• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

తెలంగాణ మార్చ్: సంగిశెట్టి శ్రీనివాస్ అనుభవం

By Pratap
|

Sangisetti Srinivas
ఘడియ కొక్కరు ఫోన్‌ చేసి ఏడున్నవన్నా, ఎట్లవోతున్నవ్‌, యాడ కలుద్దాం అని ముప్పై తారీఖు నాటి పొద్దుగాలటి సందే దోస్తులందరు పలుకరించుడు షురు జేసిండ్రు. సాగరహారంలో షామిల్‌ అయ్యేందుకు ఇంట్లకేలి బయట్కొచ్చెసరికి మిర్యాలగూడ నుంచి ‘సింగిడి' కన్వీనర్‌, మిత్రుడు ఏశాల శ్రీనివాస్‌ ఫోన్‌ జేసిండు. అన్న మనోళ్లు లారి మాట్లాడుకొని హైదరాబాద్‌కొస్తుంటే ‘రామోజి ఫిల్మ్‌సిటీ'కాడ ఆపేసిండ్రట. వాళ్లంత నడుసుకుంట అప్పుడే దిల్‌సుఖ్‌నగర్‌ దాకా వచ్చిండ్రు. ఎట్లయితదో ఏమో? ఏమైనా జరుగొచ్చు మనోళ్లందర్ని జాగ్రత్తగుండుమను. నువ్వు కూడా జాగ్రత్త అని మల్లొక్కసారి జెప్పి ఫోన్‌ పెట్టేసిండు.

నాకు టెన్షన్‌ షురువైంది. ఎక్కడికక్కడ ఆపేస్తే ఎట్లవోతం. ఇంత అన్నాలమా? ‘సాగర హారం' కోసం అనుమతి తీసుకొచ్చినమని సంకలు గుద్దుకుంటున్న కాంగ్రెస్‌ ఎంపీలను కూడా అరెస్టు చేసిండ్రని తెలిసింది. మరి ఈయింత దానికి అనుమతెందుకిచ్చిండ్రని ఎవ్వలి కోపం ఆళ్లు ఎల్లగక్కుతుండ్రు. ఎహె అనుమతియ్యకుంటెనే మంచిగుండేది. ఎక్కడోళ్లని అక్కడ ఆంధ్రోళ్లను యియ్యరమయ్యర జోపడానికి అవకాశముండె అని కూడా దోస్తులన్నరు. అనుమతిచ్చి మనల్ని నమ్మించి మోసం జేసిన వలసాధిపత్య గవుర్నమెంటుపై కోపం అంతకంతకు పెరుగుతోంది.

ఎక్కడెక్కడి నుంచో అన్న మేము గీడున్నమ్‌ నువ్వేడున్నవ్‌ అనే ఫోన్ల మధ్యనే మధ్యలో స్కైని కలుపుకొని ఆటోల ఖైరతబాద్‌ జంక్షన్‌ దగ్గరికి చేరుకున్నం. ఇగ బ్రిడ్జి దిగితె నెక్‌లెస్‌ రోడ్డు వస్తది కదా అని అటుదిక్కు పోవోతుంటె ఇనుప ముండ్ల కంచె కనబడ్డది. అగో ఇట్ల పోనిస్తరని పేపర్ల రాసిండ్రు కదా ఎందుకు పోనిస్తలేరు అని పోలిసోళ్లని అడిగితే ఇట్లకేలి పొయ్యేది లేదు. పేపర్ల తప్పుగ రాసిండ్రు. అని జవాబొచ్చింది. ఇగ ఏంజెయ్యాలె? ఎట్ల పోదామని ఆలోచన చేస్తూ ఖైరతబాద్‌ ఫుట్‌ఓవర్‌ బ్రిడ్జి కిందొచ్చి స్కైబాబ, నేను నిలబడ్డం. ఇంతల్నే ఖైరతబాద్‌ రైల్వే స్టేషన్‌ డోర్లు మూసేసి ఉన్నయి. అయితే మెల్ల మెల్లగ ఒక్కొక్కళ్లు బ్రిడ్జి వెనకనుంచి చిన్నగ తొవ్వతీసి రైలు పట్టాలు దాటేది కనిపించింది. ఇంకేంది తొవ్వ దొరికిందని సాగర హారం బాట పట్టినం. కొంత దూరం పోయినంక ఎవ్వరికి వాళ్లు ఎట్లకేలి పోవాల అని ప్రశ్నలేసుకునుడు షురు జేసిండ్రు. ఎందుకంటే అక్కడున్న అందరికీ అది కొత్త దారే!

