వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సుదర్శన్ క్విక్ బాక్సింగ్: దెబ్బకు దెబ్బ!

|
Google Oneindia TeluguNews

మంత్రిగారు హాల్లోంచి వరండాలోకి వరండా నుంచి ఒక్కొక్క మెట్టే దిగుతూ బంగాళా ముందుకీ వచ్చారు భారంగా వూపిరి పీలుస్తూ భారీ శరీరానికి కాస్తా కూస్తా గాలి సరిపోదు గదా. కాళ్ల ముందుకి వచ్చి నిలబడ్డది నిగనిగలాడే నల్ల ఏనుగులాంటి కారు. చుట్టు పక్కల గన్‌ మెన్లూ ఆపైన పెద్ద పోలీసులూ ఈ పక్కా ఆ పక్కా మందీ మార్బలమూ.

కారు డోరు తెరిచి నుంచున్నాడు ఒకడు. గొడుగు విప్పి పట్టుకున్నాడొకడు వెనకాల కారుల్లో జనం ఎక్కడానికి రడీగా వున్నారు.

ఇక మంత్రి వరేణ్యులు కుడి కాలు పెట్టి కార్లో కూచోవడమే తరువాయి. ఉన్నట్టుండి సుడిగాలి వీచింది. ఎక్కడ్నించో దుమ్ము రేగుకుంటూ వచ్చింది. ఏం జరిగిందో తెలిసే లోపునే ‘ఢాం'మ్మని కిందపడ్డారు మంత్రిగారు. ఢామ్మన పోయినా ఆయన కుండాల్సిన పళ్లల్లో మూడు కనిపించకుండా పోయేయి.

ఏమైందేమయింది అని ఘొల్లుమన్నారు జనం. తుపాకులు ఎక్కుపెట్టారు గన్ మెన్లూ పోలీసులూ. రేగుకుంటూ వచ్చిన దుమ్మును అనుసరించి పరుగెత్తేయి బూటు కాళ్లు. ఓ వైపు కొందరు మంత్రి గార్ని మంచం మీదకు చేర్చారు. మరో వైపు గన్నులూ బూటు కాళ్లూ బంగళా ఆవరణ అంతా రన్నింగు మొదలు పెట్టారు. చెంగు చెంగున ఎగుర్తున్న దుమ్ము యింతమంది ఖాకీలు కమ్ముకొస్తుంటే ఎంతకని పరిగెత్తను యిక నా వల్ల కాదు అనుకుని ఓ చోట స్టడీగా నిలబడింది.

chintapatla sudarshan column on current politics

దాని చుట్టూ నిలబడ్డాయి గన్లు. పై ఆఫీసర్ల ఆర్డర్ కోసం నిరీక్షిస్తూ. మంత్రిగారు కారెక్కబోతుంటే యింతమంది జనాన్ని యింత సెక్యూరిటీని సవాలు చేస్తూ వచ్చి ఆయన్ని నడుం విరిగేట్టు లాగి పెట్టి తన్ని తప్పించుకోబోయిన ఆ నాలుగు కాళ్ల టెర్రరిస్టుని యేం చెయ్యాలో అర్థం కాలేదు వాళ్లకూ ఆఫీసర్లకూ.

దీన్ని తక్షణం షూట్ చేసి పారేద్దాం అన్నాడొకడు. తప్పు తప్పు అది దానంతట అదే సరెండరయి పోయింది అన్నాడింకొకడు. మానవ హక్కులకు విరుద్ధం అని కేక పెట్టారెవరో. దీనికి మానవ హక్కులు వర్తించవు అన్న సమాధానం వచ్చిందెక్కడ్నించో.

ఏది ఏమైతేనేం. అది చేసిన నేరానికి కోర్టే సరిఐన శిక్ష వేస్తుంది. ప్రస్తుతానికి అరెస్టు చేసి లాకప్‌లో పెట్టండి అన్నాడు పెద్ద పోలీసు.

జీపెక్కించండి అన్నాడు మరో పోలీసు. ఇది జీపులో ఎక్కలేదు. ఆటో ట్రాలీ తెప్పించండి అన్నాడో తెలివైన పోలీసు. ఆటో ట్రాలీలో నేరం చేసిన దాన్ని పోలీసు స్టేషన్‌కి తరలించారు. ఈ వార్త క్షణాల్లో నగరమంతా గుప్పుమంది. టీవీల్లో వార్త వెల్గుతూ ఆరుతూ జనాల కళ్లు బైర్లు కమ్మించింది. ఒక మంత్రిగార్ని ఎట్నుంచి బంగాళా లోకి వచ్చిందో తెలీని ఒకానొక నాలుక్కాళ్ల జీవం ఎగిరి తన్నింది. అది ముందు కాళ్లతో తన్నిందో, వెనక కాళ్లతో కిక్కిచ్చిందో కూడా తెలియనంత నేర్పుతో మంత్రిగారిని పడదోసి మూడు దంతాలను రోడ్డుపాలు జేసింది. వాటి కోసం గాలింపు చర్యలు మొదలయ్యేయి. డాక్టర్ల బృందం ఒకటి మంత్రిగారి ఆరోగ్యాన్ని కార్పొరేట్ ఆస్పత్రిలో పర్యవేక్షిస్తూ గంటగంటకీ మెడికల్ రిపోర్టు ప్రకటిస్తున్నది.

