వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దళిత, విప్లవ ఉద్యమాలు - భిన్న కోణాలు

By Pratap
|
Google Oneindia TeluguNews

katti padma rao and bs ramulu
నేను డా. కత్తి పద్మారావుగారు సాహిత్యం ద్వారా ఉద్యమాల్లోకి వచ్చినవాళ్లం. అనేక విషయాల్లో కలిసి పనిచేయడానికి ఇది చక్కని ప్రాతిపదిక వేసింది. సాహిత్యంలో సహృదయత, సౌజన్యం, వ్యక్తిత్వ వికాసం, ప్రేమ, కరుణ, ప్రజ్ఞ, మానవీయ విలువలు, సంస్కృతి లక్ష్యం. అందువల్ల సాహిత్యకారులు, సాహిత్య పాఠకులు, ఉద్యమాల్లోకి వచ్చినప్పుడు అవి ఇతర ఉద్యమాలకన్నా, ఉన్నతమైన మానవీయ విలువలతో, సహృదయతతో, ప్రేమ, కరుణ, సంస్కృతితో విలసిల్లుతాయి. వ్యక్తుల మధ్య, సంస్థల మధ్య సంబంధాలను కూడా మానవీయం చేస్తాయి. మనిషిని ప్రేమించే స్వభావాన్ని పెంచుతాయి. ద్వేషించాల్సిన మనిషిని కూడా క్షమించగలిగే సంస్కారాన్ని అందిస్తాయి.

సాహిత్య సంపర్కం లేని ఉద్యమాల్లో ఇది చాలా కష్టం. అందువల్ల చాలా ఉద్యమాలు, సాహిత్యం, కళలు జమిలీగా పెనవేసుకొని సాగుతాయి. ఒక థలో ఉద్యమాలను సాహిత్యం, కళలే ముందుకు తీసుకువెళతాయి. ఉద్యమకారులు సాహిత్యం, కళల ద్వారా పెరిగిన చైతన్యాన్ని నిర్మాణంలోకి మలిచే కృషి చేస్తారు. ఉద్యమాల ప్రభావం ఎంతో గొప్పగా ఉంటుంది. కానీ నిర్మాణ రూపంలోకి దాన్నంతటినీ తీసుకురావడం అసాధ్యమైన విషయం. సాహిత్యం, కళల ప్రభావాన్ని పూర్తి స్థాయిలో నిర్మాణరూపంలోకి తీసుకురావడం కూడా అంతే అసాధ్యం.

ధర్మపురి ప్రాంతంలో భూస్వాములకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు సాగితే వారి గురించి చేసే ప్రచారం, వేసే కరపత్రాలు చూసి ఒక్కోసారి నవ్వు వచ్చేది. వాళ్లా భూస్వాములు అని నవ్వుకునేవాణ్ని. ఎందుకంటే నెలకు నాలుగు రూపాయలు దినపత్రికల చందాను ఇవ్వాల్సిన డబ్బు ఆరునెలలదాకా ఇవ్వలేని వాళ్లు, దాన్యం తీసుకుపోతానని వారిదగ్గరనుంచి తెచ్చుకున్న సంఘటనలు... గుర్తుకు వచ్చేవి. డైలీ పేపర్‌, పోస్టల్‌ రన్నర్‌ల ద్వారా పంపించడం బంద్‌ చేస్తానని భూస్వాములను బెదరించేవాడిని. ఇది భూస్వాములకు నాకు ఉన్న ఆనాటి సంబంధాలు. అందులో నాకు వారు ఏవిధంగా భూస్వాములో నాకు అర్థం కాలేదు. ఇది అజ్ఞానం కావచ్చు. సాహిత్యం ఇచ్చిన సంస్కారం కావచ్చు. నాకు భూస్వాములతో సమస్య లేకపోవడం కావచ్చు. అయితే భూస్వాములపై వేసే కరపత్రాలు, చేసే ప్రచారం వారి శక్తి సామర్ధ్యాలకన్నా వందల రెట్ల శక్తివంతుల్లాగా ఉన్నట్లు భయపడేవిధంగా ఉండేవి. ఆ ప్రచారాన్ని, కరపత్రాలను చూసి వాళ్లు ఇంత భయంకరులా అని భయపడ్డంకూడా నేర్పిందేమో. కొంతమంది కామ్రేడ్‌లు, ఆమాట కూడా అన్నారు. శత్రువులను చూసి భయపడ్డం నేర్పితే అంతకన్నా ఘోరం ఏముంటుంది? వామపక్షాలు, విప్లవకారులు, భూస్వాములను చూసి ఇలా భయపడ్డం నేర్పారు. ప్రభుత్వాలను వాటి నిర్బంధాలను చూసి భయపడ్డం నేర్పారు.

