• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

టెర్రరిజం రక్కసులను మనం ఎదుర్కొనగలమా?

By Pratap
|

M Sridhar
పోలీసులు తమ శక్తికి మించి టెర్రరిస్టు దాడుల రహస్యాలను ఛేదించడానికి ప్రయత్నిస్తున్నారు. హిందువులు ముస్లింలు సాధ్యమైనంతం వరకు సామరస్యంగానే ఉంటున్నారు. కొట్లాటలు పెట్టేది పెద్ద పెద్ద నాయకులే గాని మామూలు మనుషులు కాదు. మత నాయకులు కూడా మరొక మతం పైన దాడులు చేయడం లేదు. మతం పేరున ఓట్లు దండుకోవాలనుకునే వారే దండెత్తుతున్నారు. మతం ఆధారంగా రాజకీయాలు చేస్తున్నవారు రాజకీయ నాయకులే కాని, మత పెద్దలు కాదు. టెర్రరిజం మత సమస్య కాదు. ముస్లిం మతం వారు నేరగాళ్లలో 99.9 శాతం మంది ఉన్నంత మాత్రాన అందులో లేని ముస్లింలనూ మొత్తం ముస్లింలను నిందించాల్సిన అవసరం లేదు. కాని నేరస్తులను ఖచ్చితంగా పట్టుకుని శిక్షించాల్సిందే.

హిందూ టెర్రరిజం అని హోం మంత్రి నిందించి నాలుక్కరుచుకోవడం, అక్బరుద్దీన్ మతం పేరుతో చాలా దారుణంగా రెచ్చగొట్టే మాట్లాడడం, దానికి జవాబుగా ప్రవీణ్ తొగాడియా, మరి కొందరు స్వాములు విరుచుకుపడడం అనవసరం. ఎవరికైనా చేతనైతే టెర్రరిస్టు దాడులను ఆపడానికి ప్రయత్నించాలి. లేదా మౌనంగా సాయం చేయాలి. అదీ చేతగాకపోతే కనీసం రెచ్చగొట్టడం ఆపివేయాలి. ఈ రెచ్చగొట్టే వి వి ఐ పి నాయకులను జైళ్లకు కోర్టులకు తిప్పడానికి వందలాది మంది పోలీసులను పనుల్లోకి దింపితే, రక్తం ఉడికించే వీరి మాటలకు రెచ్చిపోయి టెర్రరిస్టులకు సాయం చేస్తే ఎదుర్కొనడానికి ఎందరు పోలీసులు కావాలి. వారిని ఎక్కడినుంచి తేవాలి.

నెత్తురిచ్చిన మానవతా మూర్తులు

నెత్తురు తాగే ఉగ్రవాద రక్కసికి మానెత్తురు తీసుకో అంటూ భాగ్యనగరం రక్తదానంతో జవాబిచ్చింది. ఎవరికీ ఏ హానీ చేయని అమాయకుల నెత్తురు తాగే ముష్కరులు అయిదారుగురు ఉంటే వారి బాంబు దెబ్బతిని జీవన్మరణ స్థితిలో ఉన్న బాధితులకు రక్తం పంచి ఇచ్చే మానవతా మూర్తులు వందలు వేల మంది ఉన్నారు. వంటి నెత్తురు దానం చేసి బతికించాలనుకునే వారి రద్దీతో ప్రయివేటు ఆస్పత్రులు నిండిపోయినై. అరుదైన గ్రూపు రక్తం కావాలని టివి చానెల్స్ లో రాగానే వందలాది మంది అక్కడికి చేరుకుని మానవతా పరిమళాలు వెదజల్లిన భాగ్యనగరం మనది. నిరంతరం మత కలహాలను రెచ్చగొట్టే మత పార్టీ సంకుచిత నాయకులు, ఎదుటి మతాన్ని కించపరిచే కుహనా సెక్యులరిస్టు కుత్సిత మేధావులు మానవజాతిని చీల్చుతూ ఉంటే, ఏ స్వార్థమూ లేని మామూలు మనుషులు, మధ్యతరగతి మానవులు తమ సెల్ ఫోన్ నెంబర్లు ఇచ్చి ‘అవసరం ఉంటే అడగండి వస్తాం' అని డాక్టర్లకు హామీ ఇచ్చిన మానవతా మూర్తులు.

