వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సుదర్శన్ క్విక్‌బాక్సింగ్: లాఫింగ్ గ్యాస్

|
Google Oneindia TeluguNews

మిత్రమా ఉదయమున ఉపాహారము చేసి బయలుదేరితిమి. మధ్యాహ్నం భోజనము లభించక చేతికందిన చెట్ల ఫలములు తెంపి తింటిమి. ఇక నా వల్ల కాదు. చీకట్లు ముసురుతున్నవి. కడుపులో ఎలుకలు ఇష్టం వచ్చినట్లు దుముకుచున్నవి అన్నాడు మంత్రి పుత్రుడు.

పక పక నవ్వినాడు రాకుమారుడు. గుర్రము మీద అటూ ఇటూ వూగుతూ మరీ మరీ నవ్వినాడు.

ఎందులకానవ్వు రాకుమారా! నవ్వకుండా వుండలేవు కదా! నీకన్నీ వేళాకోళములే! చూడు నా గుర్రము అడివంతా పరుగెట్టి పరుగెట్టి తడబడు కాళ్లతో నడవలేక నడవ లేక నడచుచున్నది అన్నాడు మంత్రి కుమారుడు.

నా గుర్రమూ అంతే! అలసిపోయింది పాపం! దూరంగా ఏ వో భవనాలు కనిపించీ కనిపించనట్టు కనిపిస్తున్నవి. ఏదో నగరమై వుండును. ఒక్క పావుగంటలో మనమూ నగర శివారునకు చేరుకుందుము. నీ ఎలుకలను కడుపులో కదలకుండా వుండమని చెప్పుదూ అన్నాడు రాకుమారుడు మళ్లీ ఫకాలుమని ఫటేలుమని నవ్వుతూ.

మళ్లీ నవ్వకండి మహా ప్రభో! అసలు మీకీ నవ్వు ఎలా వస్తున్నదో. నాకు మాత్రం గడ్డ పెరుగుతో సవాసేరన్నం ఆవకాయ నంజుకుని ఆవురావురంటూ తినాలనిపిస్తున్నది అన్నాడు మంత్రి కుమారుడు.

నవ్వడానికీ ఆవకాయ అన్నానికీ సంబంధం లేదోయి. నవ్వుతూ వుంటే దేన్నైనా మరచిపోవచ్చు... ఆఖరుకి కడుపులో హడావిడిగా తిరిగే ఎలకల్ని కూడా అన్నాడు రాకుమారుడు పెద్దగా నవ్వుతూ.

ఈసారి మంత్రి కుమారుడిక్కూడా నవ్వు నిరాటంకంగా వచ్చింది. నవ్వక తప్పింది కాదు గనక నవ్వేశాడు కడుపులో ఎలకల సంగతి పూర్తిగా మరచిపోయి.

అదీ అలా నవ్వాలోయి. ఎలుకల సంగతి ఎవడిక్కావాలోయ్ అన్నాడు రాకుమారుడు నవ్వుతూనే.

జోడు గుర్రాలు నగర శివారులోకి వచ్చేయి. ఆ గుర్రాల మీద వచ్చిన వారు రాకుమారుడూ మంత్రి కుమారుడూ. వీరిద్దరూ తమ రాజ్యం వొదలి, ఇలా గుర్రాల మీద దేశ దేశాలు, వాటిల్లోని వింతలూ విడ్డూరాలు చూస్తూ వస్తున్నారు.

పూటకూళ్ల ముసలవ్వ ఇంటి వెనుక దొడ్లో గుర్రాల్ని కట్టేయించి వేడి నీళ్లు స్నానం చేసి వంటశాలకు వచ్చి కూచున్నారు భోజనానికి. విస్తళ్లల్లో అన్నీ వడ్డించి నేతిగిన్నె పట్టుకు నుంచున్నది పూటకుళ్ల అవ్వ.

 chintapatla sudarshan column on laughing

ఆవురావురుమంటూ ఆవకాయ కారం నాలికకి అంటుకుని మంట పుట్టిస్తుందని నోట్లో వేలు పెట్టిన మంత్రి కుమారుడికి కనిపించాల్సిన చుక్కలేమీ కనిపించలేదు.

ఇదేమిటవ్వా! ఆవకాయలో ఆవాల ఘాటేదీ మసాలా కారపు మంటేదీ అన్నాడు చప్పటి పచ్చడి రుచికి విలవిల్లాడిపోతూ.

మీదే దేశం నాయనా అందా అవ్వ బోర్లించిన బిందెలా గున్నతల మీద ముసుగు సవరించుకుంటూ.

మాది దూర దేశం అమ్మా వింతలూ విడ్డూరాలూ చూస్తూ తిరుగుతున్నాం అన్నాడు రాకుమారుడు.