నేను ఇలా విప్లవోద్యమంలోకి వచ్చాక భయపడ్డం నేర్చుకున్నాను. భయంకరమైన భయానక మానసిక తత్త్వాన్ని విప్లవోద్యమం నాపై ప్రభావం వేసింది. దాంతో ఆవేశం పెల్లుబికేది. అది తిరుగుబాటుగా పరిణమించేది. నిరంతర భయానక వాతావరణంలో ఆలోచన, వివేచన మృగ్యమౌతుంది. ఆవేశం ప్రతిచర్య, ప్రతీకారం ప్రధానమౌతుంది. అలా చర్య ప్రతిచర్యల చుట్టూత విప్లవోద్యమం థాబ్దాలుగా కొనసాగుతూనే ఉంది.

భయ రహిత సమాజాన్ని ఎప్పుడు సృష్టిస్తాం? స్వేచ్ఛాయుతంగా ఆలోచించే వాతావరణాన్ని ఎప్పుడు కల్పిస్తాం? అప్పుడే మనిషి ఎదుగుతాడు. ఆలోచిస్తాడు. భయ వాతావరణంలో సహజాతాలకు అనుగుణంగా జంతు థలోకి ఆత్మరక్షణ ప్రతీకార థలోకి మారతాడు. డా. కత్తి పద్మారావు దార్శనికుడిగా ఈ విషయాన్ని లోతుగా అర్థం చేసుకున్నారు. అందుకే దళిత మహాసభ, దళిత ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసే క్రమంలో అగ్రకులాలంటే భయపడేబదులుగా, ఎవడ్రావాడు? అని ప్రశ్నించే స్వభానికి, ఆత్మవిశ్వాసానికి మలుపు తీసుకుంది.

దీన్నే కొందరు అగ్రకుల స్వభావం కలవారు. దళితులు దళితోద్యమంతో పెట్రేగిపోయారు, మా ఆడపిల్లలను వేదిస్తున్నారు. రోడ్డుమీద నడవడం కూడా కష్టమైపోయింది అని దళితోద్యమాన్ని విమర్శించేవారు. అది కొంత సాగిందేమో. వేల యేళ్ల కులాల అణచివేతనుండి ఒక్కసారిగా ఆత్మవిశ్వాసం పొందినప్పుడు కలిగే కసి ఎంతకైనా తెగించే స్వభావాన్ని సంతరించుకోవచ్చు. ఆ థ కొద్దికాలమే. తనను అందరితో సమానంగా గౌరవించే సంస్కారం సమాజం పొందినప్పుడు ఆ కసి దానంతటదే అదృశ్యమౌతుంది.

అలా దళిత ఉద్యమం ఒక జలపాతంలా ముందుకు సాగిన చర్య ప్రతిచర్యగా ఆవేశకావేశాల, కసి థల నుండి ప్రజాస్వామిక సంస్కృతి దిశగా పరిణమించింది. అందుకే ఇవాళ అందరు కలిసి జీవిస్తున్నారు. ఇది ఎంత కాలం కొనసాగుతుంది. ఈ సయోధ్య, ఎంత కాలం కొనసాగుతుందంటే, డా. బి.ఆర్‌. అంబేడ్కర్‌ మార్గంలో ముందుకు సాగినంతకాలం కొనసాగుతుంది.

