• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

క్విక్ బాక్సింగ్: ‘థ్యాంక్యూ సుదర్శన్’

|

ఈ లోకంలో కవులూ రచయితలూ కదిలే వస్తువుల గురించీ ప్రాణుల గురించీ ఎక్కువగా రాస్తుంటారు కాని నా లాంటి కదల్లేని దాని గురించి అంతగా పట్టించుకోరు. ఇటీవలి కాలంలో నా గురించి ఎవరయినా రాస్తే బాగుండు ననిపించింది. ఎవరో ఎందుకు మన సైటైరిస్టు సుదర్శన్ వుండనే వున్నాడు కదాని వెంటపడ్డా. చాలా రోజులు ఆయన వెంటపడ్డంతో ఇన్నాల్టికి ఇట్లా నా స్టోరీ మీ ముందుకి వస్తున్నది.

నాది మరీ రాయగూడని పర్సనాలిటీ యేంకాదు. విశేషాలంటూ లేని లైఫేంకాదు. కొద్దో గొప్పో పనికొచ్చే బయోగ్రఫీ నాకూ వుంది. ఇప్పటి రోజుల్లో నా షేపూ డిజైనూ మారి వుండవచ్చు గానీ నా అవసరం లేని వారు లేరు సుమా. అందువల్ల నాకూ చెప్పుకోదగ్గ చరిత్ర వుందనే చెప్పుకోవాలి కదా!

నా పర్సనాలిటీ గురించి ప్రస్తావించాను గదా పై పేరా మొదటి వాక్యంలో. ఆ సంగతి కొంచెం ‘డిటెయిలిస్తాను'. నా ‘హైట్' చెప్పుకో దగ్గదే. మనుషుల్లో లాగా అక్కడక్కడా మా వాళ్లు కొందరు పొట్టి వాళ్లే అయినా చాలా మటుకి మేమంతా పొడగర్లమే. ఆరడుగుల ‘లాంగ్ ఫెలో'లమే. ఇక వెడల్పంటారా పొడుగుకు దగ్గట్టుగా లావుగా మ్యాచింగ్‌గా వుంటాం. బలంగానూ వుంటాం. రకరకాల రంగుల్లోనూ వుంటాం.

chintapatla sudarshan column on cabinet

ఇంత పొడుగూ లావూ బలమూ బరువూ వున్నా మేం వెకిలి చేష్టలు చెయ్యం, బస్ స్టాండ్లల్లో బీటెయ్యం. మేం చాలా జెంటిల్మన్లం. ఉన్న చోటే వుంటాం. అంగుళం కూడా కదలం. ఏ నలుగురో ఆరుగురో మోసుకుపోతే తప్ప ఉన్న ఊరూ ఉన్న చోటూ వొదలం. మమ్మల్ని తయారు చేసిన వాళ్లు మాకు రకరకాల పేర్లు పెడ్తారు. మనుషులైన మీకూ గుర్తింపు కోసం ఓ ‘నేమ్' వుండాలి కదా.

ఇక మా వాళ్ల పాపులారిటీ గురించి చెప్పాలి. మా వాళ్లు లేని ఇల్లూ, ఆఫీసులూ లేదంటే నమ్మండి. మేం లేకపోతే మీ కాయితాలకీ, ప్యాంటూ కోటూ టైయీలకి సేఫ్టీయే లేదు. కాయితాలంటూ ఏ కంప్యూటర్ లోనో దాచుకుంటారేమో కాని టీషర్ట్లూ బుష్ షర్ట్లూ సఫారీలు మాన్యవర్ జుబ్బాలూ సిల్కు రుమాళ్లు, పట్టు చీరలూ టస్సర్ కోటా గద్వాల, ఉప్పాడ, షిఫాన్ గిఫాన్ వంటివి కంప్యూటర్‌లో పెట్టుకోలేరు గదా!

