వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

క్విక్‌బాక్సింగ్: ఇంటర్నేషనల్ ఎనిమల్ ఫెస్టివల్

|
Google Oneindia TeluguNews

వందో వెయ్యో యింకా ఎక్కువో జనం సభలో వుంటం పదో, పాతికో మంది ప్రముఖులు వేదిక నలంకరించడం, వాళ్లు మైకుల్లో వాగిందంతావిన్న జనం చప్పట్లు చరచడం అనబడే సమావేశాలు ఒక్క మనుషులకే కాపీ రైటుగా సంక్రమించినవాయేం? మనం మాత్రం సభలూ సమావేశాలూ ఎందుచేత నిర్వహించకూడదు అనుకున్నవి కొన్ని ప్రాణులు. వాటిని మనుషులు జంతువులని పిలుస్తున్నారు మరి మనుషులని అవి యేమని పిలుస్తాయో ఎవ్వరికీ తెలీదు.

సరే! మనుషులు జంతువలని పిల్చుకునే ఆ జంతువుల్లో ఒక ‘రాడికల్ థింకింగ్' రానే వచ్చింది. జంతువులనమబడే మనం కూడా సభలు ఎందుకు జరుపుకోరాదు? సమావేశాలు ఎందువల్ల జరుపుకోరాదు? అని ప్రశ్నించుకుని ‘ప్రపంచ జంతువులారా ఏకం కండి' అనే నినాదాన్ని ఎలుగెత్తి నినదించాయి.

జంతువులనగా ఏ జంతువులు అనే ప్రశ్నరాక మానదు. ఈ భూమనబడే పెద్ద ఫుట్‌బాల్ బంతి మీద ఎన్నో రకాల జంతువులు బ్రతుకు బండ్లు లాగుతున్నాయి కదా. జంతువుల సమావేశం అనగా యే జంతువుల సమావేశం అని లేవనెత్తబడ్డ ప్రశ్నకు ముందుగా అగ్రజాతి జంతువుల సమావేశం అనే జవాబిచ్చాయి. పెద్ద జంతువులు. ఇచ్చట అగ్రజాతి జంతువులనగా నెవరు అనీ పెద్ద జంతువులు అనగానేవి అనీ ప్రశ్నలు రైజయ్యేయి.

chintapatla sudarshan column on animals meeting

ఏనుగు, సింహం, పులి, చిరుత, ఎలుగు వంటివి పెద్ద జాతి జంతువులని, తోడేలు, నక్క, బాతు, కోడి వంటివి తక్కువ జాతి జంతువులని కొన్ని బాగా చదువుండి డిగ్రీలూ వున్న జంతువులు నిర్ధారణ చేసేయి. ఈ ఫైండింగ్ ప్రకారం మొట్టమొదట పెద్ద జంతువుల ప్రథమ సమావేశారం ఏర్పాటు చెయ్యబడింది. ఈ సమావేశానికి ఎవరు అధ్యక్షత వహించాలి అన్నది కూడా క్వశ్చనే కదా! తర్జనభర్జనల అనంతరం సభకు ఏనుగు అధ్యక్షత వహిస్తే సింహం ముఖ్య అతిథిగా వేదిక నలంకరించడానికి ఏర్పాటయ్యింది.

ఏనుగు అధ్యక్షత వహించీ, సింహం ముఖ్య అతిథిగా వ్యవహరించే సభకు ఏర్పాట్లు ఆర్భాటంగా మొదలయ్యేయి. నక్కా, తోడేలూ వంటి చిన్న జంతువులకి చిర్రెత్తుకొచ్చింది. జంతువులంటే ఒక్క ఆకారమూ, నాన్‌ వెజ్‌టేరియనిజమూనేనా తక్కిన జంతువులు కావా‘ఏనిమల్స్' అంటూ రొద పెట్టేయి, బ్రతిమాలేయి ప్రపంచ జంతువుల సమ్మేళనంలో తమలాంటి బడుగు జంతువులకు కూడా అవకాశం యివ్వాలని సకల ప్రయత్నాలు చేసేయి.

