• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

బాహుబలి చేసిన మేలేమిటి: ''మెగా'' హీరోలపై దెబ్బనే...

By Pratap
|

రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సినిమా కథ అద్భుతమేమీ కాకపోవచ్చు. కానీ, తెరకెక్కించిన పద్దతి అద్భుతమే. పైగా, బాహుబలి తెలుగు సినిమాకు మేలు చేసిందా, చెడు చేసిందా అనే ప్రశ్న వేసుకోవాల్సి ఉంది. బాహుబలి సినిమాపై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నప్పటికీ దానిపై విమర్శలు లేకపోలేదు. ఆ విమర్శలు ఎటువంటివి, న్యాయమైనవేనా?

ఆ ప్రశ్నలకు సమాధానాలు చెప్పుకోవాల్సి వస్తే న్యాయమైనవేనని చెప్పాల్సి ఉంటుంది. ప్రజల తరఫు నుంచి సినిమాను నడపకపోవడం వల్ల ఆ ప్రశ్నలు న్యాయమైనవి అనిపిస్తుంది. రాజుల చరిత్రను, కట్టుకథే అయినా తెరకెక్కించి సామాన్యప్రజానీకం వైపు నుంచి సినిమా తీయలేదు. రాజుల చరిత్రలు అవసరం లేదనే మహాకవి శ్రీశ్రీ దృక్కోణం నుంచి చూస్తే బాహుబలి సినిమా ప్రయోజనం అంతంత మాత్రమే.

అయితే, ప్రారంభంలో కష్టాలు ఎదురైనా నిజాయితీ, వీరత్వం, ప్రజా పక్షపాతం గెలుస్తుందనే సందేశాన్ని బాహుబలి సినిమా ఇస్తుందా అంటే, అవునని చెప్పడానికి సందేహించాల్సిన అవసరం లేదు.అంటే, ధర్మవీరం గెలుస్తుందని రాజమౌళి తన సినిమా ద్వారా చెప్పారని అనుకోవచ్చు.

అసలు కథ అది కాదు...

అసలు కథ అది కాదు...

బాహుబలి సినిమా విషయంలో ఎక్కువగా దిగ్భ్రమకు గురి చేసింది గ్రాఫిక్స్‌ను వాడుకున్న తీరు. ఏవి గ్రాఫిక్స్, ఏవి కావు అని విడదీయడానికి వీలు లేనంతగా దృశ్యాలు కలిసిపోయాయి. ఈ విషయంలో రాజమౌళి ప్రతిభను మెచ్చుకోవచ్చు. మరో విషయమేమిటంటే, సినిమా నిర్మాణానికి అంత ఖర్చు అవసరమా అనేది ప్రశ్న. చిన్న సినిమాలు కొద్దిపాటి పెట్టుబడితో తీయడానికి సందేహించాల్సిన పరిస్థితిని బాహుబలి కల్పించి తెలుగు సినిమాకు నష్టం చేస్తుందా అనే ప్రశ్న కూడా వస్తోంది. అయితే, ఏ సినిమాకైనా ప్రేక్షకులు ఉంటారని ఇటీవల వచ్చి పెళ్లిచూపులు వంటి సినిమాలు నిరూపించాయి. అందువల్ల నిర్మాణ వ్యయం గురించి ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు.

మరో విషయం ఏమిటంటే...

మరో విషయం ఏమిటంటే...

తెలుగు సినిమాను పట్టి పీడిస్తున్న సమస్య హీరోయిజం. బాహుబలి సినిమా కథను తప్పు పట్టేవారు తెలుగు మాస్ హీరోల సినిమాల కథలను కూడా తప్పు పట్టాల్సిందే. ఓ విలన్‌ను, పాసివ్‌గా ఉండే ఓ హీరోయిన్‌ను పెట్టేసి, ఆరు ఫైట్లు, ఆరు డ్యూయెట్లు పెట్టేస్తే తమ హీరోయిజంతో ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతారనే భ్రమను బాహుబలి దెబ్బ తీసిందనే చెప్పాలి.

అది సరిపోదని ఇలా....

అది సరిపోదని ఇలా....

విలన్‌ను, విలన్ అనుచరగణాన్ని (వందలాదిమందిని ) ఒంటిచేత్తో మట్టి కరిపించే సినిమాలు చేయడానికి మన మాస్ హీరోలు ఏమాత్రం వెనకాడడం లేదు. లాజిక్ లేని ఫైట్లు కూడా ఉంటాయి. అలాగే, హీరోయిన్ అందాలను ఆరబోస్తూ ఉంటే, ఆమెతో ఆరు పాటల్లో గంతులేస్తే ప్రేక్షకులు మైమరిచిపోతారనే భ్రమలు ఉన్నాయి. మితమైన వలువలతో హీరోయిన్ వేసే గంతులు చాలడం లేదని చెప్పి, ఐటమ్ సాంగ్స్ కూడా ప్రవేశించాయి. మన హీరోల సినిమాల్లో ఓ ఐటమ్ సాంగ్ గొంతులనే కాదు, అంగాంగ ప్రదర్శనలోనూ ప్రేక్షకులను కట్టిపడేయడానికి మత్తును గుప్పించే పరిస్థితి వచ్చింది. దాన్ని కూడా బాహుబలి సినిమా దెబ్బ తీసినట్లే...