ఇరవై ఏళ్ళ లోపు గిరి వెన్నంతా బాంబుముక్కలతో చిట్లిపోయి నెత్తురంతా కోల్పోయి మరణంతో పోరాడుతూ ఉంటే అతనికి అరుదైన ఎ బి గ్రూపు నెత్తురు కావాల్సి వచ్చింది. అందుకు 300 మందికి పైగా పౌరులు స్వచ్ఛందంగా తరలి వచ్చారు. మెగాస్థాయిలో చిల్లరగా రక్తం అమ్ముకోవడానికి కాదు. ఉచితంగా ఇవ్వడానికి. మేడ్చల్ దగ్గర పూడూరు గ్రామంలో బాధితులకు రక్త దానం చేయడానికి ఒక శిబిరాన్ని నిర్వహించడానికి యువకులు ముందుకు రావడం మరో మంచితనం. చనిపోయిన వారిలో, రక్తదానం చేయడానికి వచ్చిన వారిలో అన్ని మతాల వారూ ఉన్నారు. మతం రాజకీయాల మిక్చర్ తో కల్లోలం సృష్టిస్తున్న నేతలు గుర్తుంచుకోవలసిన మాట ఇది. కావలసింది కొవ్వొత్తుల ప్రదర్శనలు బంద్ పిలుపులు కాదు, మంచితనం పలకరింపులు. రాజకీయ పరామర్శలు కాదు. మనలోని చెడుతనం పైనే ఆత్మ విమర్శలు.

రక్తం పంచుకున్న నగరం

హిందువో ముస్లిమో, క్రైస్తవుడో... ఒకరికి కాలు నుజ్జునుజ్జు అయింది. మరొకరికి ఎముకలు చిట్లిపోయినై. ఇంకో అభాగ్యుడికి చర్మం అంతా కాలిపోతే మరొక శరీరభాగం నుంచి చర్మంతీసి అతికించడానికి గంట పట్టింది. ఒక అమ్మాయి కుడి కాలు ఎగిరి దూరంగా పడిపోయింది. ఇంకొకరికి వంటినిండా ఇనుప చువ్వలు ఇరుక్కుపోయినై. మరొ యువకుడి ఊపిరితిత్తుల్లోకి బాంబు శకలాలు దూరినై. అనేక ఆపరేషన్లుచేసి శరీరాన్ని ఛిద్రం చేసిన మేకుల్ని తొలగించారు. 16 యూనిట్ల రక్తం ఎక్కించిన తరువాత గాని అతని కి ఊపిరి అందలేదు. ఎన్నో గాయాలు, ఎన్నో బాధలు.. రక్తంతాగే రాక్షసుల అభాగ్యనగరంలోనే రక్తం ఇచ్చే మానవుల భాగ్యనగరం కూడా ఉందంటే మనిషి కి బతికే అవకాశం ఉందన్న విశ్వాసం పుడుతుంది. కాని ఎంత రక్తం ఇచ్చినా ఆ ‘గిరి' కూలిపోయింది. పన్నెండు గంటలలో అతను గాయాలు భరించలేక నేలకొరిగాడు. అతని వంటి నిండా లోహపు ముక్కలు, వీపంతా చీలిపోయింది... మెషిన్ గన్ తో కాల్చినట్టు. ఆ గాయాలతో అతను బతకలేడు. ఆ విధంగా ఒక్కడు కాదు. ఇంకా డజన్ల మంది ఉన్నారు. ఒక్కొక్కరికి రెండు సార్లు మూడు సార్లు ఆపరేషన్ చేసి బాంబు ముక్కలు తీసివేయవలసి వస్తున్నది.

డాక్టర్లు బాధితుల గుండె నిబ్బరాన్ని మెచ్చుకుంటున్నారు. వళ్లంతా తూట్లుబడి బతుకుతారో లేదో తెలియకపోయినా, తమ పేర్లు బంధు మిత్రుల వివరాలు, ఫోన్ నెంబర్లు చెప్పి ఓపిగ్గా చికిత్స కోసం ఎదురుచూస్తున్న బాధితుల మొక్కవోని ధైర్యం మానవతకు మరో గుర్తు.

