• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

క్విక్‌ బాక్సింగ్: మారేదీ! మారనిదీ!!

|

ప్రభుత్వాలన్నాక మారుతూవుండటం మామూలే. ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఉద్యోగాలు ఉద్యోగులూ శాఖలూ పేర్లూ గట్రాలు మారుతూ వుండటం కూడా సహజంగా సహజమే. తస్మదీయులు తోక ముడవటం అస్మదీయులు వచ్చి చేరడం ముఖ్యంగా చెయ్యడానికి పనేమీలేని అస్మదీయులకు కొత్త ఉద్యోగాలిచ్చి ఉద్ధరించడం ప్రభుత్వాలన్నాక మార్పులన్నాక అన్నీ మామూలుగా మామూలే మరి సహజంగా సహజమే కదా!

రాజావారికి గుర్రపు స్వారీ అంటే ఇష్టం. గుర్రానికీ రాజావారు తన వీపు మీద ఎక్కి డొక్కలో పొడవటం ఇష్టం. అందువల్ల ఇష్టంగా గుర్రం ఇష్టం వొచ్చిన వేగంతో దౌడు తీయడం వల్ల మిట్ట మధ్యాహ్నం వేళకి రాజాగారు కోటబయటవున్న ఒక తోట దగ్గరికి చేరుకున్నారు. వెనకవున్న మందీ మార్బలమూ వచ్చి చేరేదాంకా ఈ తోటలో విశ్రమిస్తే ఏంపోతుంది అనుకున్నారు రాజాజీ.

గుర్నాన్ని ఓ చెట్టు కింద తోలేసి తాను ఓ మామిడి చెట్టు నీడలో వున్న రాతి దిమ్మమీద వేంచేశారు రాజావారు. ఆహా! ఎవరిదీ తోట ఎంత అందంగా వున్నది ఎంత కూలింగ్‌గా వున్నది ఎంత చల్లగా గాలి వీస్తున్నది అనుకుంటూ వున్న రాజాగారి ఎదుటకి వచ్చి వంగి సలాము చేస్తూ నిలబడ్డాడొకడు. వంటికి గుడ్డ చుట్టుకున్నాడు ఛాతీ మీద నక్షత్రల్లాంటి మెరుస్తున్న చెమటతో చేతిలో పలుగు పారతో నిలబడ్డ అతన్ని పరీక్షగా చూశార్రాజావారు.

 chintapatla sudarshan column on governments

‘ఏవర్రా నువ్వు? ఈ తోట ఎవరిది. ఇంతకు ముందెప్పుడూ చూడనేలేదు' అన్నాడు రాజు దర్జాగా.

‘మారాజా! ఈ తోట తమరిదే మారాజా. ఇంతకుముందు ఎప్పుడూ తమరు ఇటువైపు దయ చేయలేదు మారాజా' అన్నాడు ఆవచ్చినవాడు.

‘మాదేనా! మాదేనా ఈ తోట నిజంగా.. ఎంత బావుందో' అంటూ చుట్టూ చూశాడు మారాజు. మామిడి, కొబ్బరివంటి పెద్ద వృక్షాలతో పాటు రకరకాల, రంగు రంగుల పూలమళ్లున్నాయి.

ఎక్కడెక్కడ ఏమేంవున్నయో ఏం తెలుస్తుంది మనకు అనుకున్న రాజు ‘మరి నువ్వు యిక్కడ' అనడిగాడు.

తోట మాలిని మారాజా! తాత రాజావారి టైంలో మాతాత మీ తండ్రి రాజావారి జమానాలో మా తండ్రి మీ టర్మ్‌లో నేనూ ఈ తోటని కన్నబిడ్డలా చూసుకుంటున్నాం అన్నాడు తోటమాలి పైగుడ్డతో చెమట తుడుచుకుంటూ.

‘మరి నీ జీతం?' అన్నాడు రాజు అతన్ని పరీక్షగా చూస్తూ.

‘జీతం బత్తెం లేని ఉద్యోగం మారాజా. ఇరవై నాలుగ్గంటలూ ఈడే. మీరు ప్రతి రోజూ పూజ చేసుకోవడానికి పూలు తెచ్చియిస్తూ వుంటాను కానీ కానీ పుచ్చుకోను. ఏదో పుల్లా పుడకా ఏరుకుని అమ్మి వచ్చిందాంట్లో బ్రతికేస్తున్నా. ఇది మా తాత ఒప్పచెప్పిన డ్యూటీ' అంటూ చిరునవ్వుని కొద్దిగా, రిలీజు చేసేడు తోటమాలి పెదాలమీద.

