వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Expert Comment: రేప్ నేరాలు, శిక్షలూ

By Pratap
|
Google Oneindia TeluguNews

Madabhushi Sridhar
మనం మనుషులమేనా అనిపిస్తుంది. పోలీసులు డాక్టర్లు నిజంగా ప్రజాసేవకులుగా మారితే బాగుండు కదా అనికూడా అనిపిస్తుంది. మన నాగరిక వ్యవస్థలో నేరాలకు శిక్షలు కూడా పడవా అని అనుమానం వస్తున్నది.

ఆమె 23 సంవత్సరాల యువతి. ఫిజియోథెరపీ విద్యార్థిని. తన మిత్రుడితో కలిసి సాకేత్ లో సినిమా చూసి బస్సు అందుకోవడానికి ఆటోలో మునిర్కా కు మహావీర్ ఎంక్లేవ్ లలో ఉన్ననివాసానికి వెళ్లాలని 764 నెంబరు బస్సుకోసం ఎదురుచూశారు. వచ్చిన వైట్ లైన్ ప్రయివేట్ బస్సు ఎక్కారు. నల్లటి అద్దాలు, దొడ్డు తెరలు ఉండడం వల్ల లోపలజరిగేది ఏదీ కనిపించదు. బస్సులో తాగి ఉన్న కొందరు యువకులు అవమానకరంగా మాట్లాడారు. ఆమెను భద్రంగా ఇంట్లో దింపడానికి తోడు వచ్చిన స్నేహితుడు అభ్యంతరం చెబితే అతన్ని కొట్టారు. యువతిని డ్రైవర్ కాబిన్ కు తీసుకువెళ్లి అయిదుగురు రేప్ చేశారు. డ్రయివర్ బస్సునడుపుతూనే ఉన్నాడు. నేరం జరిగిన తీరు చూస్తే, దారుణాన్ని వ్యతిరేకించేవారి కన్న దాన్ని జరగనిచ్చే వారే ఎక్కువ మంది కనిపిస్తున్నారు. ప్రతిఘటించే వారు తక్కువైపోతున్నారు. వైట్ లైన్ లగ్జరీ బస్సులో తన కాబిన్ లో అయిదుగురు ఆమెను రేప్ చేసే దాకా బస్సును డ్రైవర్ ఆపలేదు. రేపిస్టులు ఆమె కడుపుమీద ఇనుప కమ్మీలతో కొట్టారు. ఆమె కడుపు పూర్తిగా దెబ్బ తిన్నది. శరీరమంతా గాయాలైనాయి.

తమ బస్సు ఎక్కండని చెప్పి, ఎక్కింతరువాత మిత్రుడితో తగవులకు దిగి, కొట్టి, అత్యాచారం చేసి, ఇనుప కడ్డీలు ఎక్కడెక్కడో గుచ్చి పేగులు బయటకు తీసి, వస్తువులు, ఫోన్లు డబ్బు లాక్కుని, బట్టలు చింపి, బస్సులోంచి విసిరేసి... ఇంకా భయానక క్రూరత్వం సరిపోక ఆమె మీంచి బస్సును నడపాలని చూసిన ఈ అమానుషాన్ని ఏమనాలి? నెత్తురోడుతున్న మిత్రుడు ఆమెను సమయానికి పక్కకు జరిపి ఉండకపోతే మరో దారుణం జరిగిపోయేది. రేప్ ఆమె మానసిక బలాన్ని చంపేస్తే ఈ గాయాలు ఆమెను దాదాపు చంపేశాయి.

మనం మనుషులమేనా?