ఎక్స్ గ్రేషియా: దయాభిక్ష కాదు పరిహారం హక్కు

ప్రభుత్వం చనిపోయిన వారి కుటుంబాలకు 6లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియో, గాయపడిన వారికి లక్ష రూపాయలు ఇస్తున్నట్టు ప్రకటించింది. ఒక్క విషయం ప్రభుత్వం తెలుసుకోవలసిందేమంటే, బాంబులకు బలైన వారికి ఇచ్చేది క్షమాభిక్ష కాదు. అది వారి హక్కు. టెర్రరిస్టుల దౌర్జన్యంతో పాటు ప్రభుత్వ అలసత్వం కూడా వారి మరణానికి లేదా గాయాలకు కారణం కనుక వారి జీవన హక్కు కింద వారి బాధలకు పరిహారం పొందే హక్కు వారికి ఉంది. ప్రభుత్వం ఇవ్వకపోతే కోర్టుకు వెళ్లి డిమాండ్ చేసే అధికారం కూడా ఉంది. కాని ఆ విషయం చాలామందికి తెలియదు. తెలిసినా మన కోర్టుల్లో న్యాయం ఒక జీవిత కాలం లేటు కనుక ఆ జోలికి వెళ్లరు. మన కర్మ ఈ విధంగా కాలింది అనుకుని భరిస్తారు. ఏదో కొంత డబ్బు ఇచ్చి చేతులు దులుపుకోవడం కాదు. పోయిన వారి కుటుంబాలను పూర్తిగా ఆదుకునే బాధ్యత, గాయపడిన వారి జీవితాలను నిలబెట్టే బాధ్యత ప్రజాప్రభుత్వం పైన ఉంది.

జీవించే హక్కు అంటే చట్టపరమైన న్యాయ విధానాలద్వారా మాత్రమే జీవితాన్ని హరించాలి. అంతే గాని దుష్పాలన నిష్పాలన, అలసత్వం, నిర్లక్ష్యం, రాజకీయ నిష్క్రియాపరత్వం, రాజ్యాంగేతర రాజకీయ స్వప్రయోజనాధార నిర్ణయాలతో దుర్మార్గులకు మార్గం సుగమం చేసి సగటు మనుషుల ప్రాణాలు తీయడం కాదు. లా ఆఫ్ టార్ట్స్ (పౌర ఉల్లంఘనలను నష్టపరిహారం చెల్లించే పరిహార న్యాయశాస్త్రం) ప్రకారం ప్రాణాల విలువ లెక్క కట్టి, గాయాల నష్టం, బాధ, సంపాదనా శక్తి క్షీణత, ఆయుర్దాయం డబ్బు రూపంలో గణించి ఖచ్చితమైన పరిహారం చెల్లించాలి. హైదరాబాద్ బాంబు పేలుడు వంటి దుశ్చర్యలు ప్రభుత్వాల నిశ్చర్యల ఫలితమే కనుక రాజ్యాంగపరమైన వారి బతుకు హక్కులను ఉల్లంఘించినందుకు న్యాయపరమైన పరిహారం చెల్లించాలి, అంతేకాని ఏలిన వారు దయదలిచి భిక్షం వేయడం కాదు. ఒక కుటుంబ సభ్యుడు మరణిస్తే అందువల్ల ఆ కుటుంబానికి ఎంత నష్టం వాటిల్లిందో లెక్కించడంలో, అతను సగటున ఎంతకాలం బతికి, నెలకు సగటున కుటుంబానికి ఎంత వెచ్చించే వాడో ఏవిధంగా ఆదుకునే వాడో అంచనా వేసి డబ్బు ఇవ్వాలని న్యాయశాస్త్రం చెప్పింది. ప్రభుత్వానికి నష్టపరిహారం చెల్లించే బాధ్యతనుంచి విముక్తి లేదని కూడా వివరించే తీర్పును సి ఆర్ రెడ్డి వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసులో జస్టిస్ జీవన్ రెడ్డి చాలా స్పష్టంగా పేర్కొన్నారు. అదే ఈ నాటికీ న్యాయం కూడా.