లాకప్‌లో వున్న నేరస్తుడ్ని అర్ధరాత్రి దాటాక నిజాలు రాబట్టాలని, అది ఏ తీవ్రవాద గ్రూపుకి చెందినదో బయట పెట్టించాలని పోలీసులు లాటీలు రడీ చేసుకుంటున్నారు. పెద్దాఫీసర్ల నుంచి చిన్నాఫీసర్ల దాకా దాన్ని ఊచల్లోంచి తొంగి చూస్తున్నారు.

ఉన్నట్టుంది అది ఒక్క పెట్టున ఓండ్ర పెట్టింది. పోలీసులు ఉలిక్కిపడి గన్నులూ లాటీలు ఎత్తి పట్టుకున్నారు. ఒక ఆఫీసర్ ఊచలని చేత్తో తడుతూ ష్.. ష్.. అన్నాడు.

ఏంటా ష్..ష్.. నేను గాడిదనే కాని మాటలు వచ్చిన గాడిదని అంది గాడిద గాడిదలా కాకుండా మనిషిలా మాట్లాడుతూ.

అది విన్న ఆఫీసరు విరుచుకుపడి పోయాడు వెనక్కి.

మరో ఆఫీసరు ముందుకురికాడు. ఏం చేశావు మా వాణ్ణి అనరుస్తూ.. ఏం పోలీసు డిపార్టుమెంటయ్య గాడిదని లాకప్‌లో పెట్టారు సరే తిండీ తిప్పలూ ఏమైనా చూడాలా వద్దా! అసలు నన్ను ఇరవై నాలుగ్గంటల లోపు కోర్టులో హాజరు పరుస్తారా లేక ఏ అర్ధరాత్రో ఎన్ కౌంటర్ చేస్తారా అనడిగింది గాడిద.

నిశ్శబ్దంగా వున్న స్టేషన్లో దాని మాటలు ‘డోల్బీ డిజిటల్ సౌండ్'లో వినపడ్డాయి. గాడిద మాట్లాడుతున్నదని ముఖాలు చూసుకున్నారు. కలా నిజమా అని ఒకళ్లనొకళ్లు గిల్లి చూసుకున్నారు.

మీమంత్రి గార్ని నడుం విరిగేట్టు పళ్లు వేడేట్టు తన్నింది నేనే. మనుషుల భాష తెల్సిన గాడిదని నేనే అన్నది గాడిద బూడిద రంగు తోకని పైకెత్తి వూపుతూ. నోటి నిండా వున్న పలుగు రాళ్లవంటి పళ్లని బయటపెడ్తూ.

తీగలో కరెంటు కన్నా వేగంగా ప్రవహించే మీడియా ఈ వార్తని క్షణాల్లో నగర పౌరుల నరాల్లోకి ఎక్కేసింది. టీవీ ఛానళ్ల వాళ్లు పోలీసు స్టేషన్ బయట గుంపులు గుంపులుగా చేరారు.. కెమెరాలు వూపుకుంటూ.

లోపల పోలీసుల్ని తనకు తండి పెడ్తారా లేదా అని దబాయించింది గాడిద. ఏంతింటావు వెజ్జా నాన్ వెజ్జా, పిజ్జానా బర్గరా అనడిగారు ఫ్రెండ్లీ పోలీసుంగులో పోలీసులు.

ఓ డజను దిన పత్రికలు ఓ అరడజను వార పత్రికలు పడెయ్యండి చాలు ఈ పూటకి సర్దుకుంటాను. ఓ తొట్టినిండా మినరల్ వాటరిప్పిస్తే తినీ తాగీ త్రేన్చీ పడుకుంటాను అన్నది గాడిద ఆవులిస్తూ. కొందరు పాత పేపర్లూ వార పత్రికలూ అమ్మే దుకాణానికి పరుగెత్తారు. ఇంగ్లీషువైతే టెస్టీగా వుంటయి అనరిచింది గాడిద వెనకనించి.

గాడిద మాట్లాడ్తున్నదన్న విషయం ఫినాయిలు బుడ్డీ పగిలి వాసన వ్యాపించినట్టు వ్యాపించి వకీళ్ల ముక్కుల్ని కూడా బద్దలు కొట్టింది. ఒకానొక యంగ్ లాయర్ పబ్లిసిటీకి యింతకు మించి దారేలేదని బెయిలు పేపర్లు పట్టుకుని వచ్చాడు స్టేషన్‌కి. గాడిదకి బెయిలిచ్చి తన ఇంట్లో పాత కేసుల బాపతు వకాలత్ నామా ఫైళ్లు బోలెడున్నాయని కడుపునిండా తినితొంగో వచ్చనీ దీన్ని బయటకు తీసుకువచ్చాడు.

