• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

రాయలసీమ నాటు బాంబుల తయారీపై ఇలా...

By Pratap
|

తెలుగు బిడ్డ పివి నరసింహారావు ప్రధాన మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత కర్నూలు జిల్లా నంద్యాల నుంచి పోటీ చేశారు. తెలుగు బిడ్డ ప్రధాన మంత్రి అయ్యారనే ఉద్దేశంతో అప్పుడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎన్టీ రామారావు తన పార్టీ అభ్యర్థిని పోటీకి దింపలేదు. కానీ కొంత మంది స్వతంత్రులు పోటీకి దిగారు. దీంతో పివి ఎన్నిక ఏకగ్రీవం కాలేదు. దాంతో పోలింగ్ అనివార్యంగా మారింది.

పివి నరసింహారావు తరపున ఎన్నికల ప్రచారం జరుగుతున్న తరుణంలో నేను రాజకీయ, సామాజిక వారపత్రిక సుప్రభాతంలో పనిచేస్తున్నాను. పివి నరసింహారావు కోసం జరుగుతున్న ప్రచారంపై, ఇతర ఎన్నికల వ్యవహారాలపై వార్తాకథనం రాయడానికి నేను నంద్యాల వెళ్లాల్సి వచ్చింది.

కర్నూలులో దిగిన తర్వాత నేను నంద్యాల, ఆళ్లగడ్డ, అవుకు వంటి ప్రాంతాల్లో ఫొటోగ్రాఫర్ భరత్ భూషణ్‌తో కలిసి తిరిగాను. ఎన్నికల ప్రచార సరళిని పరిశీలించడానికి కొన్ని గ్రామాలు కూడా తిరిగాం. కోట్ల విజయభాస్కర్ రెడ్డి గ్రామానికి కూడా వెళ్లాం. రాయలసీమ అంటే బాంబుల సీమ అనే అభిప్రాయం మిగతా ప్రపంచానికి ఉంది. రాయలసీమలో ఎలా బాంబులు తయారు చేస్తారు, ఎలా ప్రయోగిస్తారనేది బయటి ప్రపంచానికి ఆశ్చర్యకరమైన విషయమే. ఆ ఆశ్చర్యాన్ని ఛేదించాలని అనుకున్నాం

దాంతో రాయలసీమ బాంబుల తయారీపై ఓ వార్తాకథనం చేస్తే బాగుంటుందనే అభిప్రాయం కలిగింది. అయితే, కేవలం వార్తాకథనం రాస్తే మామూలుగానే ఉంటుందనే ఉద్దేశంతో ఓ ప్లాన్ వేశాం. బాంబుల తయారీ మొదలు దాన్ని ప్రయోగించే వరకు గల దశలను కెమెరాలో బంధించాలని నిర్ణయించుకున్నాం. ఆ నిర్ణయానికి రావడమే తరువాయి ఓ రాజకీయ నాయకుడి ఇంటికి వెళ్లాం. మాకు అక్కడ మంచి ఆతిథ్యం లభించింది. మధ్యాహ్న భోజనం కూడా ఆయన ఇంట్లోనే ఏర్పాటైంది.

Article on country made bombs of Rayalaseema

మెల్లగా మా ఆలోచన చెప్పాం. అదేం పెద్ద విషయం కాదన్నట్లుగా వారు మాకు సహకరించాం. బాంబుల తయారీకి వాడే పదార్థాల నుంచి దాన్ని తయారు చేసి విసిరే దశ వరకు వరుసగా ఫొటోలు తీశాం. ఆ ఫొటోలతో సుప్రభాతంలో వార్తాకథనం రాశాం. బహుశా రాయలసీమ బాంబుల తయారీ మీద వచ్చి సమగ్రమైన మొదటి వార్తాకథనం అదే. సుప్రభాతంలో ఆ వార్తాకథనం అచ్చయిన తర్వాత ది వీక్ వాళ్లు ఓ వార్తాకథనం రాసి ప్రచురించారు.

నిజానికి, భరత్ భూషణ్‌తో కలిసి కర్నూలు జిల్లాలో పర్యటించడమనేది మాకు ఉద్వేగభరితమైన విషయమే కాకుండా ఉత్కంఠభరితమైంది కూడా. నేను ఓ నాయకుడిని ఇంటర్వ్యూ చేసి బయటకు వచ్చేసరికి భరత్ భూషణ్ కనిపించలేదు. అతన్ని ఎవరైనా కిడ్నాప్ చేశారమే నేను తీవ్రమైన భయాందోళనకు గురయ్యాను. అలా గురి కావడానికి కారణం లేకపోలేదు. స్థానిక నాయకులను నేను ఇంటర్వ్యూల్లో ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేశాను. ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేసే వాతావరణం ఉండదట కదా అనేది ఆ ప్రశ్నలోని ప్రధాన విషయం.

అయితే, భారీ మనిషి భరత్ భూషణ్ ఓ ఆరగంట తర్వాత నా ఎదుటికి వచ్చాడు. దాంతో నేను ఊపిరి పీల్చుకున్నా. కర్నూలు జిల్లాకు సంబంధించి రాసిన వార్తాకథనాలు, భిన్నమైనవి అదే సమయంలో ప్లాన్ చేసుకుని రాసేశాను. కర్నూలు జిల్లా పర్యటన భరత్ భూషణ్‌కు మంచి ఫొటోలను కూడా ప్రసాదించింది. ఆయన అక్కడి ఇళ్లకు ఉండే, అక్కడి సంప్రదాయానికి ప్రతీకగా ఉన్న తలుపులను చాలా ఫొటోలు తీసుకున్నాడు. మొత్తం మీద, కర్నూలు జిల్లా పర్యటన భరత్ భూషణ్‌కు ఏమో గానీ నాకు జర్నలిజం కెరీర్‌లో మంచి అనుభవాన్ని మిగిల్చింది.

- కాసుల ప్రతాపరెడ్డి

English summary
Kasula Pratap reddy explains the country made bombs culture of Rayalaseema.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X