ఆ తరువాత జరిగిందేమిటి? మనమంతా నాగరికులమేనా అని అనుమానించే సంఘటనలు. దారిన పోయే వారెవరూ ఆగరు, చూస్తారు, బండి వేగం తగ్గిస్తారు. కాని ఆగిపోరు, సాయంచేయరు. కనీసం అంబులెన్స్ ను పిలవరు, పోలీసులను రప్పించరు. అరగంట తరువాత పోలీసులు మూడు పిసి ఆర్ వ్యాన్లలో వచ్చారు. కాని తీరిగ్గా ఏ పోలీసు స్టేషన్ పరిధిలోకి వస్తుంది అని వాళ్లలో వాళ్లు మాట్లాడుకుంటారు. నగ్నంగా ఉన్న ఆమెకు కప్పడానికని ఆ మిత్రుడు ఒక బట్టన్నా ఇవ్వండని అడిగాడు. ఎంతో సేపడి తరువాత దుప్పటి ముక్క ఒకటి ఇచ్చారు. తను బట్టలు లేకుండానే నెత్తురోడుతూ ఉండిపోయాడు. దగ్గర్లో ఏదన్నా ఆస్పత్రికి తీసుకువెళ్లండి, నొప్పి తట్టుకోలేకపోతున్నదని బతిమాలినా దిక్కులేదు. వాళ్ల చర్చలు ముగిసిన తరువాత సఫ్దర్ జంగ్ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. దానికి మరో 16 నిమిషాలు పట్టింది. అక్కడ ఆమెను చూడమని ప్రతివాడినీ అర్థించడం తన మానరక్షణకు ఓ బట్ట దానం చేయండి అని బిక్షమెత్తడం చాలా సేపు ఇదే గతి. మిత్రుడి బంధువులు వచ్చిన తరువాత గాని అతనికి ఓ గుడ్డ ముక్క ఇచ్చిన వాడు లేడు. బతికున్నంత కాలం బాధపడింది. నేరగాళ్లను ఉరితీయడం కాదు సజీవంగా తగలేయాని ఆవేశంతో రగిలిపోయిందామె. జడ్జికి తన మరణ వాంగ్మూలం ఇచ్చింది. జరిగిన విషయం వివరించింది. చాలా రోజులు మృత్యువుతో పోరాడి చివరకు ఆమె మరణించింది.

రాజ్యసభలో ఈ సంఘటన పై ఆవేశపూరితంగా చర్చ సాగింది. మహిళలు బతకలేని చోటుగా దేశ రాజధాని ఢిల్లీ మారిపోవడం సిగ్గుచేటని ఆవేదన చెందారు. బాధితురాలు బతకలేకపోతే ఒక దారుణం, బతకగలిగితే ఈ క్షోభను ఏ విధంగా జీవించినంతకాలం భరిస్తుందని అంటూ జయా బచ్చన్ కన్నీరు పెట్టారు. మీడియాలో దాదాపు ప్రతి ఛానెల్ ఈ అంశాన్ని చర్చించింది. నేరగాళ్లకు ఉరి వేసి తీరాలని చాలా ఆవేశంతో వీక్షకులు డిమాండ్ చేశారు.

యువత, ముఖ్యంగా మహిళలు ఉవ్వెత్తున లేచారు. న్యాయం కావాలని పోరాడారు. కుంభకర్ణ నిద్రలో ఉన్న ప్రభుత్వాన్ని అంకుశంతో పొడిచి లేపారు. మౌన్ మోహన్ సింగ్ కూడా ఓ పక్షం తరువాత నోరు విప్పారు. అదీ ఠీక్ హై అనే ధోరణిలో.

డిల్లీ నేరంలో లైంగిక అత్యాచారం తోపాటు భయానకమైన క్రూరత్వం కూడా ఉంది. హత్యకన్న మానభంగమే దారుణమైన నేరం. ఎందుకుంటే ఆమె అన్నిహక్కులను హరించేస్తుంది. ఒక మనిషి గా ఆమెను బతకనీయదీ నేరం. ఆమె మహిళ అన్న కారణంగానే ఈ నేరం జరుగుతుంది. స్త్రీ సహజమైన భౌతిక బలహీనతలను వాడుకుని, జులుం చూపడం, కండబలంతో ఆమె శరీరంపైన ఆధిపత్యం చాటడం, బతికినంత కాలం మానసిక వ్యధతో, చెదిరిపోయిన మనసు, తనువులతో వ్యక్తిత్వం దెబ్బతిని చితికిపోయి బాధతోనే బతకాలనే దురుద్దేశంతో హాని చేయడం ఈనేరంలో లక్షణాలు.

