వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సుదర్శన్ క్విక్‌ బాక్సింగ్: ‘ఆరోగ్యరావు’

|
Google Oneindia TeluguNews

ఆరోగ్యరావనే వాడొకడు కలడున్నాడు. ‘హెల్త్‌రావ్'కి ఆరోగ్యం అనేది పేరులో వున్నది కాని ఆరోగ్యం మీద అతనికి బోలెడంత అనుమానం. అసలు తను నిజంగా ఆరోగ్యంగా ఉన్నాడా లేదా అన్నదాన్ని గురించి గంటలు గంటలు ఆలోచించి ఆరోగ్యం పాడుచేసుకుంటున్నాడని కొందరు అనుకోవడం షరామామూలే.

అసలు ఆరోగ్యరావుకి ఏ అనారోగ్యం లేదని ఎవడు గ్యారంటీ యివ్వగలడు గాని అతడి సందేహాస్పదమైన జీవితాన్ని అనేకమైన విషయాలు అనేక రకాలుగా గీపెట్టి హింసపెట్టి చావగొడ్తుంటయి.

పొద్దున్న పేపరు ముట్టుకుంటే చాలు వణికిపోవలసి వస్తుంది. అది పేపరో పేషంటు కేస్ షీటో అర్థం అవదు. ఏ పత్రిక ముట్టుకున్నా అనేక రోగాలకు కారణాలు రకరకాల చికిత్సలు. ఆరోగ్యానికి చిట్కాలు.

chintapatla sudarshan column on health

వద్దు వద్దు అనుకుంటూ కంట బడిన వన్నీ చదివేసే రోగం మాత్రం ఆరోగ్య రావుని పట్టుకుని వైరస్‌లా తెగనముల్తుంది.

చిన్నప్పుడు బొద్దుగా ముద్దుగా వున్న ఆరోగ్యరావు యిప్పుడూ కొంచెం ‘మందం'గానే వుండడం చేత మందం అందం కాకపోవడం వల్ల దాన్ని చెక్కి చిక్కి శల్యమయితేనే ఆరోగ్య భాగ్యమని చదివాడు. ఇంకేం వుంది లావు తగ్గడం ఎలా? వారంలో పది కేజీల బరువు తగ్గడం ఇలా. సన్నగా గడకర్రలా కావడానికి మీరేం చెయ్యాలి. మా దగ్గరికి రండి నాలుగు వారాల్లో తోలుతీస్తాం దూది పరుపులో నుంచి దూదిని వేరు చేసియిస్తాం డన్ లప్ టైరులోంచి గాలితీసి పంచరు చేసి వదుల్తాం అనే ఊక దంపుళ్లు విని టెంప్టయ్యేవాడు. అయితే కరెంటు తీగ సన్నగానే వుంటుంది ముట్టుకుంటే షాక్ కొడ్తుంది లా వుంటానికి ఏ మార్గం అయితే అది ఆనంద మార్గం అవుతుందో తేల్చుకోలేక తెగ హైరానా పడేవాడు ఆరోగ్యరావు.

ఏదైనా మొదలు పెట్టాలంటే మొదలు పెట్టడమే కదా అని వో వాకర్ ఎత్తుకు వచ్చి అంటే కొనుక్కువచ్చి హాల్లో గోడ గడియారం, దాని ఫ్రెండు సోనీ టీవీకి ఎదురుగ్గా స్థాపించాడు.

టీవీలో పాటలు వింటూ ఐదు కిలో మీటర్ల వేగంతో ముప్ఫయి నిమిషాలు వాకించి చెమట్లు కారుతూ దిగిపోయేవాడు. హమ్మయ్య ఇవాళ వొంద కేలరీలు మటాషించేశాం అని సంబరపడి పోయేవాడు. త్వరలోనే మీరొక కరెంటు తీగని చూస్తార్రా అని లోలోపల మురిసిపోయేవాడు తన్ని పరీక్షగా చూపుల్తో గుచ్చి గుచ్చి చంపుతున్న వాళ్ల వైపు ముఖ్యంగా ఆఫీసులో బక్క బాస్ వైపు.

