వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సుదర్శన్ క్విక్‌బాక్సింగ్: ఎవర్ గ్రీన్ స్టోరీ

|
Google Oneindia TeluguNews

ఉదయం ఫలహారం చేయకుండానే స్నేహితురాళ్లు వచ్చారని వెళ్లిపోయింది. మధ్యాహ్నం చేస్తూ వుండిన భోజనం మధ్యలోనే స్నేహితురాళ్ల కోసం వెళ్లిపోయింది. ఇప్పుడు సూర్యుడస్తమించే వేళకి కూడా తోటలో ఆ ఆటలేమిటో! వాళ్ల నాన్న గారు రానీ చెప్తా. అస్తమానూ ఈ ఆటలేమిటి చెప్మా అనుకుంది ఆ తల్లి.

తోటలో మల్లె పువ్వుల బంతితో ఆటలాడుతున్నది ఆమె కూతురు, స్నేహితురాళ్లతో. ఆడపడచు పిల్లల నవ్వుల్ని చెవులు రిక్కించి వింటున్నయి పూపొదలు. ఒకరు మరొకరికి ఆ మరొకరు ఇంకొకరికి విసిరేస్తే ఆకు పచ్చని చెట్ల మధ్య ఆ తెల్లటి బంతి ఇట్టే కనబడి అట్టే మాయమవుతున్నది.

ఎవరో బలంగా విసిరేశారు బంతిని. అది ఎవళ్లకీ అందకుండా గాలిలో దూసుకువెళ్లి ఉద్యాన వనానికి ఓ పక్కన వున్న భవంతి కిటికీ లోంచి లోపలికి వెళ్లిపోయింది. ఆట ఆగిపోయింది. ఎవరు వెళ్లి తెస్తారు బంతిని అడిగింది ఒక అమ్మాయి. నేను వెళ్లను బాబూ. ఆ మూల భవంతిలో ఏమున్నదో ఎప్పుడూ ఎవరూ అటువైపు వెళ్లరు అన్నది బంతిని ఆ వైపునకు విసిరిన చిన్నది. మేం వెళ్లం అంటే మేం వెళ్లలేం అన్నారందరూ.

chintapatla sudarshan column on Sri Rama Navami

అయితే ఆట సాగేదెలా? ఒక పని చేద్దాం ఎవరో ఒకరు వెళ్లి తేవడానికి భయం కదా అందరం కలిసి వెళ్లి తెచ్చుకుందాం అనుకున్నారు. బిబిలబిలమంటూ వాళ్లంతా భవంతి ముఖ ద్వారం తోసుకుని లోపలికి వెళ్లారు. అక్కడ ఒక పెద్ద భోషాణం పెట్టే దాని మీద ఓ పెద్ద ధనస్సూ వున్నయి.

అదిగోనే మన బంతి దానికింద నుంచి కనబడుతున్నది అన్నది ఒక పడచు.

ఇంక లాభం లేదు. దాన్ని ఎలా కదిలిస్తాం బంతి ఎలా సంపాదిస్తాం పెదవి విరిచింది మరో పడుచు.

అందరం కల్సి జరుపుదాం అన్నది ఓ యువతి. అంతా కల్సితోసినా అంగుళం కూడా కదల్లేదది. ఇదంతా చూస్తూ నించోకపోతే నువ్వూ ఓ చెయ్యి వెయ్యరాదూ అన్నది ఓ కుమారి. అందరికంటే వెనక నిలబడ్డ మెరుపుతీగ పెదాల మీద చిరునవ్వుని అదిమి పట్టి మీరంతా పక్కకు రండే.. నేను జరుపుతాను అన్నది.

ముక్కు మీద వేలువేసుకున్న పడుచు వెనక్కి వచ్చింది తతిమ్మా వాళ్లునోళ్లు తెరిచి యివతలకి వచ్చారు.

కలహంసలా నడచివచ్చిన మెరుపుతీగ ఆ భోషాణం పెట్టె మీద చేయి వేసింది.

తల మీద చంద్రవంకా, మెడలో జారిపోతున్న నాగుడూ నుదుటి మీద మరో కన్నూ వున్న జడధారి ధ్యాన భంగమయింది. ఒక్క ఉదుట్న కళ్లు తెరిచాడు.

ఆ పక్కనే వున్న ఆవిడ అడిగింది. ఏమయింది స్వామీ? అన్నది.

కల్యాణ ఘడియలు దగ్గరపడ్డవి. ‘మేరేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్' అన్నారు గదా. మనం పూనుకోవాల్సిన టైం వచ్చింది అన్నాడతను తలలో అలంకరించుకున్న చందమామలా నవ్వుతూ.

అటు చూడు దేవీ అన్నాడతను వేలు పెట్టి చూపుతూ.

