వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబు, తెలుగుదేశం రాష్ట్రానికి చేస్తున్న మేలు!

By Pratap
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
తమ అవిశ్వాస తీర్మానాలకు మద్దతు ఇవ్వకూడదని తెలుగుదేశం పార్టీ తీసుకున్న నిర్ణయంపై వైయస్సార్ కాంగ్రెసు, తెరాసలు మండిపడుతున్నాయి. తెలుగుదేశం పార్టీ విప్ జారీ చేయడాన్ని కూడా తప్పు పడుతున్నాయి. కాంగ్రెసును కాపాడే రక్షణ కవచంగా తెలుగుదేశం పార్టీ మారిపోయిందని, ప్రభుత్వాన్ని గద్దె దించాల్సిన ప్రధాన ప్రతిపక్షం శానససభ్యులకు విప్ జారీ చేయడం వింతగా ఉందని, ఈ వింతకు స్పూర్తికర్త చంద్రబాబు చరిత్రలో నిలుస్తారని మండిపడుతున్నారు. చంద్రబాబు ఇప్పటికైనా అవిశ్వాస తీర్మానంపై పునరాలోచించుకోవాలని, ప్రభుత్వ వైఖరితో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కుంటున్నారని, అవిశ్వాసం నుంచి ప్రభుత్వం బయటపడేలా చంద్రబాబు చూస్తున్నారని, దీనికి మూల్యం చెల్లించక తప్పదని వారన్నారు.

2009 సెప్టెంబర్ 2 తర్వాత ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు ఎంత దిగజారేయంటే, రాష్ట్రంలో ఇంత అప్రజాస్వామ్యంగా శాసన సభని నడపడం కలలో కూడా ఊహించలేము! ఒక పెద్ద మనిషిని చూసి ప్రజలు కాంగ్రెస్ పార్టీ ని గెలిపిస్తే, ఈ రోజు ముఖ్యమంత్రి, సభాపతి లాంటి విధులని కూడా కాంగ్రెస్ అధిష్టానమే నిర్వర్తిస్తున్నది! నాదెండ్ల మనోహర్ లాంటి ఘోరమైన, అన్యాయమైన, కాంగ్రెస్ అధిష్టానానికి వత్తాసు పలుకుతున్న సభాపతిని ఇంతకముందు, ఇక తర్వాత చూడం!

నా ఉద్దేశంలో చంద్రబాబు అవిశ్వాసానికి మద్దతు ఇవ్వకుండా చేస్తున్న పని సరైనదే! రెండు కోణాల్లో విశ్లేషిస్తే తన నిర్ణయం సమంజసంగా కనబడుతుంది! ఒకటి తెలుగు దేశం పస్తుత పరిస్థితి, రెండోది రాష్ట్రానికి జరగనున్న దీర్ఘకాలిక మేలు!

చంద్రబాబు అమాయకుడు కాదే!?

చాలా మంది కాంగ్రెస్, తెలుగు దేశం ఎమ్మెల్యేలు వైఎస్సార్సీపీ లోకి జంప్ చేస్తున్నారని, మజ్లిస్ పార్టీ మద్దతు ఉపసంహరించడంతో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం మైనార్టీలో పడిపోయిందని, మైనార్టీలో పడిన ప్రభుత్వానికి ఒక్క నిమిషం కూడా అధికారంలో కొనసాగే నైతిక హక్కు లేదని, టిడిపి చంద్రబాబు అవిశ్వాసం పెట్టాలని వైఎస్సార్సిపి డిమాండ్ చెయ్యడం సబబే అయినా, చంద్రబాబు ఎందుకు పెడతాడు? ఎన్నికలొస్తే సమూలంగా టిడిపిని, కాంగ్రెస్ని పీకేయ్యడానికి ప్రజలు వేచిచూస్తున్నారు అని కూడా తెలియని అమాయకుడిలా కనిపిస్తున్నాడా? లేక ప్రభుత్వాన్ని నిలబెట్టే ఆపద్భాంధవుడు చంద్రబాబేనా?

