వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సుదర్శన్ క్విక్‌బాక్సింగ్: గ్రహానుగ్రహం

|
Google Oneindia TeluguNews

మంచం మీద ఈ పక్కనించి ఆ చివరకి దొర్లేడు ప్రేంకుమార్. కాస్తయితే ధడేలనో దభేలనో కిందపడిపొయ్యేవాడు కాని ఒక్క కన్ను కొంచెం తెర్చుకోవడం వల్ల ప్రమాదం అంచులోవున్న వాడు మళ్లీ యిసుంటూ జరిగేడు కానీ ఆ అదురుకి కొంచెం మెలకువ వొచ్చింది.

కళ్లు రెండూ పూర్తిగా తెర్చి సీలింగు నుంచి వేళ్లాడుతూ తన చుట్టూ తాను తిరుగుతున్న ఫ్యాన్‌కేసి అదే పనిగా చూస్తూ వుండిపోయేడు. మూడు రెక్కల మీదా గిర్రుమంటున్న ఫ్యాను మధ్యభాగం అదో గోళంలా అదో గ్రహంలా తిరగడం తప్ప మరేపని చేతగాని దానిలా తిరుగుచున్నది.

వయసులో వున్న కుర్రాడి దట్టమైన నల్ల గడ్డంలా కిటికీలోంచి చీకటి తొంగి చూస్తున్నది. జీరో బల్బు వెల్గుతుండటం వల్ల ఈ మాత్రం ఒంటరిగా పండుకోగల్గుతున్నాడు కానీ ప్రేంకుమార్‌కి రాత్రంటే భయమూ చిరాకు బోరు మరింకా ఎన్నో. అపార్టుమెంటులో తనతోపాటు వుండే నలుగురూ కొత్త సంవత్సరం వస్తున్నదని వూళ్లెళ్లి పోయారు. తను మాత్రం అలవాటుగా బద్ధకించి యేం బస్సులు యేం జనం ఏం ప్రయాణం లెస్తూ అని వుండిపోయాడు ఒక్కడే మూడు నిద్ర గదుల బోల్డు పెద్ద ఇంట్లో.

కాస్తయితే కిందపడ్డును. ఏమైవుండేదో ఏ బోను విరిగేదో.. అనుకున్నాడు ప్రేంకుమార్. కొత్త సంవత్సరం.. హు! అనుకున్నాడు. వస్తున్నాయి పోతున్నాయి క్యాలెండర్లు. కానీ కాలం ఖర్మం కల్సి రావట్లేదు. ఒంటరి బ్రతుక్కి విముక్తి రావడం లేదు. ప్రేమించడానికే కాదు పెళ్లి చేసుకోవడానికి క్కూడా యంగ్ బ్యూటిఫుల్ గర్ల్స్ లభించడం లేదు. ప్రతి ఏడూ పంచాంగం వివాహ ప్రాప్తి అని అని అంటూ వున్నా దాని మాట అవుతున్నది సున్నా. రాశులూ ఫలితాలూ అంతా బూటకం జాతకాలూ గ్రహాల అనుకూలతలూ కట్టుకథలే అనుకుంటూ మళ్లీ కళ్లు మూసుకునే ప్రయత్నం చేశాడు ప్రేంకుమార్.

హాల్లో ఏదో అలికిడి అయ్యింది. ఎవరు వచ్చారు.. అయినా ఈ టైంలో ఎవరోస్తారు. మరో జత ‘కీస్'తో ఎవరైనా లోపలికొచ్చారా?అందరూ పండగ తర్వాత కానీ రారు కదా. చెవి రెక్కించి విన్నాడు. నిశ్శబ్దంగా వుంది. ఎవరూ లేరు అంతా తన భరమ అనుకున్న ప్రేం మళ్లీ కునుకు కంటన్యూ చేయబోయాడు.