సాక్ష్యాలు ఉంటేనే శిక్షలు

సాధారణంగా రేప్ కు సాక్ష్యాలు ఉండవు. కాని ఈ కేసులో ఒకమిత్రుడున్నాడు. ఆమె మరణించడానికి ముందు చెప్పిన ప్రకటనలు విలువైన సాక్ష్యాలుగా కోర్టు పరిగణిస్తుంది. ఆరుగురు రాక్షసులు నిందితులైకోర్టు ముందు నిలబడతారు. వారిలో చాలామందిని ఇప్పడికే ఆమె మిత్రుడు గుర్తించాడు. అత్యాచారం, హత్య, హత్యా ప్రయత్నం, దోపిడీ, తీవ్రంగా గాయపరచడం అనే రకరకాల నేరాలు చేసిన ఆ దుర్మార్గుల వ్యవహారం దారుణాతి దారుణమైన నేరంగా భావిస్తే మరణ శిక్ష విధించే అవకాశాలు కూడా ఉన్నాయి. రేప్ తోపాటు హత్య చేస్తే హత్యాచారం అనాలేమో. అటువంటి దారుణాతి దారుణాలకు మరణశిక్ష విధించవచ్చని సుప్రీంకోర్టు తీర్పులు సూచిస్తున్నాయి. మందుకొట్టి రాత్రిళ్లు జల్సాలుచేసుకుంటూ తిరిగే చెడిపోయిన బాద్యతా రహిత యువకులు ఈ నేరం చేశారని అర్థమవుతూనే ఉంది. రాజకీయ నాయకులు, ఉన్నత స్థాయి అధికారులు, అత్యున్నత నైపుణ్యం కలిగిన లాయర్లు, ఈ సారా ప్రభావిత దుర్మార్గుల తరఫున ప్రత్యక్ష పరోక్ష ప్రయత్నాలెన్ని చేసినా ప్రజాప్రభంజనం విజృంభించింది కనుక నిందితులు కల్లబొల్లి కబుర్లు చెప్పి బయటపడే పరిస్థితి ఉందనుకోలేము. కఠినమైన శిక్షలు విధిస్తే భయం ఏర్పడుతుందనే ఉద్దేశంతో ఉరి శిక్ష వేయాలని జనం కోరుకుంటున్నారు.

తుకారం కేసు

ఒక అమ్మాయిని పోలీసు స్టేషన్లో ఒక కానిస్టేబుల్ రేప్ చేస్తే ఆమె అరవలేదని, శరీరం మీద గాయం లేదని, మౌనంగా అన్నీ భరించడం వల్ల ఆమె అంగీకారానికి వ్యతిరేకంగా మానభంగం జరిగిందని అనలేమని సెషన్స్ కోర్టు పోలీసు గణపతి, తుకారాం లను నిర్దోషులుగా విడుదల చేసింది. నాగపూర్ హైకోర్టు అర్థంలేని ఈ తీర్పును తిప్పికొట్టి నేరస్తులేనని శిక్ష వేసింది. సుప్రీంకోర్టు అప్పీలు విచారిస్తూ పోలీసుస్టేషన్ నుంచి బంధువులందరినీ వెళ్లిపొమ్మని చెప్పి ఆమెను ఒక్కరినే ఉండిపొమ్మంటే ఉండడం, గణపతి కానిస్టేబుల్ లోపలికి తీసుకువెళితే వెళ్లడం, అత్యాచారం జరుగుతూ ఉంటే అరవకపోవడం, ఆమె శరీరం మీద గాయాలు లేకపోవడం, తరువాత మరొక కానిస్టేబుల్ తుకారాం ప్రయత్నం చేసినా మౌనంగా ఉండడం వల్ల ఇదంతా ప్రశాంతంగా ముగిసిన పరస్పర అంగీకార వ్యవహారమని సుప్రీంకోర్టు 1978లో తీర్పు చెప్పడం దారుణమైన నేరం. పోలీసు స్టేషన్ వాతావరణమే భయం కలిగించేది. భయానికి నోరు విప్పని మహిళపైన అత్యాచారం చేసి, నోరు విప్పలేదు కనుక ఆమె అంగీకారం ఉందనే వాదం అసలైన అత్యాచారం, దాన్ని సుప్రీంకోర్టు ఒక న్యాయసూత్రంగా నిర్ధారించడం మరొక అత్యాచారం. ఈ తీర్పును నిరసిస్తూ మహిళా సంఘాలు ఉద్యమించడం వల్ల రేప్ చట్టం మారిపోయింది. అందుకు ఆ దారుణ తీర్పు ఉపయోగపడింది.

అత్యాచారానికి ఏడేళ్ల కనీస శిక్ష నుంచి విధించి తీరాలని, సాక్ష్యాలను బట్టి యావజ్జీవ కారాగారం దాకా విధించవచ్చునని, తీవ్రమైన అత్యాచారం, బాలికపై అత్యాచారం, గాంగ్ రేప్ లకు కనీసం పదేళ్ల కఠిన కారాగార శిక్ష నుంచి యావజ్జీవ కారాగారం దాకా విధించవచ్చని ఐపిసి సెక్షన్ 376 , క్రూర అత్యాచారం ఆ తరువాత ఘోర హత్యకు పాల్పడితే అదిదారుణాతి దారుణం కనుక మరణ శిక్ష విధించ వచ్చని సుప్రీంకోర్టు బచ్చన్ సింగ్ కేసులో నిర్దేశించింది.

