వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రతిక్షణం కొత్తదే: 'టెంపర్' ఏమంటాడు?

By Pratap
|
Google Oneindia TeluguNews

''ఈ సూత్రాలు డబ్బు సంపాదించడానికో, ఉద్యోగ విజయాలు సాధించడానికో కాదు. ఈ సూత్రాలు మీకు మానసిక ఆనందాన్ని యివ్వడానికి, మీరు ఒక మంచి మనిషిగా, మంచి స్నేహితుడిగా, మంచి భాగస్వామిగా, మంచి తల్లిగా, మంచి తండ్రిగా ఉండటానికి ఉపకరిస్తాయి... అంతేకాదు మీరు పాటిస్తున్న సూత్రాలవల్ల ఈ ప్రపంచానికి మీవల్ల ఎటువంటి ప్రయోజనం చేకూరిందనే విషయం గుర్తింపులోకి వస్తుంది... 'సమగ్ర జీవితానికి సరికొత్త సూత్రాలు' పుస్తకంలో రిచర్డ్‌ టెంప్లర్‌.

ఆయన ఈ గ్రంథంలో నీ విజయ రహస్యాన్ని అప్పుడే చెప్పకు అంటారు. ఎందుకంటే మీరు హఠాత్తుగా విజయాలు సాధించడం ఎవరూ సహించ లేరు... ఆచరణాత్మక విలువలు ఆచరణతోనే నిగ్గు తేలుతాయి. అందువల్ల ఈ సూత్రాలగురించి ఎవరికీ బోధించడం గానీ, ప్రచారం చేయడం గానీ, అసలు వీటిగురించి చెప్పడం గానీ, చేయకండి అని అంటారు.

అనుభవాలను, జ్ఞానాన్ని కలిసి పంచుకోవాలి...

నాయకత్వం వహించదలచుకున్నవారు తన అనుభవాలను ఇతరులతో పంచుకోవాలి. ఇతరుల అనుభవాలను ఫీడ్‌ బ్యాక్‌ తీసుకోవాలి. అన్ని కలబోసుకొని సంశ్లేషించాలి. కొత్త నిర్ణయాలకు రావాలి. స్వార్ధానికి పరిమితమైనపుడే విషయాలను, విజయాలను రహస్యంగా ఉంచుకుంటారు. రామానుజుడు శిష్యులకు ఎవరికీ చెప్పకు అని మంత్రం ఉపదేశించాడట. రామానుజుడు గుడి గోపురం ఎక్కి అందరికీ వినిపించాడట. గాయత్రీ మంత్రం ఎవరికీ చెప్పవద్దని అనేవాళ్ళు. ఆయుర్వేదం ఎవరికీ చెప్పకుండా వారితోనే నశిస్తూ వచ్చింది. కొందరు కుట్టుపని కూడా నేర్పడానికి ఆలస్యం చేస్తుంటారు.

రహస్యంగా భావిస్తుంటారు. ఇలాంటి రహస్యాలపై ఇటీవల 'శక్తివంతమైన 48 సూత్రాలు' అనే పుస్తకం వెలువడింది. కుట్రలు, ఎత్తులు, మోసాలు ఎలా చేసి పైకి రావాలో ఆ పుస్తకంలో రెండున్నర వేల యేళ్ళ నుండి సాగుతూ వచ్చిన అనేక రహస్యాలను వివరించారు. అవి చదువుతుంటే ఇలా కూడా ఉంటారా మనుషులు అని అనిపిస్తుంది. అయితే ఎదుటివారు ఎలాంటి మోసాలు చేస్తారో తెలుసుకోవడం కోసం ఆ రహస్యాలను చదవాలి కదా అని ఒక మిత్రుడు అన్నాడు.