శాంతియుత ప్రవర్తనను అహింసాయుత ప్రజాస్వామిక విలువలను ఆచరించినంతకాలం కొనసాగుతుంది. తత్వం యొక్క, భావజాలం యొక్క, మానసిక పరివర్తన యొక్క ప్రాధాన్యతను గుర్తించినంతకాలం కొనసాగుతుంది. వీటి ప్రాధాన్యతను గుర్తిస్తే మానసిక ప్రవర్తన కోసం భావజాల సంఘర్షణ వేగవంతం అవుతుంది. అది భావాల్లోనే తప్ప భౌతిక దాడులకు ఆస్కారం ఇవ్వని ప్రజాస్వామ్య జీవన విధానాన్ని మానవీయ విలువలను ప్రతిపాదించినపుడు శాంతియుత పరివర్తన ద్వారా సామాజిక న్యాయం, సామాజిక మార్పు సాధించడం సమసమాజ నిర్మాణ దృక్పథం సాధ్యపడుతుంది.

కొందరు నాకు ఐదువేల ర్యాంకు వచ్చింది మెడికల్‌ సీటు రాలేదు. కానీ రిజర్వేషన్‌లో ఫలానావారికి 10 వేలు ర్యాంకు వచ్చినా సీటు వచ్చింది అని తనదేదో ప్రతిభ అన్నట్టు విమర్శిస్తుంటారు. వాళ్లు లక్షలు పోసి సీట్లు కొనుక్కొనే వారిని ఇదే విధంగా విమర్శించడం లేదు. యాభై యేళ్ళ క్రితం మార్కులను బట్టే సీట్లు ఇచ్చేవారు. రిజర్వేషన్‌ పొందే సామాజిక వర్గాలు, సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా, విద్యాపరంగా అగ్రకులాలతో సుమారు యాభై యేళ్లు వెనకబడి కొనసాగుతున్నాయి. యాభై యేళ్ళ క్రితం అగ్రకులాలు ఎలా విద్యను, ఉద్యోగాలను అందుకున్నారో, పరిశ్రమలను పెట్టుకున్నారో, అధికారంలోకి వచ్చారో, అదే ఇప్పుడు ఎదుగుతున్న రిజర్వేషన్‌ సామాజిక వర్గాలు సాధించుకోవడానికి రిజర్వేషన్‌లు కొంత ఉపయోగపడతాయి.

పదివేల ర్యాంకులో మెడికల్‌ సీటు వస్తుందంటే వాళ్లు ఇంకా ఎదగలేదని అర్థం. ఓపెన్‌ కాంపిటీషన్‌లో నెగ్గే స్థాయి జీవన ప్రమాణాలు, విద్యా ప్రమాణాలు సమాజం, ప్రభుత్వం వారికి ఇంకా అందించలేదని అర్థం. అందువల్ల వారిపట్ల సానుభూతి చూపాలే కానీ, ద్వేషం ప్రదర్శించడం కాదు. ర్యాంకులు బాగా తెచ్చుకునేవారికుండే సౌకర్యాలు రిజర్వేషన్‌లు పొందే సామాజిక వర్గాలకు లేవు. పైగా రిజర్వేషన్‌ లేని వర్గాలు డబ్బుతో కూడా వేల సీట్లను కొనుక్కుంటున్నారు.

ఈ అసమాన అభివృద్ధి అవకాశాలు తిరిగి అసమానతలను పెంచడానికే. రిజర్వేషన్‌లే సమాజాన్ని ఒక సమస్థితిలో అందరూ సమానంగా ఎదిగే సామాజిక న్యాయానికి, సామాజిక మార్పుకు దోహదపడతాయి. ఈ విషయం సమాజపరంగా అంగీకరించినప్పటికీ, తన విషయానికొచ్చేసరికి కొందరు ఐదువేల ర్యాంకులు వచ్చినవారు బాధపడవచ్చు. అది సహజం. కానీ జనాభా నిష్పత్తి ప్రకారంగా ఆయా సామాజిక వర్గాలకు రిజర్వేషన్‌లు, అవకాశాలు ఉన్నప్పుడే అది సమాజం అవుతుంది.