అయితే అదేం న్యాయమో అదేం ధర్మమో కానీ ఒళ్లు చిక్కిశల్యం అవడానికి ససేమిరా ససేమిరా అంది. ఆరోగ్యరావు బరువు తగ్గించవోయి అనే వాళ్లు అలా అనడం కొనసాగించారు. పైగా రోజూ సాక్సూ బూట్లూ తొడుక్కుని వాకరెక్కేందుకి బద్ధకం పిచ్చిపిచ్చిగా రెచ్చిపోయింది. చెట్టుకి కాయలు ఎన్నో కదా! మరో మార్గమేదీ లేదా అని మధించి శోధించాడు.

ప్రాచీన భారతదేశం అడ్డమైన బాబాలకు నిలువైన సన్యాసులకూ ఓ ‘అడ్డా' అని యిది వరకు అనుకునే వాడు కానీ ఇప్పుడు కళ్లు తెర్చుకుని జ్ఞాన మార్గం పట్టాడు. అసలు మన దేశమే దేశం. దేశమంటే మట్టి కాదోయి, దేశమంటే యోగులోయి. యోగులంటే బాబాలోయి బాబాలంటే నిత్యానందలోయి రాందేవులోయి వంకరటింకర రాజులోయి అని భావించి యోగించడం మొదలుపెట్టాడు. ‘ప్రాణాయామం' ‘భస్త్రిక' సూర్యనమస్కారం వారేవా అనుకున్నాడు. కూచున్న చోటు కూచుని ముక్కు మూసీ తెరిచి, పొట్ట వుబ్బిచ్చీ లొట్టపోయేట్టు చేసే ఎన్నో కేలరీలు కరిగించి పారబోయించవచ్చు అనుకున్నవాడు యోగా మ్యాట్ కొనుక్కొచ్చి ‘హూ హా హా హూ' మొదలెట్టాడు. ఇదీ మూణ్ణాళ్ల ముచ్చటే అయ్యింది. పొట్టలో ఏదో నెప్పిగా వున్నట్టు అసలు పొట్ట అనేదానిలో ఏమీ లేనట్టటూ పేగులు వొకదానికొకటి చుట్టుకుని పతంగీ దారంలా చిక్కుపడ్డట్టూ ఫీలవడం మొదలెట్టాడు.

‘డూ ఆర్ డై'అని కంటిన్యూ చేస్తే డూ సంగతేమో కాని ‘డై' అవడం ఖాయం అనిపించి యోగ నిద్రలోంచి బయటకు వచ్చేశాడు.

అసలు ఈ వాకింగులూ ముక్కు మూసింగ్‌లూ శుద్ధవేస్టు. ఉన్నదంతా ‘డైట్'లోనే వుంది అసలు ఆరోగ్యానారోగాలు వంటింటి మీదే ఆధారపడుతున్నయి. ‘కిచెన్' అనేదే ఒక ఔషధశాల. ‘ఆరోగ్యానికి అరవయి సూత్రాలు' ‘వంటింటి చిట్రాలు' ‘ఇవితింటే ఆరోగ్యం మీ వెంటే' ‘బ్రేక్ ఫాస్టే ఆరోగ్యానికి ట్రెజర్' ‘మీ అన్నపు పళ్లెం బట్టి మీ ఆరోగ్యం' ఏది తింటే ఏమవుతుంది? ఏమేం తినాలి? ఏమేం తినరాదు వంటివి చదివీ చదివీ సైటొచ్చేసింది. సైటు వస్తే వచ్చింది కానీ డైట్‌కు సంబంధించి ఇన్‌సైటనగా అంతర దృష్టి వచ్చేసింది అనుకున్నాక ఆరోగ్యరావు వంటగదిలో ప్రవేశించి కాపురం పెట్టేశాడు.

వైద్యో నారాయణో హరి కాదు వైద్యో పోపుల పెట్టో హరి అని కిచెనే పెద్దాసుపత్రి అని భావించాడు. జీలకర్ర నమిలాడు మెంతులు పటపట కొరికాడు దాచిన చెక్కను పొడిచేశాడు పసుపు నాలకకు రాచుకున్నాడు లవంగాలు బుగ్గన పెట్టుకున్నాడు, ఇంగువ మింగాడు అల్లం తేనె నిమ్మనీళ్లు తాగాడు. ఇదంతా పాత కిచెన్ అయితే మాడ్యూలార్ కిచెన్‌ని కూడా ఫాలో అయ్యాడు. ఓట్సుని వదిలిపెట్ట లేదు కెల్లాగ్స్‌ని కావిలించుకున్నాడు బాదామూ ఎండు ద్రాక్షా అంజీరూ అన్నింటికీ జీ హుజూరన్నాడు. గడియారం చూసుకుంటూ (గోడమిద్ది కాదు చేతి మీద్ది) ఏది ఎంత తినాల్లో త్రాసులో తూచి ఆచి మరీ తిన్నాడు. మధ్యాహ్నం అప్పడం లాంటి పుల్కాలు కాకికి పెట్టే పిండం అంత అన్నమూ రాత్రికి మరో రెండు పుల్కాలతో శరీరాన్ని రాచిరంపాన పెట్టాడు.