తమను హీరోలుగానే చూస్తారని...

తమను హీరోలుగానే చూస్తారని...

మెగా హీరోలు గానీ నందమూరి హీరోలు గానీ అనుకుంటున్నదేమిటంటే, అభిమానులు తమ నుంచి ఏది కోరుతున్నారో అదే చేయాలని. చిరంజీవి రెండు మూడు సార్లు ఆ విషయం చెప్పారు కూడా. ఇక్కడ అభిమానులు వేరు, ప్రేక్షకులు వేరు అనే విషయాన్ని గుర్తించాల్సి ఉంటుంది. ప్రేక్షకులకు అవసరం లేని అభిమానులకు మాత్రమే అవసరమయ్యే సినిమాలు తీయాలనే ఉద్దేశంతో లాజిక్ లేని కథలను ఎంపిక చేసుకుని సినిమాలు చేస్తున్నారు. చాలాసార్లు అవి బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయినా, మాస్ హీరోలు వెనక్కి తిరిగి చూసుకోవడానికి సిద్ధంగా లేరనే విషయం ఎప్పటికప్పుడు స్పష్టమవుతూనే ఉంది. ఈ మాస్ హీరోల నమ్మకాలను బాహుబలి దెబ్బ తీసిందనే చెప్పాలి.

ప్రభాస్‌ను చూసి వారంతా...

ప్రభాస్‌ను చూసి వారంతా...

రెండు కుటుంబాలకు చెందిన హీరోలు బాహుబలి ద్వారా ప్రభాస్ దక్కించుకున్న ఇమేజ్‌ను చూసి నేర్చుకోవాల్సిందేనని చెప్పక తప్పదు. కాస్తా ఆయన పట్ల ఈర్ష్య పడి ఉంటారని కూడా చెప్పవచ్చు.ప్రభాస్‌కు అంతకు ముందు అబిమానులు ఉన్నప్పటికీ బాహుబలి సినిమా ద్వారా ఆ అభిమానం హద్దులను చెరిపేసింది. ఈ సినిమా కోసం ప్రభాస్ చేసిన త్యాగాలను రాజమౌళి ఇప్పటికే చాలాసార్లు చెప్పారు. అందువల్ల ఏడాదికి నాలుగైదు సినిమాల్లో నటించేసి, సినిమాల్లో తాము ప్రదర్శించిన హీరోయిజానికి మురిసిపోయి చేతులు దులుపుకుంటే సరిపోదని ప్రభాస్ నిరూపించాడు. సినిమాలో తాము ఉంటే చాలు, బాక్సాఫీసులు బద్దలవుతాయనే హీరోల నమ్మకాలను బాహుబలి పరీక్షకు పెట్టిందనే చెప్పాలి.

రాజమౌళి ఆ మాట ఎందుకున్నారో...

రాజమౌళి ఆ మాట ఎందుకున్నారో...

పెద్ద హీరోలతో తాను సినిమాలు చేయబోనని రాజమౌళి ఎందుకున్నారో బాహుబలి సినిమా చూసిన తర్వాత అర్థం కాక తప్పదు. కథలను మార్పించి, దర్శకుడి పనిలో జోక్యం చేసుకుని, దర్శకుడు తాను తీయాలనుకున్న సినిమా కాకుండా మరో సినిమా మాదిరిగా తయారయ్యే పరిస్థితి తెలుగు సినిమా రంగంలో ఉంది. తాను అనుకున్నట్లు సినిమా రావాలంటే బడా హీరోలను ఒప్పించడం కన్నా వారిని పక్కన పెట్టడమే మంచిదనే అవగాహనకు రాజమౌళి వచ్చి ఉంటాడు. మాస్ హీరోలతో సినిమాలు చేసిన అనుభవం ఆయనకు ఉంది. చివరగా తాను అనుకున్న సినిమాను ప్రేక్షకులను అందించాలంటే, తన మాటవినే హీరో కావాలని ఆయన అనుకుని ఉంటాడని బాహుబలిని చూస్తే అర్థమవుతుంది.

- కె. నిశాంత్

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
K Nishant on his article written on Rajamouli's Bahubali raised few questions and tried to answer on Telugu cinema.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more