ఇదివరకున్న కార్మిక నష్టపరిహార చట్టం ఇప్పుడు ఉద్యోగుల నష్టపరిహార చట్టంగా మార్చారు. ఈ చట్టం ప్రకారం ఉద్యోగులు గాయపడినా మరణించినా, అందుకు కారణం ఎవరైనా సరే యాజమాన్యం పరిహారం చెల్లించాలి. ఆ పరిహార గణన విధానాన్ని కూడా ఆ చట్టం నిర్దేశించింది. సుప్రీంకోర్టు తీర్పులు కూడా ఈ లెక్కను మరింత పటిష్టం చేశాయి. ఉద్యోగులు కాని మామూలు పౌరులకు పరిహారం చెల్లించే బాధ్యత వారి పన్నుల మీద సర్కారు చలాయించే పాలకులమీద ఉంటుంది. కనుక పాలకులు అర్థంచేసుకోవాలసిందేమంటే, బాధితుడికి మృతుని కుటుంబానికి తగినం పరిహారం ఇచ్చితీరాలి. నిజానికి బతికిపోయినా గాయపడిన వారికి ఇస్తానన్న లక్షరూపాయలు ఏమాత్రం చాలవు. కనుక వారికి ఎంత పరిహారం ఇవ్వాలో ఒక నిపుణుల బృందం ద్వారా నిర్ణయింపచేసి, ముందుగా కొంత డబ్బు తాత్కాలికంగా ఇచ్చి, తరువాత మొత్తం పరిహారాన్ని నిర్ణీత గడువులోగా చెల్లించాలి. అసలు సర్కారు వారిదగ్గర ఇటువంటి సందర్భాలలో మరణించిన వారి కుటుంబాలకు, గాయపడిన వారికి ఎంత పరిహారం ఏ విధంగా ఏ రేటున చెల్లించాలో ఒక విధానం ఉండాలి లేదా అందుకు ఒక చట్టం రూపొందించాలి.

పబ్లిక్ లయబిలిటీ ఇన్సూరెన్సు చట్టం ఒకటి ఉంది. ఏదైనా వ్యవస్థలో ప్రమాదం జరిగినపుడు, కలెక్టర్ బాధితులకు వెంటనే పరిహారం చెల్లించి, ఆసొమ్మును ఆవ్యవస్థ యాజమాన్యం నుంచి తరువాత వసూలు చేయాలి. ఈ బాధ్యత యాజమాన్యం తప్పొప్పులపైన కాకుండా జనం గాయాలపైన ఆధారపడి ఉంటుంది. ఇది ఖచ్చితమైన బాధ్యతా సూత్రం. యాజమాన్యాలు తమ బాద్యతకు బీమా జోడించి బాధితులకు డబ్బు ఇవ్వాలని ఈ చట్టం నియమాలు చెప్తున్నాయి. ఈ చట్టం మామూలు మనుషులకు ప్రభుత్వానికి కూడా వర్తించేట్టు చేయాలి. లేదా ఇంకేది అవసరం ఆ పని చేసి పరిహారం మాత్రం వెంటనే చెల్లించితీరాలి.

ఇవ్వవలసిన పరిహారాలు ఇవ్వకుండా చనిపోయిన వారికి లక్ష ఇచ్చాం గాయపడితే ఆరు లక్షలు ఇస్తాం అని గొప్పలు చెప్పుకోవడం మానేయవలసిన దశ ఇది. హైదరాబాద్ బాంబు పేలుళ్లలో బాధితులైన సామాన్యులకు ఆరోగ్య వైద్య సేవలు అందిస్తామని కూడా ప్రభుత్వం ఎంతో సౌజన్యంతో ప్రకటించింది. సంతోషం, కాని ఇదీ దయాభిక్ష కాదు, పరమ బాధ్యతే. అదే సమయంలో ఖర్చులెక్కువవుతాయని ప్రయివేటు ఆస్పత్రులనుంచి సర్కారీ దవాఖానాలకు తరలిస్తామని ఒక మంత్రిగారు ప్రకటించినట్టువార్తలు వచ్చాయి. ఇది న్యాయమైన పని కాదు. నిపుణులు చికిత్స ఎక్కడ ఉంటే అక్కడ అవసరమైన వారికి చికిత్స జరిపించడం బాధ్యత. ఉగ్రవాద రక్కసికి ఎవరైనా బలైతే దురదృష్టం అనుకోవచ్చు కాని చికిత్సలేక మరణిస్తే, వైద్యం చాలక మరణిస్తే, అది ఉగ్రవాద నేరం కన్న ఘోరం. ఆ ఘోరాలకు ప్రభుత్వం పాల్పడకూడదు.

మీరు మిత్రులేనా?

