వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అనుకరణను అనుసరించి వ్యక్తిత్వ వికాసం

By Pratap
|
Google Oneindia TeluguNews

తల్లిదండ్రుల ఆరోగ్యం, ఆర్థిక స్థితి, సమాజంలో వారికి గల స్థానం, వారి సంస్కృతి, జీవన విధానం, వారి బంధుమిత్రులు, ఆ ప్రాంత జీవిత లక్ష్యాలు, ఆలోచనలు... ప్రతి మనిషీ పుట్టగానే చుట్టూత ఆవరించి ఉంటాయి. ఆరోగ్యవంతమైన శిశువులు తల్లిదండ్రుల జీన్స్‌ వారసత్వంతో పెరుగుతుంటారు. పెంపకంలో తల్లి భాష మెల్లిమెల్లిగా నేర్చుకుంటారు. కుటుంబ సభ్యుల హావభావాలను, ప్రవర్తనను, పిల్లలు అనుకరిస్తారు. అలా అనుకరిం చడం కోసం అమ్మా నాన్నలు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు శిక్షణ
ఇస్తుంటారు. నేర్పుతుంటారు. అలా బాడీ లాంగ్వేజ్‌, భావ వ్యక్తీకరణ విధానం, భాష వ్యక్తీకరణ విధానం, నడక విధానం నేర్చుకోవడం జరుగుతుంది.

పుట్టిన్నుంచి చుట్టూత ఉండే మనుషులనుండి, పరిసరాలనుండి పిల్లలు అనుకరణ ద్వారానే చాలామేరకు నేర్చుకుంటారు. తల్లి వంట గిన్నెలతో వంట చేస్తుంటే పిల్లలు కూడా వంట గిన్నెలన్నీ ముందేసుకొని వంట వండినట్లు ఆట ఆడుతుంటారు. అమ్మలాగే తాను వండిన వంటలు వడ్డించి తినమని కోరుతుంటారు. అమ్మానాన్నలు, నానమ్మ, తాతయ్య తదితరులు ఆ పిల్లల ఆటల్లో నిజంగానే వడ్డించింది. తిన్నట్టు నటిస్తుంటారు. తల్లికుక్క కూడా కుక్కపిల్లలకు పరిగెత్తడం, పోట్లాడటం, గారాబం చేయటం, అరవడం మొద లైనవి నేర్పుతూ ఉంటుంది. తల్లికోడి కూడ కోడి పిల్లలకు అనేక విషయాలు నేర్పుతూ ఉంటుంది. తల్లిని అనుసరించి పిల్లలు అలా నేర్చుకుంటూ ఉంటారు.

అందువల్ల మూర్తిమత్వం, వ్యక్తిత్వ నిర్మాణం ఇంటినుండి, పాలుతాగే వయసునుండే ప్రారంభమవుతుంది. సమాజంలో అనేక భాషలు సంస్కృతులు జీవన విధానాలు, ఆలోచనా విధానాలు, వృత్తి విధానాలు, ధనిక, పేద అంతరాలు, విద్యా సంపన్నులు, అధికారుల సంపన్నులు, గౌరవనీయులు, అవమానితులు మొదలైన తేడాలు, అంతరాలు ఉన్నవన్నీ పిల్లలు నేర్చుకోవడం ద్వారా, పిల్లలకు అలవాటు చేయటం ద్వారా అవి తరాతరాలుగా కొనసాగుతూ వస్తున్నాయి. వాటినే కులవృత్తులనీ, భాష అనీ, సంస్కృతి అనీ, జీవన విధానమనీ, ఆయా సామాజిక వర్గాల వ్యక్తిత్వాలని, నైపుణ్యాలనీ పిలుస్తుంటారు.

BS Ramulu says personality development with imitation

నూతన వ్యక్తిత్వ వికాసం కోసం...

సమగ్ర వ్యక్తిత్వ వికాసం ఒక ప్రత్యేకమైన శిక్షణ ద్వారా, ఆచరణ ద్వారా అలవాటు చేసుకోవాల్సి ఉంటుంది. సమగ్ర వ్యక్తిత్వ వికాసం అనేది ఒక శాస్త్రం. మానవ సమాజం తన అనుభవాల నుండి క్రోడీకరించి రూపొందించిన శాస్త్రంగా సమగ్ర వ్యక్తిత్వ వికాసం రూపొందుతూ వస్తున్నది. గతం తాలూకు ఆలోచనలను, అలవాట్లను పట్టుదలతో సమూలంగా మార్చుకొంటూ ఎదగదలుచుకున్న లక్ష్యాలకు అనుగుణంగా స్వభావాన్ని, ఆచరణను, ఆలోచనను నిరంతరం కొనసాగించడం ద్వారా నూతన వ్యక్తిత్వ వికాసం జరుగుతుంది.