‘అలాగ వీల్లేదు. ఇప్పట్నుంచీ నీకు జీతం ఏర్పాటు చేస్తున్నాను. దివాణానికి వచ్చి మంత్రి గారిని కల్సుకో' అన్నాడు రాజు మీసం మెలేశాడు.

మార్నాడు పూలు తీసుకుని దివాణానికి వెళ్లిన తోటమాలికి ఉద్యోగం అప్పాయంట్‌మెంట్ ఆర్డర్ అందింది. నెలకి యింత జీతమని, ఇవీ పనివేళలని, ఇవిగో సర్వీసు రూల్సని కాయితాలందించారు మంత్రి కార్యాలయం వారు.

ఇరవై నాలుగ్గంటలూ తోటని తన స్వంత బిడ్డలా చూసుకోడం అలవాటయిన తోటమాలి పరిస్థితి ఇరుకున పడ్డది. రూల్స్ ప్రకారం డ్యూటీ టైంలో తప్ప తోటలోకి ప్రవేశించే వీలులేదు. తను ఎప్పుడు వస్తున్నదీ, వెళ్తున్నదీ రిజిష్టర్‌లో నమోదు చెయ్యాలి. ఏ ఏ చెట్టుకి ఎన్ని నీళ్లు పోస్తున్నదీ, ఎక్కడ గుంత తవ్విందీ ఎక్కడ ఎరువు వేసిందీ తెలియచెయ్యాలి. ఏ మొక్క ఎన్ని పూలు పూసింది పూసిన పూలల్లో ఎన్ని దివాణానికి డెలివరీ అయ్యిందీ లెక్క చెప్పాలి.

ఇవన్నీ వూరికే జరగవు కదా! తోటమాలి డ్యూటీ సరిగ్గా చేస్తున్నదీ లేనిదీ తనిఖీ చెయ్యటానికి మంత్రి కార్యాలయం వారు ఒక సూపర్ వైజర్ని అప్పాయింట్ చేశారు. తోటలోకి ఎవరూ రాకుండా చుట్టానికి సెక్యూరిటీ ఆఫీసు తయారైంది.

మూడు తరాలుగా టంచన్‌గా పని చేస్తూ మొక్కల మీదే ప్రాణం పెట్టుకున్న తోటమాలికి ఈ పరిస్థితులన్నీ అయోమయంగా కనపడ్డవి. తను ప్రేమగా పెంచుకున్న మొక్కల్ని ప్రేమగా ముట్టుకోడానికి కూడా వీళల్లేదు. కొన్ని మొక్కలకి డ్యూటీ టైంలో పారించిన నీళ్లు చాలక పోతే మరికొంచెం సేపు వుండి నీళ్లు పెట్టడానికి వీలేలేదు.

పనీ పాటా లేకుండా వున్న మంత్రి గారి పెద్ద భార్య బావమరిది ఈ కోట బయట తోటకి సూపర్ వైజరయ్యాడు. ఈ సంగతి తెల్సి మంత్రి గారి చిన్న భార్య అలగనే అలిగింది. ఈ సంగతి తెల్సి మంత్రిగారు మరో మాట లేకుండా తోటకి సంబంధించిన లెక్కలూ అవసరానికి కావల్సిన ఖర్చుల ప్రపోజల్సూ వగైరాలు పంపించడానికి చిన్న భార్య తమ్ముడిని అకౌంట్సు ఆఫీసర్‌గా నియమించాల్సి వచ్చింది.