రిజర్వేషన్‌లు అక్కర్లేదనుకునేవారు అన్ని రంగాల్లో రిజర్వేషన్‌లు కోరుకుంటారు. తల్లిదండ్రుల ఆస్థి, గౌరవాలు, కుల అంతస్థులు తమకే రిజర్వేషన్‌లు కావాలని కోరుకుంటారు. ఈ దేశం తమకే రిజర్వ్‌ కావాలని కోరుకుంటారు. బలమున్నవాడిదే, ప్రతిభ ఉన్నవాడిదే రాజ్యమయ్యేది అయితే దేశ సరిహద్దుల్లో సైన్యం అక్కరలేదు. ఇతర దేశాల ప్రజలను, వారి రాకపోకలను నియంత్రించాల్సిన అవసరం లేదు. అసలు పోలీసులే అక్కరలేదు. చట్టాలే అక్కరలేదు. ప్రభుత్వాలు అక్కరలేదు. బలం ఉన్నవాడే, ప్రతిభ ఉన్నవాడే అన్నిటిని పోటీలో గెలుచుకోవచ్చు.

పూర్వం యుద్ధాలతో రాజ్యాలపై బడి రాజ్యాలను గెలుచుకునేవారు. ఇలా రిజర్వేషన్‌లలో సొంత ఆస్థిహక్కు, వారసత్వ హక్కు, దేశభద్రతా హక్కు, చట్టబద్దతతో న్యాయబద్దమైన హక్కు, స్వేచ్ఛా సమానత్వపు హక్కు పొందుతున్నారు. అందువల్ల ప్రతిదీ ఒక పద్ధతి ప్రకారం రిజర్వేషన్‌ చేయబడుతున్నది. తల్లి తొమ్మిది నెలలు తన కడుపును రిజర్వేషన్‌ చేయడం ద్వారానే పిల్లలను కంటున్నది. వాన నీటిని చెరువుల ద్వారా కాలువలు ద్వారా రిజర్వాయర్లుగా మార్చుకోవడం ద్వారానే పొలాలకు నీళ్ళు పెట్టడం జరుగుతుంది. అన్ని రంగాల్లో శాంతియుత సహజీవనం సాగడానికి సామాజిక న్యాయం కోసం ఇలా కుటుంబంలో, సమాజంలో, దేశంలో అనేక రూపాల్లో రిజర్వేషన్‌లు కొనసాగుతున్నాయి.

రిజర్వేషన్‌లు రద్దు చేయాలనుకునేవారు. మొట్టమొదట వారసత్వ ఆస్థి హక్కును, వారసత్వ కుల ప్రతిష్ఠ, గౌరవాలను, ఒకరికి ఒకే భార్య, ఒకే భర్త అనే రిజర్వేషన్‌ హక్కును మొట్టమొదట రద్దు చేయాలని కోరవలసి ఉంటుంది. అరాచకమైన సమాజాన్ని ఒక శాంతియుత సహజీవనంలో కలిసి జీవించడానికి అనువుగా ఒకే భార్య, ఒకే భర్త రిజర్వేషన్‌ని ఎలా ప్రవేశపెట్టారో, అలాగే సమాజంలో అనేక రంగాల్లో కొన్ని రిజర్వేషన్‌లు కొనసాగుతూ వస్తున్నాయి. జ్ఞానం ఒక్కటే రిజర్వేషన్‌ లేకుండా ఎవరైనా పొందగలిగేది. హక్కు, అవకాశాలు ప్రజాస్వామ్యంలో పెరిగాయి. ఆస్థి, సంపద, వారసత్వానికి రిజర్వ్‌ కావడంవల్ల అది అందరి సొత్తు కాలేకపోతుంది. విద్య, విజ్ఞానం, సైన్సు, టెక్నాలజీ, ప్రభుత్వ ఉద్యోగాలు మొదలైనవి మాత్రమే వారసత్వ హక్కు లేకుండా అందరూ అందుకునే అవకాశం ఏర్పడింది.