ఇక మా వాళ్ల సంగతిక్కడ వదిలేసి నా ‘గొడవ' చెప్పుకోనివ్వండి. నేనెవరో ఈ పాటికి మీకు తెలిసే వుండాలి. నన్ను తెలుగు భాషలో బీరువా అని అల్మారి అని అలమర అనీ అంటారు. కొందరయితే స్టైల్‌గా అల్మిరా అనీ అంటారు. ఇంగ్లీషు వాళ్లకీ నా అవసరం లేదనుకోవద్దు. వాళ్లు నన్ను ముద్దుగా క్యాబినెట్ అని, క్లోజెట్ అనీ డ్రెస్సర్ అనీ లాకర్ అనీ ‘వార్డ్ రోబ్' అనీ పిలిచేస్తారు. పేరు ఏదయితేనేం అవసరం అదే.

నన్ను చూడండి. తళతళా మెరిసే స్టీల్ హేండిల్తో, హృదయా కారం వున్న స్టీలు బిళ్లను కప్పుకున్న ‘కీహోల్'తో ఈ పడక గదిలో ఇలా స్టడీగా నుంచుని ఎన్నేళ్లయిందో. మిలిటరీ వాళ్లు కూడా ఇంత అటెన్షన్‌గా నుంచోలేరు. ఇలవైకుంఠపురంలో ఈ మూల సౌధమ్ములో ఈ మూల ఇక్కడున్న నా సంగతులు కొంచెం వినండి మీరు.

ఉండండుండండి ఎవరో తాళం తీస్తున్నారు. వినపడిందా కిరకిర శబ్ధం. ధనలక్ష్మి కాలి గజ్జెల చప్పుడులా లేదూ. నాకు కుడివైపున చిన్న సొరుగుంది. దానికీ తాళం వుంది. చూశారా కిర్రుమంది. లోపల్నించి కరెన్సీ కట్ట ఒకటి బయటకు తీసింది మా యజమానికి యజమాని అంటే ఆయన భార్యన్న మాట. మళ్లీ కిర్రుమని సొరుగు మూసుకుపోయింది. కిరకిరమంటూ నా తలుపూ మూసుకుపోయింది. చూడండి చూడండి నా హేండిల్ కింద కదుల్తున వెండి తాళం చెవుల గుత్తి. గాలికి అందమైన ఆడవాళ్ల నుదుటి మీద కదిలే వెంట్రుకలు గుర్తు రావట్లేదూ.

ఇప్పుడు నన్ను తెరిచి నోట్ల కట్ట పట్టుకెళ్లిన ఆవిడకి నేనంటే ‘ప్రాణం ప్యార్ కాదల్', ఆవిడ పట్టు చీరలన్నీ నా ఎడమవైపు సొరుగులో ఒకదాని మీద ఒకటి మెత్తమెత్తగా వెచ్చవెచ్చగా పడుకుంటాయి. పెళ్లిళ్లకి తప్ప వాటికి నిద్రాభంగం కలగదు. దానికంద సొరుగులో రకరకాల చీరలు రంగు రంగుల చీరలు అద్దాల చీరలు పువ్వులున్న చీరలు ఏనుగులూ చిలకలూ నెమళ్లూ ఎన్ని డిజైన్లు సన్నంచులు, వెడల్పంచులు అంచులే లేనీవీ పాలనురుగ లాంటివీ, జరజారిపోయేవీ చీకట్లో మెరిసేవీ నీలాకాశంలో మబ్బుల్లాంటివీ వెన్నెలాకాశంలో చుక్కల్లాంటివీ ఎన్నివున్నయో.