ఇన్నాళ్లూ తోటమాలి ప్రతి రోజూ పూలని ఓ పాత గుడ్డలో మూట కట్టుకుని పసిపాపని ఎత్తుకున్నట్టు ఎత్తుకుని దివాణంలో అప్పగించేవాడు. ఇప్పుడన్నీ మారిపోయాయి గదా. పూలు ట్రాన్స్‌పోర్ట్స్ చైడానికి నాలుగైదు రథాలు ఏర్పాటయినాయి. మంత్రిగారి కైతేనేం, ప్రధాన ఉద్యోగులకయి తేనేం బంధువర్గం తక్కువేం కాదు కదా. రథాలకు డ్రైవర్లూ, గుర్రాలకి స్టేబిళ్లూ, గుగ్గిళ్లు పెట్టేవాళ్లూ, వొళ్ళు తోమేవాళ్లూ అబ్బో ఎన్ని ఉద్యోగాలో. వీళ్లందరినీ అజమాయిషీ చెయ్యడానికి పెద్ద పెద్ద ఉద్యోగులూ అవసరమే కదా!

తాతల కాలం నుంచీ ఒకే ఒక్క తోట మాలితో అదీ జీతం బత్తెం లేనివాడితో కళకళలాడిన పూదోట యిప్పుడు రోజు రోజుకీ ఉద్యోగుల సంఖ్య పెరిగి ఒకటి పదయ్యి పది యిరవయ్యీ యాభయ్యీ అయి వొందను తాకబోతున్నది. ఖర్చులు కూడా పెరిగిపోయేయి. పూలు మాత్రం అవే తోటమాలి మాత్రం వాడే.

ఇందరు ఉద్యోగులు తయారయిన ఆ తోట యిప్పుడొక ప్రభుత్వ శాఖ అయింది. ‘కోట బయట తోట' అనే కొత్త శాఖలో అస్మదీయులైన ఉద్యోగుల సంఖ్య పెరుగుతూనే వుండటంతో బాబాయి కొడుకులు, మేనమామ పుత్రులు, బామ్మర్దులు, వేలు విడిచినవాళ్లు వేలు పట్టుకుని వదలని వాళ్లు ఎందరో ఈ ‘కోట బయట తోట' అనబడే ప్రత్యేక శాఖలో చేరి రాజావారి ఖజానాకు కన్నం వేయసాగారు.

సాలీనా లెక్కల్లో మహాగణకుల వారు ఈ కోట బయట తోట శాఖలో ఆదాయం కన్నా వ్యయం ఎక్కువైందని అందువల్ల ఈ శాఖను ఎందుకు మూసివేయరాదోనని సంజాయిషీ అడగనే అడిగారు.

ఇంకేంవుంది. మంత్రిగార్నీ, పెద్ద హోదాలున్న వారినీ చుట్టాలు చుట్టుముట్టారు.

మహాగణకుల వారికి సంజాయిషీ అందింది.

‘కోట బయట తోట' శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులంతా విద్యాధికులనీ, చిత్తశుద్ధితో పని చేస్తున్నారని, అయితే ఆదాయం తక్కువై వ్యయం ఎక్కవ కావడానికి కారణం డ్యూటీ సరిగ్గా చేయని తోటమాలేనని ఆ తోటమాలిని ఉద్యోగం లోంచి తొలగించడమే ఆదాయం పెంచడానికి వున్న ఏకైక మార్గమని ఆ సంజాయిషీ పత్రంలో వున్నది.

నిజంగానే మూడు తరాల నుంచీ నిస్వార్థంగా పని చేస్తున్న వాళ్లల్లో మూడవ తోటమాలిని అతను పూల మొక్కల మీద విపరీతమైన ప్రేమను పెంచుకుని అవసరం కంటే ఎక్కువ నీళ్లూ ఎరువులూ ఖర్చు చేస్తున్నందున వ్యయం పెరిగిపోయిందని సర్కారు ఆ తోట మాలిని ఉద్యోగం నుంచి తొలగించింది.

ప్రభుత్వాలు మారినప్పుడల్లా కొత్త శాఖలు, కొత్త సలహాదార్లూ, కొత్త ఉద్యోగాలూ షరామూమాలే. అస్మదీయులైతే చాలు విశ్రాంత ఉద్యోగులకు మళ్లీ కొత్త పదవులు కొత్త హోదాలు పంపక ఆవడమూ మామూలే!

నిజాయితికీ, చిత్తశుద్ధికీ, విశ్వాసపాత్రుతకు యే ప్రభుత్వంలోనైనా చెల్లుచీటి తప్పదు.

-చింతపట్ల సుదర్శన్

English summary
Prominent columnist Chintapatla Sudarshan in his column Quick Boxing tells about Governments.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X