అత్యాధునిక విద్య, సైన్స్‌, టెక్నాలజీ, ఊహాశక్తి, సృజనాత్మకత, సంస్కృతి, అధికారం, పరిపాలన, సంస్థలు జీవన విధానాలు, ఆలోచనా విధానాలు ఉన్న చోట, వాటిని అందుకున్నచోట వ్యక్తిత్వ వికాస శాస్త్రాలు అదే తీరులో అభివృద్ధి చెందుతాయి. ఆ సమాజం యొక్క అవసరాలను తీర్చుతుంటాయి.

ప్రాచీన కాలంలో వ్యక్తిత్వ వికాసం...

ప్రాచీన కాలంలో వ్యక్తిత్వ వికాసం అవసరాలను నీతి శాస్త్రాలు, ప్రాచీన సాహిత్య పఠనం, రాజుల శాసనాలను, వ్యవసాయ విధానాలు, ఉత్పత్తి విధానాలు, పెళ్లి, కుటుంబ వ్యవస్థ, కులం, కులవ్యవస్థ ఆయా ప్రవర్తన శాస్త్రాలు రూపొందిస్తూ వచ్చాయి. సుమతీ శతకం, వేమన పద్యాలు, కుమారి శతకం, భక్తి శతకాలు, జానపద కథలు, పాటలు, పురాణాలు, ఇతిహాసాలు, మనుస్మృతి, కౌటిల్యుని అర్థ శాస్త్రం, రాజనీతి శాస్త్రం, వర్ణ వ్యవస్థ, కుల వ్యవస్థ మొదలైనవి వ్యక్తిత్వాలను నిర్దేశిస్తూ వచ్చాయి. ఆయా కులాల కనువుగా మాత్రమే వ్యక్తిత్వ వికాసాన్ని, జీవన విధానాన్ని, సంస్కృతిని నిర్దేశించాయి. వాటి పరిధులను అతిక్రమించితే శిక్షలు నిర్ణయించారు. అలా వర్ణ వ్యవస్థ, కుల వ్యవస్థలను అనుసరించి కులాల వారీగా వ్యక్తిత్వాలను, జీవన విధానా లను, సంస్కృతిని, భాషను, అలవాట్లను, పెళ్లిళ్ళను పరిమితం చేశారు. గిరిగీశారు. ఇలా శతాబ్దాలపాటు సామాజిక, సాంస్కృతిక భాష, వృత్తి రంగాల్లో కులాల ప్రకారం, ప్రాంతాల ప్రకారం, అధికార హోదాల ప్రకారం, వ్యక్తిత్వ వికాసాన్ని పరిమితం చేశారు.

సమగ్ర వ్యక్తిత్వ వికాసంలో బౌద్ధం...

బౌద్ధం కులాలను, వర్ణ వ్యవస్థను అందులోని పరిమితులను, అణచి వేతను గుర్తించింది. సమగ్ర వ్యక్తిత్వ వికాసానికి, వర్ణ వ్యవస్థ, కుల వ్యవస్థ పెద్ద అవరోధమని ప్రకటించింది. అందరికీ సమగ్ర వ్యక్తిత్వ వికాసం సాధ్య మయ్యే నూతన జీవన విధానాన్ని, సంస్కృతిని ముందుకు తెచ్చింది. కుటుంబం వ్యక్తిత్వ వికాసానికి, సమాజ సేవకు అవరోధంగా ఉంటుందని బౌద్ధ భికక్షు వ్యవస్థను ప్రతిపాదించింది. అందరికీ విద్యకోసం, విద్యాలయా లను, స్థాపించారు. అత్యున్నత వ్యక్తిత్వ వికాసానికి బౌద్ధం పెద్దపీట వేసింది. అష్టాంగ మార్గాన్ని ప్రతిపాదించి ఆచరించింది. అలా గ్రీకు, తదితర దేశాల్లో బానిస వ్యవస్థ కొనసాగుతున్న కాలంలో భారతదేశంలో బౌద్ధం అందరూ సమానమే అనే జీవన విధానాన్ని, వ్యక్తిత్వ వికాసాన్ని ముందుకు తెచ్చింది.

వర్ణకుల వ్యవస్థలు కొందరి వ్యక్తిత్వ వికాసానికే...