BS Ramulu explains the importance of time

జీవితంలో పనికిమాలిన విషయాలు ఎన్నో... వాటిని వదిలించుకుంటే ఎంతో సమయం మిగులుతుంది. గొప్ప విజయాలు సాధించినవాళ్ళు పనికిమాలిన విషయాలను వదిలివేసి సాధించాల్సినవాటికి సమయాన్ని వెచ్చించడంవల్ల ఎంతో ఎదిగారు. కొందరు టైం చాలడంలేదు అనుకుం టారు. వాళ్ళు అనవసరమైనవాటికి టైం కేటాయిస్తున్నారు అని అర్థం.

జరిగిపోయిన వాటికి ఏడ్చి లాభం లేదు...

జరిగిపోయిన వాటికి ఏడ్చి లాభం లేదు. ప్రస్తుత పరిస్థితులలో వర్తమా నంలో జీవించడం అవసరం. ఇక్కడ ఇప్పుడు ఈ క్షణంలో జీవించండి. గతం ఎలాంటిదైనా జరిగిపోయింది. దానిని మార్చలేరు. కాబట్టి వర్తమానం లోనే జీవించండి. ఒక సంఘటన వదిలివేయబడ్డ జ్ఞాపకం అయినప్పుడు దాన్ని బతికించాలని అదేపనిగా ప్రతి పదినిమిషాలకు తవ్వి చూడకు. దాన్ని అంతటితో వదిలివేయి. నీ బాధలు, నా బాధలు కూడా చరిత్రలో గుర్తుంచుకో తగ్గవి కావు. నీ జీవితంలో పది సంవత్సరాలు గడిచి పోయాక వెనక్కి తిరిగిచూసుకుంటే అసలవి గుర్తుంచుకోతగినవిగా అనిపించవు.

ఎంతో కొంత హాస్య నైజం కలిగి ఉండడం చాలా అవసరం. బయటి ప్రపంచం మీద ఆసక్తి పెంచుకోండి. బయటి ప్రపంచం మీద ఆసక్తి పెంచుకోవడంవల్ల మీరే లాభపడతారు. ప్రపంచం కాదు.

జీవితం చాలా కష్టతరమైనది. అది కఠినమైనందుకు దేవుడికి కృతజ్ఞతలు చెప్పాలి. జీవితం చాలా సులభంగా సాహసాలు లేకుండా ఉంటే సానపెట్ట బడటం, ఎదగడం, నేర్చుకోవడం ఉండదు. ఎలా ఉన్నామో, అలాగే ఉంటాము. జీవితమంతా సుఖంగా ఉంటే బోరు కొడుతుంది. వాన పడినప్పుడే కదా, అది వెలిశాక మనం వాన నీళ్ళతో ఆడుకోగలిగేది. అంతా సుఖంగా ఉంటే మనలో ఏమాత్రమూ బలమైన వ్యక్తిత్వం అలవడదు... జీవితమంటే కష్ట సుఖాల సమాహారమే... అంటాడు టెంప్లర్‌.

ప్రపంచంలో నాలుగు రకాల మనుషులుంటారు. విజయాన్ని సాధించే వారు. విజయాన్ని సాధించేవారిని చూసి అసూయపడేవారు. విజయాన్ని చూసి స్ఫూర్తి పొందేవారు. మనతో అది సాధ్యం కాదని ఆగిపోయేవారు. (ఉదా. ప్రధాని పదవి... మొదలుకొని ఎమ్మెల్యే..., సర్పంచ్‌, ఐఎఎస్‌ మొదలు కొని టీచర్‌, బిల్‌గేట్స్‌, వారన్‌ బఫెట్‌, రిలయన్స్‌ ముఖేష్‌ అంబానీ, టాటా, బిర్లాల దాక)

ప్రతిసారీ ర్యాంకు రావాలా...?