పండగలకీ పబ్బాలకీ కొత్త కొత్తవి వొచ్చి జాగా చేసుకుంటయి. కబ్జాదారుల్లా జబర్దస్తీగా వచ్చి ఎక్కడో ఓ చోట ఇరుక్కుంటయి. తనని ఏమన్నా సీరియస్‌గా తీసుకోదు కానీ మా ‘మిస్ట్రెస్' నాలోపల వుంచిన చీరల్ని ఎవరన్నా ఏమన్నా అంటే మాత్రం చాలా సీరియస్‌గా తీసుకుంటుంది. ఇవీ వో చీరలేనా? అన్నీ పాతబడ్డయి. కొత్త చీర కొనుక్కోక ఆర్నెల్లయ్యింది అందరికీ నా చీరల మీదే దృష్టి అంటూ ముక్కులుబ్బిస్తుంది.. కళ్లు పెద్దవి చేసి చూస్తుంది. ఇక మరో సొరుగులో జాకెట్లూ తువ్వాళ్లూ కర్చీఫ్‌లూ ఎన్నని చెప్పను. చివరిదాంట్లో మాత్రం ఏవో కాయితాలున్న ఫైళ్లూ, రెక్సిన్ బ్యాగులూ ఒక దాని మీద ఒకటి నిల్వ లేక అడ్డంగా పడిపొర్లుతుంటయి. మధ్య సొరుగులో ఓ పక్క మా యజమాని ప్యాంట్లూ షర్ల్టూ కొన్ని మాత్రం కనిపిస్తయి. ఆయన దుస్తులకి క్రమక్రమంగా ఖాళీ తరిగిపోయింది. పైన హేంగర్లు పెట్టే చోటు కూడా ఆవిడ గారి చీరల మాటున కనిపించకుండా పోయింది. ఇక ‘సేఫ్'లో నగల డబ్బాలూ, కరెన్సీ కట్టల రూపంలో భాగ్యలక్ష్మి నా దగ్గరే ‘సేఫ్'గా వుంటుంది. ఇవన్నీ వున్న నాకు తలుపులు మూసినప్పుడు గాలి ఆడనట్టుంది కానీ తెరిచినప్పుడు కావాల్సినంత గాలిని ఒడిసి పట్టుకుని దాచేసుకుంటాను. ఇక సొరుగుల్లో మూలలందు వేసిన తెల్లటి కలరా వుండల పరిమళం మాత్రం భలేగా వుంటుంది. మనుషులు ‘సెంట్' స్ట్పే చేసుకుని ఉషారుగా వున్నట్టే కొత్త కలరా వుండలు వేసినప్పుడల్లా నేనూ కొత్త ఉత్సాహం తెచ్చుకుంటాను.

ఉండండుండండి ఎవరో వచ్చారు. ఎవరో కాదు మా బాసే. షాప్ నుంచి నన్ను కొనుగోలు చేసి ఆటో ట్రాలీలో నన్ను జాగ్రత్తగా ఇంటికి తీసుకొచ్చి నిమిష నిమిషానికీ నన్ను మోసే వాళ్లకి జాగ్రత్తలు చెప్తూ నన్నిక్కడికి చేర్చిన నా బాస్. కిరకిరమని చప్పుడు వినిపించిందా? ఏదో వెదుకుతున్నాడు. ఎప్పుడూయింతే. దేని కోసం వెదుకుతాడో అర్థం కాదు. అన్నీ కెలుకుతాడు. నానాయాగీ చేస్తాడు. అటూ ఇటూ తోస్తాడు. అరెరే! చూడండి అనుకున్నంతా అయింది పట్టు చీరలనీ జర్రున జారి కింద నా కాళ్ల దగ్గరపడాయి. ఇకవుందిలే లడాయి. ఇప్పుడు ఆవిడగారు వస్తుంది. చీరలు కింద పడేసినందుకు మా బాస్‌కి తలంటూ తపేలా తోమూడు తప్పదు. నేను చెవులు మూసుకుంటాను మీరూ మూసేసుకోండి. నా గొడవలో ఈ గొడవ మామూలే. చీరలు కుప్పకూలినప్పుడే కాదు ‘తాళాలు' దొరకనప్పుడూ యిదే తంతు అంటే సంతగోల. సాధారణంగా నా తల మీద వుండే ‘కీస్' ప్లే మారుతుంది. అవి దొరక్క ఆవిడ తీసి ఎక్కడో పెట్టిందని ఆయనా, ఆయన తీసి గిరాటేశాడని ఆవిడా అరుపులూ కేకలూ వినీ పట్టించుకోవడం మానేశాను. పట్టించుకుని మాత్రం నేనేం చేస్తాను. తాళం తియ్యకుండా నా అంతట నేను తెర్చుకోలేను కదా.