అందువల్ల డాక్టర్‌ బి.ఆర్‌. అంబేడ్కర్‌ భూములను వారసత్వ హక్కుగా అనుభవిస్తున్న వారందరినీ భూమినుండి, భూమి యజమానినుండి తొలగించాలని, ప్రభుత్వం తీసుకొని వారికి డిబెంచర్‌లు ఇవ్వాలని కోరారు. అంతదాక భూమి గురించి కాకుండా, అందరికీ ఎదిగే అవకాశాలు ఉన్నాయి. విద్యకు ప్రాధాన్యతను ఇచ్చారు. విద్య ద్వారానే అన్ని రంగాల్లో ఎదగవచ్చు. రాజకీయ అధికారం ద్వారా అన్ని రంగాలను మార్చవచ్చు అని అంబేడ్కర్‌ చేసిన బోధనలు. అంబేడ్కర్‌ మార్గాన్ని తెలుపుతాయి. ఈ మార్గంలో డా. కత్తి పద్మారావు ముందుకు సాగారు.

విప్లవోద్యమం ఇందుకు భిన్నంగా కొనసాగింది. ఇది అశాస్త్రీయ విద్యావిదానం అని విద్యను నిర్లక్ష్యం చేసింది. ఉన్నత విద్యను అందుకోకుండా దారి మరల్చింది. భూమికోసం ఉద్యమం చేయాలని పిలుపునిచ్చింది. అటు భూమి, దక్కలేదు, ఇటు విద్య దక్కలేదు. మరోవైపు సుఖశాంతులకు దూరమయ్యారు. నిర్బంధాల పాలయ్యారు. దున్నేవాడికే భూమి లభిస్తే సన్నకారు రైతు జీవితమే తప్ప గొప్ప జీవితం ఏమీ ఉండదు. భూమి చట్టబద్ధంగా దున్నేవారికి అనిపించే అంతిమ లక్ష్యం, విప్లవకారులకు లేదు. విప్లవం విజయవంతమైన తరువాత భూమిని పంచుతారు. విప్లవం విజయవంతమైన తర్వాత భూమి ఎందుకు? పంచడం ఎందుకు? అంబేడ్కర్‌ చెప్పినట్లు ప్రభుత్వమే మొత్తం భూమి మొత్తాన్ని జాతీయం చేయవచ్చు.

అందువల్ల రాజకీయ అధికారం, విద్య, వైజ్ఞానికా పరిపాలనా రంగాలలో అత్యున్నతంగా ఎదిగి ప్రజల జీవన ప్రమాణాలు పెంచే కృషిలో భాగస్వాములు కావాలి. అంబేడ్కర్‌ ముందుచూపుతో వందేళ్ళ ముందు ప్రతిపాదనలు చేశారు. దీనివల్లే దేశంలో, వేల యేళ్ళ అణచివేతనుండి కోట్లాది మంది దళితులు విద్య అందుకొని, రిజర్వేషన్‌లు అందుకొని, అనేక రంగాల్లో ఎదుగుతున్నారు. ఎదిగి శాంతియుత పరివర్తన థాబ్దాల వామపక్ష ఉద్యమంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలు ఇలా ఎదిగింది తక్కువ. సంఘటిత రంగంలో ఉండేవారిని, వారి సమస్యలను పట్టించుకొని, వారి జీవన ప్రమాణాలకు వామపక్షాలు కృషి చేశాయి. తద్వారా ఎదిగిన వారికే అన్ని సౌకర్యాలు లభించాయి. అంబేడ్కర్‌ ప్రవేశపెట్టిన రిజర్వేషన్‌లు సంఘటిత రంగంలోకి వచ్చే వారిలో బీసీ, ఎస్సీ, ఎస్టీలు కూడా ఉండే మార్గం వేశారు. అనగా వామపక్షాలు ఉన్న స్థితిని కొనసాగిస్తే అంబేడ్కర్‌ ఉన్న స్థితిలో మార్పును తీసుకువచ్చారు. డా. కత్తి పద్మారావు ఈ విషయాలను దళిత మహాసభ శిక్షణా తరగతుల్లో విస్తృతంగా బోధించేవారు.