రామాయణం, మహాభారతం, పురాణాలలో, మనుస్మృతిలో వ్యక్తిత్వ వికాసం రాజులకు, క్షత్రియులకు, బ్రాహ్మణులకు అపరిమిత అవకాశాలు ఉండేవిధంగా ప్రతిపాదించారు. మిగిలిన శూద్రులు, అతిశూద్రులు గిరిజన తెగలు ఈ పై మూడు వర్ణాలకు, కులాలకు సేవ చేయడమే వారి జీవిత పరమావధిగా నిర్ణయించారు. అలా అత్యధిక ప్రజానీకం కొందరి ప్రయోజ నాలకు, సుఖాలకు, అధికారానికి అనువుగా అణచివేయబడ్డారు.

వారి వ్యక్తిత్వాలు అవమానించబడ్డాయి. వారి బాడీ లాంగ్వేజ్‌లో, భావ వ్యక్తీకరణలో కట్టుబొట్టులో, పెళ్లిళ్ళల్లో ఆయా కులాల రీతులు ప్రతిఫలించే విధంగా శతాబ్దాలుగా జీవించారు. వాటిని కాదని ఎదిగే ప్రయత్నం చేస్తే శిక్షలు విధించారు. కర్ణుడు, ఏకలవ్యుడు తదితరులు విలువిద్య నేర్చుకోవడం నేరంగా పరిగణించారు. వేదాలను, పురాణాలను చదివితే పెద్ద శిక్షలను అమలు జరిపారు.

కులరహిత వివాహాలు చేసుకునే స్త్రీ పురుషులకు భయంకరమైన శిక్షలు విధించి అమలు జరిపారు. అవమానించారు. అలా మరిన్ని కులాలు పుట్టడానికి కారకులయ్యారు. ఉదా||కు బ్రాహ్మణ స్త్రీ ఇతరులను పెళ్లి చేసుకొని పిల్లల్ని కంటే వారిని చండాలురు అని అన్నారు. బ్రాహ్మణ పురుషుడు ఇతరులను పెళ్లి చేసుకొని పిల్లల్ని కంటే వాళ్లు బ్రాహ్మణులలో కలిసేవారు. లేదా తల్లితరపు కులంలో కొనసాగేవారు. బ్రాహ్మణ స్త్రీ అలా ఇతరులతో కన్నప్పుడు తల్లి కులం అయిన బ్రాహ్మణ కులంలో కొనసాగకుండా... చండాలురు అని పిలిచారు. అంటరానితనం అనే ఒక దుష్ట సంస్కృతిని జీవన విధానంగా మార్చిన వ్యవస్థ శతాబ్దాలుగా కొనసాగింది. మనుషులందరూ సమానం కాదని, ఐదు వేళ్లు సమానంగా లేవని, సిద్ధాంతీకరించారు. అయితే ఐదువేళ్ళు నిరంతరం కలిసి పనిచేస్తుంటాయి. కలిసే ఉంటాయి. వాటి మధ్య ఎలాంటి తేడా లేదు అనే విషయాన్ని దాటవేశారు.

స్వేచ్ఛా సమానత్వం, సమాన అవకాశాలు...

1950 జనవరి 26వ తేదీన భారత రాజ్యాంగం అమలులోకి వచ్చింది. భారత రాజ్యాంగం ప్రకారం మనుషులందరూ సమానమే. ఏ కులం గొప్పది కాదు, ఏ కులం చిన్నది కాదు. అందరూ సమానమే. సంపన్నులు, విద్యావంతులు, పేదలు, అందరూ సమానమే అని భారత రాజ్యాంగం శతాబ్దాల తర్వాత మొదటిసారిగా మనుషులందరూ సమానమేనని ప్రకటించింది. అంతకు ముందు మనుషులందరూ సమానం కాదు.

భారత రాజ్యాంగం మనుషులందరూ సమానమేనని ప్రకటించినప్పటికీ కొన్ని కులాలు ఎక్కువని, కొన్ని కులాలు చిన్నవని ఎప్పటికీ గుర్తుచేసే రామాయణ, మహాభారత పురాణాలు, సామెతలు, ఆలోచనలు, సంస్కృతి, కళలు, సాహిత్యం, సామాజిక రంగాల్లో నేటికీ కొనసాగుతున్నాయి. కులాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఆలోచించే, ఆచరించే సంస్కృతిని శాస్త్రాలను పరిమితికి కుదిస్తున్నారు. కొందరి ఆధిక్యత కోసం మెజారిటీ ప్రజల సంస్కృతిని, వ్యక్తిత్వ వికాసాన్ని అడ్డుకుంటున్నారు.

