వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విరసం చీలికపై వార్తాకథనం: అసలేం జరిగింది?

By Pratap
|
Google Oneindia TeluguNews

జర్నలిస్టుగా, ముఖ్యంగా రిపోర్టర్‌గా పని చేయడం కత్తి మీద సాము లాంటిది. వాస్తవాన్ని కనిపెట్టడానికి ఉన్న అడ్డంకులను తొలగించడం చాలా కష్టంగా ఉంటుంది. ఒక్కోసారి అత్యుత్సాహం వాస్తవాన్ని అన్వేషించి పట్టుకోవడానికి అడ్డువస్తుంది. ఒక్కోసారి జరిగాల్సిన పరిణామం అనూహ్యమైన పరిస్థితిలో తిరగబడవచ్చు.

అలాంటి సందర్భమే విప్లవ రచయితల సంఘం (విరసం) విభేదాలపై నేను సుప్రభాతం వారపత్రికలో రాసిన వార్తాకథనం విషయంలో ఎదురైంది. నిజానికి, విరసంలో విభేదాలు ఉన్నాయన్న మాట వాస్తవమే. అది బహుశా 1996 లేదా 1997 కావచ్చు. సరిగా గుర్తు లేదు గానీ విరసంలో తీవ్రమైన విభేదాలు చోటు చేసుకున్నాయి.

విరసం 1970లో మార్క్సిస్టు, లెనినిస్టు, మావో ఆలోచనా విధానానికి సంబంధించిన రాజకీయాల భావజాలాన్ని ప్రచారం చేయడానికి ఏర్పడింది. శ్రీశ్రీ దానికి నాయకత్వం వహించాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బలమైన రచయితల సంఘంగా అప్పుడు ఉండేది. ముఖ్యంగా తెలంగాణలో దాని ప్రభావం విపరీతంగా పడింది. దాని వెలుపల ఉండే రచయితలు మనుగడ సాధించడం కూడా కష్టంగా ఉండేది.

logo

అటువంటి సందర్భంలో విరసంలో విభేదాలు చోటు చేసుకున్నాయి. బహుశా, విభేదాలు కొత్తవేమీ కాకపోవచ్చు గానీ అవి విరసంలో చీలికను తెచ్చేంత తీవ్రమైన స్థాయిలో చెలరేగాయి. విరసంలో చీలిక తేవడానికి ప్రయత్నించి వర్గం నన్ను కలిసింది. అప్పుడు నేను ఉదయం దినపత్రికలో పనిచేస్తున్నాను. కానీ అది మూతపడే పరిస్థితిలో సుప్రభాతంతో వేరే పేరుతో కొన్ని ఆర్టికల్స్ కంట్రిబ్యూట్ చేస్తున్నాను. అదీ వాసుదేవరావుగారి వల్లనే.

ఆ విరసంలోని విభేదాలపై నేను వాసుదేవరావు గారి సలహా మేరకు వార్తాకథనం రాయడానికి సిద్ధపడ్డాను. నిజానికి, వాసుదేవ రావుగారు విరసం అభిమాని. కానీ, ఆయన వార్తాకథనం రాయడానికి అంగీకరించారు. పైగా, దాన్ని కవర్ స్టోరీ చేయడానికి కూడా సిద్ధపడ్డారు. విరసంలో విభేదాలు చోటు చేసుకున్న తీరుపైనే వార్తాకథనమంతా నడుస్తుంది. నిజానికి, నాకు అందిన సమాచారం మేరకు విరసంలోని మెజారిటీ గ్రూపు చీలిపోయి కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకుంటుంది.

చీలిక తెస్తామని చెప్పిన వర్గం వరవరరావుతో పాటు మరికొంత మందిపై బిగ్ ఫైవ్ అనో, బిగ్ ఫోర్ అనో తీవ్రమైన విమర్శలు పెట్టారు. దాన్ని ప్రాతిపదికగా తీసుకుని నేను వార్తాకథనం రాశాను. అయితే, చీలిక జరుగుతుందని కచ్చితంగా వార్తాకథనంలో రాయలేదు గానీ కవర్ పేజీ శీర్షిక మాత్రం విరసంలో చీలిక అని పెట్టి ప్రశ్నగుర్తు ఇచ్చాం. అలా పెట్టడానికి ప్రధానమైన కారణం - కొంత సెన్సేషన్ క్రియేట్ చేయడం. దాన్ని వాసుదేవరావుగారు కూడా అంగీకరించారు కాబట్టి నాకే విధమైన ఢోకా లేదనే అనుకున్నాను.