అద్దీ అలా చెప్పండి నాయానా! మా దేశం సంగతి మీకు తెలీదన్నమాట. ఇక్కడ ఉప్పూ కారం లేని చప్పిడి బువ్వే తింటాం మేం. ఇది మా రాజావారి ఆగ్న.

అదేంటవ్వా! ఫక్కు ఫక్కున నవ్వాడు రాకుమారుడు.

పక్కనే బాంబు పేలినట్టు కెవ్వుమని అరిచింది అవ్వ.

జడుసుకున్న మంత్రి కుమారుడి జబ్బ మీద ఎడం చేత్తో చరిచాడు రాకుమారుడు.

అదేంటవ్వా అలాగ కేక పెట్టావు అన్నాడు మంత్రి కుమారుడు.

ఇంకానయం. వీధి తలుపు వేసుంది. రాజభటులు ఎవరైనా చూసివుంటే మీరీపాటికి చెరసాల్లో సలాకులు లెక్క పెడుతుండేవారే అన్నది అవ్వ.

సలాకులా ఓహో జైలు ఊచలన్నమాట సలాకులో సలాకులు అంటూ పెద్దగా నవ్వాడు రాకుమారుడు.

మళ్లీ కెవ్వుమంది అవ్వ. ఈసారి జడుసుకోలేదు మంత్రి పుత్రుడు, అలవాటయింది గదా.

బాబులూ మీతోపాటు నన్నూలాక్కెళ్తారు. నాయనలూ నవ్వకండి. ఈ దేశం సంగతీ ఈ రాజావారి విషయమూ తమకు బొత్తిగా తెలియదులా వుంది. ఈ దేశంలో నవ్వడం నిషేధం నాయన్లూ అన్నది అవ్వ సీరియస్‌గా.

నోట్లో అంత అన్నం ముద్ద వుండగానే నోరు వెళ్లబెట్టాడు మంత్రి కుమారుడు. ఇదేం రాజ్యం ఉప్పుకారం మీద కూడా రాజావారి అదుపూ ఆజ్ఞానా. అరెరే నవ్వడం కూడా నిషేధమూ అనుకున్న రాకుమారుడు అయితే అయిందని నవ్వాపుకోలేక నవ్వేశాడు.

అవ్వ మాత్రం ఎన్నిసార్లు కెవ్వుమనగలదు మాట్లాడకుండా వూరుకుంది.

మర్నాడు ఊళ్లోకి బయలుదేరిన రాకుమారుడితోనూ మంత్రి కుమారుడితోనూ జాగ్రత్త నాయనా ఈ దేశం పద్ధతులు వేరు. ఏ మాత్రం పొరపాటు జరిగినా చెరసాలే అన్నది బోసి నోటి నుంచి నవ్వు బయటకు ఆవుపడకుండా జాగ్రత్త పడుతూ.

అవ్వ చెప్పింది నిజమే! దారంటన నడుస్తున్న వాళ్లంతా మొహాలు గంటు పెట్టుకుని యమా గంభీరంగా వున్నారు. అంగట్లోనూ అంతే ఆరుబయటా అంతే. జనమంతా భయం భయంగా ఒదిగిఒదిగి లెక్క కడ్తున్నట్టు అడుగులో అడుగువేస్తూ నడుస్తున్నారు. ఎవరి మొహంలోనూ ‘నవ్వు' జాడేలేదు. అసలు వాళ్లెవరికీ ‘నవ్వు' అననేమిటో కూడా తెలిసినట్టు లేదు.

రాకుమారుడు ఎదురు పడ్డవాళ్లతో ముచ్చటించడానికి ప్రయత్నించాడు. కొందరసలు నోరు తెరవనే లేదు. కొందరు ముక్తసరిగా ముక్కులు ముక్కులుగా మాట్లాడారు. ఇదేం దేశంరా అనుకున్నారు రాకుమారుడు మంత్రి కుమారుడూ. కొంచెం ప్రసన్నంగా కనిపించిన ముఖంతో అన్నాడు రాకుమారుడు ఇదేం రాజ్యం నవ్వడానికి వీల్లేని రాజ్యం. నవ్వు ఆరోగ్యానికి అవసరం అని తెలియదా. నవ్వే వాడు యోగి, నవ్వనివాడు రోగి అన్న విషయం తెలియదా అనడిగాడు.

చుట్టు పక్కల ఎవరూ లేకపోవడంతో ఆ ముఖం ధైర్యం చేసి మాట్లాడింది. ‘చూడు నాయనా ఈ దేశంలో కూచున్నా నించున్నా తప్పే. ఉప్పు కారం తినడమూ తప్పే. ఇక నవ్వడం మాట దేవుడెరుగు. మా రాజా వారి దృష్టిలో నవ్వు నాలుగు కాదు నలభై విధాల చేటు అందుకే ఇక్కడ ఎవ్వరూ నవ్వడానికి వీల్లేదు. మా వాళ్లకి నవ్వడం రాక కాదు. ఎప్పుడెప్పుడు నవ్వుదామా అని వుంటుంది అందరికీ. కానీ చెరసాల భయంతో ఎవ్వరూ నవ్వరుగాక నవ్వరు ఆఖరు ఎంతో అందగత్తె అయిన మా రాకుమారి కూడా కనీసం చిరునవ్వు నవ్వదంటే నమ్మండి' అన్నాడు.