ఏమిటీ? ఈ బీరువాక కథ బోరు కొడ్తుందా? యాక్షన్ లేదని అడ్వెంచరేదని సణుగుతున్నారా? ఉంది నా లైఫ్‌లోనూ యాక్షనూ అడ్వెంచరూ సస్పెన్సూ థ్రిల్లూ లేకపోలేదు. నేను యిక్కడికి వచ్చిన కొత్తలో ఈ కాలనీలో ఇళ్లు ఇక్కడోటీ విసిరేసినట్టుండేవి. ఓనాడు అర్ధరాత్రి నలుగురు దొంగనా కొడుకులు ఇంట్లోకి జొరబడ్డారు. మా యజమాని కుటుంబం పెళ్లికని యేదో ఊరెళ్లారు. ఇంట్లో నేను వొంటరిగా చిక్కాను. నన్ను తెరవడానికి ట్రై చేశారు. యజమాని మీద విశ్వాసం వున్న నేను తెర్చుకోలేదు పైగా పెద్దగా అరవడం మొదలెట్టాను. బెదిరిపోయిన నలుగురు దొంగలూ నన్ను అమాంతం పైకి లేపి మోసుకుపోయి దగ్గర్లోవున్న గడ్డి పొలంలో వెల్లకిల్లా పడేసి పెద్ద బండరాయితో నా హేండిల్‌ని విరగొట్టారు. ఎంత భయపడ్డానో. అప్పటికి నా లోపల సరుకు అంతగా లేదు. ఉన్నదేదో తీసేస్కుని నన్నట్లా చలిలో వొదిలేసిపోయారు. తెల్లార్లూ నిద్రపోతే ఒట్టు. తెల్లారాక మా యజమాని నన్ను మళ్లీ ఇంట్లో బెడ్రూంలోకి తరలించాడు. అప్పుడు పెట్టించిన కొత్త హేండిల్ ఇప్పటికీ తళతళలాడ్తున్నది. ఇదో అనుభవం. ఇక నాపక్కన జరిగే ‘రొమాన్స్' సంగతి నేను చెప్పను బాబూ ఆ తీపి అనుభూతుల్ని నాలోనే దాచుకుంటా.

ఇదీ నా కథా కమామిషూ! నాకూ ఓ కథ వుందని ఒప్పుకుంటారు కదా. నాలాగా ప్రతి ఇంట్లో వుండే బీరువాకీ అది వేరే వరే రూపంలో వుండవచ్చుగాక ఓ కథ వుంటుంది. మీ రహస్యాల్నీ మీ నగల్నీ దుస్తుల్నీ కడుపులో దాచుకుంటున్న నన్ను నిర్లక్ష్యం చెయ్యకండి. తాళాలు జాగర్తగా దాచుకోండి. రఫ్‌గా హేండిల్ చెయ్యకండి. ధణాళ్‌మని నా తలుపులు విసిరికొట్టకండి. పచారీ కొట్టు సరుకుల్లా నన్ను నింపకండి. అప్పుడప్పుడూ అన్నీ తీసి కొత్త తెలుగు న్యూస్ పేపర్లు పరవండి(ఇంగ్లీషు న్యూస్ ధారాళంగా చదవలేను నేను) వాటి మీద అన్నీ పద్ధతిగా సర్ది కొత్త కలరా వుండలు వెయ్యండి నన్ను నా మీద బిగించిన మిర్రర్‌నూ శుభ్రంగా మెత్తటి క్లాత్‌తో తుడవండి దుమ్ముకొట్టుకుపోకుండా నన్ను కాపాడండి. నా కథ రాసినందుకు థ్యాంక్స్ సుదర్శన్!!

-చింతపట్ల సుదర్శన్

English summary
Prominent columnist Chintapatla Sudarshan in his column Quick Boxing tells about a cabinet.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X