కొత్త చట్టం

ఇప్పుడు నేర చట్టాల సవరణ బిల్లు 2012 ద్వారా ఆడవారు మగవారిని రేప్ చేసినా శిక్షించగల కొత్త రేప్ చట్టాన్ని ప్రతిపాదిస్తున్నారు. ఇది పార్లమెంటులో ప్రవేశ పెట్టవలసి ఉంది. ఇందులో కూడా ఉరి శిక్ష లేదు. తీవ్రమైన అత్యాచార నేరాలకు పదేళ్ల కఠిన కారగార శిక్ష కనీసం విధించాలని, లేకపోతే ఎందుకు విధించలేదో కారణాలు వివరించాలని, ఇతర రేప్ నేరాలకు కనీస శిక్ష ఏడేళ్ల కారాగారం, అంతకు తక్కువ విధిస్తే సమర్థించే కారణాలు చెప్పాలి. గరిష్ఠం యావజ్జీవ కారాగార శిక్ష విధించాలి.

ఉరి కోసం డిమాండ్

ప్రతిరేప్ నేరానికి కూడా ఉరి శిక్ష కనీస శిక్ష గా వేయాలనడం శాస్త్రీయం కాదు, నాగరికం కాదు, అన్నిటికన్నా మహిళలకు మంచిది కాదు. నేరం చేసిన వాడు సాక్ష్యం ఖతం చేస్తాడు. సజీవమైన మానవుడిని మించిన మంచి సాక్ష్యం ఉండక పోవచ్చు. ఉరి కనీస శిక్ష అయితేబాదితురాలిని హత్యచేసే ప్రమాదం ఉంది. ఎందుకంటే అత్యాచారం కేసులో బాధితురాలి సాక్ష్యానికి ఎక్కువ విలువ ఇవ్వాలని, కేవలం ఆమె వాంగ్మూలం ఒక్కటే ఉన్నా సరే అందులో అనుమానలేశాలు లేకపోతే, తోడు సమర్థన సాక్ష్యం లేకపోయినా నమ్మవచ్చని, నేరం జరిగిందని భావించి నేరస్తుడిని శిక్షించవచ్చని సుప్రీంకోర్టు అనేక కేసుల్లో తీర్పు చెప్పింది.

వీలయినంత త్వరగా నేరం రుజువుచేసేందుకు అనుకూలమైన పరిస్థితులు కల్పించడం నాగరిక వ్యవస్థ లక్షణం. నేర విచారణలో ఆలస్యం ఉన్నంత కాలం శిక్షపడవలసిన వారికి శిక్షలు పడవు. నేరం రుజువు కాదు. ఆ దశలో ఉరి వేయాలనడం న్యాయం అని నమ్మినా కూడా సాధ్యమే కాదు. అన్నింటికన్నా మించిన శిక్ష మరణ శిక్ష కనుక, ఆ శిక్ష వేయడానికి గాను ఏ అనుమానం లేకుండా ఆరోపణపత్రంలోని ప్రతి నేరం పూర్తిగా పటిష్టంగా రుజువు కావాలని కోర్టు ఆశిస్తుంది. ప్రస్తుత అవినీతి భరితమైన వ్యవస్థలో ఈ రుజువు చాలా అరుదుగా సాధ్యమవుతుంది. నేరంచేసి తప్పించుకోవడానికి అనేక మార్గాలున్న మన సమాజంలో నేరం రుజువుచేసే అనుకూల యంత్రాంగం నిర్మించే బదులు ఉరి శిక్ష వేయాలనడం, ఆవేశపూరితమైన ఆకాంక్షే అవుతుంది కాని వివేకం వివేచన కలిగిన విచారణ కాబోదు.