భూమ్మీద ఓ ఉద్యానవనం చివరలో ఉన్న భవంతి. ఆ భవంతిలో బంతి కోసం ప్రయత్నిస్తున్న అమ్మాయిలు కనిపించారు.

అంతమంది అమ్మాయిలు కదల్చలేని దాన్ని ఆ ఒక్కర్తీ ఎలా కదిలిస్తుంది బంతిని ఎలా బయటకు తీస్తుంది స్వామీ అన్నది ఆవిడ.

ఆ బంతి నా ధనస్సు కింద వున్నది. ఇప్పుడు ఆ అమ్మాయి కనక ఆ ధనస్సుని కదిలించి బంతి బయటికి తీసిందంటే అదో ‘సెన్సేషన్' అవుతుంది. ఆ తర్వాత ఆమె కల్యాణానికి మార్గమేమిటో ఆ తండ్రికి తెలిసివస్తుంది. చూడు.. తమాషా అన్నాడు భర్త.

ఆయన తన రెండు కళ్లనీ భవంతిలోని ఆ వొస్తువు మీద కేంద్రీకరించాడు.

అందరితోనూ తాను ఆ భోషాణం పెట్టెని కదిలిస్తానని బంతిని బయటకి తీస్తానని అన్నది కాని నిజంగా అంత పెద్ద వస్తువూ కదులుతుందా సందేహిస్తూనే ఆమె తన సుకుమారమైన చేయిని దానిపైన వేసింది.

ఆశ్చర్యం అది అతి తేలికగా కదిలింది. ధైర్యం వచ్చిన అమ్మాయి దాన్ని చేత్తో అలవోకగా పక్కకు జరిపి బంతిని బయటకు తీసింది.

బ్రేకింగ్ న్యూస్ అంత:పురపు మందిరాలకు చేరనే చేరింది.

ఎప్పుడూ స్నేహితురాళ్లూ ఆటలేనా? అమ్మాయి పెళ్లి సంగతి పట్టించుకోరా అని నిష్టురమాడింది అమ్మాయి తల్లి.

తండ్రి అత్యవసర సమావేశం ఏర్పాటు చేశాడు మందిరంలో. ఇన్నాళ్లనించీ వేధిస్తున్న ప్రశ్నకి సమాధానం లభించింది.

వందల మంది బలిష్టులైన మగవాళ్లు కదిలిస్తే తప్ప కదలని ధనస్సుని కుసుమ కోమలమైన చిన్నారి దక్షిణ హస్తంతో అవలీలగా కదిలించి తన వర పరీక్షను తానే నిర్ణయించేసింది. ఎవరైతే ఆ ధనస్సుని ఎత్తి పట్టుకుని బాణం సంధించగలరో ఆ వీరుడే ఆమె వరుడు.

స్వయం వరం ప్రకటించబడింది.

ఈ విషయం దుర్గమారణ్య మధ్యమున వున్న ఆశ్రమంలోని రాజర్షి చెవులకి వినపడ్డది. ఎండ కన్నెరుగని పసివాడు నా పుత్రుడు, నీ వెంట పంపలేను అన్న తండ్రిని వొప్పించి వెంట తీసుకువచ్చాడా వీర కుమారుడ్ని. అన్న వెంట తమ్ముడూ బయల్దేరి వచ్చారు. ఆశ్రమాల్లో మునుల్ని హింస పెడ్తున్న తాటకిని వధించాడు ఆ అన్న. యజ్ఞయాగాదుల్ని భగ్నం చేస్తున్న రాక్షసులు మారీచ సుబాహులకు తన శర పరంపరల రుచి చూపాడు. తండ్రి చాటు బిడ్డడి కల్యాణం జరిపించి గానీ అప్పగించను అని నవ్వుకున్నాడు ముని. తూరుపు దిక్కున ఎర్రటి కలువ రేకుల్లా పూస్తున్నవి అరుణ కిరణాలు. నేడే మిథిలకు ప్రయాణం. రాకుమారుల్ని నిద్రలేపాలి అనుకున్నాడు.

‘కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే
ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవ మాహ్నికం'

నీల మేఘ శ్యాముడు, ఆజానుబాహుడు అరవింద దళాయ తాక్షుడు నగరవీధుల వెంట వస్తుంటే చూసినవారు చూసినట్టే నిలబడి పోతున్నారు. నల్లని వాడయిన అన్నయ్య వెనుకే నడచి వస్తున్న తమ్మయ్య రంగు అన్నయ్య రంగుకి యేమాత్రం మ్యాచింగ్ కాదు. ఎర్రటి వాడైనా అన్న అంత పొడగరి మాత్రం కాదు. అన్న వదనం ప్రసన్నం అధరం నిరంతర దరహాసానికి ఆనకట్టగా నిలిస్తే తమ్ముడి వదనం మాత్రం చుట్టుపక్కల్ని నిశితంగా పరీక్షించే నయన ద్వయంతో గంభీరం ఆలోచనాత్మకం.