ఇది పొరపాటు. సైన్స్‌ టెక్నాలజీలో యూరప్‌, అమెరికా దేశాలు, జపాన్‌, జర్మనీ ఎప్పుడూ ముందు నడుస్తున్నాయి. ఓడిపోయినా ఫర్వాలేదు, కానీ రెండవ స్థానంతో మటుకు సంతృప్తి పడకండి అంటాడు రిచర్డ్‌ టెంప్లర్‌. ఈ దృష్టి డిప్రెషన్‌కు దారి తీస్తుంది. ప్రతిసారీ మొదటిస్థానం సాధించాలి అని అనుకోవడంలో టెన్షన్‌ పెరిగి ఆరోగ్యం చెడిపోతుంది. ఒక అమ్మాయి స్కూల్లో 10వ తరగతి ప్రీఫైనల్‌ పరీక్షల దాకా ఫస్టు వచ్చింది. వార్షికోత్సవంలో ఆమెకు సన్మానం చేశారు. ఆ ర్యాంకును కాపాడుకోవాలని బాగా చదివింది. టెన్షన్‌కు గురైంది. పరీక్షలప్పుడు జ్వరం వచ్చింది. పరీక్షలు జ్వరంతోనే రాసింది. మామూలుగా ఫస్టు క్లాసులో పాసయింది. ర్యాంకు రాలేదు.

ఒక క్లాసులో 40 మంది విద్యార్ధులుంటారు. ఎంత బాగా చదివినా ఫస్ట్‌ ర్యాంక్‌ ఒకరికే వస్తుంది. మిగతావాళ్ళు అందరూ చక్కగానే చదువుతారు. వారంతా ఓడిపోయినట్లు కాదు. మొదటి 10-15 ర్యాంకులు వచ్చేవాళ్ళు ఫస్టు ర్యాంకుతో సమానమే.

ఒక డిప్యూటి కలెక్టర్‌గారి పిల్లలకు మొదటి ర్యాంకులు రావడంలేదని స్కూలు హెడ్మాస్టర్‌ పిలిచి చెప్పారు. డిప్యూటి కలెక్టర్‌... నేను బీడీలు చేసి చదువుకున్నాను. రకరకాల పనులు చేసి చదువుకున్నాను. ఎదిగాను. పిల్లలకు ఫస్టు ర్యాంకులు ముఖ్యం కాదు. చదువు రావడం ముఖ్యం, చదువుపట్ల ఆసక్తి పెంచడం ముఖ్యం. కష్టపడి బతకడం ముఖ్యం. బతుకుపట్ల అవగాహన ముఖ్యం. మీరు పిల్లలను ఫస్టు ర్యాంకంటూ అందర్నీ టెన్షన్‌కు గురి చేయకండి. ఎంత కష్టపడ్డా ఫస్టు ఒకరికే వస్తుంది. మిగతావాళ్ళు చదువురానివాళ్ళు కాదు. ర్యాంకు రానివాళ్ళని మాటలతో కించపర్చకండి, హింసించకండి.

అన్నిటికీ చదువు గీటురాయి కాదు...

గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు, కళాకారులు చాలామంది స్కూల్లో ర్యాంకులు లేకుండా మొద్దులుగా కూడా ముద్రపడ్డవాళ్ళున్నారు. డా|| రావూరి భరద్వాజ ఏడో తరగతి కూడా చదువుకోలేదు. వందల గ్రంథాలు రాశారు. దేశంలో అత్యున్నతమైన జ్ఞానపీఠ్‌ అవార్డు పొందారు. స్కూల్లో చదువుకునే అవకాశం లేని డా. అందెశ్రీ ఎన్నో గొప్ప పాటలు రాశారు. కాకతీయ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌ ఇచ్చి గౌరవించింది. ఆయన రాసిన తెలంగాణ రాష్ట్ర ప్రార్థనా గీతం స్కూళ్ళల్లో తెలంగాణా అంతటా, తెలంగాణ సభల్లో పాడబడుతున్నది. చదువుకోలేకపోయినందుకు కించపర్చడం, పేదలను కించపరచడమే అని కష్టపడి పైకొచ్చేవారి గురించి స్ఫూర్తిగా చెప్పాలి అని స్కూలు సిబ్బందికి ఆ డిప్యూటీ కలెక్టర్‌ హితబోధ చేశారు.