ప్రజాకంటక పాలన సాగిస్తున్న కిరణ్ సర్కారు ఇన్ని రోజులు మనగలిగిందంటే అదంతా ప్రతిపక్ష నేత చంద్రబాబు పుణ్యమేనని అధికార కాంగ్రెస్ పార్టీ నేతలే ప్రెస్ మీట్ లు పెట్టి పబ్లిగ్గా చెబుతున్నారు. హస్తం ప్రభుత్వం పడిపోకుండా చేయి అడ్డుపెడుతున్నది ఆయనేనని తాజాగా మరోసారి రుజువయింది. కనీస బలానికి కోత పడి ప్రభుత్వానికి కొనసాగే హక్కు పోయింది. ఆంధ్రప్రదేశ్ కు అత్యధిక కాలం సీఎంగా చేసిన చంద్రబాబుకు తప్ప ఈ విషయం అందరికీ తెలుసు. అవిశ్వాసానికి ఇంకా 'అవసరం' రాలేదన్నది ఆయన నిశ్చితాభిప్రాయం. ప్రజలను కాల్చుకుతింటున్న కాంగ్రెస్ సర్కారు ఒక్క నిమిషం కూడా కొనసాగేందుకు అర్హత లేదంటూ జనం మధ్యలో డైలాగులు దంచే బాబుగారు అవిశ్వాసానికి మాత్రం ససేమిరా అంటున్నారు. పోనీ, కిరణ్ సర్కారు బాగా పని చేస్తుందా అని అడిగితే - ఇంత అసమర్థ ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదంటారు హైటెక్ బాబు. పనిచేయని ప్రభుత్వంపై అవిశ్వాసం ఎందుకు పెట్టరని అడిగితే- అవసరమైతే అవిశ్వాస తీర్మానంపై నిర్ణయం తీసుకుంటానని ప్రధాన ప్రతిపక్ష నేత గడుసుగా సమాధాన మిచ్చారు. జనం నిలదీయడంతో చంద్రబాబు నుంచి వచ్చిన జవాబిమిది. తర్వాత జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన బాబు- పన్నులతో ప్రజలపై భారం మోపుతున్న ప్రభుత్వాన్ని చిత్తుచిత్తుగా ఓడించాలని పిలుపునివడం కొసమెరుపు. చంద్రబాబు ద్వంద్వ వైఖరి జనాలకే కాదు తెలుగు తమ్ముళ్లకే అంతుబట్టడం లేదు. బాబు విపక్ష నేతగా ఉండగా కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చిన ముప్పేమి లేదని సొంత పార్టీలోనే అంటున్నారు.

కాని, వీళ్ళకెవరికీ అర్ధం కానిదేమంటే రాష్ట్రంలో ఈరోజున్న పరిస్థితులు. మధ్యంతరమైనా, సకాలంలోనైనా ఎన్నికలొస్తే కాంగ్రెస్ తోపాటు, తెలుగుదేశం అత్యంత దారుణమైన ఫలితాలు వచ్చి, పూర్తిగా పుట్టి మునుగుతాయి! ఎన్నికలను ఆహ్వానించేది గెలుస్తామనే ఆశ ఉన్నవాళ్ళు! ఈ వయసులో నా కష్టం చూడండి, నా బాధలు చూడండి, నన్ను నేను శిక్షించుకుంటున్నాను, మీరు నన్ను నమ్మి నాతో నడవండి, ఆస్తులు అమ్ముకొని తెలుగుదేశాన్ని నిలబెట్టండి, ఊపిరి పోయండి, నా కాళ్ళ బొబ్బలు చూడండి, సుష్కించిన నా కాయాన్ని చూడండి అని అన్ని విధాలా వేడుకున్నా ప్రజలు కనికరం చూపకుండా చంద్రబాబుకి నిస్తేజం తెప్పిస్తే, ఓడిపోతాను అని తనకి గట్టి నమ్మకం ఉంటే, ఎందుకు అవిశ్వాసం పెట్టి ఎన్నికలను తెచ్చుకోవాలి? ఈ కోణంలో చూస్తే చంద్రబాబు అవిశ్వాసం పెట్టకుండా ఉండటంలోనే అర్ధముంది!

రాష్ట్రానికెలా లాభం!?