సరే! మనుషుల్లోలాగా మనమూ తర తమ తారతమ్యాలూ, ఎక్కువ తక్కువలూ లేకుండా చీమా, దోమా, చిలుకా ఎలుకలతో సహా ప్రపంచ జంతు సమ్మేళనం ఏర్పాటు చేసుకుందాం అని జంతువులు నిర్ణయించాయి. అయితే అంతా బానే వుంది కాని ఏనుగు అధ్యక్షత, సింహం ముఖ్య అతిథీ.. మరి మా మాటేమిటి మేమెవ్వరమూ వేదిక ఎక్కకూడదా? మైకు పట్టకూడదా? మేము వొట్టి చప్పట్లు కొట్టే అలగా జనంలా సభలో నడుములు నొప్పెట్టే దాకా కూచోవాలా అని తోడేలు ఒక వితండవాదం లేవనెత్తింది.

తోడేలుకు సమావేశ కర్తగా అవకాశం కల్పించబడింది. సమావేశానికి సంబంధించిన వ్వవహారం, ఆహ్వానాలు పంపవలసిన వారి వివరాలు, సమావేశపు వేదిక, వేదిక మీద వుండవలసిన ఆసనములు, ఏర్పాటవలసిన మైకులు, లైట్లు వంటి అనేక విషయాలు తోడేలుకు అప్పగింపబడ్డవి.

వేదమూర్తులూ, బ్రాహ్మణోత్తములూ తమ యందు లేరు గనక మనుషుల్లో వుండే వాళ్లని సంప్రదించి ప్రపంచ జంతు సమ్మేళనం ఏర్పాటు చేసింది తోడేలు. సభలో హుందాగా వుండటానికి ఒక ‘వాస్ కోటు' సిద్ధం చేసుకుంది. దుబ్బ మీసాలు తెల్లగా వుండటం బాగోదని నల్లరంగు పూసి నిగనిగలాడేట్టు చేసింది.

సభ ఏర్పాటయింది. ప్రపంచ అంతర్జాతీయ జంతు మహాసభ ఏర్పాటయ్యింది. ఆస్ట్రేలియానించి కంగార్లూ ఆఫ్రికానించి ఏనుగులూ సింహాలూ ఇండియానించి పులులూ, రష్యా నుంచి ఎలుగుబంట్లూ హాలెండ్ నించి హాగ్ లనబడే ముళ్ల పందులూ, ప్రపంచ దేశాలన్నింటా వృద్ధి చెందిన నక్కలూ, తోడేళ్లు, జిరాఫీలూ, జీబ్రాలూ జడల బర్రెలూ, లొట్టి పిట్టలూ, వొట్టి పిట్టలూ, చిలుకలూ, నెమళ్లూ చెప్పుకుంటూ పోతే చేంతాడంతవుతుంది లిస్టు కనుక సమస్త దేశాలకు చెందిన సమస్తమైన జంతువులూ విచ్చేశాయని చెప్పాలి.

వేదిక మీద కోటేసుకున్న ఏనుగూ, కోటు వేసుకోని సింహమూ, కొట్టవచ్చినట్టు కనబడే నల్లటి దుబ్బ మీసాల తోడేలూ తమ తమ సీట్లలో డాబుగా దర్పంగా దర్జాగా ఠీవిగా కూచున్నాయి.

అయితే సభ ఆరంభం కాకముందే ఒక పెద్ద సమస్య ఎదురయ్యింది. సభలో పెద్దలూ, రాజకీయ వేత్తలూ, వక్తలూ, ఇబ్బడి ముబ్బడిగా వున్న మేధావులూ ఏ భాషలో ప్రసంగించాలన్నది ఆ సమస్య. అలాగే సభలో దస్తాల కొద్దీ కాగితాల్లో కవిత్వం రాసుకువచ్చిన కవులూ ఏ భాషలో కవిత్వం వినించాలనే సమస్య కూడా ఎదురయ్యింది.

ప్రపంచ భాష అంటే ఇంగ్లీషు. ఇంగ్లీషు అంటే ప్రపంచ భాష. దేశ దేశాల జంతు ప్రముఖులూ, ప్రతినిధులూ వున్నారు గనక ఇంగ్లీషులోనే సభ నడిపిస్తే బావుంటుందని సమావేశ కర్త నల్ల మీసాల తోడేలు గట్టిగా వాదించింది. మరయితే ఈ దేశం నించి వచ్చిన మా సంగతేమిటి? మేం వాడే పాడే ‘ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్' మాటేమిటి? అని అరిచిగీపెట్టాయి లోకల్ జీవులు.

సభలోనూ, వేదిక మీదా కలకలం కాస్సేపు గందరగోళం రేపింది. తేట తెలుగులో మేం రాసుకువచ్చిన కవిత్వం మాటేమిటి మాకు ఇంగ్లీషు కవిత్వం రాదే మేం వొట్టి తెలుగు కవులమే కాదా అని కవులు ‘గీ'పెట్టారు.