ఫింగర్ టెస్ట్ రెండో రేప్

23 సంవత్సరాల వయసులో ఇంత నరకం అనుభవించిన ఆమె బతకాలనే ఆశిద్దాం. కాని ఆమె వెంటనే ఎదుర్కొవలసిన చట్టపరమైన దారుణాలు చాలా ఉన్నాయి. ముందుగా వైద్యపరీక్ష. ఆమెపైన అత్యాచారం జరిగిందా లేదా అని వైద్యులుపరీక్షిస్తారు. దీన్ని ఫింగర్ టెస్ట్ అంటారు. వేలును లోపల జొనిపి ప్రవేశం జరిగిందని వీరు నిర్ధారించాలి. అసలీ పరీక్షే మరొక రేప్ వలె ఉంటుంది. మగవాడికి ఇటువంటి పరీక్షలు లేవు. ఎందుకంటే ఈ కిరాతకులు దొరకరు. దొరికే సమయానికి తమ శరీరంమీద వీర్య కణాలను వైద్యులు పరీక్షించడం కోసం దాచి పెట్టరు. వారికి ఫింగర్ పరీక్షలు ఉండవు. ఇటువంటి పరీక్షలు మానవ హక్కుల భంగకరమని, వెంటనే నిషేధించాలని డిమాండ్ ఉంది. అయినా 153 కేసుల్లో హైకోర్టులు వేలి పరీక్షల నివేదికల మీద ఆధారపడ్డారని ఒక సర్వేలో తేలింది.

ప్రశ్నలతో గుచ్చే మూడో రేప్

తరువాత పోలీసు వారు ప్రశ్నలతో గుచ్చుతారు. మొత్తం వివరాలు ఇవ్వాలి. తన పై జరిగిన అత్యాచారంలో ప్రతి అంశాన్ని ఒకటి తర్వాత మరొకటి చొప్పున వరస క్రమంలో మరిచిపోకుండా చెప్పడమే కాక, ఎవరు ఎక్కడ ఎన్ని సార్లు అడిగినా ఆ క్రమం తప్పకుండా చెప్పాలి. ఏమాత్రం తేడా వచ్చినా సాక్షిని అనుమానిస్తారు. నిందితుడిని అమాయకుడని నమ్ముతారు. రేప్ కేసులో బాధితురాలే సాక్షి. ఆమెకు చట్టం పెట్టిన పేరు ప్రాసిక్యూట్రిక్స్. పోలీసులు, ప్రాసిక్యూటర్లు, డాక్టర్లు లోతైన ప్రశ్నలతో ఆమెను అందరిముందు (ఇన్ కెమెరా అయితే కొందరిముందు) సవాళ్లు కురిపిస్తారు. ఇక న్యాయశాస్త్రాన్ని సాక్ష్య నియమాలను అతి క్షుణ్ణంగా పరిశీలించి, నేరగాళ్లను న్యాయంగా రక్షించడంలో అతి ప్రతిభావంతులు, గంటకు లక్షలరూపాయలు ఫీజు విధించే పెద్ద లాయర్లు రంగంలోకి దిగుతారు. ‘‘అసలు నీకూ ఈ స్నేహితుడికి మధ్య నిజంగా స్నేహమే ఉందా ఇంకే మయినా అంతకు మించిన అభిమానాలు ఉన్నాయా? ....అయినా ఈ రాత్రి అతని తో కలిసి తిరుగతున్నావంటే నిన్ను అనుమానించకూడదంటావు కదమ్మా?... ఇప్పుడు సినిమా చూసి ఇతని తో కలిసి అంతదూరంలో ఉన్న మీ ఇంటికి వెళ్లడం అంత అవసరమా?... మీనాన్న అమ్మా కూడా ఇందుకు ఒప్పుకున్నారా? ....ఇదివరకు ఇలా ఎన్ని సార్లు వెళ్లావమ్మా? ...'' అని ఎంతో మర్యాదగా రెచ్చగొట్టే ప్రశ్నలు ఆమెను గుచ్చి గుచ్చి అడుగుతారు. ఏదో ఒక ప్రశ్నకు తనకు కావలసిన జవాబు వచ్చే దాకా గంటలు, రోజులు, వారాలు నెలలు క్రాస్ ఎగ్జామినేషన్ జరుగుతుంది, ఏదో జవాబు లాగడం ద్వారా ఆమెకు ఈ కార్యక్రమం లో ఎంతో కొంత మౌనాంగీకారమో లేక పరోక్ష ప్రకటిత ఇష్టమో ఎక్కడో ఓ మూల ఉందని, సినిమాలకు పోవడం, యువకులతో తిరగడం, ఈనాటి యువతులకు అలవాటు కనుక, ఇదంతా ఆమెకు మామూలేనని... కనుక నిందితులు ముందంజ వేసే అవకాశం ఆమే కల్పించిందని వాదించి అది నిజమే అయి ఉండవచ్చనే అనుమానాన్ని సృష్టిస్తాడు. ముందుగా రేపిస్టులకుముందు బెయల్ ఇప్పిస్తాడు, తరువాత ఉరి తప్పుతుంది. ఆతరువాత అప్పీలు లో జైల్ కూడా తప్పిస్తాడు. ఆఫీసులో ఇంకా డజనుమంది రేపిస్టులు డబ్బు కట్టలతో ఈ లాయర్ కోసం ఎదురు చూస్తుంటారు. మూడు రేప్ లు ఆరుఫీజులతో ఆయన ఆఫీసు కళ కళ లాడుతూ ఉంటుంది. ఇటువంటి వారిని లోకం కీచకులు అని సంబోధించదు. వీరు చేసే పనిని మూడో రేప్ అని పిలవదు. ఇంకా మన మీడియా, పత్రికలు, నీతి వంతులైన మేధావులు అందరూ కోరుకునేదేమంటే... ఎన్ని కష్టాలెదురైనా సరే, ఎన్ని త్యాగాలు చేసైనా సరే రేప్ బాధితురాలు వీరోచితంగా కోర్టులో మాట్లాడి మూడు రేప్ లను విజయవంతంగా ఎదుర్కొని, డబ్బు ప్రలోభాలకు లొంగకుండా బెదిరింపులకు భయపడకుండా, తనవారు ఎందరు లారీ కింద పడిచనిపోయినా చెదరకుండా నేరగాళ్లకు శిక్షపడేట్టు చూసి న్యాయాన్ని రక్షించే గురుతరమైన బాద్యత నిర్వర్తించాలి. ఆమె వెంటవచ్చిన యువకుడి పైన కూడా ఇంతే గురుతరమైన బాధ్యత ఉందని కాఫీ తాగుతూ టీవీ చూసే మధ్యతరగతి మిధ్యావాద మేధావులు ఘంటాపథంగా చెప్తూ ఉంటారు.