అంబేడ్కర్‌ గ్రామాలను నిర్మూలించాలని భావించినట్లు ప్రచారంలో ఉంది. అంబేడ్కర్‌ కాలంనాటికి 10 వేలకు తక్కువ కాకుండా ఉండేవిధంగా గ్రామాలను కలిపేయాలని, నిర్మించాలని భావించారంటారు. సన్నకారు ఉత్పత్తి విధానం, గ్రామీణ స్వయం పోషక కుల వ్యవస్థ ప్రాతిపదికగా గల ఉత్పత్తి విధానం, జీవన విధానం ఈ చిన్న గ్రామీణ వ్యవస్థవలే వేల యేళ్లు కొనసాగుతూ విదేశాలనుండి ఇతర రాజ్యాల నుండి ఎన్ని దాడులు జరిగినా పట్టించుకోని విధంగా కొనసాగడం జరుగుతూ వచ్చిందని, కుల నిర్మూలనకు, జాతీయ భావాల అభివృద్ధికి గ్రామాన్ని నిర్మూలించి, అధిక జనాభాగల పట్టణాలుగా మలచాలని భావించారు.

లెనిన్‌ కూడా సన్నకారు ఉత్పత్తి విధానం నిరంతరం భూస్వామ్య వ్యవస్థను, భూస్వామ్య వర్గ సంబంధాలను, వర్గాలను నిరంతరం సృష్టిస్తుందని భావించారు. అంబేడ్కర్‌ చెప్పింది కూడా ఇదే. ఆధునిక విద్య, ఆధునిక పారిశ్రామికీకరణ ద్వారానే ఆధునిక సామాజిక సంబంధాలు ఏర్పడతాయి అని లెనిన్‌, నెహ్రూ, అంబేడ్కర్‌ భావించారు. గాంధీ దీనికి భిన్నంగా ఆలోచించారు. గ్రామాలను నిర్మించాలన్నారు. సన్నకారు, చిన్నకారు కుటీర పరిశ్రమల విధానాన్ని, వృత్తి విద్యలను ప్రధానం చేసే వార్దా విద్యావిధానం ప్రకటన చేశారు. వామపక్షవాదులు, నక్సలైట్లు గాంధీ ఆలోచనా విధానంలో గ్రామాలగురించి ఆలోచిస్తుంటారు.

బోధకుడిగా డాక్టర్‌ కత్తి పద్మారావుగారు విశేష అనుభవాన్ని గడించారు. మహోపాధ్యాయుడిగా ఎదిగారు. కార్యకర్తలకు, ప్రజలకు శిక్షణా తరగతుల, అధ్యయన తరగతుల ఆవశ్యకతను బాగా గుర్తించారు. 1930లలో జాతీయోద్యమంలో గుంటూరు జిల్లాలో సాగిన శిక్షణా తరగతుల్లోంచే ఎన్‌.జి. రంగా వంటి నాయకులు ఎదిగారని కత్తి పద్మారావు ఇప్పటికీ గుర్తు చేస్తుంటారు. తనదైన సిలబస్‌తో వర్తమాన కర్తవ్యాలను, సామాజిక అవగాహణను బోధించే శిక్షణా తరగతులు లేకుండా, ఏ ఉద్యమమూ ఎంతో కాలం ముందుకు సాగదు. ముందుకు సాగినా, అరాచకత్వం తప్ప ఒక సుశిక్షితులైన కార్యకర్తలతో, నిర్మాణంతో ముందుకు సాగడం నూతన సంస్కృతిని రూపొందించడం సాధ్యం కాదు.
ఇది గమనించిన కత్తి పద్మారావుగారు కొన్ని వందల శిక్షణా తరగతులను నిర్వహించారు. ఆయా బహిరంగ సభల్లో చేసే ప్రసంగాలు కూడా శిక్షణా తరగతుల్లా అనేక విషయాలను ఆవేశాన్ని, ఉత్తేజాన్ని జోడించి ప్రజలను చైతన్యపరిచేవే. అలా కత్తి పద్మారావు నిత్య బోధకుడిగా, థాబ్దాలుగా సామాజిక చైతన్యాన్ని అందిస్తూ, సమస్యలు కరుడు కట్టిపోకుండా, మంచుల వాటంతటవే కరిగిపోయేవిధంగా చైతన్యాన్ని, విద్యను, సామాజిక వర్గాల బల ప్రదర్శనను, నినాదాలను, ఆయుధాలుగా ప్రయోగించారు. విజయం సాధించారు. అందువల్లే కారంచేడు, చుండూరు వంటి సంఘటనలు జరిగే మానసిక వైకల్యం సమాజంలో మంచులా కరిగిపోతూ వచ్చింది. పరస్పరం గౌరవించుకునే సమానంగా చూసే దృష్టి పెరిగింది.