తమ పార్టీ ఎన్నో సీట్లు గెలిచినప్పటికీ మెజారిటీ రానందున ప్రతిపక్ష నాయకులుగా ఉండి సేవ చేయాల్సి వస్తుంది. తాను గెలిచినప్పటికీ తనవాళ్ళు గెలవకపోవడంవల్ల వచ్చే పరిస్థితి ఇది. అలాగే ఆటలో కొందరు బాగా ఆడి, కొందరు బాగా ఆడకపోతే టీం ఓడిపోవచ్చు. ఓడిపోకుండా ఆటలో ఎప్పటికీ గెలుపు సాధించేవారితో ఎవరూ ఆట ఆడడానికి సిద్ధపడరు. తాను కూడా గెలిచే అవకాశం ఉందనుకుంటేనే ఆడడానికి సిద్ధపడతారు. అందరికీ అన్ని తెలియాలని లేదు.

మొదట్లో నన్ను, నా స్నేహితులు బుట్టలో పడేసేవారు. నేనెప్పుడు వినని, చూడని విషయాలో ఇరికించేవారు. ఇలాంటి సందర్భాల్లో లోతు తెలియకుండా నదిలోకి దూకవద్దు అంటాడు రిచర్డ్‌ టెంప్లర్‌. నిజమే. నేను కూడా అలా ఎన్నో విషయాల్లో ఇరుక్కుపోయాను, నష్టపోయాను, కష్టపడ్డాను. అలా నేను ఉద్యమం అనే నదిలో లోతు తెలియకుండా ఈత వచ్చుకదా అని మునిగి పోయినా సరే అని దూకాను. అనేక అనుభవాలు సంపాదించాను. అయితే ఏ అనుభవమూ వృధా పోదు అని గమనించాక ఆ అనుభవాలనుండి పాఠాలు తీసుకున్నాను. లక్ష్యాలు, ప్రణాళికలు, మరింత నిర్దిష్టంగా నిర్ణయించుకున్నాను. ఒకోసారి నదిలో దూకడం కన్నా ఒడ్డున నిలబడి నీళ్ళలో కాళ్లు కడుక్కోవడమో, చిన్న బోటుపై షికారు చేయడమో, నదిలో దూకడంకన్నా మంచిదిగా కనిపిస్తుంది అంటాడు రిచర్డ్‌ టెంప్లర్‌.

ప్రతిరోజు ముఖ్యమైనదే అనుకుంటే...

ఈరోజు ముఖ్యమైనదిగా భావించి, ప్రతిరోజూ మంచి డ్రెస్‌ వేసుకోండి. మంచి డ్రెస్‌ వేసుకోవడం ఒక ముఖ్యమైన విషయంగా భావించినపుడు ప్రజలు మీ ప్రత్యేకతను గుర్తించి ప్రవర్తిస్తారు. వీకెండ్స్‌ కదా అని బద్దకంగా గడ్డం తీసుకోకుండా, స్నానం చేయకుండా ఉండిపోతే సెలవు రోజు బాగుంటుందా? మీ స్నేహితులో, కుటుంబ సభ్యులో మిమ్మల్ని నీటుగా చూడాలనుకోవటం సహజమే కదా. నీటుగా ఉండడం వ్యక్తిత్వ వికాసానికి మీపై మీకు విశ్వాసానికి అది దోహదం చేస్తుంది.

నత్తగుల్ల వ్యక్తిత్వాలు...