బాధితులకు డాక్లర్లు నర్సులు ఆత్మీయ మిత్రులుగా మెలిగితే అంతకన్న ఊరట మరొకటి ఉండదు. కార్పొరేట్ ఆస్పత్రులు కూడా ఇది తమ బాధ్యత అని వైద్యం చేయాలో లేక లాభాలే లక్ష్యం అనుకుంటారో వారే తేల్చుకోవాలి. డాక్టర్ల వలె పోలీసులు పాలకులు కూడా బాధితులకు వారి బంధుమిత్రులకు మిత్రులైతే బాగుండేది. కాని చాలా అన్యాయం జరుగుతున్నది. వివిఐపిల వరద తుఫానుగా మారి బాధితులు సామాన్యులు అల్లల్లాడిపోతున్నారు. సిఎం పి ఎం, మినిస్టర్ స్థాయి అధికారులు విరుచుకుపడుతున్నారు. నేరస్థలంలో సాక్ష్యాలను క్లూలను, రక్షించాలంటే శాస్త్రీయ నిపుణులు పరిశీలించేదాకా అక్కడ ఎవరూ తొక్క కూడదు. అందుకు తగిన చర్యలు తీసుకోకపోతే నేరస్తులను పట్టుకోవడమే సాధ్యం కాకపోవచ్చు. ఇక ఆస్పత్రికి కూడా వేళా పాళా లేకుండా విమానం దిగగానే పరుగెత్తడం, ఒక్క రూపాయి, ఒక్క నెత్తురు చుక్క ఇవ్వకుండా ఒక్క కన్నీటి బొట్టు రాల్చకుండా, బాధితుడి కష్టం కొంతైనా తీర్చకుండా మేం పరామర్శిస్తున్నాం అంటే అది ఎందుకూ పనికి రాదు. వారికి కూడా ఉపయోగపడదు. పత్రికల్లో టీవిల్లో వారి ఫోటోలు చూసుకుని వారే మురిసిపోతారేమోగాని జనం మెచ్చే పనులు కావు. అసలు ఈ నేతలు రావడానికి ఉదయం ఆరునుంచి ఎనిమిదిగంటలకు సమయం కేటాయించడం అందరికీ మంచిది.

విఐపిల వల్ల బాధలు

ఒక్కొక్క వి వి ఐపి కోసం రోడ్డును రోజూ రెండు మూడు గంటల పాటు చెరబట్టి, జనాన్ని కదలకుండా రోడ్ల మీద నిలబెట్టి వేధిస్తే ప్రభువులు ప్రజలకుమిత్రులుగా ఉండగలుగుతారా? వరసగా డజన్ల కార్లు జనం కళ్లలో దుమ్ము కొట్టుకుంటూ పోతూ ఉంటే నిజానికి పోలీసులు కూడా బాధితులే అయినా వారికీ ప్రజలనుంచి ఏ సానుభూతీ దొరకదన్న వాస్తవాన్ని గమనించాలి. పోలీసులు పొలిటీషియన్లు జనానికి స్నేహితులను రుజువు చేసుకోవడానికి ఇదొక అవకాశం. ఓట్ల కోసం కాకపోయినా సామాజిక స్పృహ ఉంటే జనానికి చేరువ కావలసిన అవకాశం.

ఎక్కువ ఖర్చవుతుందని సర్కారు దవాఖానకు బాధితులను తరలించాలనుకునే ఈ నేతలు, ప్రత్యేక విమానాలు వేసుకుని వచ్చినందుకు అయ్యే ఖర్చును తగ్గించడానికో లేక ఆ డబ్బును బాధితుడికి ఇవ్వడానికి నిర్ణయిస్తే బాగుండేది. ఒక పత్రిక దీన్ని టెర్రర్ టూరిజం అని అభివర్ణించింది.