దండోరా ఉద్యమం వచ్చాక, కులం పేరే హీనంగా చూసింది. థనుండి దళితులు కులం పేరును ఆత్మగౌరవ ప్రకటనగా భరించే స్థితి పెరిగింది. సమాజం యొక్క మైండ్‌సెట్‌ మార్చింది. వేలాది స్వచ్ఛంద సంస్థల్లో ప్రజలమధ్య పని చేస్తున్నవాళ్ళయినా, జర్నలిస్టులుగా, రచయితలుగా, ప్రజాప్రతినిధులుగా, ప్రభుత్వ అధికారులుగా, ఉద్యోగులుగా, అడ్వకేట్‌లుగా, న్యాయమూర్తులుగా, డాక్టర్లుగా, ఇంజనీర్లుగా అనేక రంగాల్లో, అనేక పార్టీల్లో, అనేక ఉద్యమాల్లో దళితులు ఘననీయంగా పని చేస్తున్నారంటే దళిత చైతన్యంతో ముందుకు సాగుతున్నారంటే, దాని వెనుక దళిత ఉద్యమం, దళిత మహాసభ కృషి వాటివెనుక డా. కత్తి పద్మారావు త్యాగం, బోధకుడిగా, వక్తగా, నాయకుడిగా చేసిన కృషి ఎంతో ఉంది. ఇది రాష్ట్రంలో బహుజన సమాజ్‌ పార్టీ భావజాలం విస్తరించడంలో రాజకీయ సమీకరణ సాగడంలో ఎంతో తోడ్పడింది.

తెలుగునాట అంబేడ్కరిజం ఆచరణలో, బోధనలో దళిత మహాసభకు ముందు, దళిత మహాసభకు తర్వాత మౌలికమైన తేడా వుంది. దళిత మహాసభలకు ముందు అంబేడ్కర్‌ ఆలోచనా విధానం, మిషన్‌ ఓరియంటెడ్‌గా, బోధనలతో సాగింది. దళిత మహాసభ మిలిటెంట్‌ చైతన్యాన్ని పెంచి, సంఘటిత శక్తిని బలాన్ని ప్రదర్శించింది. అంబేడ్కర్‌ జయంతి, వర్ధంతుల సభలు కూడా, దళితుల సంఘటిత శక్తిని, బలాన్ని ప్రదర్శించడానికి సంబంధించినవే. అందుకే గ్రామగ్రామన అంబేడ్కర్‌ విగ్రహాలను స్థాపించడం, జయంతి వర్ధంతులను ఘణంగా జరపడం జరుగుతున్నవి. పుస్తకం చేతబూనిన అంబేడ్కర్‌ విగ్రహం దళితులకు, సమాజానికి విద్య యొక్క ప్రాధాన్యతను చెప్పకనే చెపుతుంది. కోటు, బూటు, సూటు వేషధారణ దళితులు ఎదగాల్సిన తీరును చెప్పకే చెబుతుంది.

కొందరు అంబేడ్కర్‌ విగ్రహాలను అవసరం లేదని బావిస్తుంటారు. బౌద్ధం సాక్ష్యాలు శతాబ్దాల తరబడి కొనసాగడానికి విగ్రహాలే కారణం. గుళ్ళు గోపురాలు, దైవ భావాలు కొనసాగడానికి ప్రతీకలు. తల్లిదండ్రుల, గురువుల ఫోటోలు స్ఫూర్తి కారకాలే. అలాగే అంబేడ్కర్‌ విగ్రహాలు కూడా స్ఫూర్తి దాయకాలు. ప్రపంచంలో ముస్లింలు తప్ప చాలా మతాలు ఏదో ఒక రూపంలో విగ్రహాలనుండి స్ఫూర్తి పొందుతున్నవారే. ముస్లిములు కూడా మక్కా మదీనాలను సందర్శించడం, ఆ స్థల రూపాల ప్రాధాన్యతను గుర్తించడమే.

