వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

క్విక్‌బాక్సింగ్: ఆలస్యం ‘జీవితం’ విషం!!

|
Google Oneindia TeluguNews

నువ్వు ఎక్కదల్చుకున్న రైలు ఒక జీవితాలంలేటు అన్నాడో కవి. నిజంగానే కొందరు జీవితకాలమంతా లేటుగానే గడుస్తుంది. అనుకున్న దేదీ అనుకున్న టయానికి అనుకున్నట్టుగా జరిగిపోవడమనేదసలు వుండనే వుండదు. అవకాశాలు రావు వస్తే వాటికి వీరు సరిపోరు. వీరికి సరిపోయే అవకాశం వచ్చినా వీరికి అందనంత లేటుగా వస్తుంది. ఆలస్యం అనేది అమృతాన్ని విషం చేస్తుందని తెలిసీ కొన్ని జీవితాల గడియారాలు ‘స్లో'గానే నడచిపోతుంటాయి.

అసలు ‘లేట్' అనేది ఎందుకవును అని ‘లేట్' కాకుండా ‘లేటెస్టు'గా ఎవరైనా అడిగితే అంతా ‘ఖర్మ' ‘విధివ్రాత' లేదా ‘విధి పెట్టే వాత' అని లేటుగానే అయినా సమాధానం చెప్తాడు రామారావు.

ఖర్మ, విధివ్రాత లేక విధివాత అనేవి నిజంగా ‘లేట్'కు కారణం కాదని మీరెంతగా వాదించినా ఒప్పుకోడు. ప్రతి ‘లేటుకీ' ఓ కారణం వుంటుందని మీరు లాజికల్‌గా చెప్పినా సరే మ్యూజికల్‌గా చెప్పినా సరే వింటాడేమో కానీ వినిపించుకోడు ఈ చెవిలోంచి ఆ చెవులోకి ఆ తర్వాత దాంట్లోంచీ ‘స్పేస్'లోకి వదిలేస్తాడు.

chintapatla sudarshan column on lateness

ఒక్కో తరగతినీ లేట్‌గా దాటి వస్తే పునాది గట్టిగా వుంటుందనేది ఒక ‘భ్రమాయ' మరి రామారావు బయోగ్రఫీ యందు. అన్ని తరగతులనూ అవసరానికి మించి లేట్‌గా దాటేస్తూ ఈ కాలికాలంలో కనీసం జీవించే అర్హతగా ఓ డిగ్రీని సంపాదించాడు ఎంతో లేటుగా. ఎంత లేటుగా అంటే అప్పటికి వాళ్ల వూళ్లోనూ, వాళ్ల రాష్ట్రంలోనూ, వాళ్ల దేశంలోనూ చివరకు ప్రపంచమంతటయున్నా ఉద్యోగాలు సున్నయై పోయేయంటే నమ్మండి.

జీవితపు బండి లేటుగా నడవడమంత దురదృష్టం మరొకటి వుండదు కదా! చావకుండా చెడకుండా చెప్పులనేవి అరిగినప్పటికీ కాళ్లనేవి అరక్కుండా తిరిగిన చోట తిరక్కుండా వున్నచోటును వదలక తిరిగీ తిరిగీ ఎలాగయితేనేం ఎంత లేటయితేనేం ఓ ప్రైవేటు నౌకరీ సంపాదించేడు జీవితమనే బోటుని చాలీచాలని జీతమనే తెడ్డుతో ‘పుష్' చేయడానికి.

చిన్నదో చితకదో సర్కారుదో ప్రైవేటుదో కొలువు అనేది ఒకటి దొరికితే యిక కావాల్సింది సంసారంలో సరిగమలో సంసారం ఒక చదరంగమో కదా. ఆల్రడీ బండి లేటుగా నడుస్తుండటం వల్ల ‘పెళ్లీ పెళ్లీ పెళ్లీ' అని పాడుతూ పడుతూ లేస్తూ అనేక రకాలుగా అనేక తరహాలుగా అనేక వ్యూహాలుగా ప్రయత్నాలు మొదలుపెట్టేడు. ఈ ఇరవైయిన్నీ ఒక్కటవ శతాబ్దంలో ప్రేమే నేరమౌనా? అని అనుకుంటూ ఆ దిశగా అడుగులు వేశాడు లేట్‌గా నయితేనేం!

అతగాడి లైఫుజాకెట్టు మరీ టైటుగా లేటూ గదా అందువల్ల అదేమంత వీజీకాదని అసలు వర్కవుట్ కానేకాదని అర్థం చేసుకునే టయానికి ఏమంతలేటు కాలేదు కానీ చెవుల పక్కనున్న నల్లజుత్తు కొంచెం తెల్లబోయింది. ఇంకేముందు అద్దం వార్నింగుల మీద వార్నింగులు యిచ్చేడం మొదలుపెట్టింది. ఇక ఆట్టే కాలం వొంటరిగా వున్నావంటే వొంటికి మంచిది కాదు అని భయపెట్టింది. లేట్ చెయ్యబోకు గురూ అని బతిమాలింది. చివరాఖరికి రామారావనబడే సవాలక్షల మందిలో ఒకడికి రెండయ్యే అవకాశం దక్కింది. అయితే కాస్త లేటయిందని అతనూ చాలా లేటయిందని మనమూ అనుకోవచ్చు.