తమ బలపరాక్రమాలను ప్రదర్శించి కన్యను పరిణయం ఆడదామని వచ్చారు దేశ దేశాల రాజులు. తానే ఓ పూల హారం అయిన అందాల భరిణ చేత పూల హారం ధరించి నిలబడ్డది తండ్రి సింహాసనం ప్రక్కన. ఆమెను అనుసరించి వున్నారు స్నేహితురాళ్లు.

భవనం మధ్య తాము బంతి కోసం వెళ్లినప్పుడు చూసిన పెద్ద ధనస్సు వున్నది. ఒకరి తర్వాత ఒకరు జబ్బలు చరుచుకుంటూ వచ్చి ఎన్ని విధాల ప్రయత్నించినా బాణాన్ని అర అంగుళం కూడా కదల్చలేక అవమానంతో తలలు దించుకుని వెళ్లిపోతున్నారు.

సమయం మించి పోతున్నది. ఎక్కు పెట్టక పోయినా కనీసం ఎత్తి పట్టుకునే వారైనా లేరా? ఇక నా కూతురుకి కల్యాణం జరిగేనా? ఆ అమ్మాయి అలవోకగా కదిలించిందని ఈ పరీక్ష పెట్టడం తన తప్పిదమా అని ఆలోచిస్తున్నాడు తండ్రి.

స్వయం వరం అన్నాక వచ్చిన వాళ్లల్లో అందగాడ్నీ తన మనస్సుకు నచ్చిన వాడ్నీ అమ్మాయి పరిణయం ఆడాలి కాని ఈ కఠిన పరీక్ష ఏమిటి? అని చింతించసాగింది తల్లి.

మహా వీరుడూ కైలాస పర్వతాన్ని తన పది తలలతో కదిలించిన వాడూ కూడా ఇది మన వల్ల కాని పని అని ఎస్కేపయ్యాక యిక యింతే సంగతులు అనుకున్నరందరూ.

ఆకాశంలో రెండు మేఘాలు ఢీకొన్నప్పుడు మెరిసే మెరుపులా గురువు కనుసైగతో ముందుకు కదిలాడతను. కొదమ సింహంలా అడుగులో అడుగు వేస్తూ వచ్చి చుట్టూ చూస్తూ సభకు నమస్కరించాడు ముకుళిత పద్మల్లాంటి హస్తాలతో. ఆ తర్వాత ఆల్చిప్పల కన్నులు పూర్తిగా తెరిచి ధనస్సును ఆసాంతం పరికించాడు. చూపుకి సుకుమారంగా కనిపిస్తున్నా దృఢమైన దక్షిణ హస్తంతో అందరూ చూస్తుండగా అలా అలా.. పైకి లేపేశాడు. వామ హస్తాన్ని ముందుకు చాచి నారిపైకి సారించి ముడివేయబోతున్నంతలో సభా భవనం ఒక ఊయల్లా అటూ ఇటూ వూగిందేమోననుకున్నారు ఫెళపెళార్భాటంతో ఆ ధనస్సు విరిగిపోవడంతో.

ఎవరీ వీరకుమారుడు అని సభలో గుసగుసలు. దశరథ తనయుడు, కోసల రాముడు, కోదండ రాముడు, అయోధ్య రాముడు.

ఏ రాముడయితేనేం ఇప్పుడు ఈ రాముడు కల్యాణ రాముడు అన్నారెవరో.

నీల మేఘ శ్యాముని మెడను వరమాల అలంకరించి కనులు దించి ఆ సుందర విగ్రహాన్ని ఓర కంట చూస్తూ నిలబడ్డది వధువు. జనకరాజ పుత్రిక జానకి.

శివుడు పార్వతి వైపు చూశాడు ‘మిషన్ కంప్లీటెడ్' అన్నట్టు. దేవతలు పూల తోటల్లోకి పరుగెత్తారు కల్యాణ సమయంలో వధూవరులను పూల వర్షంలో ముంచెయ్యటానికి పూల కోసం.

జానకి రాముల కళ్యాణం.. జగత్కల్యాణం!! ఏటేటా మళ్లీ మళ్లీ గుర్తు చేసుకునే మధుర ఘట్టం. శ్రీరామదాసు బాసూ, బర్త్ డే నాడే వెడ్డింగ్ డే కూడా జరుపుకునే నీకు.. డబుల్ గ్రీటింగ్స్!!!.

-చింతపట్ల సుదర్శన్

English summary
Prominent columnist Chintapatla Sudarshan in his column Quick Boxing tells about Sri Rama Navami.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X