ఆరుశాతం శిక్షలు

మనదేశంలో నేరాలు రుజువయ్యే శాతం అయిదునుంచి ఆరు శాతమే ఉండడంలో చాలా మంది ప్రతిభ డబ్బు ప్రధానమైన కారణాలు. బాధితురాలు కేవలం సాక్షి మాత్రమే కాదు. ఆమె లాయర్ల ప్రశ్నలకు జవాబులు ఇస్తున్నపుడు న్యాయాధికారి జాగ్రత్తగా ఆమె భావాలను పరిశీలించి నిజానిజాలపైన అభిప్రాయానికి రావాలి. కాని ఆవేదనతో ఆమె చెప్పేమాటలను విలువ తగ్గించి లాయర్ అనువదిస్తుంటే, అవినీతి లేదా అసమర్థత లేదా నిర్లక్ష్యం వల్ల ప్రాసిక్యూషన్ లాయర్ దానికి అభ్యంతరం చెప్పకుండా ఉంటే యాంత్రికంగా టైపిస్టుకు వాక్యాలను డిక్టేట్ చేయడం లేదా లాయర్ ఆ విధంగా డిక్టేట్ చేస్తుంటే దాన్ని అనుమతించడం వల్ల నిజాలెన్నో సమాధి అవుతున్నాయి. నిజాన్ని చెప్పలేకపోతున్నారని, నిజంచెప్పే అవకాశం వారికి లేదని న్యాయాధికారులు గమనించాల్సిన అవసరం ఉంది. వారికి జుడిషియల్ అకాడమీలలో పదవీ విరమణ చేసిన న్యాయాధికారుల ద్వారా అనుభవజ్నులైన సీనియర్ న్యాయాధికారుల ద్వారా ఈ విషయంలో శిక్షణ ఇప్పించాలి. న్యాయం చేయాలన్న తపన ఉన్న వారిని ప్రోత్సహించి నేరనిర్ధారణ బాధ్యతను వారికి అప్పగించే విధానాన్ని హైకోర్టు అమలు చేయాలి.
లైంగిక నేరాల విచారణ గురించి పత్రికల ప్రచారం తప్పించడానికి ఇన్ కెమెరా అంటే ప్రచారానికి ఆస్కారం లేని పద్ధతిలో విచారణ జరపడం ఒక్కోసారి బాధితురాలికి నష్టం కలిగిస్తూ ఉంటుంది. లాయర్లు విజృంభించి అవమానకరమైన ప్రశ్నలు వేస్తూ ఆమె శీలం మంచిదికాదనే అభిప్రాయాన్ని జడ్జిగారిమనసులో కలిగిస్తూ ఉంటారు. మీడియా ట్రయల్ వల్ల తమపై అన్యాయమైన ప్రభావం పడుతుందని అనుమానించే న్యాయాధికారులు, ఈ అసమంజస ప్రభావాలనుంచి కూడా తప్పుకోవాల్సి ఉంటుంది. సీనియర్ లనీ పలుకుబడి గలవారనీ, ఆకాశరామన్న ఉత్తరాలు రాస్తారనీ, లేక అరుస్తారనీ పిటిషన్లు పెడతారనీ, ప్రధాన న్యాయమూర్తికి ఏదో రకంగా ఫిర్యాదు చేస్తారనే అంశాలు కూడా నేర నిర్ధారణకు ప్రతిబంధకాలుగా మారకూడదు. మారాయి.