నీకు నువ్వు కంపర్ట్‌బుల్‌గా పరిధిని దాటి రావడం అలవాటు చేసుకో. నువ్వు ప్రతిరోజు దైర్యంగా ముందడుగు వెయ్యి. అలిశెట్టి ప్రభాకర్‌ ఉనికి అనే కవితలో ఇలా అంటాడు... ''అలా అంగుళం మేరనన్నా కదలకుండా పడివుంటే ఎలా? కొన్నాళ్ళు పోతే నీమీద నానా గడ్డి మొలిచి నీ వునికే నీకు తెలిసి చావదు''. చాలా సమస్యలకు మూల కారణం మనం విషయం పూర్తిగా తెలియ కుండానే మనకు తోచింది సరైనదని నమ్మడమే. మనకంతా తెలుసను
కుంటాము కానీ, నిజానికి మనకేమీ తెలియదు. ప్రశ్నించడం నుండి ప్రశ్నించుకోవడంలోకి మారాలి. నిరంతరం ప్రశ్నించుకుంటూ వెళితే ప్రతిపక్ష నాయకుడిలా ఉండిపోతారు. ఇతరులు అధికారంలోకి వస్తుంటారు. మనపై అధికారం చెలాయిస్తారు. అందువల్ల ప్రశ్నించే స్థాయినుండి జవాబులు ఇచ్చే స్థాయికి ఎదగడం అవసరం.

మనిషిని తెలిపేవి...

చాలాసార్లు మన మాట తీరు, భాష, యాస, బాడీ లాంగ్వేజ్‌, నడక, నడత, డ్రెస్‌, సైకిల్‌, బైక్‌, కారు, ఇల్లు, సెల్‌ ఫోన్‌ మన డిగ్నిటీని తెలపడానికి ఉపయోగపడుతుంటాయి. ఒకాయన ఒక చక్కని మాట అన్నాడు. నువ్వు ఎంత పెద్ద ఇల్లు కట్టుకుంటే ఏమిటి? నీ ఇంటికి వచ్చి నీ ఇంట్లో ఆతిధ్యం పొందినపుడు కదా నీ డిగ్నిటీ, విలువ తెలిసి గౌరవించేది...! కానీ నువ్వు నీ స్థాయిని తెలిపే కారులో ఒక మిత్రుని ఇంటికో, కార్యాలయానికో వెళితే నీ డిగ్నిటీని వారి ఇంటి ముందు, రోడ్డుమీద ట్రాఫిక్‌లోకూడా నీ డిగ్నిటీ నిలిపిన వాడివవుతావంటాడు. ఇందులోని జీవిత సత్యాన్ని గుర్తించడం అవసరం.

విశ్వాసాన్ని నిలుపుకో... పెంపొందించుకో... మార్చుకో... అయితే ఇతరులు కూడా అలా మారాలని... మార్చుకోవాలని... అనుకోవటం అనవ సరం అంటారు కొందరు. ఇది సరైన అభిప్రాయం కాదు. ఒక వ్యక్తిగా మిగిలిపోవడం మాత్రమే ఇది. శతాబ్దాలుగా మానవ సమాజం ఎందరో మహనీయుల తత్వవేత్తల, శాస్త్రవేత్తల, నాయకుల, కళాకారుల జీవితాలతో, బోధనలతో మారుతూ వస్తున్నది. నాయకత్వం లేకుండా, మార్గదర్శకులు లేకుండా సమాజం ముందుకు సాగదు. అది అరాచకం అవుతుంది. అందువల్ల సమాజానికి స్ఫూర్తినివ్వాలి. మార్గదర్శకం అందించడం ఎంతో అవసరం.

మీరెక్కిన చెట్టు కొట్టివేసే ప్రయత్నం జరిగినా, మీ అద్భుతమైన ఆలోచ నలను వారు సంగ్రహించి తమదిగా ప్రచారం చేసుకున్నా, మీరు పగ సాధించే ప్రయత్నాలకు వాళ్లు ప్రతిగా వాళ్ళు ఏదో ఒకటి చేస్తారు. సాగిలపడి ఊరుకోరు.