తీరా సమయానికి కథ అడ్డం తిరిగింది. వార్తాకథనం అచ్చయిన తర్వాత పెద్ద సంచలనమే చెలరేగింది. వరంగల్‌లో జరిగిన విరసం కార్యవర్గ సమావేశంలో దాని జిరాక్స్ ప్రతుులు తీసుకుని పంచిపెట్టుకున్నారు. దానిపై సమావేశంలో తీవ్రమైన చర్చే జరిగినట్లు తర్వాత నాకు తెలిసింది. ఒక రకంగా విరసంలోని ఓ వర్గానికి అప్పుడు నేను హీరోను కూడా అయ్యాను.

విరసం చీలిపోతుందని బలంగా నమ్మడానికి నాకు మరో ప్రధానమైన కారణం కూడా ఉంది. విరసం చీలిక వర్గానికి చెందిన ప్రధాన కార్యదర్శి కూడా ఖరారయ్యాడు. విరసం ప్రధాన కార్యదర్శిగా ఆయన నాకు ఇచ్చిన రాతపూర్వకమైన ఇంటర్వ్యూ కూడా ఉంది. దాన్ని వార్తాకథనంలో ప్రచురించకూడదని, విరసం చీలిక జరిగిన తర్వాత కార్యవర్గం ఏర్పాటైన తర్వాత దాన్ని ప్రచురించాలని విరసం నాయకత్వంతో విభేదించిన వర్గం నాకు షరతు పెట్టింది.

అయితే, అనూహ్యమైన పరిణామాల మధ్య చీలిక జరగకపోవడంతో దాన్ని అచ్చు వేయడానికి కుదరలేదు. అయితే, ఆ రాతపూర్వకమైన ఇంటర్వ్యూ ఆయన చేతిరాతలోనే నా వద్ద ఇప్పటికీ ఉంది. అయితే, తప్పుడు వార్త రాసిన అపఖ్యాతి నాకు దక్కింది. విభేదాలు ఉన్న మాట వాస్తవమే అయినప్పటికీ విరసంలో కొన్ని విషయాలపై ఓ వర్గం తీవ్రంగా విభేదిస్తున్నప్పటికీ, నేను రాసిన వార్తాకథనంలో అంశాలు నిజమే అయినప్పటికీ చీలిక జరగకపోవడంతో ఆ నింద నేను మోయాల్సి వచ్చింది.

అలా మోయడానికి సిద్ధపడే నేను చివరి నిమిషంలో రాజీ పడిన నాయకుడి ఇంటర్వ్యూ నా వద్ద ఉందని గానీ దాన్ని బయటపెడతానని గానీ నేను ఎప్పుడూ చెప్పలేదు. పాత ఫైల్స్ దుమ్ము దులుపుతున్నప్పుడల్లా ఆ ఇంటర్వ్యూ రాతప్రతులు గత అనుభవాలను గుర్తు చేసి బాధ పెడుతాయి. అలాంటి సందర్భమే ఇటీవల ఎదురైనందున ఇది రాయాల్సి వచ్చింది.

అయితే, విమర్శలు చేసేవారు కూడా అచ్చేసిన ఎడిటర్‌ను అనకుండా నన్ను లక్ష్యం చేసుకోవడం కూడా బాధాకరమైన విషయమే. అయితే, సాంకేతిక కారణాల వల్లనే నా అసలు పేరు పెట్టుకోకుండా వేరే పేరుతో ఆ వార్తాకథనం వచ్చింది. భయపడి నేను అసలు పేరు పెట్టుకోలేదనే ప్రచారం కూడా ముమ్మరంగానే సాగింది. అలాంటి నోటీ మాట ద్వారా జరిగే ప్రచారానికి సమాధానాలు ఎలా చెపుతాం, అందుకే మిన్నకుండిపోయాను. మొత్తం మీద, జర్నలిజంలో, మరీ ముఖ్యంగా రిపోర్టింగులో నాకు ఎదురైన చేదు అనుభవమే ఇది. అయితే, సాహిత్య చరిత్రలో మాత్రం దానికి చోటు ఉంటుందేమో, చూడాలి.

- కాసుల ప్రతాపరెడ్డి

English summary
The special article on Revolutionary writers associatian created controversy in Telugu literary field.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X