మూడ్నాలుగు గల్లీలు తిరిగినంక 15,20 మంది జై తెలంగాణ అంటూ నినాదాలిస్తూ కనబడ్డరు, ఇగ వాళ్లెన్క, వాళ్లతో పాటు నినాదాలిస్తూ మరో నాలుగు గల్లీలు తిరిగే సరికి ఐమాక్స్‌ ఎదురుగ తేలినం. మస్తు సంతోషమైంది. ఇంకేంది ఇగ నెక్లెస్‌ రోడ్డేక్కుడే అనుకుంటే... పోలీసోళ్లు ఇక్కడ కూడ ఇనుప ముండ్ల కంచే ఏసి ఆపేసిండ్రు. అప్పటికే ఓ రెండు మూడొందల మంది ముండ్ల కంచె ముందట కూసొని నినాదాలిస్తుండ్రు. నేను, స్కై మెల్లగా ఆడికి చేరుకునే సరికి అప్పటి దాకా సప్పుడు చేకుండ ఉన్న పోలీసోళ్లు ఒక్కసారిగా లాఠీ చార్జికి దిగిండ్రు. కొత్తగ ఇచ్చిన స్టీల్‌ రాడ్ల లాంటి లాఠీలను వాళ్ళు రెండు చేతుల పట్టుకొని తమ బలమంతా ఉపయోగించి వెనక్కి ఫోర్స్‌గా తీసుకుంటే అంతకంటే ఎక్కువ ఫోర్స్‌తోటి ఉద్యమకారులపై దాడికి దిగిండ్రు. ఎవ్వరైన బక్కపానముంటే ఖచ్చితంగా బొక్కలిరిగేవి. ఏమో ఎవరియన్న యిరిగినయో ఏమో నాకు తెల్వదు. నా మీద దెబ్బ పల్లేదు గానీ ఉద్యమకారులు ఒక్కరి మీద ఒక్కరు తొక్కుకుంట ఉరుక బట్టిండ్రు. ఆగితే ఇంకొక దెబ్బ ఎక్కువ పడుతది కాబట్టి ఎవ్వరికి వాళ్లు ఆ లాఠీ దెబ్బలను తప్పించుకోడానికి ఉరక వట్టిండ్రు.

నేను బూట్లేసుకున్న కాబట్టి కొంచెం రక్షింపబడ్డ, అయినా పిక్కల మీద్దాకా ఒక్కటే తొక్కుడు. షర్ట్‌ ఎన్కంతా రక్త మరుకలే. ఎట్లనో అట్ల మెల్ల మెల్లగ గోడపొంటి బయటికొచ్చిన. కొంచెం సేపు వెతికితే స్కై కనిపించిండు. మనిషి మూడ్నాలుగు రోజుల సంది జెరంతోటి బాధపడుతూ అయ్యాల్నే కొంచెం కోలుకొని బయటికొచ్చిండు. కాళ్లకు చెప్పులు లేవు. అరచేయి నుంచి రక్త కారుతుంది. బలంగ నిలబడలేకవోతుండు. పోలీసోళ్ల లాఠి దెబ్బలు స్కైమీద బలంగనే పడ్డయి. తొడమీద దద్దులు తేలి రక్తం పేరింది. ఆ నొప్పి సక్కగ నిలువనిస్తలేదని అర్థమయింది. పోలీసోళ్లు ఉర్కించే సరికి మెల్ల మెల్లగ నడుసుకుంట ఖైరతాబాద్‌ వినాయకుణ్ని పెట్టే జాగదన్క వచ్చినం. ఆడ మెడికల్‌ షాపు కనబడితె అండ్ల గ్లూకోన్‌డి అడిగితే లేదన్నడు. ఎలక్ట్రాల్‌ పౌడరుంది కావాల్నా అని అడిగిండు షాపాయన. సరే యియ్యిమని తీసుకొని అప్పటికే స్కై తెచ్చుకున్న నీళ్లల్ల దాన్ని కలిపిన. నేను గూడా ఓ నీళ్ల బాటిల్‌ కొని నడుస్తుంటే గాదె వెంకటేష్‌ ఫోన్‌జేసిండు. ఆయన ఇల్లు కూడా గక్కడ్నే ఉంటది. సెన్సేషన్‌ థియేటర్‌ దిక్కు వస్తున్నం, జెన్‌ కాలేజి దగ్గర కలుద్దామని చెప్పిన, ఇదే విషయం అప్పటికే రిజర్వ్‌బ్యాంక్‌ దగ్గర ఉన్న పసునూరి రవీందర్‌కు కూడా చెప్పిన రమ్మన్న.