గాడిద బయటకు వస్తుంటే నగర పౌరుడొకడు దాని మెళ్లోదండ వేశవాడు. ఛానళ్లు లైవ్ ప్రసారం మొదలుపెట్టినయి. ప్రేక్షకులు టీవీలకు అతుక్కుపోయారు. పాత్రికేయుల ప్రశ్నలకి తడుంకోకుండా జవాబిచ్చింది దడిగా అనగా గాడిద.

నువ్వసలు గాడిదవు కదా! నీకు మాటలెలా వచ్చు అనడగిందో మైకు.

మనుషులు గాడిదల్లా ప్రవర్తించడం లేదూ అలాగే. భాష మీ ఒక్కరి సొత్తేం కాదు. గాడిదలకూ లాంగ్వేజిలర్నింగ్ ప్రతిభ లేకపోలేదు అంది గాడిద ఎక్కా బుడ్డీలాంటి కళ్లెగరేస్తూ.

నోనో. మనుషులు గాడిదల్లా ప్రవర్తిస్తారంటే ఒప్పుకుంటాం కానీ భాష వేరు ప్రవర్తన వేరు అన్నదింకో మైకు.

అసలు లోకంలో ఎవరూ లేనట్టు మంత్రి గారి పళ్లే ఎందుకు వూడ బెరికావు అన్నారొకరు.

మంచి ప్రశ్న అన్నది గాడిద. కాస్సేపు నేల చూపులు చూసి అన్నది. గత జన్మలో రిగ్గింగ్ చేసి మూడు ఓట్లతో గెలిచాడా పుండాకోర్ అందుకే మూడు పళ్లూడబీకా అన్నది గాడిద.

గత జన్మలో అంటే అన్నాడో‘ర్‌ర్టపోరి' గత ఎలెక్షన్ల నాటికి బతికే వున్నాన్నేను. మూడే మూడు ఓట్లతో నన్ను ఓడించి తను మంత్రి అయి పోయేడు. ఆ బెంగతో గుండెపోటొచ్చి చచ్చి మళ్లీ వచ్చానిలా గాడిదనయ్యి అన్నది గాడిద కన్నీరు కారుస్తూ.

అసలు నువ్వు గాడిదవే ఎందుకయ్యావ్ అన్నది ఓ మైకు.

గత జన్మలో లీడర్ గిరీ చెలాయించినప్పుడు ప్రజలకిచ్చిన మాట తప్పి బోలెడు బ్లాక్ మనీ పోగేశాను. అపకారం తప్ప ఉపకారమనేది ఎప్పుడూ చెయ్యలేదు. అందువల్లనే గాడిదనయి వుంటాను. అందువల్లనే గాడిదనయి వుంటాను. నా ఈ జన్మ రాజకీయాల్లో వుండి గాడిద చేష్టలు చేసే వారందరికీ గుణ పాఠం కావాలి అన్నది గాడిద గంభీరంగా.

ఆ తర్వాత మా ఛానల్‌కి ఇంటర్వ్యూయివ్వాలంటే మా ఛానల్‌కి అని ఎగబడ్డారు మీడియా సోదరులు. అంతా నన్ను బయటకు తెచ్చిన లాయర్‌గారే చూసుకుంటారు.

మీరు చేసిన నేరానికి శిక్ష పడుతుందంటారా అన్నాడో పత్రికాయన.

కోర్టులో ఏదైనా జరగచ్చు. సుప్రీం కోర్టు దాకా వెళ్లయినా సరే గాడిదను నిర్దోషిగా నిరూపిస్తాను అన్నాడు యంగ్ లాయర్.

లాయర్ కాదు నా పాలిటి దేవుడు అన్నది గాడిద కుక్కలా తోక వూపుతూ.

భారతదేశ చరిత్రలోనే ఒదొక అపూర్వమైన కేస్ అవుతుంది అని కాలరెగరేశాడు లాయర్.

స్వచ్ఛ భారత్ గురించి మీరేం చెప్తారు. అనడిగాడో సంచలన వార్త హరుడు.

చెప్పేందుకేముంది. దేశంలో మనుషులు పెరుగుతున్నారు కానీ గాడిదలు తరిగిపోతున్నయి. మనుషుల్లో గాడిదలుండవచ్చు అది వేరే సంగతి. వాషింగ్ మెషిన్ల పాపమా అని మా గాడిదల జీవనం గడవడం కష్టంగా వుంది. అందువల్ల మనుషులు రోడ్ల మీద పడి వూడ్చడం కంటే ఆ పని మా గాడిదలకు ఒప్పచెప్పడం మంచింది. ఏ చెత్తనయినా తిని హరాయించుకునే మేం ఈ దేశంలో చెత్త లేకుండా చేస్తాం అన్నది గాడిద.

ఈ గాడిద మామూలు గాడిద కాదు. అన్ని విషయాల మీద నాన్ స్టాప్‌గా మాట్లాడగలదు. రేపట్నించి మా ఇంటి ముందు ‘క్యూ' కట్టండి అపాయింట్ మెంటిస్తుంది అంటూ యంగ్ లాయర్ గాడిదని ఆటో ట్రాలీ ఎక్కించాడు.

- చింతపట్ల సుదర్శన్

English summary
Prominent columnist Chintapatla Sudarshan in his column Quick Boxing tells about current politics.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X