మాటలు వినపడసాగినయి... గుసగుసగా ఎవరు? ఎవరది? అని అరుద్దామనకున్నాడు ప్రేం కానీ మాట పెగల్లేదు. లోపల జొరబడ్డ వాళ్లు దొంగలయితే!! అంతవేగంగా ఫ్యాన్ తిరుగుతున్నా చెమటలు పట్టసాగాయి. లేచి అడుగులో అడుగు వేసుకుంటూ గది తలుపు దగ్గర నిలబడి హాల్లోకి తొంగిచూశాడు. చీకటిగా వున్న హాల్లో సోఫా మీద యిద్దరు కూచునివున్నారు. చిత్రంగా వాళ్ల మీద మాత్రమే వెలుగు పడుతున్నది.

కళ్లు పెద్దవి చేసి చూశాడు ప్రేం. ఆ యిద్దరూ వేసుకున్న దుస్తులు చిత్రంగా వున్నయి. ఇద్దరి తలల మీదా కిరీటాలున్నవి. అసలు ఇలాంటి వాళ్లని ప్రేం యిదివరలో ఎప్పుడూ చూసి వుండలేదు. దొంగలయితే యిలాంటి గెటప్‌లో ఎందుకు వస్తారు అనుకున్నాడు. గడపదాటి హాల్లో అడుగుపెట్టాలా వద్దా అని తటపటాయించాడు. కొంపదీసి ఈ ఇద్దరూ తన్ను పైలోకానికి లాక్కుపోడానికి వచ్చిన యమభటులు కారు గదా అనుకున్నాడు. గుండె స్పీడు పెంచింది. నరాల్లోంచి బయటికి పారిపోడానికి రక్తం స్పీడు డబుల్ చేసింది. తల మీది నూడుల్స్ లాంటి జుట్టు నీడిల్స్‌లా నిక్కనిలబడ్డది.

chintapatla sudarshan column on Planets

రావోయ్ రా! భయపడకు మేం యమదూతలం కాదు.. దొంగలం కూడా కాదులే.. అన్నాడా యిద్దరిలో ఒకడు.

కమ్ కమ్.. వెల్‌కమ్ అన్నాడా యిద్దరిలో ఒకడుకాక మరొకడు.

నా ఇంట్లోకి వచ్చి నాకే ‘వెల్ కమ్' చెప్తున్నారీళ్లు అనుకుంటూ ముందుకు కదిలాడు ప్రేం. ఆ ఇద్దరినీ పరీక్షగా చూస్తూ ఎదురుగ్గా వున్న ప్లాస్టిక్ కూర్చీలో కూచుంటూ.

మరి.. మరి.. ఎవరు మీరు.. మీ వేషం చూస్తుంటే.. గ్రహాంతర వాసులా?! అన్నాడు ధైర్యం చెయ్యక తప్పద కనుక చేసి

ఆ ఇద్దరూ ఒకరిముఖాలొకరు చూసుకుంటూ ఫక్కున నవ్వారు. ఆ నవ్వు హాల్లో రీ సౌండిచ్చింది. జడుసుకున్నాడు ప్రేం. కానీ మేక పోతులా అలాగే కూచున్నాడు కుర్చీలో.

మేం గ్రహాంతర వాసులం కాదు బాబూ ప్రేం మేమే గ్రహాలం అన్నారాయిద్దరూ డ్యూయట్‌గా

అదిరిపడ్డాడు ప్రేం కుమార్. గ్రహాలా.. గ్రహాలు మనుషుల్లా వుంటయా? మాట్లాడ్తాయా అనుకున్న ప్రేం పైకి ఏమీ అనకుండా నిశ్చేష్టుడయిపోయేడు.

అవునోయ్.. అలా బిర్రబిగుసుకుపోకు నీకు యిప్పుడిప్పుడే పిజ్జాలూ బర్గర్లూ నిండుకోలేదు.. అన్నాడొకడు.