ఆయనతో పాటు ఉన్న శ్యామల, కొల్లూరి చిరంజీవి, ఉమేర్‌ ఖాన్‌ కూడా ఓ పదినిమిషాల తర్వాత వచ్చిండ్రు. ఆ తర్వాత గాదె వెంకటేష్‌ వచ్చిండు. అప్పటికే నెక్లెస్‌రోడ్డుకి ఖైరతబాద్‌ నుంచి చేరుకున్న ఊడ్గుల వేణు స్కైకి ఫోన్‌ జేసి అన్న మేము జేరుకున్నం, తొవ్వ ఖుల్లా అయింది ఇగరా అని చెప్పిండు. జెన్‌ కాలేజి దగ్గర చాయ్‌ తాగి నేను, స్కై, పసునూరి, గాదె వెంకటేశ్‌, పసూనూరి రాజేష్‌, తదితరులం మెల్లగ మళ్ల వచ్చిన దారిల్నే నడువబట్టినం. ఈసారి రోడ్డు ఖుల్లా అయింది. ఖైరతాబాద్‌ వినాయకుడ్ని పెట్టిన రోడ్ల నుంచి ఐమాక్స్‌కు, ఆ తర్వాత నెక్లెస్‌ రోడ్డుకు చేరుకున్నం.

రోడ్డుల నడుసుకుంట పోతున్న దశలో పోలీసోళ్లను, ఆంధ్రోళ్లను అందరు ఒక్కటే తిట్టుడు. మంచి మంచి తెలంగాణ పదాలల్ల తిట్లు సాగినయి. తొవ్వల శాన మంది కలిసిండ్రు. తెలంగాణ టీచర్స్‌ ఫోరమ్‌ రాములు, శ్రీధర్‌ (టీచర్‌), నీలిజెండా పత్రిక బాధ్యుడు మిత్రుడు జి.జ్ఞానేశ్వర్‌, తాండూర్‌ టిఆర్‌ఎస్‌ మిత్రులు విజయ్‌ ఇట్లా కొన్ని వందలమంది కలిసిండ్రు. జలవిహార్‌కాడ కొంచెం సేపు కూలబడ్డం. నెక్లెస్‌ రోడ్డుకి అటువైపు పీవీఘాట్‌ దగ్గర చీమల దండులాగా ఉస్కెపోస్తే రాలనంద జనం కనబడుతుండ్రు. ఎటు జూసినా జనం జాతర సాగుతోంది.