ఏవోయి ఆరోగ్యరావు ఇంత చిక్కిపోయావ్ అనే తీపికబురు ఎప్పుడు ఎప్పుడెప్పుడు వింటానా అని తహతహలాడాడు కుతూహలపడ్డాడు కానీ చివరకు నీరసపడ్డాడు. నేనేం పాపం చేశాను ఉప్పు మానేశాను కారం బహిష్కరించాను పంచదారను పంచకు రానీ లేదు అయినా ఈ ఒంట్లో కొవ్వుకేం మాయరోగం కరిగి నీరై కారిపోదేం అనుకున్నాడు.

నీరసపడ్డ ఆరోగ్యరావుకి ఎవరో నీళ్ల వైద్యం చెప్పారు. పొద్దున్లేచింది మొదలు రాత్రి నిద్ర పోయేవరకు సముద్రమన్ని నీళ్లు కాకపోయినా పొట్ట చెరువయ్యేన్ని నీళ్లు తాగమన్నారు. వెయ్యి డిగ్రీలు వేడి చేసినా కరగిపోని ఒంటి కొవ్వు గ్యాలన్ల కొద్ద నీళ్లు తాగితే కరగి కాల్వలై కారిపోతుందని సెలవిచ్చారు. ఇంకేం వుంది కూట్లోనించి ఏట్లో పడ్డాడు ఆరోగ్యరావు. ఇంట్లో అడుగడుక్కి చెంబులూ గళాసుల్తో నీళ్లు పెట్టుకుని అదే పనిగా అదో పనిగా అగస్త్యుడిలా అనేక పర్యాయాలు తాగి తడిసి నీరైపోయేవాడు.

ఏం చేస్తేనేం ఆరోగ్యరావుకు మూలశంక తీరనే లేదు అసలు తను ఆరోగ్యంగా వున్నాడో లేదో తేలలేదు. పోనీ డైరెక్టుగా డాక్టరు దగ్గరికి వెళ్తే డబ్బులు ఖర్చేకాక ఏదోవొక జబ్బు అంటించి ఇంటిని ఒక మెడికల్ షాపు చేసేస్తాడని భయం.

ఈ భయం ఆరోగ్యరావుని నానా యాతనా పెట్టడం మానలేదు. భూతంలా పట్టివొదలడం లేదు. పేపర్ల నిండా అనేక రోగాల వర్ణనా విశేషాలు. టీవీల నిండా డాక్టర్లూ జబ్బులూ. ఇది ఆరోగ్యానికి మంచిది తినండి అని ఒకరంటే వొద్దు ఇది తినద్దు తింటే ఫలానా జబ్బు గ్యారంటీ అని ఒంకొకరు. ఇది తాగద్దు తాగితే మీ జీవన రేఖ కట్టు అని వొకరంటే ఇదే తాగండి మీకు లైఫ్ గ్యారంటీ అని మరొకరు.. ఈ లెక్కన ఆలోచిస్తే లోకంలో తినదగిన వేవీ లేవనిపించింది ఆరోగ్యరావుకి.

అయితే మనిషి దురాశా జీవి కదా! ఇప్పుడు విటమిన్ల గ్నానం అంది పుచ్చుకున్నాడు. ఉదయాన్నే పోటాషియం ఆ తర్వాత ‘డి' విటమన్ కాస్సేపటికి కాల్షియం, ‘బి' విటమిన్ యిక రోజంతా ‘సి' విటమిన్ ‘ఐరన్' జింకు, ఫాస్పేట్ ఎక్కడెక్కడ వున్నయో వెతుక్కు తింటున్నాడు.

ఈ జబ్బు ఈ అనుమానం ఈ సందేహం సందోహం ఒక్క ఆరోగ్యరావుకేనా. మనక్కూడానా?...

-చింతపట్ల సుదర్శన్

English summary
Prominent columnist Chintapatla Sudarshan in his column Quick Boxing tells about Health.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X