ఒక విధంగా చెప్పాలి అంటే చంద్రబాబు ప్రజల మీద విపరీతమైన కసి ఉంది. ఆయనకీ మొదటినుండి ప్రజలన్నా, వారి బాగోగులన్నా గట్టి నిర్లిప్తతే! కాని ఈ మధ్య దానికి కసి కూడా తోడైంది! జనహితం అనేది ఒక విదేశి మాట అతనికి, ఎప్పుడూ అర్ధం కాదు! సహాయం అవసరమైన ప్రజలని అక్కున చేర్చుకోవాలి అనే ఒక కాన్సెప్ట్ లేని వాడు, ప్రజాసేవ లోకి, రాజకీయాల్లోకి ఎలా ఎందుకు వచ్చాడో అర్ధం కాదు! వెన్నుపోటు అతని ముఖ్యాయుధం! ఎన్టీఆర్ని వెన్నుపోటు పొడిచిందే ప్రజలకి తెలుసు కాని మొదటినుండి చంద్రబాబు ప్రతి అడుగు వెన్నుపోటే! తనకి మొదటి అసెంబ్లీ సీట్ ఇప్పించిన నల్లారి అమరనాధ రెడ్డిని వెన్నుపోటు పొడిచి, కుతూహలమ్మని జిల్లా పరిషద్ ఛైర్పర్సన్ చేసిన ఈయన, టీడీపీని నడిపినన్ని రోజులు పార్టీ లోని అందరికీ, చివరికి పార్టీకి వెన్నుపోట్లు పొడుస్తూనే ఉన్నాడు! దగ్గుపాటి, హరికృష్ణ, జూనియర్, ఎలిమేటి, నాగం, దాడి ఒకరేమిటి ఎంత మంది ఎమ్మెల్లె అభ్యర్ధులని వాడుకొని వదిలెయ్యలేదు?

చంద్రబాబు, తెలుగుదేశం, ఎల్లో మీడియా, కుహనా మేధావులు రాష్ట్రాన్ని, ప్రజా జీవితాన్ని మలినం చేస్తున్నారు! అబద్దాలని నిజంగా, నిజాలని అబద్దాలుగా వీరు ప్రజలకి చూపించుకుంటూ మూకుమ్మడిగా దాడి చేస్తున్నారు! వాళ్లకి వైఎస్సార్ లోని, జగన్ లోని తప్పులే కనబడతాయి, రంద్రాన్వేషణ చాలా చక్కగా చేస్తారు కాని, ముందున్న తమ వారి పెద్ద కంతలు కనబడనే కనబడవు! జైలుకి పొయ్యాడు కదా తప్పుడోడు అంటారు, కాంగ్రెస్ పరమ పవిత్రంగా కనబడుతుంది! కాంగ్రెస్ ని, కోర్ట్ లను మేనేజ్ చేసి చంద్రబాబు తప్పించుకుంటే ఆయన నిఖార్సైన, నిప్పులాంటి మనిషంటారు, రామోజీ చేసిన చట్ట విరుద్ధమైన పనులన్నీ వ్యాపారం అంటారు, జయప్రకాశ్ వీటన్నిటి చూడనట్టు పోతున్నా పెద్ద మేధావి అంటారు! ఏంటో ఈ కుహానా మేధావులు! ప్రజలు రెండు సార్లు చీదరించుకుని రిజెక్ట్ చేసినా, ఇంకో సారి రిజెక్ట్ చెయ్యడానికి సిద్ధంగా ఉన్నా, ఇంకా ఈ రాతలు రాస్తూనే పోతుంటారు! దానికేమో, ప్రజలు మమ్మల్ని గెలిపిస్తే విజ్ఞత, వాళ్ళని గెలిపిస్తే అమ్ముడు బోయారు అంటారు! అన్నిటికి అన్ని ఆర్గ్యుమెంట్స్ రెడీగా ఉంటాయి వీళ్ళ ఫ్యాక్టరీస్ లో! ప్రజలు వెర్రివాళ్ళు అనడం వీళ్ళకి వెన్నతో పెట్టిన విద్య! కానీ అదే ప్రజలు అత్యంత తెలివితేటలతో జైల్లో ఉన్నా, వారి ముందుకు రాలేకున్నా జగన్ ని సమర్ధించడం, అతని పార్టీకి అఖండ విజయాల్ని అందిస్తుండటం వీరికి అర్ధం కాని విషయం!