ఈ జాతర మధ్యలోనే గాలి నల్లటి పొగలు పైకి లేస్తున్నయి. పోలీసోళ్ల వ్యాన్లు లాఠీ దెబ్బలు తిన్నోళ్ల చేతిలో అహుతయ్యాయని చెప్పిండ్రు. ఆ యెంటనే పోలీసోళ్ల భాష్పవాయువు గోళాల సప్పుడు టప్ప టప్ప ఒక్కటే పేలుతున్నయి. కండ్లు మండపట్టినయి. వశంగాకుంటయ్యింది. మూతికి బట్టకట్టుకొని జెర్ర పక్కకు నిలబడ్డ. ఇంతల్నే జై తెలంగాణ అంటూ అప్పుడే మా ముందటికేళి ఫిరంగుల్లా దూసుకెళ్లిన ఆడపిల్లలు అంతే స్పీడుగా వాపస్‌ రావట్టిండ్రు. పోలీసోళ్లు వాల్ల కొత్త లాఠీలకు మల్ల పన్జెప్పిండ్రు. ఆడపిల్లలు అనిసూడకుండా ఆళ్ల మీద పడ్డరు. కొంచెం దూరం ఉర్కించి కొద్దిగంత సేపు పోలిసోళ్లు రెస్ట్‌ తీసుకుంటుండ్రు. మళ్ల జెర్రసేపాగి మళ్ల లాఠీలు పట్టుకొని పబ్లిక్‌ ఎన్క పడ్డరు.

రెండు మూడు సార్లు అటురికి ఇటురికి. చిన్న సందుల కేలి రైలుపట్టాలు దాటినం. వెంటనే అన్న నా పుస్తకం అని గాదె వెంకటేశ్‌ అన్నడు. అప్పుడు గుర్తుకొచ్చింది. గాదె వెంకటేశ్‌కు ఫోన్జేసినప్పుడు అన్న నేను ఇంటికాడున్న నా కవిత్వం ‘పొలి'ని ఆవిష్కరించుకుందాం అని జెప్పిండు. అప్పటికే ఎన్క టప్ప టప్ప గోళాల సప్పుడెక్కువైంది. ఎట్లయితె అట్లాయె పుస్తకాన్ని ఆవిష్కరించాలని మళ్లీ పట్టాలు దాటొచ్చి ఎన్క భాష్పవాయుగోళాల మధ్యన నెక్లెస్‌ రోడ్డు నడి మధ్యల ఎనకాల పబ్లిక్‌ ముక్కులకు బట్టలుగట్టుకొని ఉరుకొస్తుంటే ‘పొలి'ని నేను అవిష్కరించిన. పసునూరి రవీందర్‌, గాదె వెంకటేశ్‌ కూడ ఉన్నరు. జైతెలంగాణ అంటూ నినదిస్తూ ఒక చారిత్రక సంఘటనకు ప్రాణం పోసినం. బహుశా భాష్పవాయువు గోళాల మధ్యన, లక్షలాది తెలంగాణ ప్రజల మధ్యన ఆవిష్కరణ జరుపుకున్న ఏకైక పుస్తకం ‘పొలి'. ఈ యాది, పుస్తక ఆవిష్కరణ తెలంగాణ ఉద్యమంలో చిరస్థాయిగా నిలిచిపోయే అరుదైన, అపురూపమైన అవకాశాన్ని అందించింది. అందుకు అవకాశమిచ్చిన గాదె వెంకటేశ్‌కు షుక్రియా.

మా ముందు నుంచే 20 లారీలల్ల పోలీసోళ్లు అంతకుముందే ఉన్న వాళ్లకు తోడుగా చేరుకున్నరు. ప్రజల్ని అటిటు ఎటూ పోనియకుండా జేసి తొక్కిసలాటలో వాళ్లే చనిపోయేలా చెయ్యాలనే ప్లాన్‌ వేసినట్లు కూడా అనుమానమొచ్చింది. యుద్ధాక్షేత్రాన్ని ముద్దాడాలని చేసిన ప్రయత్నం సఫలమయ్యింది. తెలంగాణ వచ్చేదాకా తెగించి కొట్లాడేందుకు ఈ మార్చ్‌ మంచి టానిక్‌లాగా పనిచేస్తదని నమ్ముతున్న.

- సంగిశెట్టి శ్రీనివాస్‌

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Sangisetti Srinivas, a prominent Telangana writer and researcher, participated in Telangana March on september 30 in Hyderabad. He narrated his experience in march.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more