కలిసి బతకాలనే కోరిక బలంగా ఉండాలి. ఇతరుల సంతోషం కోసం కూడా మీ జీవితాన్ని అంకితం చేసి చూడండి. క్షమాపణ అడగడంలో మొదటివారిగా ఉండండి... అంటాడు టెంప్లర్‌.

లక్ష్యాలు నిర్ణయించుకుంటే ఆత్మహత్యలు ఎందుకు?

కలిసి బతకాలని లక్ష్యాలు నిర్ణయించుకుంటే ఆత్మహత్యలు ఎందుకు? జీవితంలోని కష్టాలను, అవమానాలను, నిరాశను, ప్రతికూలాంశాలను అధిగమిస్తూ ముందుకు సాగడమే జీవితం. అవమానాలు భరించలేక, నిరాశలో నిరసన వ్యక్తం చేయడానికి, ప్రతిఘటన చేయలేని సందర్భాల్లో బానిసగా బతికుండలేక కూడా ఆత్మహత్యలు చేసుకోవాలనుకుంటారు.

ఆత్మహత్యతో వారి జీవితం అయిపోతుంది. కానీ వారితో పెనవేసుకున్నవారి జీవితాలు మరిన్ని కష్టాలకు గురవుతాయి. వారిని పెంచి పోషించిన తల్లి దండ్రులు గర్భశోకంతో విల పిస్తారు. స్నేహితులు, కొడుకులు, కూతుర్లు తమ తల్లి, తండ్రి కోల్పోయి అనాధలుగా జీవిస్తారు. అప్పులపాలై ఆత్మహత్య చేసుకోవడం సరికాదు. జీవితాన్ని ఎదుర్కోవాలి.

తెలంగాణ రాష్ట్ర సాధనకోసం ఎందరో ఆత్మహత్యకు పాల్పడ్డారు. తద్వారా రాష్ట్ర సాధన ఉద్యమం ముందుకు సాగుతుందని భావించారు. నిరాహారదీక్షతో ఉద్యమం ముందుకు సాగినట్టు తమ ఆత్మ హత్యతో సమాజం కదులుతుందని, శత్రువు గుండెలు కరుగుతాయని భావిం చారు. కొందరు ఉద్యమాల్లో ఆత్మహత్య దళాలుగా ఏర్పడి బాంబులు కట్టుకుని శత్రువులపై పడి తాము ముక్కలుముక్కలుగా తెగిపోతూ శత్రువులను చంపాలనుకుంటారు. ఇలా ఆత్మహత్యలు ఎన్నో స్థాయిల్లో, ఎన్నో కారణాల రీత్యా సమాజంలో జరిగిపోతున్నాయి. వృద్ధులు ఇంకా బతకడం దేనికని చివరి థలో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. పెంచి పోషించేవారు లేక కొందరు బిక్షాటన చేస్తున్నారు. మరికొందరు ఆత్మహత్య చేసుకుంటున్నారు. సమాజం సజావుగా సాగడంలేదని ఇవి తెలియజేస్తున్నాయి. ఇలా అవకతవక లకు ఆత్మహత్యలు ఒక నిదర్శనం. గుండుసూది 150 రకాలుగా ఉపయోగపడుతుందని శోధించారు. అలాంటిది మనిషి ఎన్నిరకాలుగా ఉపయోగపడతారో వేరే చెప్పనవసరం లేదు. ఎవరి జన్మ వ్యర్ధం కాదు. కారాదు.

హిట్లర్‌ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాక ఏం చేశాడు....?