ఉగ్రవాదానికి తోడు మంత్రి మూర్ఖ వాదం

భాగ్యనగరంలో బతుకు భయం. అసలు బతకడమే ఒక సాహసం. బతుక్కు గ్యారంటీ లేకపోయినా, మరణానికి ప్రతి ప్రదేశం చిరునామావలె తయారైంది. దీనికి ఒక మంత్రిగారు ఇచ్చిన వ్యాఖ్యానం ఆయన ఆలోచనా స్థాయిని తెలియచేస్తుంది. తెలంగాణా రాష్ట్రం వస్తే హైదరాబాద్ ఉగ్రవాద ముష్కరుల అడ్డా అవుతుందని వారు వివరించారు. రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే ఇన్ని ఘోరాలు జరుగుతూ ఉంటే విడిపోతే ఏమవుతుందో అని ఆ మంత్రిగారు వాపోయారు. హైదరాబాద్ నేరాలకు అడ్డాగా మారిందన్న మాట నిజమే అనుకుంటే దానికి హైదరాబాద్ నగరాన్ని పట్టించుకోకుండా పాలించిన ఇటువంటి మంత్రులే కారణం. పాతబస్తీని వదిలేసి, కొత్తగా కాలనీలు నిర్మించుకోవడానికి పథకాలు వేసిన ప్రతి ప్రభుత్వం హైదరాబాద్ లో ఈనాటి దుర్మార్గానికి బాధ్యత వహించాల్సి ఉంటుంది. తమ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి తెలంగాణా ముఖ్యమంత్రులను గద్దె దించడానికి హింసా రాజకీయాలను జిల్లాలనుంచి మోసుకు వచ్చి గూండాలను దింపి బాంబుదాడుల సంస్కృతిని తెచ్చింది ఈ బాధ్యతారహిత ప్రభుత్వాలే. టెర్రరిజం మూలాలు కేవలం హైదరాబాద్ లోనే కాదు అనేక జిల్లాల్లో ఉన్నట్టు సమాచారం వచ్చింది.

హైదరాబాద్ లో దిల్ సుఖ్ నగర్ లో దాడులు జరపడానికి వీలుగా రెక్కి నిర్వహించినట్టు సమాచారం ఉన్నా కాపాడుకోలేని అసమర్థ ప్రభుత్వపు మంత్రులే ఇటువంటి అసంబద్దఅబద్దాలను చెప్తున్నారు. పాత బస్తీలో అసలు పాలనే లేదు. మజ్లిస్ ఎంఎల్యేలు, ఎంపీ ఏది చెబితే అది చేస్తారు. వారి అనుమతిలేకుండా చట్టాలు అమలు చేయరు. పన్నులు వసూలు చేయరు. రోడ్లు వెడల్పు చేయరు. నేరస్తులకు ఆశ్రయం కల్పించే మతపార్టీ నాయకులఇళ్లను తనిఖీ చేయరు. అక్కడ జనం బాగుపడడానికి ఏమీ చేయరు. చంపడానికి సహకరించే శక్తులను పట్టుకోకుండా ఉండడంద్వారా సాయం చేస్తారు. హైదరాబాద్ నగరం టెర్రరిస్టు ముష్కరుల అడ్డాగామారిందనడమే తామున్నది దివాళాకోరు ప్రభుత్వమని చెప్పే నేరాంగీకార ప్రకటన.

హైదరాబాద్ సంస్కృతిని మత సామరస్యాన్ని రాజకీయాలకోసం నాశనం చేసిన రాజకీయ నాయకుల నీతి ఈ విధంగానే ఉంటుంది. ఇటువంటి నాయకులున్నా భాగ్యనగరం ఇంకా పూర్తిగా నాశనం కాకుండా ఉండడం ఇక్కడి ప్రజల గొప్పతనం, హుందా తనం, గుండె నిబ్బరం. వారి సహనశీలతకు ఇది నిదర్శనం. ఇటువంటి మూర్ఖపు దివాళాకోరు ప్రకటనలు కూడా వీరు సహిస్తారు.

ఇటువంటి నాయకుల ఏలుబడిలో భాగ్యనగరం నలిగిపోవడం ఇక్కడి పౌరుల దౌర్భాగ్యం. పౌర చైతన్యేమే ఉగ్రవాదానికి, మూర్ఖవాదానికి కూడా చెంప పెట్టు అవుతుంది. మానవత్వం, మత సామరస్యం, రక్తం పంచుకునే సోదరభావం ఉన్న భాగ్య నగరం భాగ్యనగరంగానే ఉండనివ్వండి. మనుషులను బతకనివ్వండి.

- మాడభూషి శ్రీధర్

(రచయిత హైదరాబాద్ నల్సార్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్, సెంటర్ ఫర్ మీడియా లా అండ్ పబ్లిక్ పాలిసీ కోఆర్డినేటర్)

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A whistle blower was first not taken seriously, later rules prevented to act upon, and after a disaster 9/11, American society rewards the lady whistle blower as woman of the year. Then they changed the law assumed more powers to check , search and seize without letting out suspects under privacy and other rights.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more