విపరీత ఆలస్యాలు

నేరం రుజువుచేయడానికి ఎన్నాళ్లు? ఎన్నేళ్లు? విపరీతమైన జాప్యం వల్ల అన్ని రకాల అన్యాయాలూ జరుగుతాయి, జరుగుతున్నాయి. మొత్తం కేసు ఒకే సారి వినరు, ఒకే న్యాయాధికారి వినరు. మూడేళ్ల కోసారి మారతారు కనుక కనీసం ముగ్గురున్యాయాధికారులు ముక్కలు ముక్కలుగా కేసు వివరాలు వినడం వల్ల, రికార్డులో ఏ లోపాలున్నా అవే నిర్ణయానికి ఆధారాలై దోషులు తప్పుకుపోతుంటారు. నేరవిచారణ ను మూడునెలలకు మించకుండా పూర్తిచేయాలనే నిబంధన పాటించనంత వరకు ఈదేశంలో డిల్లీ యువతి కే కాదు ఏ మహిళకు న్యాయం జరగదు. నేరగాళ్లకు శిక్షే పడదు. ఉరి శిక్షే వేయాలని పట్టుబడితే బాధితురాలి బతుక్కే కాదు, రుజువుల మనుగడకు న్యాయం ఉనికి కే ప్రమాదం వస్తుందని గుర్తించాలి.

బాధితురాలు, సాక్షులు ఇన్ని త్యాగాలు చేసినా నేరగాళ్లకు శిక్షపడడం అనేది న్యాయాధికారి మేధో విచక్షణ మీద, మానసిక వికాసం మీద, సామాజిక అవగాహన మీద, అంతకుముందే ఆడవారిని కించపరుస్తూ చూసిన సినిమా ప్రభావం పైన ఆధారపడి ఉంటుంది. తరువాత హైకోర్టులో సాక్ష్యాలను సరిగా విచారించలేదని, అనుమతించకూడని సాక్ష్యాలను అనుమతించారని, న్యాయాధికారి అసమంజసంగా ఆలోచించి అనవసరంగా తన మానసిక వైక్లబ్యం ఆధారంగా అనుచిత అభిప్రాయానికి వచ్చి అన్యాయంగా శిక్ష విధించాడని చాలా తెలివిగా వాదిస్తాడు. అందుకోసం ఆ రాష్ట్రం లేదా దేశంలో కెల్లా క్రిమినల్ లా ప్రాక్టీసులో అనుభవజ్నుడు, సగంమంది జడ్జిలకు, సగంమంది లాయర్లకు గురువులాంటి సీనియర్ ను కోర్టులో నిలబడతారు. ఆయన కొడుకో బంధువో అప్పడికే హైకోర్టులోనో సుప్రీంకోర్టులో నో జడ్జిగా ఉండే ఉంటాడు. అంత పెద్దాయన నిలబడ్డప్పుడు రిలీఫ్ ఇవ్వాలి కదా అని న్యాయమూర్తులు చాలాన్యాయంగా ఆలోచించి శిక్ష రద్దుచేయడమో లేక కనీసం తగ్గించడమో లేక ఇప్పడికే నిందితుడు జైల్లో ఉన్నకాలం ఎక్కువే కనుక అతను నేరస్తుడే అయినా వెంటనే విడుదల చేయాలనో తీర్పు చెప్తాడు. అందులో కూడా ఏదో అన్యాయం కనబడితే సుప్రీంకోర్టు మిగిలిన న్యాయం జోడించి రాజ్యాంగ బాధ్యతైన సంపూర్ణ న్యాయం దేశానికి సమర్పిస్తుంది. ఈలోగా మీడియా ప్రతి సారీ ఆమె ఏవిధంగా రేప్ కు గురయిందో ఆమెకూ, మొత్తం దేశానికీ కూడా గుర్తుచేసే గురుతరమైన బాధ్యతను నిర్వహించమే గాకుండా, ఏ విధంగా రేప్ చేసినా ఏవిధంగా తప్పించుకోవచ్చో ప్రత్యేకంగా నటీనటులతో నటింపచేసిన సంచలన వీడియో కార్యక్రమాల ద్వారా వివరిస్తూ ఉంటుంది.వాటికి టి ఆర్ పి రేటింగ్ ఎక్కువగా ఉండడం వల్ల ప్రకటనదారులు విశేషంగా లైంగిక శక్తి పెంపొందించే మందుల గురించి ప్రకటనలు ఇస్తూ ఉంటారు. ఒక తెలుగు టీవి ఛానెల్ జనవరి 7న మహిళలపై అత్యాచారాలు నివారణ అనే అంశంపై విద్యార్థులతో రికార్డు చేసిన ఒక కార్యక్రమాన్ని ప్రసారం చేస్తూ మధ్యమధ్య కమర్షియల్ బ్రేక్ లో అమ్మాయిలను పడేయడానికి రెండు ఐడియాలు అనే ప్రకటన కనీసం రెండు డజన్లు వేసి డబ్బు సంపాదించింది. అమ్మాయిలను పడేసే అయిడియాల కోసం ఆలోచిస్తూ అత్యాచారాల నివారణ విషయం ఎవరైనా పట్టించుకుంటాడా?