వదులుకోవాల్సిన పాత భావాలు, స్వభావాలు...

కులాల ప్రకారం సూక్తులు, సామెతలు, తిట్లు ఆయా వ్యక్తిత్వాలను కుదిస్తున్నాయి. వారి ఎదుగుదలను అడ్డగిస్తున్నాయి. ఆధునిక విద్య, ఉద్యోగం, సైన్స్‌ టెక్నాలజీ, అభివృద్ధి, అధికారం, ఆధునిక సంస్కృతి అందుకున్న మేరకు వారి వ్యక్తిత్వ వికాసాల్లో కొంత మార్పు కనిపిస్తున్నది. ఇది కూడా ఆయా కులాల ప్రకారం ఆధిపత్యాన్ని కొనసాగించడానికి కూడా ఉపయోగ పడుతున్నది. ఇలా ఆయా రంగాల్లో కులాధిక్యత గలవారే నాయకత్వంలోకి రావడాన్ని సులభం చేస్తున్నది. మిగతా అశేష ప్రజలు ఎదగడానికి కుల వ్యవస్థ, వర్ణ వ్యవస్థ తాలూకు భావాలు, సంస్కృతి, ఆధిపత్యం అనేక అవరోధాలు కల్పిస్తున్నది. అందువల్ల మొట్టమొదట వ్యక్తిత్వ వికాసంలో వదులుకోవాల్సిన అంశాలు కులాల ప్రకారం ఉండే సంస్కృతిని, ఆలోచనా విధానాన్ని, ఆధిపత్య, అల్పత్వ భావాలను, బాడీ లాంగ్వేజ్‌ను స్పష్టంగా గుర్తించి, ప్రశ్నించి తొలగించడం అవసరం.

అది భారత రాజ్యాంగం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రణాళికా సంఘం, విద్యా ప్రణాళికలు, ప్రభుత్వ, ప్రభుత్వేతర ఉద్యోగ రంగాలు నిర్వహిం చాల్సిన రాజ్యాంగ కర్తవ్యాలు. ప్రజలు, సంస్థలు, ఉద్యమాలు చేసే ఈ కృషి మొత్తం కృషిలో భాగమే తప్ప, అదే సర్వస్వం కాదు. ఇక వ్యక్తిగత స్థాయిలో చేసే వ్యక్తిత్వ వికాస కృషి మరింత పరిమితం. అందువల్ల సమగ్ర వ్యక్తిత్వ వికాసం భారత రాజ్యాంగ మౌలిక లక్ష్యాలను, ఐక్యరాజ్యసమితి ప్రతిపాదించిన మానవహక్కుల మౌలిక లక్ష్యాలను అన్ని స్థాయిల్లో అమలుకోసం కృషి చేసి నప్పుడే సమగ్ర వ్యక్తిత్వ వికాసం సాధ్యపడుతుంది.

సమగ్ర వ్యక్తిత్వానికి దేశం ఎదగడానికి మధ్య సంబంధం...

సమగ్ర వ్యక్తిత్వ వికాసం అనేక వ్యవస్థల ద్వారా, సమస్థ స్థాయిల్లో ముందుకు సాగే క్రమంలో అందరు ఎదగడం ద్వారా దేశ సంపద పెరుగుతుంది. ప్రజల సృజనాత్మక శక్తులు వికసిస్తాయి. ఉత్పత్తి, సేవారంగాలు, సైన్స్‌, టెక్నాలజీ కళలు, మహోన్నతంగా ఎదుగుతాయి. జీవన ప్రమాణాలు పెరుగుతాయి. ఇలా సమస్థ రంగాల సమగ్ర అభివృద్ధికి దారి తీస్తుంది. సమగ్ర వ్యక్తిత్వ వికాసం జరగకుండా భారతదేశం ప్రపంచంలో సంపన్న రాజ్యంగా, పేదరికం, కులవివక్ష లేని సమాజంగా ఎదగడం సాధ్యం కాదు.

పేదరిక నిర్మూలనకు, వ్యక్తిత్వ వికాసానికి మధ్య సంబంధం...