సాఫ్ట్ డ్రింకులూ, బివరేజులూ గ్యాలన్ల కొద్దీ వున్నయిలే.. అన్నాడొకడు.

ఇది నిజం ముమ్ముటికీ నిజం. మేం యిద్దరం గ్రహాలమే. నన్ను రాహువు అంటారు అన్నాడొకడు.

నాపేరు వినేవుంటావు కేతువు అనే అంటారు నన్ను అన్నాడ్మరొకడు.

నమ్మటం లేదులా వుంది కుర్రాడు. ఈ రాత్రి జయ నామ సంవత్సరం డ్యూటీ దిగిపోయి మన్మథుడు డ్యూటీలో చేరిపోతాడు కదా! మన్మథ నామ సంవత్సరంలో మా డ్యూటీలూ, క్యాంపులూ, టూర్ ప్రోగ్రాంలూ మారిపోతయి కదా. ఏయే రాశుల్లో ఏఏ డేట్ నించి ఏ డేట్ దాకా వుండాలో సెటిల్ అయ్యే రోజు కదా అందుకని ఇట్లా గ్రహాలందరం మీ గ్రహం మీద చక్కర్లు కొడ్తున్నాం అన్నాడొకడు కాదు కాదు.. రాహువు.

హాలు విశాలంగా వుంది కదా ఇక్కడ మీటింగ్ పెట్టుకుందామనుకున్నాం అన్నాడొకడు కాదు కాదు కేతువు.

బాబోయ్ అని అరుద్దామనుకున్నాడు ప్రేం తెలుగులో వీలుకాక ఓ మైగాడ్ అనీ అరుద్దామనుకున్నాడు ఇంగ్లీషులో. కానీ రెండు లాంగ్వేజీలూ మరచిపోయాడు.

మేం ఇక్కడ కల్సుకోవడం నీకేం అభ్యంతరం లేదనుకుంటాం అన్నాడు కేతువు.

లే.. లే.. లేదు.. లేదు లేదు అన్నాడు ప్రేం తడబడుతూ.

రాశులన్నా గ్రహాలన్నా, జాతకాలన్నా నీకు నమ్మకం లేదనుకుంటా అన్నాడు రాహువు చిన్నగా నవ్వుతూ..

లేదు.. లేదు.. వుంది.. వుంది.. అన్నాడు తడబడుతూనే మళ్లీ ప్రేం.

నీ కింకా పెళ్లి కాలేదనుకుంటూ అంటూ లోపలి కొచ్చాడు మరో మనిషి.. ఈ ఇద్దరిలాగే డ్రస్సూ తల మీద కిరీటముతో.

జయనామ సంవత్సరం నీ కంతగా కల్సి రాలేదు కదోయ్ అన్నారెవరో సోఫాలో మరో పక్కనించి వైట్ ఆ వైపు తిరిగి కనిపిస్తూ.

వీళ్లిద్దరూ బుధుడూ, గురువూ అని పరిచయం చేశాడు రాహువు.

కుర్చీలో బొమ్మలా వుండిపోయాడు ప్రేం. శ్వాస ఆడున్నదీ లేనిదీ కూడా తెలీడం లేదు.

ఉన్నట్టుండి గోడగడియారం ధభేలున కిందపడి అద్దం పగిలి భళ్లుమన్నది. శనిగారు వస్తున్నారు కాస్త పక్కకు తప్పుకోండి అని అరిచాడు కేతువు. శనితోపాటే హాల్లో జొరబడ్డాడు కుజుడు. ఎక్కడ్నించో మంచి గంధం వాసన వచ్చి హాలు నిండింది. ఇంకెవరు శుక్రుడే అన్నాడు చంద్రుడు మరో పక్క నించి వస్తూ హాల్లో వాతావరణం చల్లబడింది.