హిట్లర్‌ జర్మనీ దేశం సంక్షోభంలో పడ్డప్పుడు ఒక పోలీసుగా పని చేస్తుండేవాడు. ప్రజలందరూ నిరాశానిస్పృహల్లో కొట్టుమిట్టాడుతున్నారు. హిట్లర్‌ ఈ అవమానాలు భరించలేక ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. ఆత్మహత్య చేసుకునేముందు మరొక్కసారి ఆలోచించాడు. నేను బతికి ఉండ డానికి నాకు ఏ అర్హత లేదా? ఈ జర్మనీని తిరిగి సగౌరవంగా తల ఎత్తుకొని నిలబడేట్టు చేయడంలో నాలో ఏమైనా శక్తి ఉందా...? అని పరిపరివిధాలుగా ఆలోచించాడు. తనకు ప్రసంగాలు చేయడం వచ్చు. ప్రజలను తన ఉపన్యా సాలతో ఆకర్షించవచ్చు... అని అన్పించింది. అలా ఆలోచించి వాగ్ధాటి శక్తితో ప్రయోగాలు చేస్తాను అనుకొని ఆత్మహత్యను వాయిదా వేసుకొని వెనక్కి తిరిగాడు. అనేక ప్రసంగాలు చేశాడు. వందలు, వేలు, లక్షల ప్రజల్ని తన ప్రసంగాలతో ఒక తాటిపై నడిపించాడు. జర్మనీలో పుట్టిన మార్క్స్‌ ప్రపంచ సోషలిజం గురించి చెప్పిన మాటను దేశానికి వర్తించేవిధంగా 'నేషనల్‌ సోషలిజం' అని, మనం ఆర్యులం అని స్వస్థిక్‌ గుర్తును తీసుకొని ప్రజలందర్ని త్యాగాలు చేయాలని ఉద్భోధించాడు.

అలా హిట్లర్‌ 'మేన్‌ క్యాంపు' అనే పుస్తకాన్ని రాశాడు. ఆ పుస్తకం అనేక దేశాల్లో నిషేధించబడింది. ఆ పుస్తకం చదివిన ప్రతిఒక్కరూ ఇప్పటికీ ఆవేశంతో రగిలిపోతారు. అలా హిట్లర్‌ జర్మనీ ప్రజలను సమీకరించి దేశాలమీద దండెత్తి రెండవ ప్రపంచ యుద్ధంలోకి నడిపించాడు. రెండవ ప్రపంచయుద్ధంలో ప్రపంచ వ్యాప్తంగా ఐదు కోట్లమంది మరణించారు. తన ఓటమి సమీపించడంతో అప్పుడు చేసుకోవాలనుకున్న ఆత్మహత్యను తన పిస్టల్‌తో తాను కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు హిట్లర్‌. ఎప్పుడైతే ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడో అప్పుడే తననుతాను జయించాడు. ఆ తర్వాత బతికిన బతుకంతా బోనసే...

మనిషి చావడానికి సిద్ధపడ్డ తర్వాత పెరిగే ధైర్యం ఎవరూ ఊహించ లేనిది. ఆత్మహత్య భావన ఇలా మనిషిని మరింత ధైర్యంతో ముందుకు సాగడానికి పురికొల్పాలి. అందుకు ఆత్మహత్యకు ముందు సమీక్షించుకోవాలి. ఉదాత్త ఆశయాలను లక్ష్యాలను పెంచుకొంటే ఆత్మహత్యకు పురికొల్పే కారణాలు ఆవగింజలా, దూదిలా తేలిపోతాయి. అందువల్ల నిరాశ, నిస్పృహల్లో ఆత్మ హత్య భావన కలిగినపుడల్లా హిట్లర్‌ను గుర్తుచేసుకోవాలి. తనలోని శక్తిసామర్ధ్యాలను సమీక్షించుకోవాలి. ఉన్నత లక్ష్యాలను సాధించడానికి ఈ ప్రాణాన్ని మరో జన్మ అనుకొని తిరిగి బతకాలి. ఇలా ఎన్నోసార్లు ఆత్మహత్య అనే భావన దాకా వచ్చి... ఆ భావనను జయించి తిరిగి సాహసంతో ముందుకు సాగి కష్టాలను అధిగమించి విజయాలను సాధించినవారు ఎందరో. అందులో హిట్లర్‌ ఒకరు.

English summary
An eminent writer BS ramulu has has explained the importance of time in his personality development column
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X