చంద్రబాబుకి విస్వసనీయతకి ఉప్పు నిప్పుకి ఉన్న వైరం ఉంది మొదటనుంచి! ఆయన జీవిత ప్రారంభం నుండి దానిమీద ఎప్పుడూ నమ్మకం లేదు! ఎన్టీఆర్ కూతుర్నిస్తాను అంటే లావుగా ఉంటుందని వద్దంటే, వైఎస్సార్ ఎన్టీఆర్ అంటే ఎవరనుకున్నావు, అంత పెద్దమనిషి పిలిచి పిల్లనిస్తాంటే వద్దని ఆయన్ని అగౌరవ పరచవద్దు, నీ భవిష్యత్తు కూడా బాగుంటుందని నచ్చ చెప్పిన విషయం చాలా మందికి తెలీదు! పిల్లనిచ్చిన పెద్దమనిషిని వెన్నుపోటు పొడిచి, చేసుకోమని సలహా ఇచ్చిన పెద్దమనిషి చనిపోయి మూడేళ్ళు దాటిన తర్వాత కూడా వదలకుండా కుసంస్కార విమర్శలు చేసుకుంటూ, అక్కసు వెల్లకక్కుతున్నాడు ఇదే చంద్రబాబు! సాయం చేసిన వాళ్లకు కుడా ద్రోహం తలపెట్టే మనస్తత్వం ఉన్న మనిషి, ప్రజా వ్యతిరేకి అయిన చంద్రబాబు ఎప్పటికీ ప్రజల్ని శాసించే స్థితిలో ఉండకూడదు! ఎన్టీఆర్ టీడీపిని స్థాపించినప్పుడు రంగులేసుకునేవాడికి ప్రజలు ఓట్లు వెయ్యరని తూలనాడి, ఎన్నికల్లో మామ మీద పోటీచేస్తానని ప్రగల్బాలు పలికి, పిల్లనిచ్చిన మామని చెప్పులతో కొట్టించి, వెన్నుపోటు పొడిచి, కనీసం అసెంబ్లీ లో కడ సారి ప్రసంగం చేయడానికి ఎంత బతిమాలినా అవకాశం ఇవ్వని, నైతిక విలువలు లేవని పదే పదే తన యెల్లో మీడియాలో ప్రచారం చేసి, అదే ఎన్టీఆర్ ని అవసరానికి వాడుకుంటున్న చంద్రబాబు మళ్ళీ ప్రజా జీవితంలో ఏ పదవి చేపట్టకుండా ఎప్పటికీ మిగిలిపోవాలి! లుంబినీ పార్క్, గోకుల చాట్ లలో బాంబులు పేలి వంద మందికి పైగా చనిపోతే తన కుమారుడి పెళ్ళిలో భాగంగా సంగీత్ లో నృత్యాలు చేసుకున్న చంద్రబాబుకి ఎప్పటికీ ప్రజా జేవితంలో భాగం ఉండకూడదు! నిజమైన ప్రజా నాయకుడైతే, ప్రజలకోసం స్పందించే మనసున్న మనిషైతే ఈ విలువల్లేని నృత్యాలని ఆపి సాదా సీదాగా కొడుడ్కు పెళ్లి జరిపించే వాడు!

ఈ పరిస్థితుల్లో చంద్రబాబు, తెలుగుదేశం, యెల్లో మీడియా ఎన్ని ఎక్కువ, పెద్ద తప్పులు చేస్తే రాష్ట్రానికి అంత మంచిది! ఆ పార్టీ సమూలంగా పెకిలించబడాలి. దానికి చంద్రబాబు భారీగా దోహదపడ్తున్నాడు. పాదయాత్ర అంటే ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి కాని, ఉక్రోషంతో కుమారుడి వయసున్నవారిని కూడా తూలనాడుకుంటూ, పోయిన వాళ్ళని తిట్టుకుంటూ ఉన్న ఎంతో కొంత ఆదరనని కూడా పోగొట్టుకుంటున్న చంద్రబాబు రాష్ట్రానికి చాలా మేలు చేస్తున్నాడు! చంద్రబాబు, ఎల్లో మీడియా ప్రజాబలం కోల్పోవడం అనే పరంపర చాలా కాలం నుండి జరుగుతున్నదే - ఒక్కో ఎన్నికకు ఎంతో కొంత ప్రజాభిమానాన్ని కోల్పోతునే వున్నారు! ఇలాగే కొనసాగాలని, కొనసాగి కొనసాగి వాళ్ళు చేష్టలుడిగి నిర్వీర్యమవ్వాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు! ఈ విధంగా రాష్ట్ర ప్రజానీకానికి సాయం చేసుకుంటూ ముందుకు సాగిపోతున్న చంద్రబాబుకి నా అభినందనలు!

గురవా రెడ్డి, అట్లాంటా

English summary

 Guruva Reddy from Atlanta writes on Telugudesam party president Nara Chandrababu Naidu stand on no confidence motion to be proposed by YSR Congress party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X