ఉన్నట్టుండి మల్లెపూల పరిమళం గాలిలో తెరలు తెరలుగా వ్యాపించింది. రావయ్యా మన్మథా.. ఇది నీ సంవత్సరం. ఇక పోస్టింగులు డిసైడ్ చెయ్యండర్రా అన్నాడు గురువు గడ్డం పొడవు కొలుచుకుంటూ.

ఆ తర్వాత కుర్చీలో వున్న ప్రేంని ఎవరూ పట్టించుకోలేదు. మన్మథ నామ సంవత్సరంలో రాజు శని అనీ, కుజుడు మంత్రి అనీ, పంటలకు శుక్రడు, ధాన్యానికి బుధుడూ ఇంఛార్జీ లని, మేఘాలకి చంద్రుడు, రసాలకి రవి కార్యదర్శులని, గ్రహాలు మాట్లాడుకుంటుంటే అర్థం అయ్యింది ప్రేంకి. అలాగే వివిధ రాశుల వారి ఆదాయ వ్యయాలూ రాజపూజ్యం అవమానాలూ డిసైడైపోయేయి.

రాత్రి పన్నెండయ్యేక హడావిడిగా వెళ్లిపోయేయి అన్ని గ్రహాలూ తమ తమ డ్యూటీల్లో చేరడానికి. చివరగా మిగిలిన మన్మథుడు ప్రేంని తట్టాడు. వెళ్లు యంగ్‌మాన్ లోపలికి వెళ్లు పడుకో అన్నాడు.

తల్లో పూల కిరీటమూ మెళ్లో పూలదండలూ ముఖంలో ప్రసన్నతా వున్న మన్మథుడ్ని చూసేక మళ్లీ ధైర్యం వచ్చింది ప్రేమ్‌కి.

సార్.. సార్.. జయనామ సంవత్సరంలో పేరుకే జయ వున్నది కానీ నాకేం ‘సక్సెస్' కాలేదు సార్. మరి మీరన్నా కాస్త దయ చూపాలి సార్ అన్నాడు.

ప్రేంకేసి పరీక్షగా చూస్తూ ఈ యేడు శని ప్రభావం వున్నా గురుడు, రాహు కేతువుల అనుకూల సంచారం కల్సి వస్తుంది. ముందుగా రాహువు కేతువు నీ హాల్లోకి వచ్చారు గనక నీ మీద కొంచెం మంచి ఒపీనియనే వుంటుంది కూడా. గృహ వాహన యోగాలు వుండనే వున్నాయి అన్నాడు ‘లవ్ గాడ్'.

అది ఎలాగూ ఉన్నాయి సార్ గృహం వుంటే యేం లాభం గృహిణి వుండాలి కదా అన్నాడు ప్రేం మన్మథుడ్ని రిక్వెస్టు చేస్తూ.

ఓ అదెంత పని.. చుట్టూతా యంగ్ గర్ల్స్ వున్నా లవ్ టెక్నిక్స్ ఆట్టే తెలీవోయ్ నీకు. ఇదిగో ఈ పూల బాణం పుచ్చుకో ప్రజెంట్‌గా యిస్తున్నా. సరిగ్గా గురిచూసి వాడావంటే ఓ ఇంటివాడవవుతావు అంటూ ప్రేంకుమార్ చేతిలో ఓ ఫ్లవర్ ఏరో వుంచి మాయమై పోయేడు మన్మథుడు.

హాల్లో గడియారం ఠంగ్ ఠంగ్ మంటూ పన్నెండు గంటలు కొట్ట సాగింది వరుసగా. మెలకువ వచ్చిన ప్రేంకుమార్ హాల్లో లేడు. బెడ్ రూంలో మంచం మీదే వున్నాడు. అన్నట్టు గోడ గడియారం భళ్లుమని బద్దలవలేదు. అయితే... గంటలెలా కొడుతుంది?!

- చింతపట్ల సుదర్శన్

English summary
Prominent columnist Chintapatla Sudarshan in his column Quick Boxing tells about planets.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X