తే కుట్ర అవుతుందా... హైదరాబాదులోని ఫిరంగి కాలువ కింద జరిగిన భూ ఆక్రమణలని వెలికి తీయటం కుట్ర అవుతుందా.. ఇవన్నీ కిడ్ - ప్రో - కో పేరున తెలంగాణ వనరులను దోచుకోవడం కాదా... వీటిని ప్రశ్నిస్తే రాజ్యాధికార ధిక్కరణ ఎలా అవుతుందో ప్రజాస్వామ్యవాదులు ఆలోచించాలి.

తెలంగాణ రాష్ట్ర సాధనకు అడ్డంకిగా మారిన తెలంగాణ వ్యతిరేకుల ఆర్థిక మూలాలను దెబ్బ తీయగలిగితేనే తెలంగాణ సాధ్యమనే అంశం పతి ఉద్యమ సంస్థ, నాయకులు టిజాక, కోదండరామ్‌తో సహా టిఆర్ఎస్ పార్టీ కూడా పదే పదే చెబుతున్నదే. కానీ ఎలా చేయాలనేది మాత్రం ఎవరు కార్యాచరణ ఇవ్వలేకపోతున్నారు. విమలక్క మటుకు తనకు తోచిన విధంగా పై అంశాలన్నింటిలో ప్రజాస్వామ్యయుతంగానే వ్యవహరించిందని చెప్పాలి. ఎక్కడా తీవ్రమైన కేసులైన దాఖలాలు లేవు.

కానీ, సెప్టెంబర్ 30న టిజాక్ ఇచ్చిన పిలుపు సందర్భంగా విమలక్క బృందంలోని కొంత మంది మాదాపూర్ దగ్గర టోల్‌గేట్‌ను ధ్వంసం చేశారనే ఆరోపణలో ఆమెను అరెస్టు చేయడం వెనక కేవలం జీవవైవిధ్య సదస్సుకు వస్తున్న ప్రధానమంత్రికి వినతిపత్రం ఇస్తామని ప్రకటించడమే దానికి ప్రధాన కారణం. సంఘటన రోజున ఆమె తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నది. ఆ విషయం స్వయంగా పోలీసులే కోర్టుకు విన్నవించుకున్నారీు. కానీ విచిత్రమేమంటే రెగ్యులర్ బెయిల్ అడిగితే ఐడెంటిఫికేషన్ పెరేడ్ జరగాలన్నారు.

ప్రజలంతా గుర్తు పట్టే కళాకారణికి అది వర్తించదని న్యాయకోవిదులు మొత్తుకున్నా ప్రభుత్వం పట్టించుకోలేదు. తీరా పరేడ్ జరిగినా ఆమెను గుర్తు పట్టలేదు. మొన్ననే బెయిల్ వచ్చినప్పటికీ నాలుగు రోజుల సెలవు కారణంగా ఆర్డర్ రాలేకపోయింది. ఇంతలో నిజామాబాద్ పోలీసులు 2010 నాటి దేవునిపల్లి కుట్ర కేసులో ఆమను తిరిగి బంధించారు. అంటే దీని వెనక ప్రభుత్వ ఉద్దేశంయ ఒక మహిళా కళాకారణిని శాశ్వత బందీగా ఉంచడమే.

విచిత్రమేమిటంటే, టఫ్, మా హైదరాబాద్, పియుసిఎల్, మహాదేవి ఖ్వామి మూవ్‌మెంట్ లాంటి ప్రజా సంఘాలు హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కలిసి విమలని విడుదల చేయాలని కోరినప్పుడు సానుకూలంగా స్పందించిన ఆమె బెయిల్ పిటిషన్‌ను వ్యతిరేకించవద్దని పోలీసులను కోరింది. అయినప్పటికీ ఆమె బెయిల్ దరఖాస్తును కోర్టు కొట్టేసింది. దానికి కారణం పోలీసులు విమలక్క ఇన్ని రోజులు పరారీలో ఉన్నదని కోర్టుకు విన్నవించుకోవడమే.

వాస్తవంగా ఈ తప్పుడు ఎఫ్ఐఆర్‌పై విమలక్క గౌరవ హైకోర్టులో స్టే పొంది ఉంది. రెండేళ్లుగా ప్రతి రోజూ ప్రజా కార్యక్రమంలో మునిగితేలుతున్నా, రోజూ ప్రజల్లో, పత్రికల్లో కనిపించే విమల పోలీసుల కళ్లకు మటుకు కనిపించకపోవడం విచిత్రమే మరి. ఆమె 2010 నుంచి పరారీలో ఉందన్న వంక చూపించడం కేవలం విమలక్కకు బెయిల్ రావద్దనే పోలీసుల బాసుల ఆలోచన. అదీ కేసు విచారణ పూర్తయి, చార్జిషీట్ దాఖలై ముద్దాయిలందరికీ బెయిల్ మంజూరై అంతా ఎప్పుడో విడుదలై ఉండడం గమనించదగ్గ విషయం.

దీన్ని ప్రజాస్వామికవాదులందరూ ముక్తకంఠంతో ఖండించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఉద్యమ నాయకులు దీనిపై గళమెత్తాలి. లేకపోతే తెలంగాణ సాధనోద్యమంలో ఉండే అందరికి రేపు ఇటువంటి పరిస్థితే ఎదురయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా తెలంగాణ అంశం తిరిగి మరొక్కసారి 1969లో లాగానే ఎలక్షన్ల చుట్టూ పరిభ్రమిస్తూ రాజకీయ అంశంగా మారిన నేపథ్యంలో తెలంగాణ సాధన ఇప్పట్లో ప్రశ్నార్థకంగా మారింది. అందుకే శ్రీకృష్ణ కమిటీ సూచనల మేరకు తెలంగాణ వాదనను శాశ్వతంగా అణగదొక్కే చర్యలకు ప్రభుత్వం పూనుకుంటుందని భావించవ్చచు.

అసలు, కేసులే పెట్టాల్సి వస్తే డిసెంబర్ 7వ తేదీన అఖిలపక్ష భేటీలో తెలంగాణకు అనుకూలంగా సంతకాలు పెట్టి తీరా డిసెంబర్ 9న కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర సాధన ప్రకటన చేయగానే తిరోగమనం చేసిన నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షలను తుంగలో తొక్కిన నయవంచనకు పాల్పడిన నయా బూర్జువా రాజకీయ వ్యాపారులపై ప్రజాద్రోహం కేసులు పెట్టాలి. 800 మందికిపైగా తెలంగాణ బిడ్డల ఆత్మహత్యలకు కారణభూతులైనందుకు భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ల ప్రకారం అబెట్‌మెంట్ కేసులు పెట్టాలి. అంతేకాని ప్రజా సమస్యలపై నిస్వార్థంగా, ప్రజాస్వామ్యయుతంగా పోరాడుతున్న ప్రతిఘటన శక్తులపై కక్ష సాధించడం ఎంత మాత్రం సరి కాదు. తెలంగాణ ఎప్పటికీ మండుతున్న కొలిమే.

- శ్రీధర్ ధర్మాసనం
సీనియర్ జర్నలిస్టు, మా హైదరాబాద్ కన్వీనర్

English summary
Sridhar Dharmasanam, senior journalist and convener Maa Hyderabad is opposing filing case against Vimalakka, who is active in Telangana movement.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X