రేప్ నేరం, పెళ్లి శిక్ష

ఈ రేప్ అనంతర రేప్ న్యాయ కథనాల్లో మరో కోణం ఉంది. జడ్జిగారికి సామాజిక స్పృహ కాస్త ఎక్కువైతే రేప్ బాధితురాలని జీవితాన్ని బాగుచేయాలనే సదుద్దేశంతో ఆమెను రేపిస్టుకిచ్చి వివాహం చేయించడానికి ప్రయత్నం చేస్తాడు. బాధితురాలిని బంధువులు ఒప్పిస్తారు. రేపిస్టు కుటుంబానికి దేవుడైపోతాడు. పత్రికలు కీర్తిస్తాయి. కోర్టు వారి ఆదేశం మేరకు నడుచుకుంటూ అప్పీలుకు వెళ్లకుండా రోజూ రేప్ చేస్తూ ఉంటాడు. లేకపోతే కోర్టు ధిక్కారం అవుతుందేమోనని బాధితురాలు అందుకు అంగీకరిస్తూ ఉంటుంది. అయితే లాయర్లు తమ అప్పీలు వ్యాపారం పోయిందని బాధపడే అవకాశం మాత్రం ఉంది.

ప్రియదర్శిని మట్టూ అనే అమ్మాయిని ఒక పోలీసు అధికారి ప్రేమించానన్నాడు. ఆమె అంగీకరించలేదు. ఆమె పై అత్యాచారం చేసి హతం చేశాడీ దుర్మార్గుడు. కోర్టులో నేరాంగీకారం చేసినా, తండ్రి గారి నైపుణ్యం వల్ల సాక్ష్యాలు లేకపోవడం వల్ల జడ్జిగారు నిర్దోషి వదిలేయవలసి వచ్చింది. మీడియా ఈ కేసును వెలుగులోకి తెచ్చింది. విస్తృతంగా చర్చించింది. న్యాయస్థానం తీర్పును మళ్లీ సమీక్షించింది. నేరగాడికి శిక్ష పడింది. మీడియా ట్రయల్ చెల్లదని కొట్టి పడేసే వారికి ఈ కేసు, జెసికాలాల్ కేసు ఉదాహరణలు. జనం గమనిస్తున్నారన్న భయం పోలీసులకు న్యాయస్థానాలకు కూడా కలిగించడమే మీడియా పని. ఎన్ని అవాంతరాలు ఎదురైనా ఆ పనిచేయడమే మీడియా కర్తవ్యం. మనమంతా మనుషులు గా పరిణామం చెందడం అన్నింటికన్నా ముఖ్య కర్తవ్యం.

- మాడభూషి శ్రీధర్
రచయిత నల్సార్ లా యూనివర్శిటిలో ప్రొఫెసర్

English summary
Madabhusi sridhar, professer in Nalsar Law university has expressed his views on rape cases and the judgements in the wake of Delhi gang rape incident.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X