భర్జన తర్జనల అనంతరం సభ తెలుగింగ్లీషులో జరుగుతుందని, కవులైన వాళ్లు తెలుగింగ్లీషులో కవిత్వం కసిదీరా వినిపించ వచ్చనీ ‘డెసిషన్' తీసుకోబడింది. అన్ని అడ్డంకులూ అధిగమించి సభ ప్రారంభం అయ్యింది. సభలో ఒక్క ఇంగ్లీషు మాత్రమే వచ్చిన వాళ్లు ఇంగ్లీషులోనే మాట్లాడితే తెలుగు వచ్చిన వాళ్లు తమకు ఇంగ్లీషు కూడా తెల్సునంటూ తెలుగులో యేడ్చిందాన్నే ఇంగ్లీషులో నవ్వారు. ఏ జంతువక్త ఏ భాష మాట్లాడ్తున్నాడో అర్థం కాకుండా సభ దారి తప్పింది. కొందరికి ఇంగ్లీషు అర్థం కాలేదు. కొందరికి తెలుగు అర్థం కాలేదు. కొందరికి ఇంగ్లీషు అర్థమయ్యి తెలుగు అర్థం కాకుండా పోయింది. కొందరికి తెలుగు అర్థమయ్యి ఇంగ్లీషు అర్థం కాకుండా పోయింది.

ఈ రెండు భాషల అక్రమ కలయిక అవసరమా? ఎవరికి వచ్చిన భాష వారు మాట్లాడితే సరిపోదా అని జనం ఉసూరుమంటుంటే కవి పుంగవులు వేదిక మీదకి లంఘించారు. తెలుగులో వినిపించిందే ఇంగ్లీషులో దబాయించారు. అయితే వాళ్ల ఇంగ్లీషు ఉచ్ఛారణకు చెవులు చిల్లులు పడుతున్నవని, వాళ్లు ఇంగ్లీషు పలుగురాళ్లు నముల్తుంటే తమ నోటి పళ్లు వూడి పోతున్నాయని సభికులు ఏడ్చి పెడబొబ్బలు పెట్టసాగారు. వీళ్ల ఇంగ్లీషు దెబ్బకి తట్టుకోలేక ఇంగ్లీషు జంతువులన్నీ బతికుంటే బలుసాకు అని పారిపోయేయి.

సభాధ్యక్షుడయిన ఏనుగు దగ్గర్నించి మైకు లాక్కుని సింహం ఒక్క పెట్టున గర్జించింది. జంతువులు హడలిపోయి నోళ్లు మూసినయి. ‘మనం అందరం జంతువులం. మనుషులనంటే ప్రాంతానికో భాష వుండి హింసిస్తుంది. కానీ మనకా భేధాలు ఎక్కడివి? ప్రపంచ జంతువుల భాష ఒక్కటే! ఏనుగు ఘీంకారిస్తుంది. నేను గర్జిస్తాను. మనది యూనివర్సల్ లాంగ్వేజ్'. జంతువుల మయిన మనం మనదైన జంతు భాషలో మాట్లాడుకోకుండా చొప్పన్న దేశాలకి చొప్పన్న భాషలుండే మనుషుల భాషలో మాట్లాడ్డం అవసరమా! అసలెవడ్రా మనకి ఈ ‘లాంగ్వేజ్ ప్రాబ్లమ్' క్రియేట్ చేసింది! ఈ సభలో మనుషుల భాషని ‘ప్రపోజ్' చేసింది ఎవడ్రా అని సింహం మళ్లీ గర్జించింది.

సమావేశ కర్త అయిన తోడేలే ఈ గత్తరకి మూలం అనరిచాయి జంతువులు.

అరవకండి! మనకంటే గొప్పవాళ్లమని విర్రవీగే మనుషులందరికీ ఒక్క భాష అనేదే లేదు. మనది మాత్రం ఒకే భాష. మనదైన జంతు భాషలో గొంతుకలపండి అని అరిచింది సింహం. జంతువులన్నీ ‘ప్రపంచ జంతువులారా ఏకం కండి' అని నినాదాలు చేశాయి.

-చింతపట్ల సుదర్శన్

English summary
Prominent columnist Chintapatla Sudarshan in his column Quick Boxing tells about Animals meeting.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X