వ్యక్తిత్వ వికాసానికి భారతదేశం సంపన్న దేశంగా ఎదగడానికి, పేదరిక నిర్మూలనకు, కులవివక్ష నిర్మూలనకు మధ్య ప్రత్యక్ష సంబంధం ఉంది. వ్యక్తులు తమ పరిమితుల్లో వ్యక్తిత్వ వికాసానికి కృషి చేయడం జరుగుతున్నది. చుట్టూతా అందరూ తెలుగే మాట్లాడుతుంటే ఒక్కరే ఇంగ్లీషు మాట్లాడడం, ప్రాక్టీస్‌ చేయడం కష్టం. అందరూ ఇంగ్లీషు మాట్లాడే వారి మధ్య ఇంగ్లీషు మాట్లాడడం సులభంగా వచ్చేస్తుంది. మాతృభాషలాగ అలవాటవుతుంది.

తెలుగువాళ్ళు లేనిచోట తెలుగు రానివాళ్ళ మధ్య జీవిస్తుంటే ఇంగ్లీషు కాస్త తొందరగా రావచ్చు. కానీ తెలుగువాళ్ళ మధ్య ఉంటూ ఒక్కడు ఇంగ్లీషు మాట్లాడటం, నేర్చుకోవడం కష్టమవుతుంది. వ్యక్తిత్వ వికాసంలో ఇదే జరుగుతున్నది. ఒక కులంలో ఒకే ఒక్కడు ఎదిగితే అతడు తెలుగువాళ్ళమధ్య ఇంగ్లీషు మాట్లాడటం నేర్చుకున్నట్లుగా తన కొత్త వ్యక్తిత్వ వికాసానికి కృషి చేయాల్సి వస్తున్నది. తనచుట్టూ అందరూ అలాంటివాళ్ళే ఉంటే ఇంగ్లీషు నేర్చుకోవడం గానీ, వ్యక్తిత్వ వికాసం జరగడం గానీ సులభంగా సాగిపోతుంది.

మంచి స్కూలు, మంచి ఏరియాలో ఇల్లు...

అందువల్ల పిల్లలను మంచి స్కూల్లో వేయాలని అనుకుంటారు. మంచి ఏరియాలో కిరాయికి ఉండాలని, ఇల్లు కొనుక్కోవాలని అనుకుంటారు. మంచి స్నేహాలు, మంచి బంధుమిత్రులు, మంచి పుస్తకాలు, మంచి అలవాట్లు, మానవీయ విలువలు, సంస్కృతీ, పరోపకారం మొదలైనవన్నీ వ్యక్తిత్వ వికా సానికి అనుకూలంగా వాతావరణాన్ని కల్పించడమే. ఇలాంటి వాతావరణం లేనిచోట చుట్టూత ఉన్న వాతావరణంలో భాగంగా ఎదుగుతుంటారు.

కష్టాలగుండా వ్యక్తిత్వ వికాసం...

పూర్వం నేటివలే వ్యక్తిత్వ వికాస గ్రంథాలు లేవు. తమచుట్టూత వున్న వాతావరణంలో ఉంటూ చదువుకున్నారు. వృత్తులు చేశారు. అధికారాలు చెలాయించారు. బాధలు పడ్డారు. ఉద్యోగాలు చేశారు. కష్టపడి సంపాదిం చారు. ఉద్యమాలు చేశారు. తమకు తాము అనేక ప్రయోగాలు చేశారు. కిందా మీదా పడి సైకిల్‌ నేర్చుకున్నట్టు అనేక విషయాలు జీవితంలో డక్కామొక్కీలు తింటూ నేర్చుకుంటూ తమ వ్యక్తిత్వాన్ని, సంస్కృతిని, లక్ష్యాలను అభివృద్ధి పరుచుకున్నారు. ఇలా అనేక తరాలకు జీవితమే ఒక పాఠశాల. ప్రపంచమే ఒక విద్యాలయం. ప్రజలు జీవితమంతా అందులో విద్యార్ధులే.

ఈ థ నుండి, ఇలాంటి అనుభవాలనుండి, క్రోడీకరిస్తూ, వ్యక్తిత్వ వికాస శాస్త్రాలు, గ్రంథాలు రూపొందుతూ వచ్చాయి. అవన్నీ ఆయా అనుభవాలను సూత్రీకరించినవే. ప్రయోగం, పరిశీలన, తప్పు, సవరణ, అనుభవం, గుణపాఠం, సూత్రీకరణ, తిరిగి ప్రయోగం, శాస్త్రంగా రూపొందిం చడం అనే క్రమంలో సామాజిక అనుభవాలు, సంస్కృతులు, శాస్త్రాలుగా రూపొందుతూ వచ్చాయి.

- బిఎస్ రాములు

English summary
An eminent writer BS Ramulu says personality development depends on the imitation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X