అందుకే అంబేడ్కర్‌ విగ్రహం దానికదొక స్ఫూర్తి, చైతన్యం, అంబేడ్కర్‌ను కోట్లాది దళితులు తమ దేవుడిగా భావిస్తారు. దేవుడే అంబేడ్కర్‌గా అవతారం ఎత్తాడని నమ్ముతుంటారు. బుద్ధుని అవతారం తర్వాత, కల్కి అవతారం బదులుగా అంబేడ్కర్‌ అవతారం ఎత్తాడని కొందరు దైవభక్తులు అంబేడ్కర్‌ను పూజిస్తారు. ఆరాధిస్తారు. కత్తి పద్మారావు వందలాది అంబేడ్కర్‌ విగ్రహాలను రాష్ట్రమంతటా ఉద్యమంలా ప్రతిష్ఠాపన చేయడానికి కృషి చేశారు. అంబేడ్కర్‌ విగ్రహాలను తయారు చేయించి, విగ్రహ ఆవిష్కరణ సభ జరిపేదాక అన్నిథలను పట్టించుకొని ఈ కృషి సాగించారు. ఇలా ఆయా గ్రామాలలో భారత రాజ్యాంగ నిర్మాత దళితుడేనని ప్రపంచంలో బాగా చదువుకున్న ఉన్నత విద్యావేత్త అని నిరంతరం అంబేడ్కర్‌ విగ్రహం గుర్తు చేస్తుంది. అలా భారతదేశంలో స్త్రీల చైతన్యం కోసం, స్త్రీ విద్య కోసం కృషి చేసిన మహాత్మ జ్యోతిరావు ఫూలే భారతదేశంలోనే తొలి భారతీయ ఉపాధ్యాయురాలు అయిన సావిత్రిబాయి పూలే విగ్రహాలను, మహాకవి గుఱ్ఱం జాషువా విగ్రహాలను స్థాపించడంలో కత్తి పద్మారావు కృషి గణనీయమైనది.

అంబేడ్కర్‌ విగ్రహ ఆవిష్కరణ జరుపుతున్నామని, మీరు రావాలని పిలిచినప్పుడు ఎంత దూరమైనా లెక్క చేయకుండా రాష్ట్రమంతటా విగ్రహ ఆవిష్కరణ జరిపి తన ప్రసంగాలతో గొప్ప స్ఫూర్తిని నింపారు డా. కత్తి పద్మారావు. కట్టా వినయ్‌ కుమార్‌, కోటి జేమ్స్‌, తదితరుల కృషితో చీరాలలో నెలకొల్పిన మహాత్మా జ్యోతిరావ్‌ ఫూలే విగ్రహాన్ని నాచేత ఆవిష్కరింపజేశారు. జాషువా విగ్రహాన్ని వారి కూతురు నాస్తిక ఉద్యమ నాయకురాలు హేమలత లవణం, అంబేడ్కర్‌ విగ్రహాన్ని కత్తి పద్మారావు, సావిత్రి ఫూలే విగ్రహాన్ని భాస్కరక్క ఆవిష్కరించారు. ఒకేచోట నాలుగు విగ్రహాలను చీరాలలో ఆవిష్కరించిన సభ ఒక కొండగుర్తు. ప్రతి ఊళ్లో ఈ నాలుగు విగ్రహాలను ఆవిష్కరిస్తే, బీసీ, ఎస్సీ, ఎస్టీ ల ప్రతీకలు, మహిళా ఉద్యమ ప్రతీకలు వాటంతటవే స్ఫూర్తినందిస్తాయి. ఒక విగ్రహం స్ఫూర్తిని అందిస్తుందా అని కొందరికి అనుమానం రావచ్చు. గుళ్ళు గోపురాల్లో, చర్చిల్లో, బౌద్ధారామాల్లో ఉండేవన్ని విగ్రహాలే కదా!. వాటి రూపం ద్వారా ప్రజలు స్ఫూర్తిని పొందుతూనే ఉన్నారు. నిరాకార దైవ భావన, నిరీశ్వర భావన కూడా మూర్త స్థాయిలో సాగే చైతన్యరూపాలే.

English summary
A prominent writer in Telugu BS Ramulu explained Katti Padma Rao's role in revelutionary and Dalith movements.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X