అసలు స్వేచ్ఛ అనేది లేని చోట ఎలా బతుకుతారు. స్వేఛ్చలేని చోట బతకడమంటే మీరంతా నడుస్తున్న శవాలన్నమాటే. అసలు నవ్వడమన్నదే లేకపోతే మనిషి చచ్చిన వాడితో సమానమే అన్నాడు రాకుమారుడు.

రాకుమారి రాకుమారి అనరిచారెవ్వరో. తప్పుకోండి తప్పుకోండి అని అరవసాగారు భటులు. బాట వెంబడి నడుస్తున్న వారంతా ఎక్కడివారక్కడ నిలబడిపోయారు. పల్లకీలో వస్తున్నది రాకుమారి ఆమె వెనుకా ముందు గుర్రాల మీద భటులు మొహాలు ముటముటలాడించుకుంటూ వస్తున్నారు. ఓ పక్కన నిలబడి చోద్యం చూడసాగారు రాకుమారుడూ మంత్రి కుమారుడూ.

హఠాత్తుగా రాకుమార్తె పల్లకీకి ఎదురుగ్గా గెంతుతూ వచ్చి నిలిచిందివో పిల్ల కోతి. అది ఎక్కడ్నించి వచ్చిందో తెలియలేదు. దాన్ని అనుసరించి వచ్చింది తల్లి కోతి. పాపం వాటికి ఈ రాజు గారి ఆంక్షల గురించి తెలిసినట్టు లేదు. తల్లి కోతి పిల్ల కోతిని రమ్మంటున్నది. పిల్ల కోతి మాత్రం భయం లేకుండా తల మీద రెండు చేతులు పెట్టుకుని నడుం వూపుతున్నది. పల్లకీ ఆగిపోయింది.

రాకుమారుడు నవ్వు ఆపుకోలేకపోయాడు. అహ్హహ్హ అంటూ నవ్వసాగాడు. నవ్వడం తెల్సిన మంత్రి కుమారుడు నవ్వు ఆపుకోలేక పోయాడు. నవ్వాడు.. పెద్దగా.. ఇంకా పెద్దగా. ఈ నవ్వులు వినిపించి పల్లకీ లోంచి బయటకు వచ్చింది మెరుపు తీగలా వున్న రాకుమారి. వీళ్ల నవ్వు విని ఆ పక్కా ఈ పక్కా వున్న జనం విస్తుపోతూ ముందుకు వచ్చారు కానీ నవ్వడానికి సాహసించలేదు. పల్లకీ ఎదురుగ్గా వున్న కోతుల్నీ వాట్ని చూస్తూ నవ్వుతూ వున్న రాకుమారుడ్నీ చూసి అసలు నవ్వడమే తెలీని రాకుమారి పెదాలు విచ్చుకున్నాయి. దానిమ్మ గింజల్లాంటి పళ్లు తళుక్కున మెరిసేయి. నెమ్మదిగా సెలయేరులా మొదలైన నవ్వు జలపాతమై హోరుమంది. నవ్వండయ్యానవ్వండి అందరూ ఒక్క పెట్టున నవ్వితే ఎందర్నని చెరసాలలో పెడతాడు మీ రాజు అన్నాడు మంత్రి కుమారుడు పెద్దగా.

కోతుల్ని చూసిన నవ్వు ఆపుకున్న పదేళ్ల కుర్రాడొకడు ఫటేల్మని నవ్వాడు. ఆ పక్కన వున్న పిల్లలందరూ ఆపుకోలేక నవ్వారు. ఇక పెద్దలు ఆపుకోలేక నోళ్లు తెరిచి ఫక్కుఫక్కుమన్నారు. ఇంత మంది నవ్వడం చూసి ఆపుకోలేక భటులు కూడా నవ్వసాగారు.

ఆ తర్వాత నగరమంతా నవ్వసాగింది. నదిలా నవ్వు ఆనకట్టలు తెంచుకుని రాజభవనందాకా విస్తరించింది. ప్రజలకే కాదు రాజా వారికీ నవ్వడం తెలియసొచ్చింది.

అందరికీ నవ్వడం నేర్పిన రాకుమారుడ్ని రాకుమార్తె వరించింది.

- చింతపట్ల సుదర్శన్

English summary
Prominent columnist Chintapatla Sudarshan in his column Quick Boxing tells about laughing.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X