లేటనేది ఒక ఒంటరి లేటు కాదుబాబూ లేటుకి లేటు లేటుకి లేటు లింకయి కొంచం బ్రతుకనే సర్వస్వము సదా లేటయి పోతుందలా. లేటుగా పెళ్లయిన వాడికి అర్లీగా పిల్లలు పుట్టాలని దేవుడనే వాడెక్కడా ఓ ప్రత్యేక నిబంధన రాసి పడేసిన పుణ్యాన పోలేదు గనక సంతాన ప్రాప్తి అయ్యే కాలానికి రామారావు నడినెత్తిన టేబిల్ టెన్నిస్ బాలంత ఖాళీ యేర్పడనే యేర్పడింది. ఈనగారు రిటైరయ్యేలోపు వారు హైస్కూలు దాటరు గాక దాటరు. అంతా లేటు మహత్యం.

సాధారణంగా చురుగ్గా బ్రెయిన్‌లో సెల్లు ఛార్జింగ్ ఎప్పటికీ నయా నయాగా వుండే వాళ్లు టైం ప్రకారం చేసుకుపోతారనడానికి మనమేం వెనకాడక్కర్లేదు. అట్టాగే సెంటిమెంట్లూ చాదస్తాలూ దస్తాల కొద్దీ లేని వాళ్లకి టైం కొట్టిన పిండవుద్దని వొండిన కూరవుతుందనీ అనుకుంటే తప్పు లేదు కదా. ఇక తమ జీవితపు గడియారం నిరంతరం ‘టక్ టక్'మంటూ సెకను కూడా లేటవకుండా వుండడానికి కొందరు పక్కపక్కవాళ్లను కాళ్లు పట్టుకు లాగడం జుట్టు అందకుండా పోతే కాళ్లు పట్టుకునైనా సరే భలే ఛాన్సులే, లలలాం లలలాం లక్కీ ఛాన్సులే అంటూ ఛాన్సుల మీద ఛాన్సులు కొట్టేస్తుంటారు. ఇట్టి పనితనానికి ‘పుష్షింగ్ నేచర్' అని ముద్దు పేరు పెట్టేస్తుంటారు. ఇట్లాంటి పుష్షింగూ పుల్లింగూ బన్ మస్కా పాలిషింగూ వంటి ఆధునిక విద్య లేవీ తెలియకపోగా పాత చింతకాయ పచ్చడి మెతుకులు మరీ ఎక్కువగా తిండం వల్ల రామారావనబడే ఒకొనొక వ్యక్తి బ్రతుకు గడియారంలో డేటూ టైమూ కరెక్టుగా వుండవు కలిసిరావు.

అందువల్ల చేతన్ చేన్ అతని ఉద్యోగ జీవితం కూడా నత్తకు జిగ్రీ దోస్తే అయింది. ఉదయం ఐదు గంటలకే లేచి నానా తంటాలూ హైరానాలు యింకేవన్నావుంటే అవన్నీ పడి ఆఫీసుకి తయారవుతాడు. తీరా గుమ్మం దాటబోతుంటే ‘హచ్'మని చప్పుడొస్తుంది. అదిమరెక్కడ్నించో కాదు తన స్వంత ముక్కు దూలం సలపరింతే. అంతే మళ్లీ ఇంట్లోకి రాడం బాత్‌రూంలో దూరడం కాళ్లూ ముఖమూ కడుక్కోవడం తలమీద నీళ్లు చిలకరించుకోడం చెంబుడు ముంచి తీర్థం పుచ్చుకోవడం, ఆపైన ఆఫీసులో బాసుతల మీద వేసే అక్షింతలు స్వీకరించడం, అసలు లేట్ అనేది కాకుండా వుంటానికి అతను చేయని ప్రయత్నం అంటూ వుండదు కానీ యేం లాభం రోడ్డు మీద అడుగు పెట్టగానే అచ్చోసిన నల్లగండు పిల్లికి అతని ఎదురుగ్గా రావద్దని ఎవరు చెప్పగల్రు? ఆఫీసులో లిఫ్టులోకి జబర్దస్తీగా జొరబడమని ఎవరు ప్రోత్సహిస్తారు. ఫైళ్లయందు ఆఫీసరుకు నచ్చే విధంగా ‘నగిషీలు' చెక్కడం ఎవరు నేర్పిస్తారు, వాస్తు బాగోలేదని మూన్నెళ్లకూ ఆర్నెల్లకూ ఇల్లు మారడం వద్దు రామా అని ఎవరు చెప్పగలుగుదురు రామారావు ఇన్ఫిరియారిటీ కాంప్లెక్సు మీద ఆఫీసులో సాటివారు జోకులు వేసుకోవడాన్ని ఎవరు మాన్పిస్తారు. ఏ విషయంలోనైనా సరే తాడోపేడో తేల్చుకోవోయ్, పిరికితనం కట్టిపెట్టి ధైర్యం చేపట్టవోయి అని ఎవరు భుజం తడ్తారు. నీ పని నువ్వు చేసుకుపోవడం కాదోయి చేసేది ఇంతయితే చెప్పుకోవోయి కొండంత అని సజెస్టు చెయ్యరు. పైన చెప్పినవేవీ జరగలేదు... జరగవు కాబట్టి రామారావు బ్రతుకు బండీ వేగం పెరగదు జీతం పెరగదు ప్రమోషననేదే రాదు!!!

ఒక్క రామారావనే కాదు ఈ లోకంలో కొందరు మనుజుల లైఫ్‌వాచ్‌లు స్లోగానే నడిచి బ్రతుకు బండ్లు, లేటవడానికి కారణాలేమిటని మళ్లీ అడిగిమరీ ‘లేట'వకండి.

-చింతపట్ల సుదర్శన్

English summary
Prominent columnist Chintapatla Sudarshan in his column Quick Boxing tells about lateness.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X